ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్
Posted on 01/08/2014 by గబ్బిట దుర్గాప్రసాద్
భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి అహల్యా బాయి హోల్కార్ జీవితం అందరికి ఆదర్శం ,ప్రేరణ ,స్పూర్తి .
మహా రాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లా జామ్ఖేడ్ వద్ద చోండీ అనే గ్రామం లో అహల్యా బాయి 1725మే 31న జన్మించింది .తండ్రి మంకోజి షిండే గ్రామాధికారి .ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు .అయినా తండ్రి కూతురికి స్వయం గా రాయటం చదవటం నేర్పించాడు .ఒక చిన్న సంఘటన తో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది .ఆ నాటి పీష్వా బాజీ రావు సేనాధ్యక్షుడు మాల్వా ప్రాంత అధినేత మల్హర్ రావు హోల్కార్ పూనా వెడుతూ చోండీ గ్రామం లో ఒక దేవాలయం లో భక్తీ ప్రపత్తులతో పూజలు చేస్తున్న ఎనిమిదేళ్ళ అహల్యా బాయి ని చూసి ఆమె లోని సద్గుణాలకు ముచ్చటపడి తన కుమారుడు ఖండే రావు కు తగిన ఇల్లాలు అని భావించి తల్లి దండ్రుల అనుమతి తో మాల్వాకు తీసుకొని వచ్చి కుమారుడికిచ్చి1733లో వివాహం చేసి మంచి కోడలు లభించినందుకు ఏంతో సంతోషించాడు .ఆమె అందాల రాసి మాత్రమె కాకు సుగుణాల ప్రోవు ధైర్య సాహసాలకు నెలవు కూడా అహల్యా బాయి పదకొండేళ్ళు భర్త తో ఆనంద సుఖమయ జేవితాన్ని గడిపింది .కాని విధి వక్రించి ఆమె భర్త 1754లో కుమ్భేర్ స్వాధీనం చేసుకొనే పోరాటం లో వీర మరణం పొందాడు .మరో పన్నెండేళ్ళ తర్వాత మామ గారూ 1767లో మరణించాడు .మాల్వా రాజ్యానికి రాణి గా అహల్యా బాయి అప్పటి నుండి జీవితాంతం అంటే 1767నుండి 1795 వరకు ఇరవై ఎనిమిదేళ్ళు మాల్వా రాజ్యాన్ని అత్యంత సమర్ధ వంతం గా పరిపాలించింది .మామ గారు మల్హర్ రావు నుండి యుద్ధ తంత్రాన్ని ,పరిపాలనా దక్షతను నేర్చుకొన్నది .దురదృష్ట వశాత్తు ఉన్న ఒక్కగానొక్క కుమారుడూ చనిపోయాడు .ఇక దేశ పాలనా బాధ్యతలను పూర్తిగా స్వీకరరింపక తప్పని పరిస్థితు లేర్పడ్డాయి .ఆడది రాజ్యానికి రావటం ఇష్టపడని కొందరు ఎదిరించారు .కాని సైన్యం ఆమె ధైర్య సాహసాలను గుర్తించి విధేయత ప్రకటించి విశ్వాసం చూపింది .పీష్వా కూడా ఆమె పాలనను అంగీకరించాడు .ఆమెకు అత్యంత ఇష్టమైన ఏనుగు నెక్కి విల్లు అంబులు సమకూర్చుకొని ఎదురు తిరిగిన వారి తో యుద్ధం చేసి ఓడించి తనకు ఎదురు లేకుండా చేసుకోంది.మల హర రావు దత్త కుమారుడు సుబేదార్ అయిన తుక్కోజి రావు హోల్కార్ ను సైన్యాధ్యక్షుడిని చేసి రాజ్యాన్ని సర్వతో భద్రం గా పాలించింది .తనకు ఎదురు తిరిగిన ఒక బ్రాహ్మణుడికి సముచిత మైన పదవి నిచ్చి ఆరితేరిన ప్రజ్ఞ ను చూపి అందర్నీ ఆశ్చర్య పరచింది .అంతః పుర పరదాను వదిలేసి జనసామాన్యానికి దగ్గరై వారి గోడు వింటూ కావాల్సిన సాయం అందిస్తూ అందరి మెప్పూ పొందింది .
మాల్వా రాజ్యానికి రాజధాని అయిన ఇండోర్ పట్టణాన్ని అన్ని రకాలా అభి వృద్ధి చేసింది .ఇండోర్ కు అతి దగ్గరలో ఉన్న మహేశ్వరం లో నర్మదా నది ఒడ్డున ఒక బ్రహ్మాండమైన కోట నిర్మించింది .పరిపాలన ఇక్కడి నుంచే జరిపింది .ఇక్కడే మహేశ్వరాలయం ,రామాలయం నిర్మించింది .మాల్వా పీఠభూమి లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాల నందించింది .మాల్వా కు సుదూరం గా ఉన్న అనేక రాష్ట్రాలలో దేవాలయాల నిర్మాణం రోడ్ల వసతి సత్రాల నిర్మాణం ,నదులకు ఘాట్ లు ఏర్పాటు చేసింది .ఆ సేతు హిమాచల పర్యంతం యాత్రా స్థలాలలో అంటే కాశి ,ప్రయాగ ,గయా , సోమనాద్ ,అయోధ్యా ,మధుర ,కంచి ,ఉజ్జయిని బదరీ ,రామేశ్వరం మొదలైన చోట్ల రాణి అహల్యా బాయి చే బట్టని మహత్కార్యం లేనే లేదు అంటే ఆశ్చర్య పడక్కర లేదు .ఆమె త్యాగాన్ని చూసి ఎందరో ధన వంతులు ఇలాంటి ధర్మ కార్యాలెన్నో చేశారు .ఆమె స్పూర్తి అలాంటిది .రాజ్యం లోని ధనం సంపద తనదికాదని తాను ఒక సంరక్షకురాలిని మాత్రమే నని అదంతా ప్రజా సంక్షేమం కోసమే నని ఆమె ఎప్పుడూ వినయం గా చెప్పేది . తనకున్న స్వంత భూముల మీద వచ్చే ఆదాయం తోనే తన స్వంత ఖర్చులు పెట్టుకొనేది. అందులో నుంచే దానాలు ధర్మాలు చేసేది ప్రజోపకార్యాలకూ స్వంత ధనాన్నే ఎక్కువగా వాడేది అంతేతప్ప ప్రజలిచ్చిన పన్నులతో ఏ నాడూ జల్సాగా జీవించని ఆదర్శ రాణి అహల్యా బాయి .అందరూ ఆమెను కన్న తల్లి లా భావించేవారు .ప్రజలంటే ఆమెకు అంత మమకారం ఆత్మీయత ఆప్యాయతా ఉండేవి .దయ గల తల్లి అని పించుకొన్న మహా సాధ్వి అహల్యా బాయి .
విధవలకు భర్త ఆస్తి లో భాగం లభించేట్లు చేసింది .కుమారుడిని దత్తత తీసుకొనే అధికారం కల్పించింది ..ఒక సారి కింది అధికారి కి ‘’ఆమ్యామ్యా ‘’ముట్టలేదని దత్తత తిరస్కరిస్తే ఆ పిల్లవాడి పోషణ అంతా తానె చూసింది .రాణి సేవా సౌభాగ్యాన్ని దర్శించి మురిసిన ఇండోర్ ప్రజలు ఆమె పేర ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి గణనీయమైన ప్రజా సేవ చేసిన వారికి ప్రతి ఏడాది అందిస్తూ గొప్ప సంప్రదాయాన్ని నెల కోల్పారు .ఈ పురస్కారాన్ని మొదట పొందిన ప్రముఖ సామాజిక సేవకుడు ” అంత్యో దయ కార్య క్రమ” నిర్వాహకుడు అయిన నానాజీ దేశ్ ముఖ్ తన రాజ్యం లో భిస్ లకు గోండు లకు అనాదిగా ఉన్న తగువులను పూర్తీ గా పరిష్కరించలేక పోయినప్పటికీ ,వారు సరిహద్దుల్లో అలజడి సృస్తిస్తునప్పటికి ఆమె ఉదారం గా వ్యవహరించి వారికి కొండ ప్రాంతాలలో ఉండేందుకు వసతి సౌకర్యాలు కల్పించి ఆవాస యోగ్యం చేసింది .వారిపద్ధతులకు సంస్కృతికి రక్షణ కల్పించింది .వారి సరుకుల రవాణాకు నామ మాత్రపు పన్ను విధించి ఆదుకోన్నది .
మహేశ్వరం రాజ దానిలో విద్యా వైద్య సాహిత్య సాంస్కృతిక ,ఆధ్యాత్మిక ,పారిశ్రామిక అభి వృద్ధిని సాధించి ప్రజల ఉన్నతికి ఎంత గానో తోడ్పడింది .ప్రముఖ మహా రాష్ట్ర కవి మోరో పంత్ ను, సాహిర్ లో అద్వితీయుడైన అనంత ఫండి లను ఆహ్వానించి ఘనం గా సత్కరించింది .కుశాలి రాం అనే సంస్కృత పండితుడిని పోషించింది .చేతి వ్రుత్తి పని వారికి ,శిల్పులకు ,కళా కారులకు జీవన భ్రుతిని ఏర్పాటు చేసిన దొడ్డ మనసున్న మా రాణి అహల్యా బాయి ..వారిప్రతిభా విశేషాలను గుర్తించి ఉత్సవాలలో సంమానించేది . ఆర్ధిక పారితోషికాలను అందించే సంస్కృతీ పరి రక్షకురాలు .మహేశ్వరం లో చేనేత పరిశ్రమను స్థాపించి ఎందరికో జీవనోపాధి కల్పించిన ఉత్తమురాలు .ఇన్ని ప్రజోపకార ,ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇంట పెద్ద ఎత్తున చేస్తున్నా అహల్యా బాయి ఒక రుషి జీవితమే గడిపింది అని ఆంగ్లేయ ,అమెరికన్ చరిత్రారులు పరిశోధించి చెప్పారు .మహారాష్ట్ర మాల్వా రాజ్యాలను అత్యంత సమర్ధ వంతం గా జన రంజకం గా ,సంక్షేమ సామ్రాజ్యం గా పరిపాలించిన ఉన్నత గుణ వరి స్టూరాలు,పాలనా దక్షురాలైన మహా రాణి రాణి అహల్యా బాయి.ఆమెను ‘’ఫిలాసఫర్ క్వీన్ ‘’అన్నారు . బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశ ద్రోహం చేయ వద్దని,వారి కబంధ హస్తాలలో చిక్కుకో వద్దని హెచ్చరిస్తూ పీష్వాకు ఉత్తరం రాసిన ధైర్య శాలి అహల్యా బాయి .మహేశ్వరం కోట దగ్గర రాణి అహల్యా బాయి చేతులలో శివలింగాన్ని పట్టుకున్న నిలువెత్తు పాల రాతి విగ్రహం ఆమె మూర్తి మత్వానికి నిలు వెత్తు ఉదాహరణ గా కని పించి రెండు చేతులతో నమస్కరించ బుద్దేస్తుంది .
రాజాస్థానానికి తగాదాల పరిష్కారం కోసం వచ్చేవారికి నచ్చ జెప్పి పరిష్కరించి నవ్వుమోహాలతతో ఇంటికి వెళ్ళే ట్లు చేయగల ధర్మ బుద్ధి ఆమెది .ప్రజలంతా సుఖ శాంతులతో అభివృద్ధి చెందుతూ జీవించాలి లన్నదే ఆమె ధ్యేయం .ఇల్లు లేని వారికి అనాధలకు ఆమె అన్న పూర్ణ .అహల్యా బాయి వంటి రాజ నీతిజ్నురాలు వేరెవరూ లేరని చరిత్రకారులన్నారు .ఆమె రాజ్యం లో హిందువులు ముస్లిములు అత్యంత స్నేహం గా ఉండేవారు ఆమె 1795ఆగస్ట్ 13నమరణించినప్పుడు కన్నీరు పెట్టని వారే లేరు .అదే ఆమె సచ్చరితకు సాక్ష్యం .గ్రీకు వేదాంతి ప్లేటో ,భారతీయ వేదాంతి ,రాజనీతిజ్ఞుడు ,ధర్మ మర్మం తెలిసిన వాడు అయిన భీష్మ పితామహుడు అభి వర్ణించిన సద్గుణాలన్నీ రాశీ భూతమైన రాణి అహల్యా బాయి .అందుకే ప్రజలు ఆమెను ‘’లోక మాన్య దేవి అహల్య ‘’అన్నారు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
విహంగ ఆగష్టు 2014 సంచికకి స్వాగతం !
ISSN 2278-4780
ముఖ చిత్రం: మమత రెడ్డి
|
– See more at: http://vihanga.com/#sthash.2fD9Ck4p.dpuf