చిన్నారి చైనా కతలు -2
తెలివి లేని గాడిద
చైనా లోని ఘిజూ ప్రాంతం లో ఒకప్పుడు గాడిదలే ఉండేవికావు .ఎవరో ఒకాయన అక్కడున్న పర్వతం ఎక్కడానికి తన ఊరు నుంచి గాడిదమీద ఎక్కి వచ్చాడు .ఆ పర్వతం గాడిద ఎక్కలేదని దానితో ఇక తనకేమీ పని లేదని ,ఆయన దాన్ని పర్వతం దిగువనే వదిలేసి వెళ్ళాడు .ఇంతలోకే ఎక్కడి నుంచో ఒక పులి గాండ్రించు కొంటు అక్కడికి వచ్చింది .పెద్ద శరీరం ఉన్న ఈ కొత్త జంతువును చూసి దేవత అను కొంది పులి .దానికి మర్యాద ఇచ్చి వెనక్కి తప్పుకొని ,అడవిలోకి వెళ్లి ,గాడిదను రహస్యం గా ఒక కంట కని పెడుతూ ,చూస్తోంది .ఒక్కో సారి ముందుకు వచ్చినా గాడిద దేవత కు దూరం గానే ఉండి గౌరవిస్తోంది .
ఒక రోజు ఆ పులి మళ్ళీ గాడిద ఉన్న చోటుకి వచ్చింది .అప్పుడే ఉన్నట్టుండి గాడిద పెద్దగా ఓండ్ర పెట్టింది .ఆ శబ్దానికి భయపడిన పులి, గాడిద తనను చంపి తినేస్తుందేమో నని అనుమానించి ,వేగం గా అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ అడవిలో దాక్కుంది .అక్కడే పొదల్లో కనిపించకుండా దాక్కుని గాడిద కదలికలను జాగ్రత్త గా గమనిస్తోంది .గాడిదకు శరీరం భారీగా ఉన్నా ,ప్రత్యేకతలు ఏమీ లేవని అర్ధం చేసుకోంది పులి .క్రమం గా దాని భయం పోయింది .
కొన్ని రోజులకు పులి కి గాడిద పెట్టె ఓండ్ర లకు భయం పోయి అలవాటైపోయింది .అది అరిచేదేకాని కరిచేదికాదని అర్ధమైంది .ఇప్పుడు మరీ ధైర్యం గా రోజూ గాడిద దగ్గరకు వస్తూ దాని చుట్టూ తిరిగి వెళ్ళేది. ఒకసారి పులి విపరీతం గా ధైర్యం పొంది గాడిద దగ్గరకొచ్చి కావాలనే రెట్టిస్తూ పంజా విసిరి గాయ పరచింది .దీనికి విపరీతమైన కోపం వచ్చింది గార్ధభానికి .వెంటనే రెచ్చి పోయి వెనక కాళ్ళ తో ఝాడించి పులిని తన్నింది .’’ఇంత పెద్ద జంతువువి నువ్వు చేసేది ఇంతేనా ?’’అని నవ్వుకొంటూ ,భయంకరం గా గర్జిస్తూ గాడిదపై దూకి చంపి హాయిగా తినేసి వెళ్ళిపోయింది . .
అందుకే అనువుకాని చోట అధికులం అని పించుకొంటే ప్రాణాంతకం అని నీతిని తెలియ జేసే కద ఇది .
బుద్ధి తక్కువ బుడతడు
ఝాంగ్ రాజ్యం లో ఒక తెలివి తక్కువ వాడు ఉండే వాడు .ఒకరోజు వాడికి కొత్త చెప్పులు తనే వెళ్లి కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది .ఒక స్కేలు తీసుకొని పాదం సైజు కొలుచుకొని ,జాగ్రత్తగా కొలతలు కాగితం మీద రాసి పెట్టుకొన్నాడు .కొత్త చెప్పులు కొనాలన్నా మోజులో కంగారులో ,ఆ కాగితం జేబులో పెట్టుకోకుండా ఇంటి దగ్గరే మర్చిపోయి చెప్పుల దుకాణానికి వెళ్ళాడు . తన కాళ్ళ సైజు రాసుకొన్న కాగితం కోసం జేబులు తడుముకొన్నాడు .ఎక్కడా కనపడ లేదు .కంగారు పుట్టింది .షాపు యజమానితో ‘’అయ్యా !కంగారులో నా కాలికోలతలు రాసుకొన్న కాగితాన్ని ఇంటి దగ్గర మర్చి పోయాను నా పాదం కొలతలు నాకు తెలియవు .ఇప్పుడే ఇంటికి వెళ్లి రెండు నిమిషాలలో కాగితం తెస్తాను ‘’అని చెప్పి ఇంటికి దౌడు తీశాడు .
ఇంట్లో వెతికి తాను రాసుకొన్న కాలి సైజు కొలతల కాగితం దొరక గానే సంతోషపడి ,రివ్వున అదే వేగం తో షాపుకు చేరుకొన్నాడు .కాని పాపం అప్పటికే షాపు కట్టేసే సమయం అయిపొయింది .షాపు కట్టేసి షాపువాడు ఇంటికి వెళ్ళిపోయాడు .బుర్రలేని బుడతడు అనవసరం గా తిరిగి చెప్పులు కొనుక్కోలేక పోయాడు .అప్పుడు అక్కడున్న ఒకాయన చెప్పులు కొనేది నీకా?లేక ఇంకేవరికోసమా?’’ అని అడిగాడు వాడిని .’నాకోసమే ‘’అన్నాడు ఆ అమాయక చక్ర వర్తి .’’అయితే నీ కాళ్లు చూపించి సరైన కొలతలున్న చెప్పులు ఎందుకు కొనుక్కోలేదు మొదటి సారి వచ్చినప్పుడే ?’’అన్నాడు పాపం సిగ్గుతో తల వంచుకున్నాడు బుడ్డాడు .
బలం కన్నా బుద్ధి గొప్ప
చైనా లో దక్షిణ సాంగ్ వంశానికి చెందిన (1127-1279)సైన్యాధ్యక్షుడు’’ లి యు ‘’దేశ ద్రోహం చేసి ,ఉత్తర జిన్ వంశానికి (1115-1234)చెందినా చక్రవర్తికి లొంగిపోయాడు .1137లో దక్షిణ సాంగ్ వంశానికి చెందిన జెనరల్’’ యు ఫి ‘’ని జిన్ సైన్యం తో యుద్ధం చేయమని ,దానికి యుద్ధ సన్నాహం చేయమని ఆజ్ఞ వచ్చింది .లియు ,అతని రాజు కొత్త ఒప్పందం తో కలిశారని తెలిసింది. యుద్ధం ప్రారంభం అయితే రెండు వైపులా భీకరం గా ఉండి ఎందరో చనిపోయే ప్రమాదం ఉందని యుఫీ కి అనిపించింది .జెనరల్ లియు కి ,జిన్వుఝు సైన్యాధక్షుడు ‘’జిన్ ‘’కు మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయని గ్రహించాడు .దీన్ని సాకుగా తీసుకొని ఆ ఇద్దరు జేనరల్స్ మధ్య భేదం సృష్టించాలని నిర్ణయించుకొన్నాడు .ఎలా సాధించాలి ?అని బాగా ఆలోచించాడు .ఆచరించి తనదేశం గౌరవాన్ని కాపాడాలి అని నిశ్చయానికి వచ్చాడుయు ఫి
జిన్వు ఝు పంపిన గూఢ చారి ఒకడి ని పట్టుకోన్నారని యు ఫి కి వర్తమానం అందింది .తాను ఆ గూఢచారిని చూడాలనుకొంటున్నానని తెలియ జేశాడు .వాడిని చూడగానే తనకు వాడు బాగా పరిచయం ఉన్నవాడు గా నటిస్తూ యు ఫి మాట్లాడాడు ‘’ఏమయ్యా ఝాంగ్ బింగ్!కొన్ని రోజుల కిందట లియు కు ఒక వార్త అందజేయమని నీకు ఆజ్నఇచ్చాను .అందులో లియు తో కలిసి జిన్వు ఝు ను చంపమని చెప్పాను ఏం చేశావు దాన్ని? మళ్ళీ నీ నుంచి నాకు ఏ రకమైన సమాధానమూ రాలేదు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు ?ఆ పని పూర్తీ కాలేదేమో నని దానికోసం ఇంకోరిని పంపే ఆలోచనలో ఉన్నాను ‘’అన్నాడు .
ఈ మాటలు విన్న గూఢ చారి ఒక్కసారి గా ఆశ్చర్య పడ్డాడు .యు ఫి పొరపాటు పడ్డా డెమోఅని అనుకోని అయినా ఇది మంచిదేకదా .ఇంత మంచి వార్తను తన జెనరల్ కు అందజేస్తే ఏంతో సంతోషిస్తాడుకడా అని మనసులో వితర్కిన్చుకొని యు ఫి కాళ్ళ మీద పడి’’అయ్యా క్షమించండి .పొరబాటున మీరు చెప్పిన విషయం మర్చిపోయాను మరో అవకాశం ఇస్తే ఇప్పుడే ఆ వార్తను మా జెనరల్ లి యు కు అందజేస్తాను .నమ్మండి ‘’అన్నాడు .యు ఫి అతడిని నమ్మినట్లు నటించి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నా ఈ సారి తప్పితే మెడమీద తల ఉండదు అని చెప్పి ఆ క్రూరమైన వంచన ప్లాన్ అంతా కాగితం మీద రాయించి ఒక మైనం బంతిలో దాన్ని పెట్టించి వాడి తుంటి కోసి అందులో బాల్ పెట్టి కుట్టించి పంపేశాడు .
మంచి ఊపులో రెట్టించిన ఉత్సాహం తో ఆ శత్రు గూఢ చారి జిన్వు ఝు దగ్గరకు వేగం గా చేరి ఆ ఉత్త్తరం అంద జేశాడు .చదివి అందులో లియు తనను చంపటానికి కుట్ర పన్నాడు అన్న వార్త చదివి అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు .వెంటనే తన చక్ర వర్తికి ఈ వార్తను తెలియ జేశాడు .చక్ర వర్తి లియు ను పదవి నుంచి తప్పించేశాడు .వెంటనే ఇప్పుడు యు ఫి.కి మంచి అవకాశం వచ్చింది .శత్రువుల మధ్య భేదం కల్పించి ,శత్రువు బలాన్ని క్షీణిం ప జేసి ,వారితో సునాయాసం గా యుద్ధం చేసి ,తన దేశాన్ని గెలిపించి గౌరవాన్ని సాధించాడు .భేదోపాయం వలన కార్య సాధన జరుగుతుంది అని బలం కన్నా బుద్ధి గొప్పది అని దీని వలన మనకు తెలుస్తోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-14-ఉయ్యూరు