తానొవ్వక నొప్పించకగా ఉండే చక్ర పాణి గురించి – సింగీతం చెప్పిన జ్ఞాపకాలు

తానొవ్వక నొప్పించక – సింగీతం చెప్పిన చక్రపాణి జ్ఞాపకాలు…

Published at: 05-08-2014 00:55 AM

పాపాయికి గోరుముద్ద తినిపించాలంటే వెన్నెల్లో చందమామను పిలవాలి. అదే పాపాయిని జో కొట్టాలంటే అక్షరాల్లో చందమామను వినిపించాలి. ఆ చందమామ అందనిది… ఈ చందమామ అందరిదీ. అందని ఆ చందమామను తన సాహితీకలంతో నేలకి దించి తెలుగు లోగిళ్లలో సాహితీ వెన్నెలను ప్రసరింపచేసిన ఆ మహోన్నత వ్యక్తి.. తెలుగు సినిమా స్వర్ణయుగ చక్రవర్తి చక్రపాణి. ఆయన అడుగుజాడల్లో నడిచిన సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన చందమామ కథల్లాంటి సినీ సౌరభాలే.. ఈ చక్రపాణి జ్ఞాపకాలు…

‘‘ఇప్పుడు సందేశాలు ఇవ్వడం ఎక్కువైపోతోంది. సందేశం ఇవ్వదలచుకుంటే ఆయన ఒకటి చెబుతారు- ‘ఒక పోస్టుకార్డు మీద రాసి అందరికీ పంపించవచ్చు కదా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకూ’ అని. సినిమా అంటే మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచడమే ప్రధానమన్న ఆయన అభిప్రాయం’’

విజయా సంస్థలో అడుగుపెట్టక ముందే నాకు చక్రపాణిగారు తెలుసు. మొట్టమొదట చక్రపాణి పేరు విన్నది బెంగాలీ శరత్‌ సాహిత్యంలో. ఎన్నో రచనలను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. ఆయనలో గొప్ప సామాజిక స్పృహ ఉంది. ‘దేవదాసు’ అంటే ‘జగమే మాయ…’ పాటలు కాదు- జమీందారి వ్యవస్థ. అదే మెయిన్‌ సబ్జెక్ట్‌. ‘లైలామజ్ను’ అయినా, ‘రోమియో జూలియట్‌’ అయినా కేవలం ప్రేమకథలు కాదు, ఆనాటి వైషమ్యాల గురించి చెప్పే సినిమాలవి. చక్రపాణి రచనల్లో సామాజిక దృక్పథం కచ్చితంగా ఉంది. ఏమీ లేకపోతే ఆయన శరత్‌ సాహిత్యాన్ని ఎందుకు అనువదిస్తారు? కాకపోతే అది స్టేట్‌మెంట్‌గా, ఈ రకంగా ఉండాలి, అలా ఉండకూడదు అని ఏదో నీతులు చెప్పినట్టు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. రాముడు మంచి బాలుడు సామెత చెప్పి మీరూ అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం కన్నా ఒక ఇతివృత్తం ద్వారా అంతర్లీనంగా సందేశాన్ని చెప్పడంలో ఒక అందం ఉంది. అది చక్రపాణి రచనలో, సినిమాలో, ఆలోచనలో ఉంటుంది.
సందేశాలొద్దు..
ఇప్పుడు సందేశాలు ఇవ్వడం ఎక్కువైపోతోంది. సందేశం ఇవ్వదలచుకుంటే ఆయన ఒకటి చెబుతారు- ‘ఒక పోస్టుకార్డు మీద రాసి అందరికీ పంపించవచ్చు కదా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకూ’ అని. సినిమా అంటే మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచడమే ప్రధానమన్నది ఆయన అభిప్రాయం. ‘షావుకారు’, ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పు కూడు’, ‘గుండమ్మ కథ’… ఇవన్నీ జనరంజకమైన సినిమాలే. అన్నిట్లో కూడాను ఒక స్టేట్‌మెంట్‌ ఉంటుంది. అండర్‌లైన్‌ స్టేట్‌మెంట్‌. అవన్నీ షుగర్‌ కోటెడ్‌గానే ఉంటాయి. ఎక్కడా కూడా సందేశం చెబుతున్నట్టు తెలీదు. కానీ, ఇవన్నీ సామాజిక నేపథ్యమున్నవే. అదే చక్రపాణి సినిమాల గొప్పతనం.
పిల్లలకే కాదు..
‘చందమామ’లో ఇదే కనిపిస్తుంది, కథల్లో ప్రతిబింబిస్తుంది. అన్నీ మనోవికాసాన్ని కలిగించే ఆరోగ్యకరమైన కథలే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే… చిన్నపిల్లల కథలు రాశారు కదా అని ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవడానికి వీల్లేదు. ఆ ఆలోచన పొరబాటు. ఎందుకంటే ఆయన రాసింది చిన్నపిల్లల కథలు కాదు, చిన్నపిల్లలకు అర్థమయ్యే కథలు. చందమామ కథలు పిల్లల కంటే ఎక్కువ ఆసక్తిగా పెద్దల్ని కూడా చదివించాయి. ఈ కథల్లో ఎన్నో గొప్ప సందేశాలున్నాయి. ప్రతి కథలోనూ మంచి సందేశం ఉంటుంది. కానీ, ఎక్కడా ఇది నీతి, మీరు పాటించండి అని చెప్పలేదు. కథ, కథా వస్తువులు, పాత్రలు, చుట్టూ పరిసరాల ఇతివృత్తమే మనకు నీతిని ప్రబోధిస్తాయి. గమనిస్తే చక్రపాణి వ్యక్తిత్వం, చందమామ తత్త్వం ఒక్కటిగానే కనిపిస్తుంది. ఇదే ఆయన సినిమాల్లోను ప్రస్ఫుటిస్తుంది. తెలుగుజాతికి చక్రపాణి అందించిన గొప్ప కానుక ‘చందమామ’. ఇది కేవలం మ్యాగజైన్‌ కాదు, గొప్ప విలువలను చాటిన జీవితపాఠం. ప్రతి కటుంబంలోనూ ఒక భాగం.
చక్రపాణి ఏదైనా విషయాన్ని చెప్పాలంటే అందుకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తారు. కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యమిస్తారు. ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో ‘ఎవరో ఎవరో…’ అంటూ పింగళి నాగేంద్రరావు ఒక పాట రాశారు. అందులో ‘చదువుల సారం సంసారమునకే పదిలం చేసిందెవరో..’ అని ఉంటుంది. అది చాలా గొప్ప మాట. ఇది చక్రపాణి రాయలేదు. అయినా ఇక్కడ ఆయన గొప్పతనం ఏమిటంటే.. ఆ వాతావరణాన్ని సృష్టించడం. మన చుట్టూ వాతావరణాన్ని బట్టే ఆలోచనలు ఉంటాయంటారు. నిర్మాతగా చాలా కమాండింగ్‌, రచయితగా సృజనాత్మక శైలి ఆయనది.
అందరితో హాయిగా..
ఆనాటి సంగీత దిగ్గజాలు ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు ఇద్దరూ చక్రపాణి సినిమాలకు సంగీతం అందించినవారే. అయితే ఇద్దరి పనితీరులో తేడా ఉంది. ఘంటసాల చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సాలూరి రాజేశ్వరరావు అందుకు భిన్నంగా ఉంటారు. ఘంటసాల అనుకున్న సమయానికి వస్తారు, పని పూర్తి చేస్తారు. సాలూరి చెప్పిన సమయానికి రారు. ‘మాయాబజార్‌’లో మొదట నాలుగు పాటలు రాజేశ్వరరావు చేశారు. అయితే తరువాత ఘంటసాలతో కంపోజింగ్‌ చేయించారు కె.వి.రెడ్డి. నిజానికి సాలూరి పెద్ద జీనియస్‌ అని ఒప్పుకుంటారు కానీ, ఆయన ఇన్‌డిసిప్లేన్‌ కె.వి.రెడ్డికి నచ్చదు. చక్రపాణి అలా కాదు- ఘంటసాలతో ఎంత హాయిగా పని చేయించుకోగలరో, సాలూరితో కూడా అంతే హాయిగా పని చేయించుకునేవారు.
ఒకసారి మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరుగుతోంది. సినిమా సరిగ్గా గుర్తు లేదు. బహుశా ‘అప్పు చేసి పప్పు కూడు’ అనుకుంటాను. రాజేశ్వరరావుకి ట్యూన్‌ రాలేదు. కంపోజింగ్‌ గదిపైన ఉంటుంది. కింద గార్డెన్‌ ఉండేది. ఆయన ‘నేను గార్డెన్‌లో వున్న చెట్టు కిందకి వెళ్లి ఆలోచిస్తాను. అక్కడైతేనే నాకు ట్యూన్‌ వస్తుంది’ అన్నారు. ఈలోపు రచయిత పింగళి నాగేంద్రరావు ‘నేనూ తోటలోకి వెళ్తాను. ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది. ఆ రాయి మీద కూర్చుంటేనే నాకు పాట వస్తుంది’ అని ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. ప్రొడక్షన్‌ మేనేజన్‌ జగన్నాథరావు వారిద్దర్నీ చూసి ఒకరేమో చిటెకెలు వేసుకుంటూ చెట్టు కింద తిరుగుతున్నారు, మరొకరు రాయి మీద కూర్చుంటేగానీ మూడ్‌ రాదంటున్నారు. వీరి వరసేంటబ్బా అనుకుంటూ అలా చూస్తూ వున్నాడు. అప్పుడే వరండాలో నుండి చక్రపాణి వస్తున్నారు. కంపోజింగ్‌ గదిలో ఎవరూ లేరు, అసిస్టెంట్స్‌ తప్ప. జగన్నాథరావుతో ‘ఏమయ్యా రాజేశ్వరరరావు ఎక్కడ? నాగేంద్రరావు ఎక్కడ?’ అనడిగారు. జగన్నాథరావు విషయం చెప్పారు. అక్కడేమో వారిద్దరూ ‘నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వెందుకు వచ్చావ’ని వాదులాడుకుంటున్నారు. ‘నాకు చెట్టు కిందే ట్యూన్‌ వస్తుంద’ని సాలూరి అంటే, ‘రాయి మీద కూర్చుంటేనే ఈ రాయి నన్ను రాయి రాయి అంటుంది, అందుకే కూర్చున్నా’ అన్నారు పింగళి. అప్పుడు చక్రపాణిగారు ఒక మాట అన్నారు – ‘అవునులే. పులి కావాలంటే అడవికి వెళ్లాల్సిందేగానీ, స్పెన్సర్‌ స్టోర్‌లో దొరుకుతుందా!’ అని. ఇదంతా నాకు జగన్నాథరావు చెప్పారు. అంటే… సాలూరిగానీ, నాగేంద్రరావుగానీ కాస్త ఇన్‌డిసిప్లేన్‌గా వున్నా… వాళ్లలోంచి ఉద్భవించే ఆ క్రియేటివిటీ ఉందే అది చక్రపాణికి తెలుసు. క్రమశిక్షణ కోసం క్రియేటివిటీని బలిచేయకూడదని చక్రపాణి అభిప్రాయం. కె.వి.రెడ్డి మాత్రం డిసిప్లేన్‌ కావాల్సిందే అంటారు. ఇద్దరూ మహానుభావులే. నాగిరెడ్డికి వీరిద్దరూ అంటే అపరిమితమైన అభిమానం.
చక్రపాణి అంటే నాగిరెడ్డికి ప్రాణం అనే చెప్పొచ్చు. ఎల్వీ ప్రసాద్‌, ఎన్టీఆర్‌, కామేశ్వరరరావులను నాగిరెడ్డి చాలా గౌరవించేవారు. వాళ్లందరి కంటే చక్రపాణే ఎక్కువ అని నాగిరెడ్డి అనేక సందర్భాల్లో అనేవారు. చక్రపాణి, నాగిరెడ్డిల మఽఽధ్య బంధాన్ని తెలిపే గొప్ప సంఘటన ఒకటుంది. చక్రపాణిగారు మరణించిన తరువాత ఒకసారి నాగిరెడ్డి తమిళం నుండి తెలుగులోకి సినిమా రీమేక్‌ చేస్తున్నారు. విజయా గార్డెన్స్‌ థియేటర్‌లో పూజా కార్యక్రమం ఏర్పాటుచేశారు. దేవుడి చిత్రపటాలన్నీ పెట్టి పండితులు మంత్రాలు చదువుతున్నారు, యూనిట్‌ సభ్యులు, అతిథులుగా వచ్చిన వారందరూ అక్కడే వున్నారు. అంతా నాగిరెడ్డి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో నాగిరెడ్డి కారులో వచ్చారు. కారు దిగి పూజ ఏర్పాటుచేసిన చోటుకి వెళ్లారు. ఎవరితో మాట్లాడకుండా ఇప్పుడే వస్తానని వెంటనే వెనక్కి తిరిగి కారెక్కి వెళ్లిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు వెళ్లిపోయారా? అన్నది ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది సేపటి తరువాత మళ్లీ కారు వచ్చింది. నాగిరెడ్డి చేతుల్లో ఒక ఫోటోతో దిగారు. అది చక్రపాణి ఫోటో. తన మిత్రుడి ఫోటోని దేవుడి చిత్రపటాల పక్కన పెట్టిన తరువాత పూజ చేయమన్నారు. ఆ దృశ్యం చూసిన అక్కడున్నవారందరూ చలించిపోయారు.
గంభీరతే ఎక్కువ..
చక్రపాణి నవ్వుతూ కనిపించే సందర్భాలు చాలా తక్కువ. బాధగా కూడా కనిపించేవారు కాదు. ముఖంలోగానీ, మాటల్లోగానీ ఏ భావం తెలిసేది కాదు. చాలా గంభీరంగా, ఠీవిగా ఉండేవారు. ఇలాంటి వ్యక్తి తన సినిమాల ద్వారా, చందమామ కథల ద్వారా ఎంతో ఉల్లాసవంతమైన వినోదాన్ని ఎలా అందించారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి నవ్వు (మొదటి పేజీ తరువాయి)
ఆయన మనసులోనే ఉంది. అది కళ్లలో కనిపిస్తుంది. మనం ఏదైనా విషయాన్ని ఆస్వాదిస్తున్నామంటే నవ్వు ముఖంలోనే కనిపించాల్సిన అవసరం లేదు. అది వారి బాడీలాంగ్వేజ్‌ని బట్టి ఉంటుంది. ఆయన ఎంత ఆస్వాదించకపోతే ‘మిస్సమ్మ’; ‘గుండమ్మకథ’ వంటి సినిమాలు తీశారు, చందమామలో అంతటి గొప్ప కథలు రాశారంటారు!
సేవల కోసం కాదు..
విజయా గార్డెన్స్‌ కాంపౌండ్‌లో ఉంటాను గనుక ఆయన్ని ఎక్కువగా చూసే అవకాశం ఉండేది. కానీ, ఆయన చనువుగా ఉండే అదృష్టం దక్కలేదు. అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పేవాళ్లమంతే. ఎంత పెద్ద స్టార్‌లైనా, మాలాంటి అసిస్టెంట్లు అయినా చక్రపాణి సమంగానే చూసేవారు. ఆయన స్థాయికి ఆ రోజుల్లో అందరూ చిన్నవాళ్లే. నేను కె.వి.రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. నాకు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. అందులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని రాసుంది. ఆ లెటర్‌ని చక్రపాణికి చూపిస్తే ‘అసిస్టెంట్‌ టు డైరెక్టర్‌’ అని మార్చారు. అంటే నేను దర్శకుడు కేవీ రెడ్డికి మాత్రమే సహాయకుడ్ని అని. మిగతా వారికి సేవలు చేయక్కర్లేదు అని దానర్థం.
అదే ఆయన ట్రేడ్‌మార్క్‌..
ఆయనకి పలు భాషలు వచ్చినప్పటికీ తెలుగులోనే మాట్లాడేవారు. మాటలో ఒకరకమైన యాస ఉండేది. నిదానంగా నడుస్తారు. పంచెకట్టు, చేతిలో సిగరెట్టు ఆయన ట్రేడ్‌మార్క్‌. సిగరెట్‌ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఎందుకో ఆయన దాన్ని వదల్లేకపోయారు. ఈ విషయంలో ఆయన ఎవరికీ సలహాలు ఇవ్వలేదు, ఎవరూ ఆయనకి సలహా ఇచ్చే ధైర్యమూ చేయలేదు. సినిమాలకు సంబంధిస్తే మాత్రం తెలిసినవారికి, తెలియని వారికి కూడా పిలిచి మరీ సలహాలు ఇచ్చేవారు. ఏఎన్నార్‌ ‘బాటసారి’ సినిమా చూసి ‘ఇటువంటి సినిమాలు ఎందుకయ్యా చేస్తావు’ అన్నారు. విజయా గార్డెన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఒక మలయాళ సినిమా చూసి… ఆ దర్శకుడు ఎవరో తెలియకపోయినా పిలిచి మరీ ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆయన చెప్పే సలహాలకు తిరుగుండదు. ఎందుకంటే ఆయన చెప్పేదంతా సినిమా మంచి కోసమే. ఆయన ఏ సినిమా చూసినా మొదటి నుంచి చివరి వరకూ వరుసగా చూడరు. ముందు ఒకటో రీలు, తరువాత మూడో రీలు… రెండు రోజులు తరువాత పన్నెండో రీలు, తరువాత నాలుగో రీలు.. అలా ఉంటుంది ఆయన సినిమా చూసే విధానం. మొత్తం చూసిన తరువాత సినిమా అంతా పర్ఫెక్ట్‌గా చెబుతారు. తుదిగా సినిమా ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. ఆయన సినిమాల్లో ఎస్వీఆర్‌, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం కచ్చితంగా ఉండాలి. వీరు లేకుండా సినిమాలు తీయరు.
ఆ పాట అలా వచ్చింది..
చక్రపాణి సినిమా మేధావి. ఆయన ఆలోచన, అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఒక ఫ్రేమ్‌లో జనం ఏది చూస్తారు, ఏది చూడరన్నది నిక్కచ్చిగా అంచనా వేయగల సామర్థ్యం ఆయనకుంది. ఒకసారి ‘గుండమ్మ కథ’లో ‘ప్రేమ యాత్రలకు బృందావనము’ పాట కంపోజింగ్‌ జరుగుతోంది. దర్శకుడు కామేశ్వరరావు, ఘంటసాల, పింగళి నాగేంద్రరావు చర్చించుకుంటున్నారు. ఆ రోజుల్లో శ్రీధర్‌ వంటి యువ దర్శకులు పాటల్ని ఊటీలో తీయడం మొదలుపెట్టారు. అది చూసి కామేశ్వరరావు ప్రేమ యాత్రలకు బృందావనం పాటని కాశ్మీర్‌లో తీయాలనుకున్నారు. చిన్న చిన్న నిర్మాతలే ఊటీ, కొడైకెనాల్‌లో తీస్తున్నారు, విజయ వంటి పెద్ద సంస్థ సినిమా మనది, కాశ్మీర్‌లోనే పాట తీద్దాం అని కామేశ్వరరావు అన్నారు. పింగళి నాగేంద్రరావు, కెమెరామెన్‌ మార్కస్‌ బార్క్‌లే, ఘంటసాల కూడా సరే అన్నారు. అప్పుడే చక్రపాణి వచ్చారు. ఏమిటి విషయం అంటే… ఈ పాటని కాశ్మీర్‌లో తీయాలని అనుకుంటున్నామండి అని చెప్పారు. చక్రపాణి వెంటనే ‘‘సినిమా చూడ్డానికి వచ్చేవాళ్లు రామారావు, నాగేశ్వరరావు ముఖాలు చూడ్డానికి వస్తారు. వెనుక చెట్లు, పుట్టలు చూడ్డానికి కాదు. మన విజయా గార్డెన్స్‌ ఏమీ తక్కువైంది కాదు. అందుకని బ్రహ్మాండంగా విజయా గార్డెన్స్‌లోనే తీయచ్చు’’ అని వెళ్లిపోయారు. ఆయన ఆలోచననే పింగళి నాగేంద్రరావు మనసులో పెట్టుకుని ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏల నో… ప్రేమయాత్రలకు కాశ్మీరాలు, కొడైకెనాలు ఏలనో…’ అని రాశారు. సూపర్‌హిట్‌ అయ్యింది. అలా చక్రపాణి ఆలోచన నుండి పుట్టిన పాట ఇది. ఇందాక చెప్పినట్టు ఏదీ డైరెక్టుగా చెప్పరు. ఆయన మాటల్లోనే అంతర్లీనంగా ఎంతో విషయం ఉంటుంది.
దర్శకుడు కనిపించకూడదు..
ఎవరు మంచి డైరెక్టరు అన్న ప్రశ్న వస్తే… అబ్బ ఎంత మంచి షాట్‌ తీశాడురా అన్నారంటే అది మంచి సినిమా కాదన్నది నా అభిప్రాయం. టైటానిక్‌ చూస్తుంటే ఎవరు డైరెక్టరు అన్నది మర్చిపోతాం. సినిమా పూర్తయిన తరువాతే ఎవరబ్బా ఈ సినిమా తీసిన డైరెక్టరు అనుకుంటాం. గొప్ప సినిమాలన్నీ అంతే. సినిమాలో దర్శకుడిగా తాను కనిపించాలని, తన స్టాంపు చూపించాలని నిర్మాత అనుకుంటే అది మంచి సినిమా అవ్వదు.
చక్రపాణి ఆలోచన కూడా అదే. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి నటీనటులుగానీ, దర్శకుడుగానీ కనిపించకూడదు. ఆ పాత్రల్లో, వాతావరణంలో లీనమైపోవాలి. హీరోల కోసం పంచ్‌ డైలాగ్‌లు పెట్టడమంటే సినిమాకి విలు వ తగ్గినట్టే. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ కూడా పంచ్‌ డైలాగులు చెప్పినా హద్దులు దాటేవారు కాదు. ఎన్టీఆర్‌కి ప్రజల్లో ఉండే ప్రభావం తెలుసు. అందుకు తగ్గట్టుగానే రచయితలు రాసేవారు.

 

Category:

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.