గండు చీమ -కోట్నక్ వినాయకరావు
నాలుగు రాష్ర్టాల గిరిజనులు జూలై 3న చేసిన పాదయాత్రకి సంఘీభావంగా ‘పోలవరం గిరిజనుల ముంపు పరిరక్షణ కమిటీ’ తరఫున కవులు, రచయితలు ఖమ్మం జిల్లా చిడుమూరు గ్రామంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఆ ఊరి పిల్లలతో మాట్లాడిన మాటలను క్రోడీకరిస్తే రూపొందిన కవితలు ఇవి.
సేకరణ : జయధీర్ తిరుమలరావు
చిన్న శరీరం ఉంది నాకు, చిట్టి చీమని
వండని ఆహారాన్ని తింటాను నేను
భూమి తడైనప్పుడు ఇల్లు మొదలుపెడతాను
నా ఇంటి దారులు పైకి పెట్టాను
నా ఇంటి లోపల నేను సందులుంచాను
గాలి వెలుతురు వెన్నెలను ప్రేమిస్తాను
చిన్న సందులు పిల్లల కోసం గదులుగా కట్టాను
ఇంటి కొచ్చిన అతిథి కోసం పెద్ద గది ఒకటి ఉంచాను
క్రిమికీటకాలు కావొచ్చు, పాములూ అతిథులుగా రావచ్చు
ఇంటి కొచ్చిన అతిథికి నేను మర్యాదలిస్తాను
నాగపంచమి రోజున నా ఇంటి పూజ చేస్తాను
హిమాలయ పర్వతమని ఇంటి పేరు పెట్టుకున్నాను
నేను మీ చిట్టి చీమని
నా ఇంటికి ఆక్రమిస్తానంటే మాత్రం గండు చీమని!
– గోండీ భాషలో, గుంజాల లిపిలో : ఆత్రం విఠల్‌రావు
తెలుగు అనువాదం : కోట్నక్ వినాయకరావు
పక్షిలేని బతుకు – పీస లలిత
ఈ మీటింగు ఎందుకు?
పత్ర హరితాన్ని రక్షించేటందుకు
ఈ మీటింగు ఎందుకు?
డ్యాము కట్టి మమ్మల్ని ముంచవద్దని చెప్పేటందుకు
పోలవరం డ్యాము ఎందుకు?
కోయ దొరలను బిచ్చగాళ్ళు చేసేటందుకు
బిచ్చగాళ్లయితే ఏమైతది?
ఊరులేని గూడులేని అనాధలైతరు
పోలవరం ఎందుకు వద్దు?
నోరులేని చెట్లు మునిగి పోవద్దు
చెట్లు మునిగితే ఏమైతది?
కూతపెట్టే పక్షుల గూళ్ళు మునిగిపోతై
గూళ్ళు మునిగిపోతే ఏమైతది?
ఇండ్లు కట్టిస్తరేమో గాని గూళ్ళు కట్టించగలరా
పక్షిలేని మా కోయ బతుకు
ఆగమాగం అయితది
ఆకాశంల మబ్బులు చిన్నపోతై!
– పీస లలిత
తరగతి – ఆరు
మా భూగోళం మునిగిపోతది! – వంగరాజు నహరి
ఈ దేశం నీటిలో మునిగిపోవద్దు
మునిగితే ఏమవుతుంది?
పెరిగే చెట్లు పుట్టవు ఇక్కడ
విత్తనాలు మురిగిపోయిన పాడువాసనే.
పశువులు ఎక్కడికి పోతాయి?
అవి కూడా ఈ నేల మీద సచ్చిపోవు
కొట్టుకుపోయి తేలుతాయి ఎక్కడో
మా గుడిసెల మీద పొదలు పెరగకపోతే
సీతాకోక చిలుకలూ రావు
పువ్వులు ఉంటేనేకదా తుమ్మెదలు ఎగరతాయి
ఆవులు పాలు ఇవ్వవు
గడ్డి మొలిచే భూములు ఉంటే కదా
కోళ్ళు గుడిసెలెక్కి కొక్కొరో మనవు
మా భూగోళం మునిగిపోతది
దానికి శ్వాస ఆనదు
గాలికోసం వందల మైళ్ళకు అవతల
భూమి పగిలి పోతది
మళ్ళా
అక్కడ అంతా ముంపే!
– వంగరాజు నహరి
తరగతి – ఐదు