ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం

ఊసుల్లో ఉయ్యూరు -53

యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం

మా  చిన్నతనం లో చదువు అంటే పెద్ద బాల శిక్ష చదివించటం, బట్టీ పట్టించటం .సంస్కృత జ్ఞానం అబ్బటానికి శబ్ద   మంజరి ,అందులోని సంక్షిప్త రామాయణం నిత్యం వల్లే వేయించటం జరిగేది .ఇంకొచెం లోక జ్ఞానం కావాలనుకొనే వారికి  అమర సింహ మహా రాజు రాసిన ‘’అమర కోశం’’(అమరం ) శ్లోకాలు కంఠతా పట్టించేవాళ్ళు .ఒక విద్వాంసుడి ఇంటి వద్ద కూర్చుని శిష్యులు చదువుకొనే వారు .ఆ నాడు గురువు గారికి పెద్ద గా ధన రూపం లో ఇచ్చేవారు కాదు శిష్యులు .కానుకల రూపం లో చెల్లించేవారు .గురువు గారింట్లో ఏ కార్య కరామతులు జరిగినా శిష్యుల కుటుంబాలు అండగా నిల బడి అది తమ ఇంటి కార్యమే నని భావించి ,పూర్తిగా అన్నిరకాల మద్దతు ఇచ్చి గొప్పగా నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుకొని కృత క్రుత్యులయ్యేవారు .అదొక ఆనవాయితీగా చాలా తరాలు గా జరిగింది .

మా గురువు గారు స్వర్గీయ వేమూరి శివరామ క్రిష్నయ్య గారి దగ్గర మేము  హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి అడ్మిషన్ కోసం ప్రైవేట్ చదివాం .గురువు అంటే ఆయనే .మాకు అక్షర భిక్ష పెట్టిన వారు ఆయనే .గుండు తో అంచుల పంచ గోసీ పోసి కట్టి ,పైన అదే అంచు ఉత్తరీయం వేసుకొని ,దబ్బ పండు చాయతో ఉదయమే సంధ్యా వందనం పూజాదికాలు చేసుకొని నుదుట తీర్చిన మూడు విభూతి రేఖలతో ,నుదుట కుంకుమ తో సాక్షాత్తు పరమ శివుడు లాగా కని  పించేవారు .ముఖ వర్చస్సు చెప్పటానికి వీలే కాదు .స్వచ్చమైన మనసున్న వారుకనుక ఆ మనస్సు స్వచ్చత ముఖం లో ప్రతి  బింబిం చేది  .స్వచ్చమైన స్పుటమైన వాక్కు సంస్కృత శబ్దాలను అంత స్వచ్చందం గా పలికే వారు ఇంగ్లీష్ లోను అంతటి ప్రవేశం ఉండేది .ఆయనకు రాని సబ్జెక్ట్ అనేది లేదని నావిశ్వాసం .హిందీ తో సహా అన్ని సబ్జెక్టులు ఆయనే బోధించేవారు .లెక్కలు మహా గొప్పగా చెప్పేవారు .చెబితే మనసుకు యిట్టె పట్టేసేది ఏదైనా .అన్ని క్లాసుల వారు ఆయన దగ్గర చదివే వారు .మహా డిమాండ్ ఉండేది .ఆయన దగ్గరే తమ పిల్లలను చది వించాలి అని బ్రాహ్మణ ,కోమటి కుటుంబాలు భావించేవి .అక్కడ చేరితే ‘’మనవాడికి తిరుగు లేదు’’అని గొప్ప నమ్మకం వాళ్లకు .మాస్టారు అంటే అందరికీ భయమే .మా నాన్న గారి తో ఆయనకు మంచి పరిచయం ఉండేది .కనుక నేనంటే ఒక రకమైన ఆపేక్ష కూడా ఉండేది వారికి .వారబ్బాయి దుర్గయ్య అనే  నాపేరే ఉన్న దుర్గా ప్రసాద్ నా క్లాస్ మేట్ .పెద్ది భొట్ల ఆదినారాయణ ,సూరి నరసింహం ,మామిళ్ళపల్లి సత్యనారాయణ కూడా మా క్లాస్ వాళ్ళే .

మాస్టారి పెద్దకుమారుడు కాశీ హిందూ విశ్వ విద్యాలయం లో చదివేవాడు .రెండవ ఆతను కామేశ్వర రావు ను పెంపుడిచ్చారు మాస్టారు .ఇంకా ఇద్దరు చిన్న కొడుకు  లుండేవారని జ్ఞాపకం .కామేశ్వర రావు ఎల్ ఐ సి లో పెద్ద ఉద్యోగం చేసి రిటైరై సుమారు ఏడాదిక్రితం హైదరాబాద్ లో మరణించాడు .వాళ్ళమ్మాయి లక్ష్మి అమెరికాలో మా అమ్మాయి విజయ లక్ష్మి వాళ్ళు ఉంటున్న షార్లెట్ లోనే ఉంటోంది .మేము 2014లో వెళ్ళినప్పుడు పరిచయం అయింది .దుర్గయ్య కూడా ఉయ్యూరు వి ఆర్ కే,ఏం హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్ చేసి ,రిటైర్ అయి స్వగ్రామం పెద ముత్తేవి వెళ్ళిపోయాడు .అక్కడ ఆశ్రమం లోశ్రీ సీతా రామ యతీన్ద్రులకు సాయం చేస్తూ ,భాగవత పురాణ గ్రంధ ప్రచురణకు తన కుమారులతో సహా తోడ్పడుతూ ,రెండేళ్ళ క్రితం అకస్మాత్తుగా  మరణించాడు .ఈ మధ్య మా అమ్మాయి ఇండియా వచ్చినప్పుడు అక్కడి స్కూల్ వార్షికోత్సవానికి గురుదేవులు ఆహ్వానిస్తే వెళ్లి ,దుర్గయ్య భార్య గారిని పలకరిం చాము .

శివ రామ  క్రిష్ణయ్య మాస్టారు గారు పెద ముత్తేవి నుంచే ఉయ్యూరు వచ్చారు ,ఉయ్యూరు లో కొబ్బరి తోటలో పుల్లేరు కాలవ ను ఆనుకొని స్థలం కొని పాకలు వేసి తానూ ఒక దాంట్లో ఉంటూ రెండో దానిలో ట్యూషన్ చెప్పేవారు .నోటి లెక్కలు సాయంత్రం వేళల్లో చెప్పించేవారు .ఉదయం జండా ఆవిష్కరణ ,జాతీయ గీతాలాపన ఉండేవి .సాయంత్రం జన గణ మన పాడేవాళ్ళం .క్రమ శిక్షణకు మారు  పేరుగా ఉండేది మాస్టారి బడి .అది మాకు ఆ నాడు గుడి యే.వారే మాకు ప్రత్యక్ష దైవం . మాస్టారి భార్య కొచెం చామన చాయగా ఎత్తుగా ,బక్క పలచగా ఉండేవారు .పూర్వం గురు పత్ని ఎలా ఉండేవారో అలా మా మీద ఆప్యాయాన్ని చిలకరించేవారు .అందర్నీ నవ్వుతూ పలకరించేవారు .మాస్టారితో మా కు చనువు ఉండేదికాదు భయమే నరనరానా .ఇంగ్లీష్ పాఠాలు మహా బాగా బోధించేవారు .ఆయన దగ్గర చదివితే అన్నిటా బెస్ట్ ,ఫస్ట్ గా ఉండాల్సిందే .అంతటి శిక్షణ మాస్టారిది .’’గురు బ్రహ్మ ‘’అంటే నాకు వారే . ఆ తర్వాత మేము కాలేజి చదువులకు వచ్చినప్పుడు మాస్టారు గారికి ఇక్కడ నచ్చక ,స్వంత ఊరి మీద ధ్యాస మళ్ళి పెదముత్తేవి వెళ్ళిపోయారు కుటుంబం తో .నెలకో రెండు నెలలకో ఉయ్యూరు వస్తే మా ఇంటికి వచ్చి మా నాన్న గారిని మా అమ్మను ,నన్నూ పలకరించ కుండా వెళ్ళే వారు కాదు .మాకు ఆయన ఎక్కడ కన పడినా రెండు చేతులు అమాంతం పైకి లేచి నమస్కారం పెట్టేవాళ్ళం అంతటి గురు భక్తీ వారి యెడ మాకుండేది .మా తమ్ముడు ,మా మామయ్య గారబ్బాయి పద్మనాభం వగైరాలు కూడా మాస్టారి దగ్గరే చదివారు .అందరం వారి దయ వల్లనే ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులతో పాసై హైస్కూల్ లో ప్రవేశించాము .ఆయన పెట్టిన అక్షర భిక్షే నన్ను ఇంత వాడిని చేసిందని వినయ పూర్వకం గా చెప్పగలను .

హైస్కూల్ లో అడ్మిషన్ కోసం  చదివే వాళ్ళకే కాక మాస్టారు గారు సంస్కృత కావ్యాలు చదివే ఇద్దరు ముగ్గురికి చదువు చెప్పే వారు .మా చదువు అయి మేము ఇంటికి వచ్చే ముందు వారు వచ్చి మాస్టారి లోపల ఇంట్లో కూర్చుని నేర్చుకొనే వారు .అందులో ఒకాయన మా కుటుంబ డాక్టర్ స్వర్గీయ వెంపటి కుమారస్వామి గారి అన్న గారు  లక్ష్మీ నరసింహ శర్మ గారు ,రెండో ఆయన కొంచెం నల్లగా ఉండే రామచంద్ర మూర్తి ?.ఇద్దరూ కనక వల్లి నుంచి వచ్చేవారు . పంచె కట్టుకొని  ఖండువా బుజాన వేసుకొని  ,వీభూతి రేకలతో ,పిలక తో ,ఉండేవారు .ఆ నాటి ఆచారం అది .ముందే చెప్పినట్లు ఏ చదువైనా ఆ నాడు ప్రార్ధన శ్లోకం గా ‘’యస్య జ్ఞాన దయా సింధు ‘’తో ప్రారంభ మయ్యేది ఇది అమరకోశం లోని శ్లోకం .ఒళ్ళు బలిసిన మేము వాళ్ళు ఎక్కడైనా తర్వాత బయట కనిపిస్తే ‘’యస్య జ్ఞాన దయాసిందో –గోడ దూకితే అదే సందో ‘’అని పారడీ చేసి ఏడిపించేవాళ్ళం .వాళ్ళ కంటే మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం .ఏమీ అనే వారు కాదు .వాళ్ళూ ముసి ముసి నవ్వులు నవ్వేవారు .దీనికి ‘’కొంటె లీడర్ని’’ నేనే .అసలు శ్లోకం

‘’యస్య జ్ఞాన దయాసింధు రగాదో రగాధ స్త్యంగా గుణః  ‘’ అని జ్ఞాపకం .

తర్వాత అమర కోశం లో నామ సర్గ చెప్పేవారు .ముందుగా స్వర్గ వర్గం చదువుకొనే వారు .అంటే దేవతలకు ఉన్న అనేక పేర్లు శ్లోక రూపం లో అతి తేలిక గా గుర్తు పెట్టుకోవటానికి వీలుగా రాశాడు అమరసింహ భూపాలుడు .అమర కోశం వస్తే శబ్దాల పై గొప్ప  ఆది పత్యం వచ్చినట్లే .నానార్ధాలన్నీ కరతలామలకాలైనట్లే .స్వర్గ వర్గ లో ముందు దేవతల కుండే పేర్లు వస్తాయి -ఆశ్లోకం

‘’అమరా నిర్జరా దేవా స్త్రిదశా విబుధాః సురాః –సుపర్వణః సుమనస్సస్త్రిదివేశా .దివౌకసం ‘’అని గుర్తు

మా పైత్యం ప్రకోపించి ,ఆ శ్లోకాన్ని వాళ్ళు చదివే ధోరణి లో వాళ్ళు బయటికోచ్చినప్పుడు పారడీ చేసి ‘’అమరా నిర్జరా దేవా కొమరా కొంప పీకరా ‘’అనే వాళ్ళం .ఏనుగులు వెడుతుంటే ఎన్ని కుక్కలు మొరిగినా వాటికి లెక్క లేనట్లు పట్టించుకోకుండా వెళ్లి పోయే వారు .ఈ రెండు పేరడీలు నేను కాని మేము కాని కని  పెట్టినవేమీ కాదు .మేము పుట్టే నాటికే వాడుకలో ఉన్నాయి శ్రవణం వలన విని నోటి కొచ్చాయి. ఇందులో మా ప్రజ్న  ఏమీలేదు .అనుకరణ చేసి అభాసు పాలయ్యామేమో నని ఇప్పుడు అనిపిస్తుంది .

మా అమ్మా వాళ్ళ బాబాయి గుండు లక్ష్మీ నరసింహం గారు బ్రహ్మ జ్ఞాని .ఎన్ని లౌకిక వ్యవహారాలలో మునిగి తేలుతున్నా  త్రికాల సంధ్యా వందనం .మధ్యాహ్నం సాలగ్రామార్చన తప్పని సరిగా చేసేవాడు .నల్లగా తుమ్మ మొద్దు లాగా  తెల్లని కను బోమలతో పిలక గోచీ పోసి పంచ తో ఉండేవాడు. ఆయన చొక్కా తొడిగే వాడే కాదు .ఎన్ని ఊళ్లు తిరిగినా పైన న  కండువా నొ  శాలువో ఉండేది .రుద్రాక్షలు మెడలో నిండుగా ఉండేవి .నుదుటిపై ఉదయం విభూతి రేకలు మధ్యాహ్నం కుంకుమ  గందాక్షింతల తో వెలిగి పోయేవాడు .మహా నిస్టా పరుడు .కోర్టు పక్షి. మా వ్యవహారాలూ వాళ్ళ వ్యవహారాలూ అన్నీ ఆయనే చూసేవాడు .హై కోర్టు దాకా వెళ్లి కేసు గెలిపించేవాడు .ఆయన అంటే లాయర్లకు జడ్జీలకూ మహా గౌరవం .లాయర్లకే పాయింట్లు చెప్పగలిగే సునిశిత న్యాయ శాస్త్రజ్ఞుడు .మహామ్మదీయులతో తురకం లో గొప్ప గా మాట్లాడే వాడు. కావ్యాలు శాస్త్రాలు క్షుణ్ణం గా అభ్యసించిన వాడు .ఇంటికి ఎవరు ఏ వేళ వచ్చినా ఆతిధ్యానికి కొదవ ఉండేది కాదు. పరాయి ఊరు  బ్రాహ్మణులకు ఉయ్యూరు లో భోజనం ఎక్కడ దొరుకు తుంది అంటే ‘’గుండు ‘’వారింట్లో అని అందరూ చెప్పేవారు .ఆయన భార్య ఎప్పుడో చనిపోయింది పిల్లలూ లేరు .కనుక మా మేన మామ గంగయ్య గారినే పిల్లాడుగా చూసి పెంచాడు .మా అమ్మ ,మామయ్యా లకు చిన్నతనం లోనే తలి దండ్రులు చనిపోయారు .కనుక మామయ్యే ఆయన కొడుకు .ఎప్పుడూ ‘’అబ్బాయీ ‘’అని ఆయన్ను ‘’అమ్మాయీ ‘’అని మా అమ్మను ప్రేమగా పిలిచేవాడు .మా ఊళ్ళో బంది పోటు దొంగలు పది దోచుకు పోవటానికి వస్తే , మా నరసయ్య తాతయ్య ,మా అసలు తాతయ్య సింగిరిగిరి శాస్త్రిగారు అంటే ఆయన తమ్ముడు మా అమ్మ వాళ్ళ నాన్న కలిసి బరిసెలు చేత బట్టుకొని తరిమి తరిమి కొట్టారారట .వీరికి మా ఇంటి ముందున్న కోమటి  వెంట్ర  ప్రగడ వెంకట రత్నం కూడా సాయం చేశాడట .మసీదు ముందు వీరమ్మ తల్లి మేళాలు వాయిన్చరాదని ఆంక్ష పెడితే కోర్టు దాకా వెళ్లి గెలిచి వాయించే వీలు పొందాడు మా నరసయ్య తాతయ్య  ఆయన్ను అందరూ ఊళ్ళో నరసింహం గారు లేక నరసయ్య గారు అనేవారు .ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే –

మా నరసింహం తాతయ్య బ్రహ్మ జ్ఞాని అని ముందే చెప్పాను కదా .ఆయన ఎప్పుడు వేదాలను ఉపనిషత్ లను బ్రహ్మ సూత్రాలను ఖాళీ సమయం లో మననం చేసుకొంటూ ఉండేవాడు .మాకు చిన్నతనం కదా .ఆయన బ్రహ్మ సూత్రాలలో ఒకటైన ‘’బ్రహ్మ ఇవాహం ‘’అనే దాన్ని పదేపదే చెప్పుకోనేవాడు. నేనే బ్రహ్మను అని అర్ధం .మాకు నవ్వు ఒచ్చేది . మాకు అర్ధం తెలిసి ఏడవడుకదా.నేనొక సారి ఊరుకుండ లేక ‘’తాతయ్యా !బ్రహ్మ’’ వివాహం’’ ‘’అంటే ఏమిటి ?’’అని అడిగా .మా తాతయ్య అగ్గి మీద గుగ్గిలం అయి అంతెత్తు లేచి ‘’ఒరే అడ్డ గాడిదా ! బుద్ధి ఉందా ?అది బ్రహ్మ ఇవాహం .బ్రహ్మ వివాహం కాదు .ఎందుకొచ్చిన చదువుల్రా మీవి .’’ధాక్కేరీ ‘’అని కేక లేశాడు .ఇక అక్కడ ఉంటెఒట్టు  పీత కొట్టుడు కొడతాడని ఒకటే పరుగు పక్కనే ఉన్న మా ఇంట్లోకి .మా ఇంట్లో ఈ మాట చెబితే అందరూ పగల బడి నవ్వారు .ఏడవ లేక నేనూ నవ్వానను కొండి  .మా తాతయ్య యెంతబాగా సంస్కృతం చాడువుకోన్నాడో బాగా కోపం వస్తేఅంట బాగా  ‘’పన్నెండో నంబరు భాష ‘’అంటే బండ బూతులు తిట్ట గలడు,.నా అదృష్టం ఆ చిట్టా విప్పలేదు .ఇదండీ ;;యస్య జ్ఞాన దయా సిందో ,,బ్రహ్మ వివాహం సంగతులు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-14-ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.