ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ
అతడు తుపాకి గుండుకు
గుండెను ఎదురిచ్చాడు
కాళ్ళ కింది ధూళిలా బతకడం కన్నా
ఒక అశ్రు బిందువై రాలి పోవడమే
మేలని సందేశ మిచ్చాడు
స్వాతంత్య్రం కోసం సింహంలా గర్జించాడు
కాళ్ళు, చేతులు, కళ్ళు
అన్నీ వున్న వాడే మనిషి కాదు
ఏమీ లేకపోతేనేం
నీవూ మనిషివే
నీ కంకాళం లోపల
అరచేయంత గుండె వుంది
దానికి సింహానికి ఉన్నంత శక్తి వుంది
పోరాడుదాం రా అందుకే అన్నాడు
గుండే శరీరం అయిన చోట
స్వాతంత్య్రం తప్పక వస్తూంది
ఆ మనిషి తనానికి ముందుగా
పోరాటమే పరిమళిస్తుంది
పరిమళించిన పోరాటమే
దివా రాత్రుల స్వేచ్ఛను అందిస్తుంది
గర్జించడమే కదా గొప్ప సౌన్దర్యానందం
గుండె ఈ శరీర సరోవరం లోని తామర పుష్పం
గుండె పుష్పమైతే అందులోని ధైర్యమే కదా సుగంధం
అందుకే… మనిషి మరణించడానికి ముందే
మనం బ్రతికాం అనడానికి సాక్ష్యంగా
్ఠగుండె తోనే మాట్లాడాలి
గుండె తోనే పోట్లాడాలి
గుండె తోనే ప్రేమించాలి
గుండె తోనే పాట పాడాలి…!
పోరాటమే ఆంధ్ర కేసరి గుండె కవచం
మహోజ్వలంగా మనిషి కదలిన చోటల్లా
గాలికి, కాంతికి, పీల్చిన ప్రాణ వాయువుకి
గొప్ప శక్తి పుడుతుంది
స్పష్టత లేని చోట గుండె స్పందించదు
భీతితో, బాధతో, బతకడం మనిషి తత్వం కాదు
గుండె తెరచాపని పడవకి కట్టి
స్వాతంత్య్ర సంద్రంలోకి వదిలాడు కేసరి
గర్జించాడు గనుకనే గమ్యాన్ని సాధించాడు
గర్వంగా చొక్కా విప్పి గుండెను చూపాడు గనుకే
సింహమయ్యాడు
మనిషంటే వెల్తురు, గాలి
బాహ్యంగా ప్రేమించే వాడు కాదు
భయాన్ని, బాధను జయించి
అజేయంగా నిలబడిన వాడే….
మనిషి
అతడే మానవ సింహం….
అతడే మన ఆంధ్ర కేసరి…!!
– పెరుగు రామకృష్ణ
(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి)