ఊసుల్లో ఉయ్యూరు -54
బాబీ కి పాట హాబీ
‘’బాబీ’’ అని ‘’బబ్బి’’ అని మేం పిలిచే అతను ఎర్రగా చక్కగా అందం గా నవ్వు ముఖం తో కుదిమట్టం గా స్వచ్చమైన తెల్లటి బట్టలతో ఉంటాడు .మాట కొంచెం తొందర .ఒకటికి రెండు సార్లు వింటే కాని అర్ధం కాదు .వేగం గా మాట్లాడటమే దీనికి కారణం .అందగాడు .ఆస్తీ ఉన్న వాడు .మా కంటే ఒకటి రెండేళ్ళు చిన్న వాడు .1960 -70 కాలం లో డిగ్రీ చదివి ఉయ్యూరులోనే వాళ్ళ స్వంత ఇంట్లో అన్నదమ్ములతో ఉండేవాడు .ఇంతకీ బబ్బి ఎవరో కాదు .నాకు మేనమామ వరస .అంటే మా అమ్మ గారి చిన్న బాబాయి కొడుకు .వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు తమాషాగా నే ఉండేవి .మా అమ్మ బాబాయి గుండు అంతర్వేది గారు పెంపుడు వెళ్ళాడు .ఆయన రాజమండ్రిలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్ అయి ఉయ్యూరులో స్తిరపడ్డారు .ఆస్తి బాగా కలిసి వచ్చింది గుంటూరు లో చాలా ఎకరాలు ఉండేవి ఉయ్యూరులో సరే చెప్పక్కర లేదు .ఆయన పెద్ద భార్య కొడుకే మా ‘’అప్పన కొండ మామయ్య’’.జంషెడ్పూర్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చీఫ్ కెమిస్ట్ .అసలు పేరు వరాహ నరసింహం .కాని అప్పల కొండ గానే మా కుటుంబాలలో వాడుక .రెండో సంబంధం ఆవిడ పద్మావతమ్మ గారు .ఆవిడ పెద్దకొడుకు ‘’అబ్బులు ‘’అసలు పేరు రాజ శేఖర్ అని గుర్తు .పెద్దకూతురు ‘’అమ్మాళు’’అసలు పేరు నాకు గుర్తు లేదు .అబ్బాయిల్లో అబ్బులు తర్వాతి వాడు ‘’రామం ‘’ అనే శ్రీ రామ చంద్ర మూర్తి .తర్వాత వాడు ‘’బాచ్చి ‘’అనే బాల భాస్కర రావు వీడు నా క్లాస్ మేట్ .’’మామా ‘’అని నేను పిలిస్తే ‘’మల్లుడూ ‘’అని వాడు పిలిచేవాడు .వీడి తర్వాత వాడే ‘’బబ్బి .అమ్మాయిలలో అమ్మాళు తర్వాత ఆవిడను ‘’మామ్మ ‘’అనే వాళ్ళం .అసలు పేరు లక్ష్మీ నరసు .తరువాత ‘’రోజమ్మ ‘’ అనే సరోజినీ పిన్ని .ఆ తర్వాత లక్షమ్మ అనే ఆవిడ .వీరిల్లు మాకు అవతలి బజారులో వేగ రాజు వారిళ్ళ దగ్గర ఉంటుంది ’ మంచి స్తితి పరులు .వ్యవసాయం అంతర్వేది గారు ఆయన చనిపోయిన తర్వాత భార్య పద్మావతమ్మ గారు ,ఆ తర్వాత రామం బాచ్చి బబ్బి లు చూసేవారు .పెద్దకుటుంబం అందరికి లక్షణం గా పెళ్ళిళ్ళు అయి బాగానే ఉన్నారు .
బాబి అన్నా కాని ,వాడి ‘’హాబీ ‘’పాట గురించి చెప్పకుండా శాఖా చంక్రమణం చేశాను .బాబీ ఎప్పుడూ ఏదో ‘’హం ‘’చేస్తూండేవాడు .ఏదోలే అని చాలాకాలం అనుకొన్నాం .ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెడితే బ్రహ్మాండం గా పాట పాడుతున్నాడు .అబ్బో వీడిలో ఇంతటి కళా కారుడున్నాడని అప్పుడే తెలిసింది .సెలవల్లో వాడు ఉయ్యూరు రావటం ,వచ్చినప్పుడల్లా ‘’భవానక్కాయ్ ‘’అని మా అమ్మను పిలుస్తూ ఉండటం నన్ను ‘’దుర్గాపతీ ‘’అని మా వాళ్ళు అందరూ పిలిచినట్లు పిలవటం , మేమూ వాళ్ళింటికి బంధుత్వం గానేకాకుండా స్నేహం తోనూ వెళ్ళటం అలవాటే .పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ తద్దినాలకూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం వెళ్ళటం రివాజే .బబ్బి పాట విన్నదగ్గర్నుంచి వాడితో వీలైనప్పుడల్లా పాడించాలి అనుకొనే వాడిని .అడిగితె ముందు ముసి ముసి నవ్వులు నవ్వేసేవాడు .తర్వాత పాట అందుకొనే వాడు .యెంత అందగాడో అంతటి పాటగాడు.గాంధర్వ గానమే అది .ఎక్కడా సంగీతం నేర్వ లేదు వినికిడి ,గ్రామ ఫోన్ రికార్డుల వల్ల వచ్చిన పాటే అది .ముఖ్యం గా శ్రీ కృష్ణుడి గురించి బబ్బి సినిమా పాట పాడుతుంటే పరవశించి పోయే వాళ్ళం .’’నీల గగన ఘన శ్యామా ‘’’వంటి భక్తీ గీతాలు వాడి నోట వినవలసిందే .హాయి అనుభ విన్చాల్సిందే .యెంత క్లిష్టమైన రాగమైనా ,యెంత శ్రుతిలో ఉన్నా ఏ స్థాయిలో నైనా పాడగల నేర్పు వాడిది .భగవద్దత్త స్వరం .ఎక్కడా జీర ఉండేదికాదు .విన్న కొద్దీ ఇంకా వినాలని పించేది .అలా కూచో బెట్టి అరగంటా గంటా పాడిం చే వాళ్ళం .ఒక సారి విష్ణ్వాలయం లో కూడా పాడించిన జ్ఞాపకం .
మా అందరికి అప్పుడు మీటింగ్ ప్లేస్ మా ఇంటికి ఎదురుగా రోడ్డు మీద ఉన్న వంగల కృష్ణ దత్త శర్మ గారు అనే ‘’దత్తు గారిల్లు ‘’.అక్కడికే అందరం చేరేవాళ్ళం .ఆయనకూ సంగీతం లోని మెలకువలన్నీ తెలుసు .పిల్లల్లో పిల్ల వాడుగా పెద్దల్లో పెద్ద వాడుగా ఉండేవారు దత్తు గారు .ఒక రకం గా మా ‘’సంసాంస్కృతిక మెంటార్’’ దత్తు గారే .ఆయన దగ్గరున్న సాహిత్యం అంతా చదివేవాళ్ళం .ఆయనతో మాట్లడటమే మాకు ఒక ఎడ్యు కేషన్ గా ఉండేది .బాగా ఎలివేట్ చేసేవారు .వారి ఇంట్లోనే బాల భారతి నిర్వహించాం నన్నయ కళా సమితి జరిపాం .ఆర్ ఎస్ ఎస్ కూ ఆయన ఇల్లు పెద్ద కేంద్రం తర్వాత జనసంఘ్ , ఆ తర్వాత బి జే పికి కూడా .బబ్బి అక్కడ ఎక్కువ పాడేవాడు .విని అందరం ఆనందించి అభినందించే వాళ్ళం .
పాట అబ్బికి ఒక హాబీ మాత్రమె .ఆ పాట లేవాడికి ఒక రకం గా వరమైంది.కాని వాళ్ళన్నయ్య ‘’బాచి ‘’కి శాపం అయింది .మా ఇళ్ళల్లో వేసవికి ఆడ పిల్లలందరూ పుట్టింటికి తరలి రావటం ,నెలో రెండు నెలలో పిల్లా పాపా తో ఇక్కడ ఉండి వెళ్ళటం జరిగేది .బాచీ వాళ్ళ పెద్దక్క అమ్మాళు ఆడపిల్లలు బహు అందం గా ఉంటారు .అందులో ఒకమ్మాయిని బాచ్చికి ఇవ్వాలని వాళ్ళూ అనుకొన్నారు , వీళ్ళూ అంటే మా పద్మావతమ్మ అమ్మమ్మ వాళ్లు అనుకొన్నారు .ఖాయమే అని అందరూ గట్టిగా నమ్మారు .కాని తానుఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడుకదా.అమ్మాళుపిల్లలు ఉయ్యూరు వచ్చ్చినప్పుడు ,బబ్బి పాటలు ,మాటలకు పరవశించి బాచ్చి ని చేసుకోవాల్సిన అమ్మాయి బబ్బిని ప్రేమించింది .బబ్బికీ ఇష్టమే .ఇద్దరూ కలిసి తిరిగారు .మొదట్లో మామూలే అనుకొన్నారు .చివరికి విషయం బయట పడిఅందరూ అవాక్కయ్యారు .ఆ అమ్మాయికి బాచ్చి మీద ప్రేమ లేదని తెలిసింది .ఇద్దరూ మేన మామలే కదా .బబ్బి పాటతో మనసు దోచేశాడు .కళ్యాణ ఘంటా కొట్టేశాడు .బాచ్చి చాల హుందాగా వ్యవహరించి ,ఇదివరకు అనుకొన్న మాటలను మర్చిపోయి , ,పెద్ద వాళ్ళను ఒప్పించి తమ్ముడు బబ్బి పెళ్లి దగ్గరుండి చేయించాడు .కద సుఖాంతం అయింది .వాళ్ళకొక కొడుకు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా పిల్లాడితో సహా మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు బబ్బి దంపతులు .
బబ్బి జంషెడ్ పూర్ లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లో పెద్ద ఉద్యోగం చేశాడు .సత్యసాయి బాబా భక్తుడయ్యారు భార్యా భర్తలు .రిటైర్ అయి కొడుక్కి పెళ్లి చేశాడు .కాని బాచ్చి జీవితం చాలా ఒడిదుడుకులకు లోనైంది .తెలిసి ,తెలీని తప్పులు చేసి ఇబ్బంది పడ్డాడు .తర్వాత రాజ మండ్రి లో నా బి ఇ డి ట్రెయింగ్ మేట్ రామ లక్ష్మిని వివాహం చేసుకొన్నాడు ,సంతానం లేదు .ఉయ్యూరులో’’ శారదా నికేతన్’’అనే స్కూల్ స్థాపించి బాగా నడిపాడు . ఆవిడా టీచర్ గా ఉండేది .అందులో హాస్టలూ పెట్టాడు .ఇంగ్లీష్ లో బాచ్చి దిట్ట .మహా క్లాస్ గా ఇంగ్లీష్ ను మహా గొప్ప ఆక్సేంట్ తో మాట్లాడేవాడు .ఇంటర్, డిగ్రీ వాళ్లకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడు .కిటకిట లాడేవారు విద్యార్ధులు .నేనూ ఒక ఏడాది అందులో సైన్సు లెక్కలు ‘’మిణికాను ‘’. ఎదేమిది ఏళ్ళ క్రితం బాచ్చి అకస్మాత్తు గా చనిపోయాడు .వాడుకూడా సత్య సాయి భక్తుడే .ఎప్పుడూ భజనలు చేయించేవాడు .భోజనాలు పెట్టేవాడు .కాని నోటి వెంట ‘’బండ బూ —‘’లు వచ్చేవి .ఆస్తిని కొంత తమ్ముడు బబ్బి పేరున రాసేశాడు .భార్య కూడా ఒక ఏడాది ఇక్కడే ఉండి తనకొచ్చిన ఆస్తిని కూడా బబ్బికి వాడికోడుక్కి రాసేసి ఉయ్యూరు వదిలి అన్నయ్యల దగ్గరికి తిరుపతి వెళ్ళిపోయింది .బబ్బిదంపతులు పుట్టపర్తి లో ఉంటూ సాయి బాబా సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు .బాబి హాబీ పాట ఇన్ని మెలికల్ని తిప్పింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-14-ఉయ్యూరు
..
గుండు భాస్కర రావు గారు, మేడం గారు చాలా మంచి మనుషులు. వారి ఇంటి కాంపౌండ్ లో 10వ తరగతి ట్యూషన్ వుండేది. చాలా సరదాగా వుండేవారు.