ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

Published at: 05-08-2014 02:41 AM

1953లో ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆ రాష్ట్రంలోనే స్థిరపడిన, పుట్టిన తెలుగువారిని స్థానికేతరులే అని జయలలిత అన్నారే అనుకుందాం. మరి, వారి మనవలకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇస్తుందా? 1956 తరువాత తెలంగాణలో స్థిరపడ్డ లక్షలాది తమిళులు, కన్నడిగులు, మరాఠీలు, గుజరాతీలు, ఉత్తర భారతీయుల సంగతేమిటి? వారి ఫీజులను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయా?

గత కొద్ది కాలంగా విద్యార్థులలోనే కాక నవ్యాంధ్ర, తెలంగాణలో ఆవేదన కలిగిస్తున్న స్థానికత -1956పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశ్య లోగుట్టు- 1. అక్రమాలు జరుగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ని సంస్కరించి (అందుకనే ఎంసెట్‌ ఆలస్యం) అర్హులకి ఇవ్వడం. అయితే నష్టపోయేవారు గొడవ చేస్తారు, దానిని ప్రతిపక్షాలు ఎగదోస్తాయి కాబట్టి, దానికంటే పదునైన ఆంధ్ర విద్యార్థుల వ్యతిరేక ఉద్వేగ టాగ్‌ అందుకుని అర్హులకే అంటే కాదనలేరు. 2. తెలంగాణ ప్రజలలో రాష్ట్రం వచ్చిన తరువాత స్వర్గం దిగివస్తుందని, 5-10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయనే భ్రమ లు కొందరు కల్పించారు. అలాగే, హామీలన్నీ వెంటనే అమలు చేయడంలో ఇబ్బందులు సరిచేయటానికి ఆంధ్ర – తెలంగాణ భావోద్రేకాలు లేపటం. కొన్ని సర్వేల ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఈ భావోద్రేకాల వల్ల మనకు ఒక్కళ్ళకే న్యాయం చేయటానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారనుకుంటూ తెలంగాణలో వారి ఓటు బ్యాంక్‌ మరింత పెరిగినట్టు కనబడుతోంది. 3. తెలంగాణ తెదేపా (ముఖ్యంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు)ని ఇబ్బందుల్లో పెట్టడం, కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఆంధ్రా వారికి మద్దతు ఇస్తున్నాయంటూ వాటిని కూడా ఇరు కున పెట్టడం (శాంతి సందేశవాసిగా పేరొందిన జానారెడ్డి ఇది అన్యాయం అని మాట్లాడితే వారినీ డిఫెన్స్‌లోకి నెట్టే విధంగా ఆయనని దూషిస్తూ వ్యాఖ్యానించడం దీనిలో భాగమే. 4. అంతిమంగా ఒకవేళ కోర్టులు కొట్టివేసినా, మనకోసం ఎంతైనా ప్రయ త్నం చేసారుగా అనుకునే తెలంగాణ ఓటర్లతో అంతి మంగా లాభమే జరుగుతుందనే భావం. అంటే ఒక దెబ్బకు 5 పిట్టలు. మాస్టర్‌ స్ర్టేటజీ. ఇవన్నీ అలా ఉంచితే, ఒక్కటి మాత్రం సత్యం. ప్రజా పంపిణీ వ్యవస్థలో, ఫీజు స్కీంలో అక్రమాలు అరికట్టటానికి మాస్‌ సర్వే, తెలుగు భాషాభివృద్ధి, ప్రభుత్వ రంగంలోనే విద్యుదుత్పాదన ఇంకా అనేక విషయాలలో ఆయన అవగాహనతో మాట్లాడుతూ కార్యసాధనలో కనబడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలు కూడా అలాంటి వాటికి ప్రభుత్వానికి సహకారమందిస్తూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్థానికత సమస్యను వేరు వేరుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదే ళ్ళు ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలుండాలి. ఆ విధంగా నాన్‌ లోకల్‌ కోటాలో నవ్యాంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలో చదివే విద్యార్థులు ఈ సంవత్సరం 39,794 మంది అలాగే తెలంగాణ నుంచి నవ్యాంధ్రలో చదివేవారు 19,461 మంది ఉంటారని అంచనా. అందువల్ల పక్క రాష్ట్రంలో నాన్‌ లోకల్‌ కోటాలో చదివే విద్యార్థులకి ఆయా రాష్ర్టాలే నిధులివ్వాలనే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ని, నవ్యాంధ్రప్రదేశ్‌ కూడా ఒప్పుకున్నప్పుడు అది ఆంధ్రకి ఈ సంవత్సరం 126 కోట్లు, తెలంగాణకి రూ. 34 కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో వివాదం లేదు, ఆ విద్యార్థులకి ఇబ్బందీ లేదు. అయితే 1-11-1956 ముందు ఉన్నవారి సంతానమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (సంక్షేమ పథకం)కు స్థానికులని తీర్మానించి అది ఎలా అమలుచేయాలో కొత్తగా కమిటీ వేస్తూ జీవో తీసుకురావడమే అత్యంత అభ్యంతరకరం. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ కోరే అన్ని వర్గాలూ 371డి- రాష్ట్రపతి శాసనాన్ని కొనసాగించాలని తీవ్రంగా కోరారు. ఆమోదించబడిన బిల్లు ప్రకారం, 371డి స్థానికత ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో పదేళ్లు ఉమ్మడిగా భర్తీ జరుగుతుంది. దానికి ఒప్పుకుంటాం కానీ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించాలంటే ఈ స్థానికత సరిపోదనీ, వారి తాతలో ముత్తాతలో 1-11-1956 కంటే ముందే తెలంగాణకి వచ్చి తీరాల్సి ఉండాలంటే ఎలా? 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తరువాత రాష్ట్ర రాజధానిగా తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ అయి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన వ్యక్తి వారసులు ఫీజు లాంటి సంక్షేమ పథకాలకు అనర్హులనడం ఘోరం. దానికంటే ఇంకా ప్రమాదకరం సంక్షేమ పథకాల అమలుకు కట్‌ ఆఫ్‌ డేట్‌ పెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని అనటం. అంటే ఆ సంక్షేమ పథకాల్లోనే ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు, రైతుకు సబ్సిడీలు, విద్యుత్‌ సబ్సిడీ అన్నీ ఉంటాయి. అలా తెలంగాణలో స్థిరపడ్డవారు నవ్యాంధ్రలో కూడా రాష్ట్రపతి శాసన నిబంధనల ప్రకారం స్థానికులవ్వరు. వారు మరి త్రిశంకు స్వర్గంలో ఉండి ఏ దేశ పౌరులౌతారు?
ఇక, 1956 తరువాత తెలంగాణలో శాశ్వతంగా స్థిరపడినవారు, అక్కడే పుట్టినవారు, లేదా వారి మనమలు-ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజులు భరిస్తుందని నవ్యాంధ్ర మం త్రులు చెప్పడమంటే తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారిని ఆ ప్రాంతానికి దూరం చేయడమే. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకవేళ 1953లో ఆంధ్ర విడిపోయిన తరువాత అక్కడ స్థిరపడి, పుట్టి/అక్కడే చదువుకున్నవారు కూడా స్థానికేతరులే అని అన్నారే అనుకుందాం. మరి, వారి మనవలకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇస్తుందా? ఇదే అమలైతే 1956 తరువాత తెలంగాణలో స్థిరపడ్డ లక్షలాది తమిళులు, కన్నడిగులు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర భారతీయుల సంగతేమిటి? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి, రేషన్‌ కార్డులు ఇస్తాయా? పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దక్కేది ఎస్సీ, ఎస్టీలకు 2 లక్షల లోపు, బీసీ, ఇబీసీలలో 1 లక్షలోపు ఆదాయం వచ్చేవారి పిల్లలకు మాత్రమే. ఎవరు దెబ్బతింటున్నారు? ఉద్వేగాలు పెరిగి కేసీఆర్‌ గారికి ఓట్లు రాల్చవచ్చు. కానీ భారతీయత దెబ్బతినదా? తెలంగాణ తెలుగు ప్రజలు మహారాష్ట్ర, గుజరాత్‌లలో అరకోటికి పైగా జీవిస్తున్నారు. అక్కడ స్థానికులై వేలాది, లక్షలాది మంది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, విద్యాసంస్థలలో స్థానికులుగా సీట్లు పొందుతున్నారు. అక్కడ ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీలే కాక మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు కూడా సంపాదించుకున్నారు. తెలంగాణ వారికి అక్కడి మరాఠీసేన వారు 1942 కట్‌ ఆఫ్‌ పెడితే పరిస్థితి ఏమిటి? భారతదేశంలో దీనికి అంతేమిటి? వీటన్నిటిపై దేశమంతటా, తెలంగాణలో కూడా పూర్తి చైతన్యం కల్పిస్తేనే, భారతదేశానికి ఎదురైన ఒక సమస్య పరిష్కారమౌతుంది. పరిష్కారం కాకపోతే మేమే దేశమంతటా తిరిగి చైతన్యానికి ప్రయత్నిస్తాము.
అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు దాటితే గ్రీన్‌కార్డ్‌కి అర్హులు. పుట్టితే-సహజంగా పౌరసత్వమే వస్తుంది. భారత రాజ్యాంగం – సమానత్వం (రైట్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ) అని ఆర్టికల్‌ 14, కుల, మత, ప్రాంత, జాతి, లింగ వివక్షత కుదరదు అని ఆర్టికల్‌ 15 చెబుతున్నాయి. అయితే ఆర్టికల్‌ 15లో (4), 29వ ఆర్టికల్‌ క్లాజ్‌ (2) ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకు, షెడ్యూల్‌ తెగలకు, వర్గాలకు ఇచ్చేదాంట్లో పై సమానత్వ క్లాజు మినహాయింపు చేయవచ్చును అని చెబుతుంది. ఆదివాసీల విషయమై ఆంధ్రప్రదేశ్‌ చేసిన 1950-చట్టం ఆదివాసీలది కాబట్టి చెల్లుతుంది. డి.పి. జోషి /స్టేట్‌ ఆఫ్‌ యంబిలో సర్వోన్నత న్యాయస్థానం దాన్ని సమర్థించింది. మోహిని జైన్‌ / స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక (1992) లోకల్స్‌ ఓన్లీ అనే కేసులో, అలాగే డాక్టర్‌ ప్రదీప్‌ జైన్‌ / యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐఆర్‌ 1984) రిజర్వేషన్‌ రూల్‌ని అప్‌హెల్డ్‌ చేసింది. అయితే రాజేంద్రన్‌ / స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1968)లో జిల్లాల వారిని కొట్టివేయగా స్టేట్‌ ఆఫ్‌ యూపీ/ ప్రదీప్‌ (1975)లో ఉత్తరాఖండ్‌ హిల్స్‌ ఏరియా విద్యార్థులకి రిజర్వేషన్‌ని ఆర్టికల్‌ 15(4) ప్రకారం విద్యాపరంగా వెనుకబడినవారికని మాత్రమే సమర్థించింది. నిడమర్తి మహేష్‌/ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (1986) యూనివర్సిటీలు ప్రాం తీయ రిజర్వేషన్లను ఒకే ప్రాంతం వెనుకబడిందంటే అది సరికాదని కొట్టవేసింది. రాధిక జైస్వాల్‌ కేసులో మెడికల్‌ విద్యలో కూడా ఆ విధమైన స్థానికత-డామిసైల్‌ రూల్‌ చెల్లదని, అదీ ముందస్తు ఇన్ఫర్మేషన్‌ లేకుండానని జస్టిస్‌ అనూప్‌ మెహతా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్‌ 2014 జూన్‌ 24న తీర్పు ఇచ్చింది. అయితే వారు ఇప్పుడు 12వ తరగతి అక్కడే చదివి ఉండాలనే నిబంధన ఒక అర్హతగా చేర్చారు. 1932 కటాఫ్‌ డేట్‌గా బాబూలాల్‌ మరాండీ ప్రభుత్వం 2002లో తీసుకొచ్చిన చట్టం హింసకు దారితీసింది. ఆఖరుకు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తమిళనాడులో తల్లిదండ్రులు, గార్డియన్‌ నివాస ధ్రువీకరణపై గత ఆరు సంవత్సరాలుగా అక్కడ నివాసముంటే స్థానికత్వం వస్తుంది. 1993 నుంచి మహారాష్ట్రలో అది పది సంవత్సరాల నివాసం. హర్యానాలో పదిహేనేళ్ళు, గుజరాత్‌లో పది సంవత్సరాలు. అనేక రాష్ట్రాల్లో స్థానికత అనేది కొన్ని ఉద్యోగాలకు, కొన్ని విద్యా ప్రవేశాలకు అదీ వేరు వేరుగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఆ రాష్ట్ర వాసిని వివాహం చేసుకున్న మహిళకు స్థానికత వస్తుంది. అనేక చోట్ల పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక భాష తప్పనిసరి చేసారు. పరీక్ష లున్నాయి. ఇక మన తెలంగాణ, ఆంధ్రలలో భాష, లిపి ఒక్కటే. పైగా ప్రత్యేక తెలంగాణ వాదులు కోరినట్లు 371-డి అధికరణం అమలులో ఉంది. దాని ప్రకారం ఆ సీటు లేదా ఉద్యోగానికి స్థానికత కావాలంటే అర్హత కలిగిన విద్యార్హత ముందు నాలుగు సం వత్సరాలు వరుసగా లేదా గత ఏడు సంవత్సరాల్లో ఎక్కడ చదివితే అక్కడ స్థానికులు అవుతారు.
వలసవచ్చిన జనాభాతో కలుపుకొని 42 శాతమనీ, హైదరాబాద్‌ జనాభా 75 లక్షలనీ చెప్పి ఆస్తులలో వాటా తీసుకుని, రాజధాని కాబట్టి ఏర్పడిన 400 ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉం చుకుని నేడు వారి పిల్లలకు, అదీ అల్పాదాయ వర్గాలకి ఫీజు కట్టనుపొమ్మంటే ఎలా? తెలంగాణలో తెలంగాణేతర భారతీయులు 70 లక్షల వరకు ఉండవచ్చు. తెలంగాణ పౌరసత్వ కార్డులు, కాశ్మీర్‌, హైదరాబాద్‌లపై టీఆర్‌ఎస్‌ అధినేతల వ్యాఖ్యలు చూస్తుంటే, ఇప్పటివరకు ఆంధ్ర-తెలంగాణ ఉద్వేగాలుగా సృష్టించినవి ఇకముందు భారతదేశ ఇతర పౌరులు వెర్సస్‌ తెలంగాణ వారుగా చేయబోతున్నారా అనే అనుమానం వస్తుంది. అందుకనే బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో సహా అన్ని ప్రాంతీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా ఉద్వేగాలను రగిలించి రాజకీయ అనుకూలతను తెచ్చిపెట్ట వచ్చు గానీ తెలంగాణ పౌర సమాజానికి అంతిమంగా లాభం చేయదు. దీనిపై స్పందించడానికి తెలంగాణలో ఒక్క మేధావి లేరా అని విద్యార్థులు, వారి తల్లితండ్రులు అడుగుతున్నారు. రాష్ట్రపతి, పార్లమెంటు, భారత ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా తమ పౌరులకి న్యాయం చేయాలి.. ఈ ఏడాది ఉమ్మ డిగా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి (పోస్ట్‌ మెట్రిక్‌) 4991 కోట్ల రూపాయలు అవసరం అని తేల్చారు. ఆ ప్రకారం కొత్త ఆంధ్రప్రదేశ్‌ 2477 కోట్లు, తెలంగాణ 2514 కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే తెలంగాణ 2096 కోట్లు (42శాతం) పెట్టుకుంటే చాలంటూ 300 కోట్లకు పైగా అధిక ఖర్చుకు చంద్రబాబు ముం దుకు వచ్చారు. ఎలాగూ సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడుగుముందుకు వేసి సమస్యని పరిష్కరించాలి. విద్యుత్తు, నీరు వంటి ముఖ్యమైన అంశాలను కూడా పరిష్కరించుకుని ఇరువురు ముఖ్యమంత్రులు రాజనీతిజ్ఞులుగా వ్యవహరిస్తూ రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్ళాలి.
-చలసాని శ్రీనివాస్‌
ఆంధ్ర మేధావుల వేదిక

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

  1. Jai Gottimukkala అంటున్నారు:

    ఈ విషయాన్ని నా బ్లాగులో కూలంకుషంగా విదిశీకరించాను. సమయం దొరికినప్పుడు చదువగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.