చిన్నారి చైనా కతలు -1
సరసభారతి బ్లాగ్ లో ఇంతవరకు నేను చిన్నారుల కోసం ఏమీ రాయలేక పోయానే అనే భావం ఉండి పోయింది .ఆ లోటు తీర్చటానికి ఈ రాఖీ పూర్ణిమ సందర్భం గా ‘’చిన్నారి చైనా కతలు ‘’మొదలు పెడుతున్నా .పిల్లలకోసం చైనా వారి కదలని , చిట్టి పొట్టి చైనా కదలని అర్ధం గా శీర్షిక పెట్టాను .రాయటం కుదురుతుందో లేదుకాని ప్రయత్నం లో తప్పులేదు కదా అని ముందుకు వెడుతున్నాను .
అనాకారులూ అవసర సాయం చేయగలరు
పూర్వం చైనా దేశం లో రాజులు అందం గా ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలనే ఎంచుకొని పెళ్లి చేసుకొనేవారు .మరి రాణీ కావాలంటే ఎన్నో విషయాలు ఆలో చించి కాని అడుగు ముందుకు వేసే వారు కాదు .కాని ఇందుకు విరుద్ధం గా చైనా లోని’’ క్వి ’’రాజ్యం లో ఇద్ద్దరు సద్గుణ రాశులైన అనాకార యువతులు ,రాజు మనసును గెలిచి ,రాణులై రాజ్య పాలన చేశారనే సంగతి వింటే ఆశ్చర్యం వేస్తుంది .
కళ్ళు ముఖం లో దాక్కొని ఉండి నెత్తిమీద సరిగ్గా జుట్టే లేకుండా ,నల్లగా తారు డబ్బా లాగా ఉండే ‘’యు యాన్ ‘’అనే అమ్మాయి ఉండేది .ఆ పిల్ల పుట్టిన ఊరు పేరు అదే .అందుకని ఆ పేరు తోనే అందరూ పిలిచేవారు .అనాకారి గా ఉండటం మూలం గా బయటికి ఎప్పుడూ వచ్చేదికాదు .అలా ఆమెకు నలభై ఏళ్ళు వచ్చాయి .ఒక రోజు ఆమె కు ధైర్యం వచ్చి జువాన్ చక్ర వర్తిని దర్శించటానికి వెళ్ళింది .చక్రవర్తి దగ్గర వినయం గా నిలబడి ‘’మహా ప్రభూ !మా రాజ్యం అపాయం లో ఉంది .కనుక అక్కడ ఉండలేక మీ కొలువులో ఏదైనా తగిన పని నాకు ఇప్పిస్తే ఇక్కడే ఉండిపోదామని వచ్చాను ‘’అనిమనవి చేసుకోంది.చక్రవర్తి ఆమె దేశానికి అపాయం ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు .దానికి ఆమె’’మా దేశానికి రెండు వైపులా’’ క్విన్’’ ,’’చు’’ అనే రెండు బల మైన రాజ్యాలు ఉన్నాయి .అవి తరచు మా దేశం పై దాడి చేస్తున్నాయి .మాకు రక్షణ లేకుండా పోయింది .మీకు ఇంతవరకు ఈ విషయం ఎవరూ చెప్పి నట్లు లేదని పించింది .మీకూ ఏ క్షణం లో నైనా ఆ రాజ్యాలు ప్రాణాపాయం కలిగించ వచ్చు.’’అని చెప్పింది.రాజుకు జ్ఞానోదయమైంది .అప్పటి నుంచి విలాస వంతమైన జీవితాన్ని వదలి పెట్టి సామాన్య జీవితం గడుపుతూ ,ప్రజల ఆలనా పాలనా పట్టించుకోన్నాడు .రాజ్యాన్ని సర్వ సంపదలకు నిలయం గా చేసి ప్రజా రంకం గా పాలించాడు .ఆ కురూపినే ఆమె ధైర్య సాహసాలకు నిర్భీతికి నిజ వర్తనానికి మెచ్చి పెళ్లి చేసుకొని మహా రాణిని చేశాడు .అప్పటి నుంచి ఆమె మహా రాణి మాత్రమె కాదు చక్రవర్తికి ఆంతరంగిక సలహా దారు ,ముఖ్య స్నేహితురాలుగా కూడా ఉండి, ప్రజా సంక్షేమం కోసం పాలించింది .
కొన్ని శతాబ్దాల తర్వాత’’ క్వి ‘’రాజ్యం లోనే మరో కురూపి జన్మించింది .ఆమె మెడపై పెద్ద కణితి ఉండి చూడటానికే భయంకరం గా ఉండేది పాపం .ఆమె పేరు ‘’సు లియు ‘’.ఒక సారి ‘మిన్’’చక్రవర్తి ప్రజల దర్శనం కోసం వీధులలో తిరుగుతున్నాడు .రోడ్లు అన్నీ జనాలతో కిక్కిరిసి చక్ర వర్తిని చూసే ఉత్సాహం లో ఆనందం లో వేడుకలో ఉన్నారు .అదే సమయాన మన ’’ సు లియు ‘’మల్బరీ ఆకులు కోసుకుంటూ ఇదేమీ పట్టించుకోకుండా ఉంది .చక్రవర్తి దృష్టికి ఈ విషయం వెళ్ళింది .ఆమె ఆయన్ను లెక్క చేయటం లేదని ఎవరో ఆయనకు సాడీలు చెప్పారు .వెంటనే ఆమె ను తన ఎదుట ప్రవేశ పెట్టమని ఆజ్ఞాపించాడు .ఆమె వచ్చి ఎదుట నిలబడింది .’’అయ్యా ! నేను నా పనిలో పూర్తీ ధ్యాస పెట్టి మల్బరీ ఆకులు కోసుకొంటున్నాను మీరు ఇక్కడికి వచ్చిన సంగతి నేను గమనించలేదు మన్నించండి ‘’అని నిజాయితీగా ,నిర్భయం గా చెప్పింది .ఆమె అంద వికారి అయినా ఆమె లో సద్గుణాలను చూసి చక్ర వర్తి మెచ్చుకొని ఆమె ను తనతో రాజధానికి తీసుకు వెడతాను రమ్మని చెప్పాడు .ఆమె అత్యంత వినయం తో ‘’మహా రాజా !నేను తండ్రి చాటు పిల్లను .మా తలితండ్రులు అనుమతిస్తేనే మీతో రాగాలను .వాళ్ళ అంగీకారం ముందుగా పొందాలి మీరు ‘’అని ఖచ్చితం గా తేల్చి చెప్పింది .ఈ మాటలకు చక్ర వర్తి మరీ మురిసి పోయాడు .ఆమె లోని మంచితనం అణకువ ,తెగువ నిర్భయం నిజాయితీ ఆయన్ను బాగా ఆకర్షించాయి .ఆమె కోరిక మన్నించి చక్రవర్తి ఆమె తలిదండ్రుల అనుమతి పొంది ‘’సు లియు ‘’ను వైభవోపేతం గా వివాహం చేసుకొని మహా రాణి ని చేశాడు .ఆమె చక్ర వర్తికి అన్ని విషయాలలో సహకరిస్తూ ,ప్రజల బాగోగులు తెలుసుకొని వారికి కావలసిన సాయం చేస్తూ రాజ్యం లో శాంతి భద్రతలు కాపాడి మంచి పేరు తెచ్చుకోంది.
కనుక పిల్లలూ !అందం కంటే సౌశీల్యం ,నడవడి ,నిజాయితీ ,పెద్దల యెడ గౌరవం , అంకితభావం తో తదేక దృష్టితో పని చేయటం చాలా ముఖ్యం అని మనకు సు లియు ,యు యాన్ కధలు వింటే తెలిసిందికదా .
మరిన్ని కధలు మళ్ళీ తెలుసుకొందాం –
సశేషం
శ్రావణ పౌర్ణమి రక్షా బంధన్ ,రాఖీ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-14-ఉయ్యూరు