జేబులో బ్యాంకు!

జేబులో బ్యాంకు!

మనిషి పుట్టుక నుండి డబ్బుతోనే పెరుగుతున్నాడు. డబ్బు తన రూపాన్ని మార్చుకుంటున్నా, మనిషికి దాని అవసరం మాత్రం తీరలేదు. అదో పెను దాహంలా మనిషిని పెనవేసుకుపోతోంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, సౌకర్యాలను కల్పించుకుంటున్నా వాటన్నింటి అంతర్గత రూపం డబ్బు. డబ్బును రక్షించుకునే ఒక ఫైర్‌వాల్ బ్యాంకు. మనిషికి డబ్బు అవసరం ఎంత పెరిగిందో బ్యాంకుల అవసరం అంతే పెరుగుతూ వచ్చింది. దేశ జనాభాలో సగం మంది బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్నారు. వారికి బ్యాంకుల్లో ఖాతాలు లేనే లేవు. మరోవైపు బ్యాంకింగ్ రంగంపై ఆర్‌బిఐ పర్యవేక్షణ, నియంత్రణ సరళీకరణ ఫలితాలు ఆచరణలోకి తేవడంలో ఆటంకంగా ఉన్నాయనేది నిస్సందేహం. బ్యాంకింగ్ రంగంలో ఇందిరాగాందీ 1969లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. దేశంలోని ప్రముఖ బ్యాంకులను జాతీయం చేశారు. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. 31 ప్రైవేటు, 43 విదేశీ బ్యాంకులు, 60కి మించి గ్రామీణ బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటికి 53వేల శాఖలు, 17వేల ఎటిఎంలు ఉన్నాయి. విదేశీ బ్యాంకులు సంఖ్య రీత్యా ఎక్కువగా కనిపించినా వాటికి 300 మాత్రమే శాఖలు ఉన్నాయి. హెచ్‌ఎస్‌బిసి, స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంకులు అందులో సగం ఉన్నాయి. హెచ్‌ఎస్‌బిసి మొట్టమొదటి శాఖను కలకత్తాలో 1853లో ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్ సేవలు నేడు వాడవాడలా విస్తరించాయని చెప్పుకుంటున్నా నేడు బ్యాంకులు సగటును 12,300 మందికి మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అదే 1969లో 64వేల మందికి అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ కంప్యూటరీకరణలోకి అడుగుపెట్టాయి. 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2011లో దేశంలోని విదేశీ బ్యాంకుల పనివిధానంపై ఆర్‌బిఐ మార్గదర్శకాలను సూచించింది. కాని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థ్ధిక సంక్షోభంతో బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ కోలుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు బ్యాంకులను ఆదుకుని ఉద్దీపన చర్యలతో ఊపిరిపోయడానికి పూనుకున్నాయి. మరో పక్క కొన్ని విదేశీ బ్యాంకులు అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకుని భారతదేశంలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్నాయి. కోల్పోయిన పూర్వవైభవాన్ని పొందడానికి చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకులు తమ సేవలను విస్తరించుకునేందుకు క్రెడిట్ కార్డులను తెరమీదకు తెచ్చాయి. ఐటి రంగంలో వచ్చిన బూమ్ యువతలో వినిమయ సంస్కృతిని పెంచి మార్కెట్‌లో వెలుగులు నింపాయి. ఇపుడు అన్ని బ్యాంకులూ క్రెడిట్ కార్డులు ఇవ్వడంపై పోటీపడుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా బ్యాంకులు తమ వ్యవహారాలను చక్కదిద్దుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన సమస్యలు బ్యాంకింగ్ రంగాన్ని రెండు ప్రధాన సమస్యలు పీడిస్తున్నాయి. కార్పొరేట్ రంగానికి సొంత బ్యాంకులు స్థాపించుకోవడానికి అనుమతి ఇవ్వడం, మరొకటి మొండి బకాయిలు పేరుకుపోవడం. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు అనేది నిరంతరం ఉండేదే. ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే ప్రైవేటు బ్యాంకులు ఆ ధనాన్ని తమ అవసరాలకు, స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. ఆ సొమ్మును దేశాభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోతోందని, జాతీయం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అప్పట్లో ఇందిరాగాందీ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో నిధులను స్థానిక సంస్థలకు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డు, గ్రామీణ విద్యుత్ సరఫరా సంస్థలు బ్యాంకుల నిధులతో నడిచాయి. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులు ప్రారంభించడానికి అనుమతి ఇస్తే , ఇంతవరకూ ప్రభుత్వ బ్యాంకుల్లో పారిశ్రామిక వేత్తలు డిపాజిట్లు చేసుకుంటూ వచ్చిన నిధులు ఈ ప్రైవేటు బ్యాంకులకు తరలిపోయి, ఆ సంస్థలు ప్రజలకు అందిస్తున్న సేవలు తగ్గుతాయి వంటి ధోరణి అపుడే ప్రారంభమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వ్యక్తిగత రుణాల రంగాల్లో బ్యాంకులు ఇచ్చిన డబ్బును విశే్లషిస్తే, వ్యక్తులు వాహనాలు కొనుక్కోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి క్రెడిట్ కార్డులకు ఇచ్చిన రుణం కన్నా 70 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి ఇచ్చింది రెండు లక్షల కోట్లు తక్కువే. లారీ ఓనర్లకు, వ్యాపారులకు, రియల్ ఎస్టేట్‌లకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కలిపి ఇచ్చిన రుణంలో వ్యవసాయానికి ఇచ్చిన రుణం సగం మాత్రమే. నాలుగు రంగాల్లో మూడింటికీ కలిపి ఎంత రుణం ఇచ్చాయో, ఒక్క పారిశ్రామికరంగానికి సుమారుగా అంతే రుణం ముట్టిందని ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. మొండిబకాయిలు కూడా బ్యాంకింగ్ రంగాన్ని కుదిపివేస్తునే ఉన్నాయి. బ్యాంకులు అన్నింటికీ పెద్దన్నయ్య లాంటి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలోనే అత్యధికంగా మొండిబకాయిలు ఉన్న విషయం తేటతెల్లమైనదే. దేశంలో టాయిలెట్ల కంటే సెల్‌ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉందని ఐటియు పేర్కొంది. పెరిగిన అభివృద్ధికి అనుగుణంగా చూసుకున్నా ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంకు అకౌంట్ ఉండాలి. రెండు వేలకు పైగా జనాభా ఉన్న గామానికి బ్యాంకులు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పోస్టల్ రంగం బ్యాంకింగ్‌లోకి ప్రవేశించి ప్రజల అవసరాలను తీర్చడానికి ముందుకు వచ్చింది. దేశంలో విస్తారమైన శాఖలు పోస్టల్ శాఖకు ఉన్నాయి. వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు అందిస్తే ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని ఆ శాఖ యోచిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే దేశంలో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకులే సేవలు అందిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవినాభావ సంబంధం ఉంది. అసంఘటిత రంగంలో అభివృద్ధికి ఈ ప్రభుత్వ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల రుణ అవసరాలను కూడా తీరుస్తున్నాయి. వ్యవసాయ రంగం కూడా బ్యాంకుల తోడ్పాటుతో ఎక్కువ అభివృద్ధిని సాధిస్తోంది. స్వల్పకాల రుణాలపై గ్రామీణ ప్రజల ఆర్ధిక జీవనం, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం బ్యాంకు అనేది ప్రభుత్వం గుర్తింపు పొందిన ఒక ఆర్ధిక సంస్థ. ధనాన్ని రుణంగా తీసుకోవడం, రుణాలు ఇవ్వడం దాని ముఖ్యమైన ప్రాధమిక కర్తవ్యం. కాలంతో పాటు చాలా ఇతర ఆర్ధిక కార్యకలాపాలను బ్యాంకులు చేపట్టాయి. ఆర్ధిక విపణులు, పెట్టుబడి నిధులు వంటి ఆర్ధిక సేవలు అందించడంలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. చారిత్రాత్మకంగా జర్మనీ వంటి కొన్ని దేశాల్లో వ్యాపార సంస్థల్లో ప్రధాన వాటాలు బ్యాంకులకు ఉన్నాయి. అయితే అమెరికా వంటి ఇతర దేశాల్లో బ్యాంకులు ఆర్ధికేతర సంస్థలను కలిగి ఉండటం నిషిద్ధం. జపాన్‌లో బ్యాంకులు సాధారణంగా జైబాత్సు అని పిలిచే సహ సంస్థలు ఉంటాయి. ఫ్రాన్స్‌లో బ్యాంకులు తమ కక్షిదారులకు బీమా సేవలను అందిస్తుంటాయి. తాజాగా రియల్ ఎస్టేట్ సేవలు అందిస్తున్నాయి. ఐస్లాండ్, యుకె, అమెరికా దేశాల్లో మిగతా వాటికంటే బ్యాంకింగ్ రంగంపై తక్కువ నియంత్రణ ఉంటుంది. చైనా వంటి దేశాల్లో ఇతర దేశాల కంటే అధికంగా నియంత్రణ ఉంటుంది. తొలి బ్యాంకు ప్రభుత్వ ఆధీనంలో తొలి డిపాజిట్ మ్యాంకు పేరు సెయింట్ జార్జి బ్యాంకు దీనిని 1407లో స్థాపించారు. ఇటలీలో ప్రారంభమైన ఈ బ్యాంకు తొలి పేరు బ్యాంకో డి సం గియోర్గియో. బ్యాంకు అనే పదం పునర్వ్యవస్థీకరణ సమయంలో ఫ్లోరెంటిన్ బ్యాంకర్లు ఉపయోగించిన డిస్క్/ బెంచ్ అనే ఒక ఇటాలియన్ పదం బాంచో నుండి ఉద్భవించింది. వారు ఈ పదాన్ని ఆకుపచ్చని వస్త్రంతో కప్పి ఉంచిన బల్లపై జరిపే లావాదేవీలకు ప్రతీకగా వాడేవారు. బ్యాంకింగ్‌కు పురాతన కాల జాడలు కూడా ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో కూడా బ్యాంకింగ్ వ్యవహారాలు కనిపిస్తాయి. ఆ కాలంలో ధనాన్ని రుణంగా ఇచ్చేవారు. మాసెల్ల అని పిలిచే మూసి ఉన్న కోట ప్రాంగణాల మధ్యలో ఒక పొడవైన బల్లపై తమ దుకాణాలు ఏర్పాటు చేసి ఈ కార్యకలాపాలు కొనసాగించేవారు. ఆ ప్రక్రియ నుండే బ్యాంచో ఏర్పడి అది బ్యాంకుగా మారింది. ఒక ద్రవ్యమార్పిడి చేసే వాడిగా ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టకుండా విదేశీ నిధిని స్వదేశీ కరెన్సీలోకి మార్చడమే. లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే 350-325 నుండి వచ్చిన ఒక వెండి డ్రాచం నాణెం మార్పిడి కార్యకలాపాల గురించి ప్రాథమిక ఆధారాలు ముద్రించారు. వాస్తవానికి ఈ రోజుకి కూడా ఆధునిక క్రీక్‌లో ట్రాపెజా అంటే ఒక బల్ల లేదా ఒక బ్యాంకు అని అర్థం. కక్షిదారుల కోసం తనిఖీ లేదా వాణిజ్యకార్యకలాపాలను నిర్వహించడం, చెక్కులు, వసూళ్లకు మధ్యవర్తులుగా పనిచేయడం, టెలిగ్రాఫిక్ బదిలీ, ఎటిఎం తదితరాలు బ్యాంకుల పనిగా ఉంది. డిపాజిట్లను అనుమతించడం, నిధులు తీసుకోవడం, బాండ్లు, రుణ భద్రత, ముందస్తు మొత్తాలను ఇవ్వడం, వాయిదా పద్ధతుల్లో రుణాలు, ద్రవ్యరుణాలు, చెల్లింపు సేవలు, దూరప్రాంతాలకు నగదు బదిలీ, బీమా, నిధులతో వ్యాపారం, బంగారం వ్యాపారం, ఆర్థికేతర వ్యాపారాలకు కూడా బ్యాంకులు నేడు తమ విధిగా భావిస్తున్నాయి. చట్టం పరిధిలో వ్యాపార ఖాతాలను నిర్వహించడం, చెక్కులు, ఇతర ఆర్ధిక లావాదేవీల సమ్మేళనం బ్యాంకింగ్ వ్యవహారాలుగా నిర్వచించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఎట్ పాయింట్ ఆఫ్ సేల్ వచ్చిన నాటి నుండి నేరుగా చెల్లింపు, నేరుగా రుణం, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల వల్ల చాలా బ్యాంకింగ్ వ్యవస్థల్లో చెల్లింపు పరికరంలా ఉన్న చెక్కు తన ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది. ఇది చెక్కుల చెల్లింపు, సేకరణకే పరిమితం కానప్పటికీ తమ వినియోగదారుల కోసం వాణిజ్యఖాతాలను నిర్వహించే, మూడో వ్యక్తి నుండి చెల్లింపులు పొందడానికి, ఇతర లెక్కలేనన్ని కార్యకలాపాలకు వేదికగా బ్యాంకింగ్ రంగం నిలిచింది. గ్రామీణ స్థాయిలో బ్యాంకు పని డబ్బు దాయడం, రుణం ఇవ్వడానికే పరిమితంగా కనిపించవచ్చు, కాని అంతర్గతంగా బ్యాంకుల పనితీరు విశ్వవ్యాప్తమైంది. బ్యాంకులు తమ ఖాతాదారులకు అనునిత్యం స్టేట్మెంట్లు ఇస్తుంటాయి. డబ్బును జమ చేసినదపుడు ఖాతాను క్రెడిట్ లేదా జమ చేశారని, సొమ్మును తీసుకున్నపుడు డెబిట్/రుణం చేస్తున్నారని చూపుతుంది. ఒ కవేళ ఖాతాలో సొమ్ము ఉంటే మీకు అనుకూల నిల్వ ఉంటుంది. అధికంగా సొమ్ము తీసుకుంటే ప్రతికూల నిల్వ ఉంటుంది. దీనికి కారణం బ్యాంకు వాంగ్మూలాలు ఎపుడు ఆస్తులకు సంబంధించి ఉంటాయి. విదేశీ బ్యాంకులు కొత్త బ్యాంకులను అనుమతించే సందర్భంలో విదేశీ బ్యాంకులు కూడా సేవలు అందించేలా చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకులకు ఉన్న స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వ రంగ సంస్థలకూ కలిగిస్తే ప్రజలకు మరిన్ని సేవలను అందించగలుగుతాయి. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులకు సరళీకరణ విధానాలు సహాయకారిగా ఉండాల్సి ఉంది. అలాంటపుడే ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు విస్తృతంగా వచ్చి ప్రజలకు సేవలు అందించగలుగుతాయి. కీలక గుర్తింపు క్రమపద్ధతిలో వర్గీకరణ ప్రకారం నడిచే అతిముఖ్యమైన బ్యాంకుల్లో నాలుగు లేదా ఆరు బ్యాంకులకు మాత్రమే ‘డొమిస్టికల్లీ-సిస్టమెటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకు’గా గుర్తింపు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరహా బ్యాంకుల గుర్తింపునకు పరిమాణం, కార్యకలాపాల అనుసంథానం, ప్రత్యామ్నాయ లభ్యత, సంక్లిష్టత్వం అనే నాలుగు కొలబద్దలను ఉపయోగిస్తారు. ఇలాంటి గుర్తింపు పొందే బ్యాంకుల్లో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు న్నాయి. ఈ బ్యాంకులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విఫలం కావడానికి వీలులేకుండా ఉంటాయి. దేశ ప్రజలు అందరికీ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్‌నెస్) కేంద్రప్రభుత్వం ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. దేశంలో 58-59 శాతం మందికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు అందుబాటలో లేని కుటుంబాలు ఏడున్నర కోట్లు. 2018 నాటికి కనీసం ప్రతి కుటుంబానికి రెండు అకౌంట్లు ఉండాలని ప్రభుత్వ భావన. ప్రస్తుతం స్మార్ట్ఫున్లలో మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. ఇక మీదట అన్ని రకాల ఫోన్లలోనూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించబోతున్నారు. ఆధునికత భారతీయ బ్యాంకింగ్ రంగం నానాటికీ కొత్త పుంతలు తొక్కుతునే ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న బ్యాంకర్లు వినియోగదారులకు మరింత సరళమైన సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఏటిఎంలు రాకతో సంప్రదాయ బ్యాంకింగ్ లావాదేవీలు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇపుడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో బ్యాంకులకేసి చూడకుండానే ఖాతాదారులు తమ పనులను తేలిగ్గా చేసుకుంటూ పోతున్నారు. ఆనాటి బ్యాంకింగ్ వేరు, నేటి బ్యాంకింగ్ రంగం వేరు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం పుణ్యమా అని విప్లవాన్ని తీసుకువచ్చాయి. కార్డు టు కేష్: ప్లాస్టిక్ మనీగా కీర్తించబడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డులు బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం. ఓ నూతన ఒరవడికి నాందీ ప్రస్తావన పలికాయి. ఇవి ఉంటే చాలా విశ్వాన్ని చుట్టిముట్టి రావచ్చనే ఆత్మవిశ్వాసాన్ని సాధారణ పౌరుడికి కూడా కలిగించాయి. ప్రతి చిన్న అవసరానికి వీటిని వినియోగించే స్థాయికి నేడు భారత్ ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే కార్డుల సాయంతో అసలు డబ్బు అవసరం లేకుండా కావల్సిన అన్ని పనులూ చకచక జరిగిపోతున్నాయి. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్‌లు, చివరికి ఆస్పత్రులు, స్కూలు ఫీజులు, రైలు టిక్కెట్లు, బస్సు టిక్కెట్లు, తినుబండారాల కొనుగోలు సైతం ప్లాస్టిక్ కార్డులతో జరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ : బ్యాంకింగ్ సేవల్లో ఇంటర్నెట్ విప్లవం చారిత్రాత్మకమైనది. ఇంటర్నెట్ అనుసంథానంతో వినియోగదారుల పని మరింత సులభతరంగా మారింది. దూర ప్రయాణాలకు టిక్కెట్లు చేసుకోవడానికైనా, విద్యుత్, టెలిఫోన్, వాటర్ వంటి బిల్లులు చెల్లించడానికైనా , చివరికి మొబైల్ ఫోన్ రీ చార్జిలైనా ఇంటర్నెట్ సహాయంతో తేలికగా అయిపోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్‌లైన్ షాపింప్‌లు చేసుకునే అవకాశం ఏర్పడింది. బ్యాంకులు ఖాతాలు తెరిచేముందు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుండటంతో ఖాతాలోని సొమ్ము వివరాలు, ఇతర లావాదేవీలు బ్యాంకులకు వెళ్లకుండానే ఖాతాదారులు చూసుకుంటున్నారు. సెల్‌ఫోన్‌తో మరింత సౌఖ్యం ఇక మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలకు విడదీయరాని బంధం ఏర్పడుతోంది. మొబైల్స్ వినియోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం మొదలు పెట్టి ఫ్లిప్‌కార్టులో పుస్తకాలను కొనుక్కునే వరకూ అమేజాన్‌లో క్లౌడ్ షాపింగ్ తో సహా ఎన్నో కార్యకలాపాలను చిటికెలో చేసుకోవచ్చు, కావల్సిందల్లా మధ్యలో బ్యాంకర్‌తో మన అనుసంధానమే. నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించి అన్ని కార్యకలాపాలను తేలికగా చేసుకునేలా మొబైల్ ఆప్స్ వచ్చాయి. ఆర్‌బిఐ సహకారం ఆటోమెటిక్ టెల్లింగ్ మిషన్లతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చిన ఆర్‌బిఐ అనేక ఇ పరిష్కారాలను సూచించడంతో చివరికి సంతకం కూడా అవసరం లేకుండానే అన్ని పనులను చక్కదిద్దుతోంది. అయితే ఈ సందర్భంగా సమస్యలు లేకపోలేదు. సేవలు వినియోగించుకుంటున్న సమయంలో ఇబ్బందులు పడుతున్న వారు బ్యాంకులకు వాటిని చెబుతునే ఉన్నారు. కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో ఖాతాల్లో నిధులు తగ్గిపోవడం వంటి ఎన్నో అనుభవాలను వారు ఎదుర్కొంటున్నారు. అనుబంధ రంగాల ప్రభావం బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇన్స్యూరెన్స్ రంగంలో నేరుగా విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుండి 49 శాతానికి పెంచడం కూడా బ్యాంకులపై ప్రభావాన్ని చూపించబోతోంది. ప్రస్తుతం ఎల్‌ఐసి ఇతర ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం కొంత ఇబ్బందికరమైనదేనని విశే్లషిస్తున్నారు. జీవిత బీమా రంగంలో 74 శాతం మార్కెట్ వాటా ఎల్‌ఐసికి ఉంది. ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో పెద్దమొత్తమే ఎల్‌ఐసి చెల్లిస్తోంది. అంటే బ్యాంకుల అనుబంధ రంగాల్లో నిర్ణయాలు కూడా బ్యాంకులపై పడుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డిఐ 26 శాతం ఉంది, కాని ఓటింగ్ పరిమితిని 10 నుండి 26 శాతానికి పెంచేందుకు బ్యాంకింగ్ చట్టాన్ని గత ఏడాదే సవరించారు. ఆ రకంగా విదేశీ బ్యాంకులు ఇపుడు భారతీయ ప్రైవేటు బ్యాంకులను నియంత్రించే ప్రమాదం ఉంది. ముగింపు బ్యాంకులకు సంబంధించి నిపుణుల కమిటీల సూచనలు బ్యాంకుల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగకరంగా ఉండాలే తప్ప ప్రతిబంధకంగా ఉండకూడదు. ప్రభుత్వం కూడా తగిన విధంగా తోడ్పాటునందించి కొత్త బ్యాంకులు రావడానికి అండగా ఉండాల్సి ఉంది. బ్యాంకింగ్ రంగంలో తెస్తున్న సంస్కరణలు రాత్రికి రాత్రి సమూల మార్పులను తీసుకురాలేకపోయినా, దశల వారీ వాటి సేవలకు తోడు నిలవాలి. అపుడే దేశంలో ప్రజలు అందరి అవసరాలు తీర్చే విధంగా బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రజల అభివృద్ధిలో బ్యాంకులు తగుపాళ్లలో తమ పాత్ర నిర్వహిస్తాయి. *

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.