వాణిశ్రీ హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేని కృష్ణం రాజు

ఆమె హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేను

Published at: 03-08-2014 00:36 AM

’’ సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో సావిత్రి స్థానాన్ని వాణిశ్రీ సునాయాసంగా భర్తీ చేసేసింది.., కొందరు ఆమె పొగరుగా ఉంటుందంటారు.. కానీ అది ఆత్మవిశ్వాసమని కొందరికే తెలుసు..’’ అంటారు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు. వాణిశ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలకరించినప్పుడు ఆ నాటి అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు…

టాలీవుడ్‌ సహజనటుల్లో వాణిశ్రీ ఒకరు. పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి పాత్ర నుంచి పౌరుషమున్న మధ్యతరగతి యువతి దాకా నటించిన అనేక పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే హఠాత్తుగా సినిమాల నుంచి వైదొలగిన వాణిశ్రీ  అంతరంగమిది..

వాణిశ్రీ అనగానే నాకు కృష్ణవేణి సినిమా తీస్తున్నప్పుడు జరిగిన రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి.  ఈ సినిమాని మా గోపికృష్ణ బ్యానర్‌లో  నిర్మించాం. మధుసూదనరావుగారు దీనికి డైరక్టర్‌. ఈ సినిమాలో వాణిశ్రీది ఒక సామాన్య మధ్యతరగతి యువతి పాత్ర. శ్రీశైలంలో టైటిల్‌ సాంగ్‌  తీస్తున్నాం. ఈ పాట కోసం ఎవరికీ చెప్పకుండా వాణిశ్రీ ఒక అందమైన హెయిర్‌స్టైల్‌తో షాట్‌కి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్‌హోస్టస్‌లు అలంకరించుకొనే హెయిర్‌స్టైల్‌ అది. ఆ అలంకరణకు బహుశా రెండు, మూడు గంటలు పట్టి ఉండచ్చు. లోకేషన్‌కి వచ్చిన తర్వాత ఆమె అలంకరణ మధుసూదనరావుగారికి నచ్చలేదు. ఒక మధ్య తరగతి యువతి పాత్రకి ఆ స్టైల్‌ నప్పదనేది ఆయన అభ్యంతరం. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పారు. నేను వెళ్లి ఆ హెయిర్‌స్టైల్‌ వద్దంటున్నారు.. అని చెప్పా. అంతే వాణశ్రీకి చాలా కోపం వచ్చింది. ’మళ్లీ వెళ్లి హెయిర్‌ స్టైల్‌ మార్చుకోవాలంటే రెండు, మూడు గంటలు పడుతుంది. అప్పటి దాకా మీరేం చేస్తారు? ఈ లోపులో టైమ్‌ అయిపోతే షూటింగ్‌ వాయిదా పడుతుంది’ అని కోపంగా అడిగింది. ’పరవాలేదు నీ కోసం  వెయిట్‌ చేస్తాం.. నువ్వు వెళ్లి మేకప్‌ మార్చుకొని రా..’’ అని చెప్పా. తర్వాత వెళ్లి మార్చుకువచ్చింది. ఇంకో సారి ఒక చిన్న షాట్‌ కోసం ఒక పెద్ద కొండ ఎక్కాల్సి వచ్చింది. నడుచుకుంటూ  పైకి ఎక్కి షాట్‌ తీసి కిందకు రావటానికి ఒక రోజంతా పట్టేసింది. అయినా వాణిశ్రీ ఎటువంటి కంప్లైంట్‌ చేయలేదు. ఈ రెండు సంఘటనలను జాగ్రత్తగా గమనిస్తే నటన పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత అర్థమవుతుంది. మొదటి సంఘటనలో కృష్ణవేణి పాత్రకు మరింత వన్నెలు దిద్దాలనే తపన  కనిపిస్తుంది. రెండో సంఘటనలో సీను ఎంత కష్టమైనదైనా నటించి ఒప్పించాలనే పట్టుదల కనిపిస్తుంది. ఒకప్పుడు ’వాణిశ్రీ పొగరుబోతు’ అనే వదంతి ప్రచారంలో ఉండేది. కానీ అది వదంతి మాత్రమే. నిజం కాదు.
మేమిద్దరం మొత్తం ఆరు సినిమాలు చేశాం. నేను నిర్మించిన ‘కృష్ణవేణి’, ‘భక్తకన్నప్ప’ చిత్రాల్లో  ఆమె నటించింది. వాస్తవానికి వాణిశ్రీ సినీ ప్రస్థానం చిన్న వేషాలతోనే ప్రారంభమయింది. చిన్న చెలికత్తె వేషం వేసినా ఆమె మంచి నటనను ప్రదర్శించేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సావిత్రి, అంజలి, జమున ఒక తరం వారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ఆ ఖాళీలను ఎవరు పూరిస్తారు? అని చాలా మంది అనుకుంటూ ఉండేవారు. ఈ ఖాళీని వాణిశ్రీ పూరించింది. కృష్ణవేణి సినిమా తర్వాత ఆమెకు తిరుగులేదు. ఈ సినిమాకు ఆమెను మేము ఎంపిక చేసుకోవటానికి కొన్ని కారణాలున్నాయి. ఆ సినిమాలో కృష్ణవేణి ఒక సామాన్య మధ్యతరగతి యువతి. ఎప్పుడో జరిగిందో లేదో సరిగ్గా తెలియని ఓ సంఘటనని గుర్తు చేసుకొని దాని వల్ల మానసిక సంఘర్షణకు లోనయ్యే పాత్ర అది.   పేరుకు నేను హీరో అయినా- అది  హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రమే.  కృష్ణవేణి పాత్ర  ఎవరు చేస్తే బావుంటుందని ఆలోచించి వాణిశ్రీని తీసుకున్నాం. ఆమె ఆ పాత్రలో ఎంత మమేకమైపోయిందంటే- సినిమా పూర్తయిన  మూడు నెలల దాకా ఈ పాత్ర నుంచి బయటకు రాలేకపోయింది. ఆమె మాట తీరు, హాహభావాలు అన్నీ అలాగే ఉండేవి. ఒక పాత్రలో నటి లేదా నటుడు మమేకమయిపోయినప్పుడే- ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. వాణిశ్రీలో ఆ లక్షణం పుష్కలంగా ఉండేది. ఈ గుణాన్ని భక్త కన్నప్పలో కూడా గమనించాను. ఆ సినిమాలో ఆమె ఒక బోయ యువతి. అప్పటి దాకా ఆమె చేసిన పాత్రలకు భిన్నమైనది. బోయవారి జీవితం, వారి వేషభాషలు, మాటతీరు అంతా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌  పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతంలో జరిపాం. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. అందరికీ అక్కడ ఉన్న ఇళ్లలోనే వసతి సౌకర్యం కల్పించాం. అప్పటికే వాణిశ్రీ పెద్ద నటి. అయినా ఎవరికీ ఇబ్బంది లేకుండా స్థానికులతో కూడా సర్ధుకుపోయింది.
వాణిశ్రీలో ఉన్న మరో రెండు లక్షణాలను కూడా చెప్పుకోవాలి. వీటిలో మొదటిది- పాత్ర నచ్చితే రెమ్యూనిరేషన్‌ గురించి పట్టించుకోకపోవటం. రెండోది ఆమెకు ఉన్న విపరీతమైన జ్ఞాపక శక్తి. చాలా సందర్భాలలో ఆమెకు పాత్ర నచ్చితే చాలు. పారితోషికాన్ని పట్టించుకోకుండా నటించేది. సాధారణంగా రెండు, మూడు పేజీల డైలాగ్‌లను గుర్తుపెట్టుకొని చెప్పటం అంత సామాన్యమైన విషయం కాదు. హీరో కృష్ణ మాదిరిగానే ఆమె కూడా పెద్ద పెద్ద డైలాగ్‌లను కూడా సులభంగా గుర్తు పెట్టుకొనేది. పెద్ద పెద్ద డైలాగ్‌లున్న సీనులను సింగిల్‌ షాట్‌లో ఓకే చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కెరీర్‌లో చాలా ఉన్నత స్థానంలో ఉన్న సమయంలో హఠాత్తుగా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆ సమయంలో నాతో సహా అనేక మంది స్నేహితులను సలహా అడిగింది. బహుశా సినిమా ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయి ఉండవచ్చు. ఈ నిర్ణయం వెనక  ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశం కూడా ఉంది. ఆ తర్వాత కూడా నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె హైదరాబాద్‌ వస్తే కలుస్తాం. మేము మొదటి సినిమాలో కలిసి నటించినప్పుడు ఎంత స్నేహంగా ఉందో ఇప్పుడే అంతే స్నేహంగా ఉంటుంది.

వినాయక విజయం సినిమాలో నేను శివుడు. తను పార్వతి. హీరాలాల్‌ మాస్టారు డ్యాన్స్‌ డైరక్టర్‌. నాకు డ్యాన్స్‌ నేర్పింది కూడా ఆయనే. నేను పెద్ద డ్యాన్సర్‌ని కాదు. వాణిశ్రీ మంచి డాన్సర్‌.  ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే శివతాండవం సన్నివేశంలో ఎక్కువ షాట్స్‌ ఆమెకే పెట్టారు. అలాగే మేమిద్దరం పక్కపక్కనే కూర్చుని నటించే సన్నివేశాల్లో నా మెడలో పాము అటు ఇటు కదులుతూ ఆమెని ఇబ్బంది పెట్టేది. అయినా భరిస్తూ ఆ సీన్‌ పూర్తి చేసేది.

‘‘చిన్నప్పుడు నేను మద్రాసు ఆంధ్ర మహిళాసభలో భరత నాట్యం నేర్చుకున్నా. ఒకసారి సభ యానివర్సరీకి కన్నడ డైరెక్టర్‌ హుణుసూరు కృష్ణమూర్తి వచ్చారు. ఆ వేడుకల్లో నా నాట్యంచూసి ‘ఈ అమ్మాయి సావిత్రి లా ఉందే? సినిమాల్లో నటిస్తుందా?’ అని అడిగారట. అమ్మ ఒప్పుకోలేదుగానీ, ఒప్పిం చి తొలిసారి కన్నడ సినిమాలో నటించాను. ‘నాదీ ఆడజన్మే’ సినిమా తీసిన కంపెనీ పేరు.. శ్రీవాణి ఫిలిమ్స్‌. వాళ్లే నాకు వాణిశ్రీ అని పెట్టారు..’’
‘‘నేను బాగా చేస్తానని, చేశానని అప్పట్లో ఎవరూ నాకు చెప్పలేదు. ఒకసారి ఎన్టీఆర్‌.. ‘కథానాయిక మొల్ల’ సినిమా బాగా చేశానని, చివర్లో నేను కూర్చునే భంగిమ బాగుందని అన్నారు. నేను చీరకట్టి, పైటవేసే విధానం ఏదో రాచకుటుంబం నుంచి వచ్చినట్టనిపిస్తుందని కృష్ణంరాజు మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు ఎప్పుడూ ప్రశంసించలేదు. కృష్ణ, నేను అసలు మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఏ హీరో అయినా మా కళ్లలోకి చూసి మాట్లాడేవారుగానీ, ఎన్టీఆర్‌ మాత్రం ఎక్స్‌రే చూపులు చూసేవారు కాదు. కారణ జన్ముడంటే ఆయనే అని చెప్పుకోవాలి. ఏఎన్నార్‌కి మూడ్‌స్వింగ్‌ ఎక్కువ. కోపంగా ఉంటే ఒకలా ఉండేవారు. మామూలు గా ఉంటే చిన్నచిన్న జోకులు వేసేవారు..’’
‘‘చిన్నపిల్లలకు వేసవి సెలవులిస్తారు. కానీ, నా వ్యవహారాలు చూసేవాళ్లు నాకు ఆ వెసులుబాటు కూడా ఇవ్వలేదు. మద్రాసులో షూటింగ్‌ చేయకూడని రోజుల్లో వేరే భాషల సినిమాలకు డేట్లు ఇచ్చేవారు. వాళ్లు అలా చేయకుండా నాకు కొంత విశ్రాంతి ఇచ్చి ఉంటే నేను పెళ్లి అనే మాట ఎత్తేదాన్నే కాదు. దీనికితోడు.. ‘ఎదురులేని మనిషి’ సినిమాలో ఒకపాట షూటింగ్‌లో అసభ్యమైన మూమెంట్లు చేయమన్నారు. నాకు ఒళ్లు మండింది. ఆ దశలో పెళ్లి నిర్ణ యం తీసుకున్నాను. మా ఆయన.. మా ఫ్యామిలీ డాక్టరే.’’
‘‘నాకు పెళ్లంటే కొంతమంది ఏడ్చారు. అంటే.. మనసులో నన్ను ప్రేమించారన్నమాట. ఇన్నిరోజులూ చెప్పలేదేమంటే.. ‘నాకు పిల్లలున్నారనా, కావాలంటే రీకేనలైజేషన్‌ చేయించుకుంటా’ అన్నారు. అప్పుడా వ్యక్తికి.. ఇట్స్‌ టూ లేట్‌, మనం స్నేహితులం అని చెప్పాను..’’
‘‘మనీ ఈజ్‌ టేస్టర్‌ దాన్‌ ఎనీథింగ్‌. డబ్బు రుచి తెలిసినతర్వాత.. ఇక అమ్మా లేదు.. నాన్నాలేదు.. ఎవరూ లేరు. నాకు కొండమీద కోతి కావాలన్నా మావాళ్లు దాన్ని తెచ్చి అక్కడ పెట్టేవాళ్లు. దీంతో డబ్బు విషయా లు ఎప్పుడూ పట్టించుకోలేదు. హీరోయిన్‌గా నేను సంపాదించినదాని గురించి అడిగితే మావాళ్లు కోర్టుకెళ్లారు. పన్నెండేళ్లు కేసు నడిచింది. మా లాయరు ‘వాళ్లు నీకు అప్పట్లో అంత పారితోషికం లేదంటున్నారు. మూడు సినిమాల్లో నటిం చి ఆ రెమ్యూనరేషన్‌ అగ్రిమెంట్లు పట్రా. వాళ్లని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా’ అన్నారు. అలా ‘అత్తకు యము డు అమ్మాయికి మొగుడు’ చేశాను. ఈలోగా మావాళ్లు రాజీకి వచ్చారు..’’
‘‘సినిమా మాత్రమే కాదు.. ప్రపంచమే మారుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చెడిపోలేదు. చాలామంది మంచి సినిమాలు తీస్తున్నారు. ఇక అశ్లీలమంటే.. కొందరు డైరెక్టర్లకు మనసులో ఎక్కడో ఉం టుంది ‘అలా’ లైవ్‌లో చూడాలని. అందుకే అలా చూపిస్తున్నారు. ఈ తరంలో అల్లు అర్జున్‌ డాన్స్‌ చూస్తే ‘ఈ పిల్లాడి కాళ్లు రబ్బర్‌తో చేశా రా’ అనిపిస్తుంది. రవితేజ, సిద్ధార్థ, మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం..’’
‘‘ఇప్పటికే నేను తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నాను. ఆధ్యాత్మికం వైపు ప్రయాణిస్తున్నాను. అలాగని కుంకుమ పూజలు చేస్తున్నానని, కొబ్బరికాయలు కొడుతున్నానని చెప్పను. దేవుడి ఉనికిని కనుగొనే దిశగా ప్రయత్నించి కనిపెట్టాను. దేవుడు ఎక్కడో ఉండడు. మనం దేవుడుగా మారడమే. ఒకరి నోటి దగ్గర అన్నం తీయకుండా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రికాల పూజ చేసుకుంటా. ప్రసాదాలేమీ ఉండవు..’’

 

Category:

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.