పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు!

 
 
 

పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు!

‘మా నోరు మూయించేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది.. పాడైపోయిన ఆహార పదార్థాలను పెడుతూ మమ్మల్ని ఆసుపత్రుల పాలు చేస్తున్నారు.. మేం అనారోగ్యం బారిన పడుతుంటే ప్రభుత్వం తన పని సులువుగా చేసుకుపోతోంది.. ఉదయం ఆరుగంటలకే ఇక్కడికి ‘ప్యాకేజీ ఫుడ్’ వస్తోంది, సాయంత్రం వరకూ వాటినే మాకు ఇస్తున్నారు.. ఇష్టం లేకున్నా బలవంతంగా నానా చెత్తా తింటూ, మేం జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం.. మాకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతను పట్టించుకునే నాథుడే లేడు…’ – సాక్షాత్తూ పార్లమెంట్ క్యాంటీన్‌లో ‘ప్యాకేజీ ఫుడ్’ నాణ్యతా ప్రమాణాలపై రాజ్యసభలో ఎంపీల నిరసన. *** సంధ్య, శ్రవణ్ ఇద్దరూ ఉద్యోగస్తులే.. ఉదయం లేచింది మొదలు ఆఫీసుకు బయలుదేరే దాకా ఒకటే ఉరుకులు, పరుగులు.. కిచెన్‌లో ఎటు చూసినా ‘ప్యాకేజీ ఫుడ్డే’.. ఉదయం పూటే కాదు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా హడావుడిగా నాలుగు ముద్దలు మింగేస్తూ టీవీకో, కంప్యూటర్‌కో అతుక్కుపోవడం, పిల్లలైతే చదువులో మునిగిపోవడం.. ఎంతగా సంపాదిస్తున్నా- నచ్చినది వండుకుని తినే అదృష్టం లేదని బాధపడి పోవడం.. ‘బిజీ లైఫ్.. టైమ్ చాలడం లేద’ని దిగాలు పడిపోతూ ‘రెడీ టూ ఈట్’ పొట్లాలను ఆశ్రయించడం.. కొన్నిసార్లు తెగించి అన్నం వండుకున్నా, మిగతా వాటిని ‘కర్రీ పాయింట్ల’ నుంచి ‘పాకెట్లు’ తెచ్చుకోవడం… *** ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నానేయడం, ఆదివారం ఉదయానే్న పిండి రుబ్బుకోవడం, తాజాగా దోశలు, ఇడ్లీలు, వడలు వంటివి చేసుకోవడం.. ఈ దృశ్యాలు నేడు కొన్నిళ్లలోనే కనిపిస్తుంటాయి.. టిఫిన్ వండాలన్నా, ఏది చేసుకోవాలన్నా ‘మిక్సీ’ తిప్పనక్కర్లేదు, చెమటలు కక్కుతూ కిచెన్‌లో ఆపసోపాలు పడనక్కర్లేదు.. ఇడ్లీ పిండి, దోశల పిండి, ఇతర టిఫెన్లకూ పొట్లాలు తెచ్చుకుంటే క్షణాల్లో టిఫిన్ రెడీ.. అల్పాహారమే కాదు, భోజనంలోకి అవసరమయ్యే ఇతర పదార్థాలూ ప్యాకెట్ల రూపంలో మార్కెట్‌లో సిద్ధం.. సంప్రదాయ వంటలే కాదు, సరికొత్త రుచులను అందించే విభిన్న వంటకాలకు సంబంధించి ‘రెడీ టూ ఈట్’, ‘హీట్ అండ్ ఈట్’ ప్యాకెట్లు మార్కెట్లో ఎన్నెన్నో.. *** ఆధునిక యుగంలో విభిన్న రంగాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా అంచనాలకు అందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ‘రెడీ టూ ఈట్’ ప్యాకెట్లు నేడు పల్లెల్లోని పచారీ దుకాణాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ ప్యాకెట్లు శాకాహార వంటలకే పరిమితం కాలేదు, పలురకాల మాంసాహార వంటకాలూ ‘ప్యాకేజీ’ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. పట్టణీకరణ విస్తరించడంతో సూపర్ మార్కెట్లలోనే కాదు, కిరాణా దుకాణాల్లో సైతం వీటి అమ్మకాలు ఇటీవలి కాలంలో ఊపందుకున్నాయి. ‘రెడీ టూ ఈట్’ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నా, సంప్రదాయాలకు పుట్టినిల్లయిన మన దేశంలో దాదాపు దశాబ్దకాలం క్రితం ప్రవేశించింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో ‘ప్యాకేజి ఫుడ్’పై మోజు నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో ‘ప్యాకేజి ఫుడ్’ వ్యాపారం 2015 నాటికి 1,800 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ‘అసోచాం’ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) తాజా నివేదికలో పేర్కొంది. పెరిగిన ఆదాయ వనరులు, ప్రజల జీవనశైలిలో మార్పులు, పట్టణీకరణ, రిటైల్ వ్యాపారం విస్తృతి వంటి కారణాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్యాకేజి ఫుడ్ వ్యాపారం 912 కోట్ల రూపాయలు దాటింది. ఒకప్పుడు పచ్చళ్లు, పొడులు, బేకరీ ఉత్పత్తులకే పరిమితమైనప్పటికీ నేడు విభిన్న రుచులతో వివిధ రకాల శాకాహార, మాంసాహార వంటకాలు ప్యాకెట్ల రూపంలో లభిస్తున్నాయి. పలు రకాల డెయిరీ ఉత్పత్తులు, స్నాక్స్, ‘హీట్ అండ్ ఈట్’ వంటకాలు, పానీయాలు. సూప్‌లు వంటివి మార్కెట్లో రంగప్రవేశం చేశాయి. పాలిథిన్ కవర్లలో, అట్టపెట్టెల్లో, డబ్బాల్లో లభించే ఈ ఆహార పదార్థాల నాణ్యతపై మొదట్లో కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నప్పటికీ ఇపుడు వీటినే జనం వేలం వెర్రిగా కొంటున్నారు. సూపర్ మార్కెట్‌కు షాపింగ్‌కు వెళితే చాలు.. రకరకాల పొట్లాలతో ‘ట్రాలీ’ మొత్తం నిండిపోవాల్సిందే. అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ వ్యాపారం ‘ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ’గా వర్థిల్లుతోంది. తాము అందిస్తున్న ఆహారోత్పత్తులు రుచికరంగానే కాదు, వాటిలో ఖనిజాలు, విటమిన్లు, అనేకానేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని, నిల్వ ఉన్నా పాడయ్యే ప్రసక్తే లేదని ‘ప్యాకేజి ఫుడ్’ తయారీ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులు, ఆసక్తుల మేరకు నాణ్యతా ప్రమాణాలతో వీటిని అందిస్తున్నామని ఈ రంగంలో పేరుమోసిన బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక ఉత్పత్తిదారులు సైతం ఘనంగా ప్రకటిస్తున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించి భారీగా ఖర్చు చేస్తూ ప్రసార మాధ్యమాల్లో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. టీవీల్లో, వెబ్‌సైట్లలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు చూస్తూ ప్యాకేజి ఫుడ్‌పై పిల్లలే కాదు, పెద్దలు సైతం మనసు పడుతున్నారు. ప్యాకేజి ఫుడ్ వినియోగంలో ఇప్పటికీ పట్టణ ప్రాంత వాసులే ముందంజలో ఉన్నారని, మిగతా ప్రాంతాల్లోనూ వీటికి ఆదరణ క్రమంగా పెరుగుతోందని ‘అసోచాం’ అధ్యయనంలో వెల్లడైంది. 2011 నాటి గణాంకాల ప్రకారం 78 శాతం ప్యాకేజి ఫుడ్ పట్టణ ప్రాంతంలోను, 25 శాతం గ్రామీణ ప్రాంతంలోనూ అమ్ముడవుతోంది. తాజా సర్వే సందర్భంగా కొన్ని పట్టణాల్లో సుమారు రెండు వేల మందిని ప్రశ్నించగా, ‘రెడీ టూ ఈట్’ ఆహార పదార్థాలపై ముఖ్యంగా యువతరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. అన్ని ప్రాంతాల్లోనూ నేడు చిన్న కుటుంబాల సంఖ్య ఎక్కువ కావడంతో వీటి వినియోగం నానాటికీ అధికమవుతోంది. ఒకరిద్దరు పిల్లలున్న కుటుంబాల్లో, దంపతులిద్దరూ ఉద్యోగులైన ఇళ్లలో, అవివాహితుల్లో అధికశాతం మంది ప్యాకేజి ఫుడ్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అధికశాతం మంది ఉద్యోగులు రోడ్డుపక్క తోపుడుబండ్లపై, దాబాల్లో లభించే ఆహార పదార్థాల కన్నా ‘ప్యాకేజి ఫుడ్’కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ రంగంలో దండిగా లాభాలను ఆర్జిస్తున్న వాటిలో హిందుస్తాన్ యూనీలీవర్, ఐటిసి, నెస్లే, పెప్సికో, దాబర్, క్యాడ్‌బరీ, హల్దీరామ్, బ్రిటానియా, గోద్రెజ్, పార్లే ఆగ్రో వంటి సంస్థలున్నాయి. వినూత్న రకాలు.. విభిన్న రుచులు.. క్షణం తీరిక లేని గజి‘బిజీ’ జీవన విధానం వల్లో, విభిన్న రుచులను ఆస్వాదించాలన్న జిహ్వ చాపల్యం వల్లో- కారణాలేమైతేనేం..? ప్యాకేజి ఫుడ్ వినియోగం నానాటికీ అధికమవుతోందన్నది కాదనలేని వాస్తవం. సంప్రదాయ వంటకాలే కాదు, మనకు తెలియని వినూత్న రుచులతో విభిన్న రకాల ఆహార పదార్థాలు మార్కెట్లో ఇపుడు కోకొల్లలు. దోశ అంటే కేవలం సాదా దోశ, రవ్వ దోశే కాదు.. ఓట్స్ దోశ, సోయా దోశ, ఇతర ఆహారధాన్యాల దోశలు క్షణాల్లో రెడీ. టిఫిన్లకైతే ఎనె్నన్నో రకాలు ప్యాకెట్ల రూపంలో ఎల్లవేళలా సిద్ధం. ఆలూ మసాలా, టమాటా ఉప్మా, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, సాంబార్, రసం, పొంగల్, చాట్‌లు, మసాలా వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు అందరికీ తెలియని ఆలూ టిక్కా, దాల్ మకానీ, ఆలూ మట్టర్, ఆలూ మేతీ, పాలక్ పనీర్, పంజాబీ చోళే, రాజ్‌మా మసాలా, పావ్ బాజీ, రాజ్‌మా చావల్ వంటి వంటకాలు సైతం ప్యాకెట్లలో నిక్షిప్తం. ఇక మాంసాహారం విషయానికొస్తే చికెన్ కర్రీ, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ, బటర్ చికెన్ వంటి పలురకాల వంటకాల పేర్లు చెబితేనే నోట్లో నీళ్లూరాల్సిందే. వీటిని ఇళ్లకు తెచ్చుకుని క్షణాల్లో వండుకోవడం, కొన్నింటిని వేడి చేసి తినేయడం తప్ప- పెద్దగా కిచెన్‌లో శ్రమ పడాల్సింది ఏమీ లేదు. డబ్బు ఖర్చయినా కోరుకున్న టిఫ్‌న్ లేదా భోజన పదార్థాలు నిమిషాల్లో డైనింగ్ టేబుల్‌పైకి చేరడంతో ‘ప్యాకేజి ఫుడ్’ చాలామందికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటోంది. అయితే- ‘రెడీ టూ ఈట్’ పదార్థాలన్నింటినీ ‘జంక్‌ఫుడ్’గానే పరిగణించాలని, వీటి వినియోగం వల్ల అనేక ఆహార సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వినియోగదారులు మాత్రం అంతగా చలించడం లేదు. ప్యాకేజి ఫుడ్ వ్యాపారం అంతకంతకూ విస్తరిస్తూ వందల కోట్లలో ‘టర్నోవర్’ పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ నాలుగూ హానికరం… ఇళ్లలో సొంతంగా వంటకాలు తయారుచేసుకునే తీరిక, ఓపిక లేనివారికి ప్యాకేజి ఫుడ్ వల్ల సమయం కలిసివస్తున్నప్పటికీ, వాటికి అలవాటు పడితే క్రమంగా కొన్నాళ్లకు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఉదయం పూట శుచిగా టిఫిన్ తయారు చేసుకుని, గ్లాసుడు పాలు లేదా మజ్జిగ తాగడానికి బదులు ప్యాకేజి రూపంలో లభించే వాటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బలం సంగతేమో గానీ, దీర్ఘకాలంలో అనారోగ్య లక్షణాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమలు, ఓట్లు, జొన్నలు ఇతర తృణధాన్యాలతో చేసినవి, పండ్ల రసాల నుంచి తయారు చేసినవి, డెయిరీ ఉత్పత్తులను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అవి రసాయన ప్రభావానికి లోనై, వాటిలో పోషకాలు తగ్గడమే కాదు పరోక్షంగా ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. కొవ్వు వంటి హానికారకాలు అసలే లేవని, పాడైపోయే గుణం ఉండదని ‘ప్యాకెట్ల’పై ఎంత ఆకర్షణీయంగా ముద్రిస్తున్నా- వాటిలోపల మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలకు లోటు లేదని, దీర్ఘకాలంలో వాటి ప్రభావం తీవ్రంగానే ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. బిస్కట్లలో… గోధుమ పిండి, వంట నూనెలు, పంచదార, ఉప్పు, పాలతో తయారు చేసే బిస్కట్లు రుచికరంగా ఉంటున్నా, వీటిలోనూ ఆరోగ్యానికి చేటు కలిగించే అనేక పదార్థాలున్నాయి. వంట నూనెలు సహజంగానే కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయి. అధిక ఉష్ణోగ్రతలో నూనె వేడిచేయడంతో మిగతా పోషకాల స్థాయి తగ్గుతుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొవ్వు వల్ల కాలేయ సమస్యలు, తీపి వల్ల మధుమేహం తప్పవు. అదనపు తీపి కోసం, రంగు కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. బిస్కట్లలో వాడే పాల పదార్థాల వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. పానీయాల్లో.. స్ట్రాబెర్రీ, అనాస, ఆపిల్, మామిడి తదితర పళ్లతో తయారయ్యే పానీయాలను అతిగా తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు. వీటిలో ద్రవరూప గ్లూకోజ్‌లు, లెసిథిన్లు ఉంటాయి. ఈ కారణంగా మగతగా ఉండడం, వాంతులు వంటివి తప్పవంటున్నారు. సోయా గింజలను తినకూడదని కొందరికి వైద్యులు చెబుతున్నా, వారికి తెలియకుండానే బ్రెడ్‌ల రూపంలో అవి శరీరంలోకి చేరుతుంటాయి. ‘రెడీ టూ ఈట్’తో… నీటి శాతం తగ్గిన కూరలు, వంట నూనెలు, జీడిపప్పు, ఉప్పు, మీగడ, అల్లం ముద్ద వంటి కారణంగా ‘రెడీ టూ ఈట్’ ఆహార పదార్థాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. నీటి శాతం తగ్గిన కూరగాయల్లో పోషకాలు చాలావరకూ నశించిపోతాయి. ఒకసారి తయారైన వంటకాలను మళ్లీ వేడిచేయడం వల్ల ఉన్న కొద్దిపాటి పోషకాలు కూడా కనుమరుగవుతాయి. ప్యాకేజీ వంటలు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు వాడే రసాయనాల వల్ల మరింత చేటు తప్పదు. ముందే తయారైన ఆహార పదార్థాలను కొద్ది రోజుల తర్వాత వేడిచేసి తింటే కిడ్నీ, కాలేయ సమస్యలు అనివార్యం. సూపులు… తాజా టమాటాలు తీసుకుని మనం ఇంట్లో ‘సూపు’ తయారు చేసుకున్నా ఆ రోజు తప్ప, రెండు రోజుల తర్వాత తాగం, తాగలేం కూడా. మరి వివిధ రకాల సూపులు ప్యాకెట్ల రూపంలో రోజుల తరబడి ఎలా రంగు మారకుండా, చెడిపోకుండా ఉంటాయి? రంగు మారకపోడానికి- అనేక రసాయనాలు వాడడమే కారణం. పలు రకాల కూరగాయలు, పండ్లు, జొన్న పిండి, పంచదార వంటివి ఉపయోగించి తయారుచేసే సూపులు ఒకటి, రెండు రోజులు నిల్వ ఉన్నా ఆరోగ్యానికి హానికరమే. వీటిలో వాడే కృత్రిమ రంగులు, రసాయనాల వల్ల కిడ్నీలకు, కాలేయానికి, గుండెకు దీర్ఘకాలంలో సమస్యలు తప్పవు. నిల్వ ఉండే సూపుల్లో హానికారక బాక్టీరియా, యాసిడ్లు కారణంగా అనారోగ్య లక్షణాలు ఖాయమని నిపుణులు అంటున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుముఖం పడుతుందంటున్నారు. సూపుల్లోని రసాయనాల వల్ల కాలేయం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. సింథటిక్ కెమికల్స్‌తో.. ప్యాకేజి ఫుడ్‌ను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు సింథటిక్ కెమికల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని పర్యావరణ శాస్తవ్రేత్తలు అంటున్నారు. క్యాన్సర్ కారకాలు ఉంటున్నా కొన్ని రకాల రసాయనాలను ప్యాకేజి ఫుడ్ తయారీలో, నిల్వ ఉంచడంలో యథేచ్ఛగా వాడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మడెహైడ్ వంటి టాక్సికెంట్లను ప్లాస్టిక్ సీసాల తయారీలో వాడుతుంటారు. హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకునే బిస్పెనాల్-ఎ, ట్రైబుటిల్టిన్, ట్రిక్లోసాన్, ఫథలేట్స్ వంటి రసాయనాలను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో విరివిగా వాడుతుంటారు. రుచుల మాయాజాలంలో పడే వినియోగదారులు ప్యాకేజి ఫుడ్‌లో అంతర్లీనంగా ఉంటున్న రసాయనాల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ప్యాకేజీ ఫుడ్ తయారీలో సుమారు నాలుగు వేల రకాల రసాయనాల మూలాలను శాస్తవ్రేత్తలు గుర్తించగా, ఇంకా గుర్తు తెలియని రసాయనాలు ఎనె్నన్నో ఉంటున్నాయి. ప్యాకేజి ఫుడ్‌పై కేవలం ‘ఎక్స్‌పైరీ తేదీ’ని చూడడంతోనే సరిపోదు, వాటి తయారీలో వినియోగించే రసాయనాల గురించి, వాటి దుష్ఫలితాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * ‘ఫస్ట్ ఫుడ్’ బాంబు..! ‘అందరికీ ఆహార భద్రత’ అంటూ మన పాలకులు అందమైన హామీలు గుప్పిస్తుండగా మరో వైపు పౌష్ఠికాహార లోపం, ఊబకాయం సమస్యలు గుదిబండలుగా మారాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫస్ట్ ఫుడ్’ రూపంలో నేడు దేశాన్ని రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. పౌష్ఠికాహారం లేని ఆహార పదార్థాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఫాస్ట్ఫుడ్‌లో చక్కెర, నూనెలు, ఉప్పు కారణంగా అన్ని వయసుల వారూ ఊబకాయం బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఈ సమస్యల నుంచి ముఖ్యంగా పిల్లలను గట్టెక్కించేందుకు పాఠశాలల్లో జంక్‌ఫుడ్‌ను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలకు చెందిన క్యాంటీన్లలో, పాఠశాలల పరిసరాల్లో జంక్‌ఫుడ్‌ను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు సంబంధించి విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు. సాఫ్ట్‌డ్రింక్ వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఇటీవలి బడ్జెట్‌లో వాటి ధరలను పెంచినట్లు పాలకులు గొప్పగా చెబుతున్నారు. ప్రభుత్వం ఆలోచనల సంగతెలా ఉన్నా జంక్‌ఫుడ్, సాఫ్ట్‌డ్రింక్‌లపై జనంలో మోజు మాత్రం తగ్గడం లేదన్నది నిజం. ‘ ఫుడ్ మార్కెట్’ హస్తగతం! ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తలుపులు బార్లా తెరవడంతో ఆహార రంగానికి సంబంధించి దేశంలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం వంటివి మొక్కుబడిగా అమలవుతుండగా, మరోవైపు పిల్లల్లో జంక్‌ఫుడ్ వినియోగం పెరుగుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ సూపర్ మార్కెట్లు విస్తరించడంతో ఆహార పదార్థాల విక్రయాల్లో ‘ప్యాకేజి ఫుడ్’ విక్రయాలదే పైచేయిగా మారింది. పల్లెటూళ్లలో సైతం పలురకాల చిప్స్, సాఫ్ట్‌డ్రింకులు, జంక్‌ఫుడ్ వంటివి అందుబాటులో ఉంటున్నాయి. మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం కావడంతో అన్ని స్థాయిల్లోనూ రిటైల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రెండు రూపాయలకు, అయిదు రూపాయలకు కూడా ఆలూ చిప్స్, టమాటా చిప్స్ లభిస్తున్నందున వీటిని కొనేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. జంక్‌ఫుడ్ వ్యాపారంలో లాభాల సంగతెలా ఉన్నా, వీటి కారణంగా పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రజారోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అందుబాటులో లేకుండా చేయాలి.. ఆరోగ్యానికి హాని కలిగించే ఫాస్ట్ఫుడ్, జంక్‌ఫుడ్‌ను పిల్లలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు, పోషకాహార నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు. పాఠశాలలకు 500 గజాల దూరంలో వీటి విక్రయాలను నిషేధించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అభివృద్ధి చెందిన దేశాల వ్యాపార ప్రయోజనాల కోసమే వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్యాకేజి ఫుడ్‌పై ఆంక్షలు విధించడం లేదన్న ఆరోపణలున్నాయి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల మేరకు 2012 నాటికే విశ్వవ్యాప్తంగా 40 మిలియన్ల మంది పిల్లలు (అయిదేళ్ల లోపువారు) ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 70 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. మన దేశంలో దాదాపు 30 శాతం మంది బడిపిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్యాకేజి ఫుడ్‌ను పిల్లలకు అలవాటు చేస్తున్నందునే ఈ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊబకాయం ఫలితంగా పిల్లలు చురుకుదనాన్ని కోల్పోవడం, బద్ధకం, రక్తంలో కొవ్వు పెరగడం, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. మరోవైపు చదువులో వెనుకబడిపోతూ మానసిక వేదనకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు తప్పడం లేదు. సరైన పోషకాహారం అందకపోవడం వల్లే పిల్లలు శారీరక, మానసిక రోగాలతో సతమతమవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిస్కట్లు, బంగాళాదుంపల చిప్స్, సాఫ్ట్‌డ్రింక్‌లను వీలైనంత వరకూ నిరోధిస్తే పిల్లలు ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్‌లను తయారు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు సంబంధించి సరైన నిబంధనలు లేకపోవడం మరో ప్రతిబంధకంగా మారింది. ‘ప్యాకేజి ఫుడ్’పై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. పన్నుల పేరిట ఆదాయం పెంచుకునే ఆలోచనలే తప్ప హానికారక ఆహార పదార్థాలను నియంత్రించేందుకు పాలకులు సిద్ధంగా లేరు. పోషక విలువలు, ప్రజారోగ్యం వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలూ లేవు. అనేక దేశాల్లో పిల్లలు రోగాల బారిన పడడం పట్ల యూనిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) వంటి సంస్థలు ఆందోళన చెందుతున్నా ఫలితం కానరావడం లేదు. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలపై కేసులు నమోదు చేస్తున్న దాఖలాలు లేవు. వీటికి జరిమానాలు విధించడానికి బదులు వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించడం విడ్డూరంగా ఉందని పోషకాహార నిపుణులు విమర్శిస్తున్నారు. పౌష్ఠికాహారం, ప్రజారోగ్యానికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పౌర సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నా పాలకుల్లో నిజాయితీ లోపిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను నిర్దేశిస్తున్నా రాష్ట్రాల్లో అవి అమలవుతున్న దాఖలాలు లేవు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’లో ‘రెడీ టూ ఈట్’ ఆహారం పదార్థాలు, జంక్‌ఫుడ్ వంటి పదాలను ఘనంగా నిర్వచించారే తప్ప- వాటిని నియంత్రించేందుకు కార్యాచరణ ఏదీ కనిపించడం లేదు. కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదని, ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్‌లను నియంత్రించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. చట్టం ఏం చెబుతోంది..? ఆహార పదార్థాల తయారీ, నిల్వ చేయడం, పంపిణీ, విక్రయాలు తదితర అంశాలపై పర్యవేక్షణకు ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006’ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. మానవ వినియోగంలో ఆహార భద్రతపై భరోసా ఇచ్చేందుకు ఈ చట్టాన్ని సమగ్రంగా రూపొందించారు. ఆహార కల్తీ, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, మాంసం, బేకరీ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన అమలులో ఉన్న చట్టాలన్నింటినీ విలీనం చేసి 2006లో ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టా’న్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలకు విస్తృత అధికారాలు కల్పించారు. హానికారక ఆహార పదార్థాలను నియంత్రించేందుకు ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆహార పదార్థాలు, వాటి తయారీ, వినియోగం వల్ల ఆరోగ్యరీత్యా ఎదురయ్యే సమస్యలు తదితర విషయాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తోంది. **

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.