పది రూపాయలకే భోజనం..!

ముప్పూటలా కడుపునిండా తినాలంటే ఎంతలేదన్నా మూడొందలు ఖర్చయ్యే నేటి రోజుల్లో – కేవలం పదంటే పది రూపాయలకు భోజనం పెట్టేవాళ్లు ఉంటారా? వింటే ఆశ్చర్యం వేస్తుంది కాని రాజమండ్రిలోని కోటగుమ్మం వద్దకు వెళితే – తిరుపతమ్మ భోజనశాల ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం ఆమె వృద్ధురాలు కావడంతో.. ఆ బాధ్యతను తన కోడలికి అప్పగించింది. ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు ఈ శాల నడుస్తుందని నిర్వాహకురాలు జ్యోతి చెబుతోంది. ‘కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పదిరూపాయలకే తిండి ఎలా పెడుతున్నావమ్మా’ అనడిగితే – ‘‘అది ముప్పయి ఏళ్ల కిందటి మాట. గోదావరి రైల్వేస్టేషన్లో నిరుపేదల కోసం భోజనశాలను ప్రారంభించింది మా అత్తగారైన తిరుపతమ్మ. ఆవిడ తిండిని అమ్ముకుని బతకాలని కాదు, పదిమందికి కడుపునింపి ఆనందపడాలన్న ఉద్దేశ్యంతో ఈ బాధ్యతను స్వీకరించింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, వాడల్లో పేదలు ఎక్కువ. వాళ్లు సమయానికి భోజనం చేయాలంటే హోటల్‌కు వెళ్లాలి. అక్కడ అంత డబ్బుపెట్టి తినలేక పస్తులున్న రోజులు కూడా ఉంటున్నాయు. అవన్నీ తెలిసే చిన్న భోజనశాలను మొదలుపెట్టారు మా అత్తగారు’’ అని చెప్పుకొచ్చింది జ్యోతి. రాజమండ్రిలోని గోదావరి రైల్వేస్టేషన్లో కొన్నేళ్లపాటు ప్రయాణికుల ఆకలి బాధల్ని తీర్చడంతో.. చుట్టుపక్కల తిరుపతమ్మకు గుర్తింపు వచ్చింది.
మాంసాహారం కూడా..
వచ్చిపోయేవాళ్ల రద్దీ పెరగడంతో.. రైల్వేస్టేషన్‌కు పక్కనే ఉన్న కోటగుమ్మం సెంటర్‌కు భోజనశాల మారింది. ఇప్పటి రోజుల్లో మాంసాహారం తినాలంటే – ఓ మోస్తరు హోటల్‌కు వెళ్లినా వంద నుంచి రెండొందల వరకు బిల్లు అవుతుంది. కాని తిరుపతమ్మ భోజనశాలలో చేప, కోడిమాంసం కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. ‘‘ఒకప్పుడు నేను పావలాకే కోడిమాంసం వడ్డించాను. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల మామూలు భోజనం పది, చికెన్‌తో అయితే పదిహేను తీసుకుంటున్నాను’’ అంది తిరుపతమ్మ. తిండి తినేందుకు వచ్చిన నిరుపేదల దగ్గర డబ్బులు లేకపోయినా.. ఇచ్చింది తీసుకునే ఉదారం వీరికుంది. త్వరలోనే జరగనున్న పుష్కరాలకు కూడా భక్తులకు ఇదే రేటుకు భోజనాలు అందించనున్నట్లు చెబుతున్నారు వీరు.
– కె.వెంకటేశ్వరరావు, ఆనందనగర్, రాజమండ్రి