ఊసుల్లో ఉయ్యూరు -52 -”నా జీతం తొంభై”

    నా—-జీతం—– తొంభై

        నిన్న సాయంత్రం నాఅమెరికా మిత్రులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఫోను ఫోన్ చేసి తమ బావ గారు అన్నే హనుమంత రావు గారు ,అక్క గారు ఒక వారం తమతో గడపటానికి అమెరికాలోని డెట్రాయిట్ నుంచి వచ్చారని చెప్పి ,హనుమంత రావు గారికి ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించారు .ఆయన సరసభారతి పుస్తకాలు చదివానని ముఖ్యం గా మా నాన్న గారు రాసిన సరస భారతి మొదటి పుస్తకం గా ప్రచురించిన ‘’జ్యోతిస్సంశ్లేషణం ‘’చదివి ,యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి మా తండ్రి గారి తో తమకున్న అనుఅబందాన్ని తమ సరస్వతి ట్యుటోరియల్ కాలేజి లో మా నాన్న గారు తెలుగు పండితులుగా పని చేయటాన్ని  గుర్తుకు చేసుకొన్నారు .మా తమ్ముడు కృష్ణ మోహన్ కూడా అందులో పని చేసిన విషయం జ్ఞాపకానికి తెచ్చారు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మేస్టారు గా పని చేసినప్పుడు మా ఇద్దరి పరిచయాలను నేమరేసుకొన్నారు .తనకు ఎనభై అయిదేళ్ళు అని ఇంకా అక్కడ డిగ్రీ విద్యార్ధులకు లెక్కలు బోధిస్తూనే ఉన్నానని చెప్పారు .చాలా సంతోషం వేసింది వారితో మాట్లాడటం .వారబ్బాయిలిద్దరు నా స్టూడెంట్స్ అని గుర్తు .ఒకతను అమెరికాలో ఎలర్జీ స్పెషలిస్ట్ అని ఆయనే చెప్పారు .2008లో మేము మూడవ సారి అమెరికా కు డెట్రాయిట్ దగ్గర స్టెర్లింగ్ హైట్స్ లో  మా అమ్మాయి విజ్జి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు గోపాల కృష్ణ గారు హనుమంతరావు గారికి మా నంబర్ ఇస్తే ,ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. చాలా సేపు ఎన్నో విషయాలు మాట్లాడుకొన్నాం.  .మళ్ళీ ఆరేళ్ళకు నిన్న ఆయనతో మాట్లాడటం జరిగింది . మా శ్రీమతికి సరస్వతి ట్యుటోరియల్ కాలేజి ప్రిన్సిపాల్ ,మైనేని గారి బావ గారు ఫోన్ చేశారు అని చెప్పా .’’ఏ మండీ మీకు గుర్తుందా?మీ తమ్ముడు మోహన్ ఆకాలేజి లో పని చేసి జీతం తీసుకొన్న రోజు ఇంటికి వచ్చి ‘’అమ్మా ! నా జీతం అని గట్టిగా అరిచి తొంభై రూపాయలు ‘’అని నీరసం గా చెప్పేవాడు ‘’అన్నది .ఒక సారి   నా మనస్సు కూడా గుండ్రాలు, చక్రాలు తిరుగుతూ యాభై ఏళ్ళు ‘’ మెరుపు వెనక్కు’’ అంటే ఫ్లాష్ బాక్ కు  వెళ్ళింది .ఆ జ్ఞాపకాలు ఇప్పుడు పంచుకోవటానికే ఈ ప్రయత్నం .

శ్రీ అన్నే హనుమంతరావు గారు ,రిటైరేడ్ హెడ్ మాస్టర్ శ్రీ పుచ్చా శివయ్య గారు కలిసి ఆ ట్యుటోరియల్ కాలేజిని పెద్ద వంతెన దాటిన తర్వాత  పుల్లేరు కాలువ గట్టు పై కొంతదూరం దాటిన తర్వాత ఎడమ వైపు సందులో తాటాకు పాకల్లో స్థాపించారు .శివయ్య గారు ప్రిన్సిపాల్ మాత్రామే కాదు మంచి ప్రిన్సిపల్స్ ఉన్న ఉత్తమ వ్యక్తీ .పంచెకట్టు ఉత్తరీయం వల్లే వాటు ,పిలా చొక్కా తో విభూది రేకలతో ఉండేవారు ఇంగ్లీష్ లో మహా దిట్ట ..హనుమంతరావు గారు లెక్కలు బోధిస్తూ డిసిప్లిన్ చూస్తూ హాస్టల్ కూడా నడిపే వారు .మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో రిటైర్ అయి ,రెండేళ్ళు ఉంగుటూరు లో పని చేసి దీనిలో చేరారు .ఆదిరాజు శివయ్య గారు సెకండరీ గ్రేడ్ టీచర్ గా రిటైర్ అయి , అందులోనే చేరారు .పున్నయ్యగారూ గొప్ప టీచరే . పోలవరపు జనార్దన రావు గారు అనే ‘’గూని ‘’ఉన్న ఆయనా అక్కడ లెక్కలు చెప్పేవారని జ్ఞాపకం .ఆయన్ను అందరూ ‘’గూని జనార్దన రావు ‘’అనే వారుపాపం .ఆయన తర్వాత జిల్లా పరిషత్ లో ఉద్యోగం పొంది లెక్కల మేస్టారు గా ఉయ్యూరు హైస్కూల్ లో మాతో కలిసి పని చేశారు .ఆయన అన్న అప్పారావు గారికి ,కడవ కొల్లు వంతెన దిగువన మా పొలాల దగ్గరే పక్కనే పొలం ఉండేది .అలా మా పరిచయం .

అప్పుడు మెట్రిక్ విద్యార్ధులు ఎక్కువ గా ఉండేవారు .అందరూ’’ బడితెల్లా’’ బలిసి ఒడ్డూ పొడుగుతో  ఉండేవారు .వాళ్ళను వంచి చెప్పింది వినేట్లు చేసే శక్తి సామర్ధ్యాలు హనుమంత రావు గారికే ఉండేదని చెప్పుకొనే వారు .ఎంతటి వాడినైనా ఒంగో పెట్టి వీపు విమానం మోత మోగించి లెక్కలు నేర్పి పాస్ అయ్యేట్లు చేసేవారని చెప్పేవారు .అందుకే ఆయన అంటే హడల్ .ఒక రకం గా అక్కడ మేస్టార్లు అంతా ‘’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ ‘’ అని పించుకొన్నారు .మా మైనేని గోపాల కృష్ణ గారు కూడా అమెరికా వెళ్ళే ముందు  ఒక్క వారం రోజులు  అందులో ‘’మిణికారు ‘’ అని ఆయనే చెప్పుకొన్నారు .శివయ్య గారి అల్లుడు అక్కడ సైన్స్ మేష్టారు. ఎర్రగా బక్క పల్చగా ఉండేవారు .తర్వాత కే సి పి లో కెమిస్ట్ ఉద్యోగం లో చేరి ,మంచి పొజిషన్ లోనే రిటైర్ అయ్యారు నాకు మంచి స్నేహితులు .మా నాన్న గారు పని చేసి నప్పుడు చాలా తక్కువ సార్లు మాత్రమె ఆ కాలేజికి వెళ్ళినట్లు గుర్తు . తెలుగులో మా నాన్న గారిని మించిన పండితుడు జిల్లాలోనే లేరని అందరూ చెప్పుకోగా విన్నాం .మాకూ తెలుసు .ఇంటి వద్ద భోజనం చేసి ,అక్కడికి వెడితే మధ్యలో అక్కడ మంచి నీళ్ళు కూడా తాగేవారు కాదని ,మా ఇంట్లో అద్దె కుండే మల్లాది రామ క్రిష్నయ్య గారు అనే ఎలిమెంటరి స్కూల్ టీచర్ గారి అబ్బాయి శర్మ అందుకోసం ఇంటి నుంచే మరచెంబు తో నీళ్ళు తీసుకొని వెళ్లి ఇస్తే నే తాగేవారని ఆతను అయిదేళ్ళ కితం చెప్పగా మాకు తెలిసింది .

బెజవాడ లో వాణీ ట్యుటోరి యల్ కి కాలేజి అప్పుడు పెద్ద పేరుండేది .ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదివి పాస్ అయ్యేవారు .అలాగే గుంటూర్ లో సి వి.ధన్ కాలేజీకి గొప్ప పేరు .ఇతర రాష్ట్రాల తెలుగు వారు కూడా అక్కడ చదివి పరీక్ష రాసి పాస్ అయ్యేవాళ్ళు .ఆ తర్వాతి స్థానం మా  ఉయ్యూరు సరస్వతి  ట్యుటోరియల్ కాలేజీకే .అంతటి పేరు ప్రతిస్టలు ఉండేవి . .ఉయ్యూరుకు కే సి.పి ,సి బి ఏం ఆస్పత్రి, తర్వాత గుర్తింపు తెచ్చింది సరస్వతీ ట్యుటోరియల్ కాలేజియే అని నిస్సందేహం గా చెప్ప వచ్చు .దీని వెనక శివయ్య గారి హనుమంతరావు గారి తీవ్ర కృషి శిక్షణ ,అధిక ఉత్తీర్ణతా శాతం ,క్రమ శిక్షణలే  కారణాలు . విరామం ఎరుగ కుండా వారుదీక్ష తో  చేసిన  కృషి ,సాధనా ఫలితమే ఇది అనిపిస్తుంది .

శివయ్య గారి మరణం తర్వాత హనుమంత రావు గారే ట్యుటోరియల్ కాలేజి ని నడిపారు .అప్పుడు మా తమ్ముడు అక్కడ పని చేసిన జ్ఞాపకం .నేను చదువులోనో ట్రైనింగ్ లోనో ,ఉద్యోగం లోనో ఎక్కడో ఉండేవాడిని .కనుక నాకు వాడు ఇక్కడి టీచర్ చేసిన సంగతి పూర్తిగా తెలీదు .అప్పటికి మా నాన్న గారు చనిపోయారని గుర్తు .ఆసమయం లో చేసి ఉంటాడు .సైన్స్ చెప్పేవాడేమో .అప్పుడే అక్కడ జీతం తీసుకొని ఇంటికి హడావిడిగా వచ్చి మా అమ్మతో ‘’నాజీతం అని ఇందాక చెప్పినట్లు గట్టిగా అరిచి చెప్పి చెప్పి, తొంభై అనే సరికి ‘’లో వాయిస్ ‘’లో చెప్పేవాడని మా ఆవిడ చెప్పటం వలననే  నాకు తెలిసింది .మా అమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకోనేదట కొడుకు ప్రజ్ఞకు .ఆ రోజుల్లో జీతాలు అందరికీ అలానే ఉండేవి .నేను బందరు హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటర్ గా 1958-59లో పని చేసినప్పుడు నా జీతం కూడా ఎనభై రూపాయలు బేసిక్ ,డి ఏ .ముప్ఫై .మొత్తం నూట పది రూపాయలే .మా వాడు కొంచెం డ్రమటైజ్ చేసి జీతం సంగతి చెప్పేవాడేమో ?

హనుమంత రావు గారు ట్యుటోరియల్ కాలేజి ని కాటూరు రోడ్డులో కుడిపక్క పాకలు వేసి చాలా కాలం నడిపారు .అప్పుడు నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేసేవాడిని .అప్పుడే వాళ్ళబ్బాయిలిద్దరూ చదివారని జ్ఞాపకం .రెండో వాడు ఆయన కాలేజిని నడిపిన జ్ఞాపకం .తర్వాత ఆ కాలేజి పెద్ద వంతెన దగ్గర ఇప్పుడున్న బస్ స్టాండ్ దగ్గర మైనేని వారి స్థలం లో ననుకొంటా నడిపారు . వార్షికోత్సవాలు ఘనం గా నిర్వాహిమ్చేవారు . పిలిస్తే వెళ్ళే వాళ్ళం ..పరిచయమూ బాగా ఉండేది .ఆయన పంచె కట్టే తీరు తామాషాగా ఉండేది .తెల్ల పంచె తెల్ల చొక్కా తో భారీ పర్సనాలిటీ తో ఉండేవారు .మాటలు కొంచెం స్పీడ్ గా మాట్లాడేవారు. కన్ను కొంచెం అదురుతూ ఉన్నట్లు ఉండేదని గుర్తు .

హనుమంత రావు గారు వ్యవసాయమూ చేసేవారు .ప్రత్తి పంట బాగా పండించి అధిక దిగుబడి సాధించేవారు .అందుకని ఆయనకు ‘’ప్రత్తి పెద్ద ‘’అనే బిరుదు ఇచ్చినట్లు ,ప్రభుత్వ సత్కారం అందుకోన్నట్లు జ్ఞాపకం.అబ్బాయి అమెరికా చదువుకు వెళ్లి అక్కడే స్తిర పడటం వల్ల ఇక్కడి కాలేజీ ని మూసేసి భార్య తో అమెరికా వెళ్లిపోయినట్లు విన్నాను .అక్కడ కూడా ఊరికే ఉండలేదని చికాగోలో అబ్బాయి ఉన్నప్పుడు అక్కడ డిగ్రీ విద్యార్ధులకు దాదాపు పదిహేనేళ్ళకు పైగా ట్యూషన్ చెప్పేవారని  ఆరేళ్ళ క్రితం నాతో అమెరికాలో మాట్లాడినప్పుడు చెప్పారు .ఆయన ఓపికకు హాట్స్ ఆఫ్ చెప్పానప్పుడే .ఇప్పటికీ విడవ కుండా లెక్కలు బోధిస్తూ అందరి అభిమానం సంపాదించు కొంటు న్నారు .ఆరోగ్యం గానే ఉంటున్నారు దంపతులు.అంత కంటే  కావాల్సిందేముంది ? .నిన్న మైనేని గారి అమెరికా  ‘’సెల్ కాల్ ‘’తీగలేక పోయినా ఇక్కడ డొంకంతా కదిల్చి జ్ఞాపకాల తేగల పాతర ను బయటికి తవ్వి తీసింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-14-ఉయ్యూరు

 

.

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.