కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…!

కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…!

‘జమ్మూలో వున్న రెండు దశాబ్దాలూ దినమో గండంగా గడిపాము. మా పుట్టి పరిగిన ఆవాస ప్రాంతాల గూర్చి కలగనని రాత్రి లేదు. నిజానికి మేం కాశ్మీరీ లోయను విడవాల్సింది కాదు. కాని, పరిస్థితులు మమ్మల్ని అలా నెట్టివేసాయి. మాలాగా లోయని వదలనివారు అదృష్టవంతులు. వారినెవ్వరు ఏమి చేయలేదు. వీరిలాగానే మేము లోయలో వుండిపోల్సింది…’ అంటూ మూడు సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చి, బారాముల్లాలోని వీర్‌వాన్ ప్రాంతంలో ప్రభు త్వం ఏర్పాటుచేసిన వసతిలో వుంటున్న 60 సంవత్సరాల రవి కౌల్ అన్న మాటలివి. 1990 నాడు అసలేం జరిగిందో తెలియదని, కాశ్మీరీ లోయను వదిలి వెళ్లాలని ఇంటి గోడలకు పోస్టర్లను మిలిటెంట్లు వేసారా, ప్రభుత్వమే స్వయంగా వేసిందా ఇప్పటికి తెలియదని ఆయన వాపోయాడు. జమ్మూలోని శరణార్థుల ప్రదేశాలను వీడి వస్తుంటే కొందరు వెళ్లవద్దని కోరినా, ఆయా ప్రాం తాల ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు తిరిగివచ్చానని రవి కౌల్ పత్రికాముఖంగా ప్రకటించారు.
సరిగ్గా 24 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయ చొరబాటుదారుల హత్యాకాండలతో భగ్గుమన్నది. నిత్యజీవితం స్తంభించిపోయింది. తమ వ్యక్తులు మాయం కావ డం, శవాల ఊరేగింపులు నిత్యకృత్యంగా మారాయని నాడు డిగ్రీ చదువుతున్న అమిత్ కుమార్ తన డైరీలో రాసుకున్న ఉర్దూ పంక్తుల్ని 24 సంవత్సరాల తర్వాత నెమరువేసుకున్నాడు. జమ్మూలో తన కు టుంబ సభ్యులతో కేవలం 12న14 అడుగుల గదిలో 22 సంవత్సరాలు కాలం వెళ్లదీసాడు. జీలం నది ఒడ్డునగల తమ పాత ఆవాసాలే తమకు బాగుంటాయని, రెండు సంవత్సరాల క్రితం లోయకు తిరిగి వచ్చిన 44 సంవత్సరాల అమిత్ తెలిపారు.
అనధికారంగా దాదాపు ఏడు లక్షలమంది ఇపుడు పునరావాసానికై ఎదురుచూస్తున్నట్లు కాశ్మీరీ పండితుల కాన్ఫరెన్స్ (కెపిసి) నాయకుడైన కుందన్ పండిత్ తెలిపారు. భారత రాజ్యాంగం కాశ్మీర్‌లో అమలుజరిగేలా చూడాలని, 370 ఆర్టికల్‌ను పునఃపరిశీలించాల ని కోరారు. సమాజ్‌వాదిపార్టీ మైనారిటీ ఫోరం ప్రధాన కార్యదర్శి అయిన ఇందర్‌జీ లాబ్రూ మాట్లాడుతూ కశ్యపుడికి చెందిన ప్రాంతమే కాశ్మీర్ అని చెప్పారు. ప్రభుత్వం సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడంలో చొరవ చొపాలని, లేకపోతే తమ భూము లు, ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జమ్మూ ప్రాంతంలో వివిధ సంఘాలకింద వున్న కాశ్మీరీ పండిత కుటుంబాలు లోయలోని బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్ లాంటి మూడు జిల్లాల్లో టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేసి, ప్రతీ కుటుంబానికి రూ.50 లక్షల్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అధికారిక గణాంకాల ప్రకారం, వివిధ శరణార్థ కాలనీలలోని పండితుల వివరాల ప్రకారం 1990లో 60,452 కుటుంబాలు వలసబాటు పట్టాయని ఇందులో 38,119 కుటుంబాలు జమ్మూలోని వివిధ ప్రాం తాల్లో ప్రభుత్వం కల్పించిన వసతి గృహాల్లో వుండగా, 19,338 కుటుంబాలు ఢిల్లీలో, 1,995 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు మొన్నటి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీరి పునరావాసానికై యుపిఎ ప్రభుత్వం 2008లో ఓ పథకాన్ని రూపొందించి, వివిధ ప్యాకేజీలను ప్రకటించింది. ఆరువేల ఉద్యోగాల కల్పనకుగాను 1,446 మంది యువతీ యువకులను మాత్రం నింపడం జరిగింది. స్వయం ఉపాధి కింద 9 వేల రూపాయల చొప్పున సహాయం ప్రకటిస్తే ఒక్కరు ముందుకు రాలేదు. ప్రకటించిన 1,68.40 కోట్ల ప్యాకేజీలో 104.52 కోట్ల రూపాయల్ని మాత్రమే గత ఫిబ్రవరి నాటికి పంపిణీ చేశారు. కుటుంబానికి రూ.7.5 లక్షల చొప్పున ప్రకటించగా, కేవలం అనంత్‌నాగ్ జిల్లాలో ఒకే ఒక వృద్ధ దంపతుల కుటుంబం ఈ లబ్దిని స్వీకరించింది. దీనికి అదనంగా రూ.5 కోట్లను ఆరోగ్యం కోసం ఖర్చుచేయాలని ప్రకటించినా, ఈ నిధులు వినియోగించలేదు.
కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ ప్యాకేజీని రూ.500 కోట్లకు, ప్రతీ కుటుంబానికి ఇచ్చే సహాయాన్ని రూ.20 లక్షలకు పెంచారు. దీంతోపాటుగా సరిహద్దు ప్రాం తాలనుంచి వలస వచ్చిన కుటుంబాలకు, తీవ్రవాదులచే చంపబడిన కుటుంబాల సహాయార్థం మరో 160 కోట్ల రూపాయల్ని మొన్నటి బడ్జెట్‌లో కేటాయంచారు. ఆర్థిక సహాయమే కాకుండా పండితులకు మైనారిటీ హోదాను, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు జిల్లాల ప్రాంతాల్లో పండితులకై ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేయాలని, దీనికై 17 వేల కనాల్స్ (ఒక కనాల్ 1/8 ఎకరం- మొత్తం 2,100 ఎకరాలు) భూమిని సేకరించాలని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఇప్పటికే తిరిగి వచ్చిన కుటుంబాలు, వివిధ పండిత సంఘాలు వ్యతిరేకించడం గమనార్హం!
కాశ్మీరీ పండితుల సంఘర్షణ సమితి నాయకుడైన సంజయ్ టిక్కూ ఈ సందర్భంగా స్పందిస్తూ, ప్రత్యేక కాలనీల ఏర్పాటు పాత సమస్యల్ని పరిష్కరించకపోగా మరికొన్ని కొత్త సమస్యల్ని తెచ్చిపెడతాయని సందేహాన్ని వ్యక్తం చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా తిరిగి వస్తున్న కాశ్మీరీ పండితుల అనుభవాలు కూడా అన్ని వర్గాలతో కలిసివుండడమే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. వయస్సు మీదపడినవారు గతంలోలాగే ముస్లిం సోదరులతో సహజీవనం గడపాలనే తపన, పోగొట్టుకున్నదేదో తిరిగి పొందిన తృప్తి మిగులుతుందని అభిప్రాయపడడం గమనార్హం! నిజానికి ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండానే కొన్ని కుటుంబాలు తిరిగి వచ్చిన చోట ఇళ్ళను నిర్మించుకోవడం, చుట్టుప్రక్కల ముస్లిం కుటుంబాలు వారికి అండగా నిలబడడం జరుగుతున్నది. అందరిలాగానే 1990లో లోయను వదిలి మారుతీ వ్యాన్‌లోముంబాయికి చేరుకొని, జుహూ ప్రాంతంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని సెంటారు కంపెనీలో జనరల్‌మేనేజర్‌గా పనిచేసిన సురీందర్ కచ్రూ తన అనుభవాల్ని తెలుపుతూ, గత మార్చిలో పురిటిగడ్డపై మమకారంతో తిరిగి వచ్చి, శ్రీనగర్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో తానూ, తన తమ్ముడు ఇండ్లు నిర్మించుకున్నామని తెలి పారు. దీనికితోడు ముస్లిం సోదరులు నీటి సౌకర్యాల్ని, ఇతర సహాయాల్ని అందించారని, తన భార్య సంతోష్ దగ్గరలోని ఓ పేరుమోసిన పాఠశాలలో పనిచేస్తున్నదని, తాను ఓ ప్లే స్కూల్‌ను ప్రారంభించాలని తెలిపారు. మీకెలాంటి భయం లేదా అని ప్రశ్నించినదానికి, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ రక్ష ణ వుందని, తాను ముంబాయిలో 1993 నాటి మత కల్లోలాను, హత్య ల్ని కళ్లారా చూ సానని, 26-11-2008 నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడినుంచి తృటిలో తప్పించుకున్నానని తెలుపుతూ, పుట్టిన ప్రాంతమే ఉల్లాసాన్ని ఇస్తుందన్నారు.
ఇలాంటి ధీమానే మోతీలాల్ అనే మరో పండితుడు వ్యక్తపరిచారు. నాలుగు సంవత్సరాల క్రితమే బారాముల్లాకు తిరిగి వచ్చిన మోతీలాల్ మాట్లాడుతూ కాశ్మీరీ పండితులకు చక్కని భద్రత కాశ్మీర్‌లోనే వుందని, ఎలాంటి భేషజాలకు పోకుండా, వివిధ రాజకీయ నాయకుల, పార్టీల ప్రకటనల్ని, హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా కాశ్మీరుకు పండితులు తిరిగి రావాలని తిరిగి వచ్చే వారికి పూర్తి సహకారాన్ని ముస్లిం సోదరులు అందిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక కాలనీలను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా 1990లో జరిగిన ఓ వాస్తవ సంఘటనని ఉదహరించారు. చీఫ్ ఫారెస్టు కన్సర్వేటర్‌గా పనిచేసిన నూర్‌హుల్ హసన్ శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో వున్న కాలంలో అల్లర్లు చెలరేగాయని, కాలేజీకి వెళ్లేదారిలో బోరికదాల్ దగ్గర ఓ అల్లరిమూక అడ్డగించి షేర్ (షేక్ మహ్మద్ అబ్దుల్లా) వర్గమా లేక బక్రా (మిర్‌దాయిజ్) వర్గమా అని ప్రశ్నించగా, ‘బక్రా’ వర్గమని చెప్పగా, అరచుకుంటూ కొట్టారని, ఎలాగో తప్పించుకొని పోతుండగా ఖాన్ కుయే ముల్లా దర్గా దగ్గర మరో అల్లరి మూక అడ్డుకుంటే ‘షేర్’ వర్గమని చెపితే, వారూ కొట్టారని, తిరిగి ఫతేకాదల్ బ్రిడ్జి దగ్గర ఎదురైన మూకకు కాశ్మీరీ పండిత్ అని చెప్పగా- అడ్డుతొలగి దారి వదలి- ఆయన్ని వదిలిపెట్టండి- ‘మన పండిత్ బాయ్’ అని వారు అన్న నాటి సంఘటనను జ్ఞప్తికి చేసుకుంటూ, నిజానికి స్థానిక ముస్లింలతో పండితులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కాని, ముస్లింలకే ముస్లింలతో రక్షణ కరువైందని ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ విధంగా నాటి, నేటి పరిస్థితుల్ని కాశ్మీరీ పండితులు మననం చేసుకోవడం, వీరికి బాసటగా నిలిచిన ముస్లిం సోదరులు, మసీద్ కమిటీ సభ్యులు తిరిగి వస్తున్న పండిత్ కుటుంబాల్ని సాధారంగా ఆహ్వానించడం లోయలో ఓ గుణాత్మకమైన పరిణామంగా చెప్పవచ్చు! ఇలా తిరిగివస్తున్న కుటుంబాల కథనాలు ఈ రోజు కాశ్మీర్ ప్రాంత పత్రికల్లో స్పష్టంగా కనపడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన భూషన్‌లాల్ భట్ అనే మరో పండితుడు మాట్లాడుతూ, పునరావాసం పేరున ఇరు వర్గాల్ని ప్రత్యేక కాలనీల పేరున విడదీయడం, చేపల్ని నీటినుంచి వేరు చేయడమేనని, తర తరాల తమ సంబంధాల్ని ఇలా దెబ్బతీస్తే హిందూ, ముస్లింల మధ్యన అడ్డుగోడల్ని నిర్మించినట్లేనన్నారు.
అయితే, పండితులకు ఏర్పడిన గాయాలు పూర్తిగా మానిపోయాయని, వారు సంఘటనల్నీ మర్చిపోయారని అనుకోవడానికి కూడా వీలులేదు. జమ్మూ సరిహద్దులో ఏర్పాటైన పుర్కూ క్యాంపులో వుంటున్న కొంతమంది పండితులు తమకు పూర్తి రక్షణ వుంటేనే వెళ్తామని, అదీ తమ ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంత హోదాను ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆలోచించాల్సిన మరో విషయం. పది సంవత్సరాల వయస్సులో లోయను వదిలి జమ్మూలో తలదాచుకొని, లాయరుగా, మానవ హక్కుల కార్యకర్తగా ఎదిగిన దీపికా సింగ్ రావత్ కూడా, తాత్కాలిక ఉపశమనాలు పనికిరావని, కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటేనే పండితుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపర్చడం జరిగింది. కాశ్మీర్ గూర్చిన వార్తలు ఇప్పుడిప్పుడే ఎక్కువ సంఖ్యలో బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని చూడని మేధావులు, జర్నలిస్టులు వివిధ కథనాల ఆధారంగా వ్యాసాల్ని రాస్తూ, వారి వ్యక్తిగత అభిప్రాయా ల్ని పరిష్కార మార్గంగా చూపడం జరుగుతున్నది. దీనికి భిన్నంగా అక్కడికి వెళ్లి, ప్రత్యక్షంగా పరిస్థితుల్ని గమనించి అక్కడి పత్రికల కథనాల్ని (కాశ్మీరీ లైఫ్ (వారపత్రిక), డైలీ ఎక్సెల్‌ప్సియర్, కాశ్మీరీ ఇమేజస్, గ్రేటర్ కాశ్మీర్ తదితర) చదివి రాస్తే వాస్తవ స్థితుల్ని సరిగ్గా అంచనా వేయగలరు. ఈమధ్యన అవుట్‌లుక్ ఈ పనిని మొదలుపెట్టింది. ఏదిఏమైనా కాశ్మీరీ పండితులు తిరిగి లోయకు వెళ్లి, వారు కోరుకుంటున్నట్లుగానే వారి స్వంత ఆవాస ప్రాంతాల్లోనే పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. వారి వయస్సులతో సంబంధం లేకుండా ప్రభుత్వం, వివిధ రకాల ఉద్యోగాల కల్పన గావించాలి. అప్పుడే వారికి ప్రభుత్వాలపై పూర్తి నమ్మకం పెరుగుతుంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.