శాస్త్ర పదకోశాలు, సాహిత్య కోశాలు, వ్యవహార పదకోశాలు, ప్రామాణిక భాషాకోశాలు, మాండలిక వృత్తి పద కోశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సులభంగా, వేగంగా చేయవచ్చు. ఇప్పటివరకూ జరిగిన కృషి అరకొరే. అందుకే ఈ కల ఇంకా కలే.
గిడుగు కన్న తెలుగు కలలు
కలలుండాలి. నిజమే. ఆ కలల దీపం కొండెక్కి పోకుండా కాచే చేతులూ ఉండా లి. తెలుగు వెలగాలనీ, జగమంతా ఆ వెలుగులో మెలగాలనీ కలలుకన్న వ్యక్తి గిడుగు. భాష-అందరికీ అందకుండా చేసిన వాళ్ళ పాలిట పిడుగై, వ్యావహారిక భాషకు గొడుగై నిలిచిన మనీషి. గిడుగు పేరు మీద భాషా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. మంచిదే. అది భాషాభక్తి స్ఫోరకం. కానీ కలల్ని కల్లల్ని చేసి, తెలుగు భాష అభివృద్ధిని వేదికలపై మాటలకే పరిమితం చేస్తే తెలుగు కలలు కన్న గిడుగు కళ్ళు రక్తం చిందిస్తాయి. పఠనపాఠనాదులు అచ్చమైన వ్యావహారిక భాషలోనే జరగాలన్నాడు. పిల్లలకు మాతృభాషలోనే బోధన ఉండాలన్నాడు. అందుకే స్వయంగా సవరభాషకు వాచకాలు నిఘంటువు లూ కూర్చాడు. భాషను శాస్ర్తీయంగా అధ్యయనం చేసి, సాంకేతికంగా అభివృద్ధి పరచాలన్నాడు. నిఘంటువులూ, నూతన ఆవిష్కరణలు భాష భవిషత్తును నిర్ణయిస్తాయన్నాడు. గిడుగు దృష్టిలో తెలుగు భాషాభివృద్ధి బోధన, సాధన, శోధన అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంది. ప్రపంచీకరణ నేపథ్యం, స్థానిక భాషలపై ఆధునిక పరిశోధనలు సైతం ప్రభావం చూపిస్తున్న తరుణం. ఈ సమయంలో తెలుగు భాషను సమున్నత స్థితికి తీసుకెళ్ళడానికి వ్యూహాత్మకమైన అడుగులు ఆలోచనల వరకే పరిమితం కాక ఆలోచనాత్మకంగా సాగాలి. అందుకు కావలసినవి శాస్ర్తీయ దృష్టి, సాంకేతిక పుష్టి, సమానార్థక పద సృష్టి.
భాషా పరిశోధనలో శాస్ర్తీయతదే కీలకం. భాషా పరిశోధనలో ఎదురయ్యే సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో భాషను శాస్ర్తీయంగా చేసే అధ్యయనం అంత గాఢంగా ఉంటుంది. ఒక్కొక్క పదం తాలూకూ పుట్టుపూర్వోత్తరాలను అధ్యయనం చేసే దృష్టి తెలుగు వారికి లేదు. ఉన్నా అది అశాస్ర్తీయ పునాదులపై సాగింది. భిన్న సంస్కృతుల నేపథ్యం నుంచి భిన్న తాత్త్విక భావధారల నుంచి భిన్నసమాజం పుట్టినట్లుగానే భాషలోనూ విభిన్నత చోటుచేసుకొంటుంది. భాష, సమాజం, సంస్కృతి అనే మూడూ ముప్పేటలుగా కలిసి మానవ జీవితం చుట్టూ అల్లుకొని ఉంటాయి. దీనిని అర్థం చేసుకొనే శక్తి భాషా పరిశోధకులకు ఉండాలి. ఉదాహరణకి తెలుగు సంవత్సరాల పేర్లు, నెలల పేర్లు, వారాల పేర్లూ తీసుకోండి. వాటి పేర్లలోనే వాటివాటి స్వభావాలు ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలలకు ఆ నెలల్లో జరిగే ప్రకృతి పరిణామాలకూ పొంతన ఉండదు. కానీ చైత్రం, వైశాఖం అనేవి కాలస్వభావాన్ని చెప్తాయి. కృత్తికా నక్షత్రాన్ని కత్తెరచుక్క అన్నారు తెలుగులో. ఇవన్నీ పదాలలో నిగూఢంగా ఉన్న సాంకేతిక, సాంస్కృతిక, సామాజిక ఆర్థిక, భౌగోళిక పరమైన రహస్యాలు. వీటిని సాధించే శాస్ర్తీయతే గిడుగు కోరుకున్నది. ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు తెలుగు భాషకూ, మంగోలియన్ భాషకూ మధ్య ఉన్న సాదృశ్యాలను సప్రమాణంగా నిరూపించారు. ఇది చారిత్రక భాషా శాస్త్ర అధ్యయనంలో ఒక అద్భుతం. ఇటువంటి పరిశోధనలే ప్రస్తుతం మనకు కావలసినది. దీనివల్ల ప్రయోజనం సాంకేతిక అభివృద్ధి.
ఇప్పుడు తెలుగు భాష అంతర్జాలంలో విశృంఖలంగా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందినట్లు. ఎందుకంటే- విశ్వమానవుడికి గూగుల్, యాహూ రెండూ రెండు కళ్ళయ్యాయి. గూగుల్ గాగుల్స్ లేకపోతే మొత్తం చీకటి. ఈ చీకటి తెలుగు భాషకూ వ్యాపిస్తోంది. తెలుగు భాషలో కావలసినంత సమాచారాన్ని యథేచ్ఛగా అంతర్జాలంలో పొందేంతగా అభివృద్ధి జరగలేదు. దీనికి ప్రధాన అవరోధం వ్యాపారాత్మకంగా వాడే ఖతులు. వాటి వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించి అందరూ యూనికోడ్ లో రాసే అవకాశం కల్పించాలి. పుస్తకముద్రణలూ అందులోనే జరగాలి. అప్పుడు తెలుగు భాష అంతర్జాలంలో పుష్కలంగా కనిపిస్తుంది. భారతీయ భాషలన్నింటి నుండీ, అన్నింటిలోకీ తెలుగు యంత్రానువాదం ద్వారా బదిలీ అయ్యే పరిశోధనలూ సంపూర్ణంగా జరిగి ఆ ఫలాలు లోకానికి అందాలి. దీనికి కావలసినది సాంకేతిక నిపుణులతో పాటూ భాషను శాస్ర్తీయంగా అధ్యయనం చేయగల నిపుణులు. రాబోయే కాలంలో ఒకే వ్యక్తిలో ఈ రెండు నైపుణ్యాలు ఉండాలి. అప్పుడు తెలుగు భాష సాం కేతిక అభివృద్ధి వేగవంతమవుతుంది. పదపరిష్కరిణి (Morphological Analyzer), పదజనకం (Word Generator), వాక్య విశ్లేషణ (Parser) లాంటి ఆధునిక ఉపకరణాలు వినియోగంలోకి రావాలి. శాస్ర్తీయతకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. నిఘంటు నిర్మాణం సాంకేతికత వల్ల ఎంతో సులభమైపోయింది. అయినా సర్వసమర్థమైన శబ్దసాగర నిర్మాణం ఇంకా కలగానే ఉండిపోయింది. నన్న య పూర్వయుగం కాలం నాటి భాష నుంచి ఆధునిక భాష వరకూ భాషా పరిణామాన్ని గమనించి కొన్ని కావ్యాలు ఎంపిక చేసుకోవాలి. భోజరాజీయం, కేయూర బాహు చరిత్ర, విక్రమార్క చరిత్ర, హంస వింశతి, శుకసప్తతి లాంటి కావ్యాలను చూస్తే ఎంత పదసంపద మనం కోల్పోయామో తెలుస్తుంది. ఆ పదాల ద్వారా ఆనాటి సమాజం, సంస్కృతి, చరిత్ర ఇవన్నీ మరుగున పడిపోయాయి. ప్రాచీన కావ్యాలంటే ఒకే మూసలోంచి వచ్చినవన్న భావన ఉన్నంతకాలం తెలుగు భాష ఇలాగే ఉంటుంది. ప్రాచీన సాహిత్యాన్ని అధునిక శాస్ర్తాల దృష్టికోణం నుంచి అధ్యయనం చేయాలి. దీనికి భాషపై సాధికారికత ఉండాలి. ఇది ఉన్న వారిలోటు ప్రస్తుత కాలంలో స్పష్టంగా ఉంటుంది. ఇటువంటి కావ్యాలను అధ్యయనం చేసి కనీసం శతాబ్దికో కావ్యానికైనా నిఘంటువు లు తయారు కావాలి. వాటన్నింటినీ సంకలనంచేసి శబ్దసాగరంలో కలపాలి. సాంకేతికంగా ఇప్పుడు లభిస్తున్న ఉపకరణాల ద్వారా ఈ పని చాలా సులభం. కానీ ఇది ఆచరణలో మృగ్యం. తెలుగు వారి నిఘంటు సంపద చూస్తే ఎండిపోయిన బొక్కసం గుర్తుకు వస్తుంది. నలుగురైదుగురు కవులకు తప్ప పద ప్రయోగకోశాలకు దిక్కులేదు. పరిశోధకులూ వీటిపై శీతకన్ను వేశారు. విద్యార్థులూ పట్టాభిమానులే కానీ నిజమైన పరిశోధకులు కారు. ఒక పరిశీలనలు, కవి జీవిత కథనాలూ జరుగుతున్నంత కాలమూ విలువైన పరిశోధనలు రావు. విశ్వవిద్యాలయ అధ్యాపకులదే ఈ బాధ్య త. తెలుగు భాషకు- అన్ని అవసరాలూ తీర్చే నిఘంటువు లేనే లేదు. విద్యార్థులకు, వ్యాపార వేత్తలకు, కథకులకు, కవులకు, కళాకారులకు… ఇలా చెప్పుకొంటూ పోతే వివిధ రంగాల వారికి ప్రత్యేకంగా నిఘంటువులు ఉండాలి. అవీ లేవు. విద్యార్థులకూ వివిధస్తరాలలో నిఘంటువులు ఉండాలి. ఇక పారిభాషిక కోశాల పరిస్థితి మరీ దయనీయం. దృష్టి పెట్టకపోవటం, అనవగాహన, దురవగాహన ప్రత్యక్షంగా వీటిలో సాక్షాత్కరిస్తాయి. దానికితోడు ‘అసంపూర్ణత’ అదనపు సొగసు. ఏ శాస్త్ర పారిభాషిక కోశాన్నయినా తీసుకోండి. మనకు కావలసిన పదం మాత్రం అందులో ఉండదు. ఆ పదానికి మనమే తెలుగు అనువాదం తయారు చేసుకోవలసిన పరిస్థితి. ఆంగ్లంలో ఉన్న పదం కర్త్ర, కర్మ కరణార్థాలలో ఉంటే అనువాదమూ అవే అర్థాలలో ఉండాలి. ఇది ఈ కోశ నిర్మాణంలో లెక్కకు రాదు. పారిభాషిక పదకోశ సంపద లేనిదే మాతృభాషా బోధన సాధ్యం కాదు. శాస్త్ర విషయాల విషయంలోనే ఇలా ఉంటే ఇక ఆధునిక సామాన్య భాషా వ్యవహారం సంగతి సరేసరి. వాక్యం మొత్తం తెలుగు వ్యాకరణం లో ఉంటుంది. కానీ పదాలు ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగు పదసంపదలో క్రియ లు వజ్రాల్లాంటివి. నేడు ఎన్నో క్రియలు మనకు అందకుండా పోతున్నాయి. ఆంగ్ల క్రియకు తెలుగులో ‘చేయు’ను చేర్చి వాడటమే దీనికి కారణం. కేవలం క్రియలపైనా, కృదంత రూపాలపైనా ప్రత్యేక నిఘంటువులు తయారు కావాలి. శాస్త్ర పదకోశాలు, సాహిత్య కోశాలు, వ్యవహార పదకోశాలు, ప్రామాణిక భాషాకోశాలు, మాండలిక వృత్తి పద కోశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సులభంగా, వేగంగా చేయవచ్చు. ఇప్పటివరకూ జరిగిన కృషి అరకొరే. అందుకే ఈ కల ఇంకా కలే.
ఆధునిక తెలుగు భాషను జనవ్యవహారంలోనూ, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాలలోనూ విరివిగా ఉపయోగించాలంటే ఎప్పటికప్పుడూ ఈ సమానార్థక పద సృష్టి నియతంగా, నిబద్ధతతో ఒక యజ్ఞంలా సాగాలి. కేవలం పాండిత్యం గానీ, కేవల సృజన గానీ ఉంటే చాలదు. వ్యవహారజ్ఞానం, భాషాస్వరూపం, శబ్దస్వరూపం, అర్థవిస్తృతి, కాల్పనికత కలిస్తే గానీ ఒక ఆంగ్ల పదానికి మంచి అనువాదం తయారుకాదు. ఏది పడితే అది సృష్టిస్తే అది నిలబడదు.Non-Alignment అనే పదానికి అలీన విధానం, విబంధ విధానం, తటస్థ విధానం అని మూడు పదాలను నార్ల సృష్టించారు. కానీ అలీన విధానమన్నదే స్థిరపడింది. డ్రెడ్జర్ – తవ్వోడ, సబ్మెరైన్ – దొంగోడ, అని నార్ల వారు, నైట్రోజను – నత్రజని, నికిల్ – నిఖలం, ఆక్సిజన్ – ప్రాణవాయువు, ఫొటోసింథసిస్ – కిరణజన్య సంయోగక్రియ అని కాశీనాథుని నాగేశ్వర రావు గారు కలకాలం నిలిచిపోయే అనువాదాలు చేశారు. సమానార్థక పద సృష్టికి పత్రికాధిపతులు, పాత్రికేయులు చేసిన కృషి చిరస్మరణీయమైనది.
1908లో ఆంధ్ర పత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1938 నాటి కే ఒక పారిభాషిక పదకోశాన్ని నిర్మించారు.ఈ పదకోశంలోని మాటలను కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధిని ద్వారా, కొండా వెంకటప్పయ్య గారు కృష్ణాపత్రిక ద్వారా ప్రచారం చేశారు. భాష విషయంలో పత్రికల మధ్య ఉన్న ఈ సామరస్యం నేడు చాలా అవసరం. ఉద్ఘాటన, విజ్ఞప్తి, అభ్యర్థన, ద్రవ్యోల్బణం, తీర్మానం, మూజువాణి లాంటి పదాలు నేటికీ పత్రికలలో వ్యవహారంలో కనిపిస్తున్నాయి. వీటి సృష్టికర్త నార్లవారే. కొంచెం దృష్టిపెడితేOrganic farming – సేంద్రియ వ్యవసాయం, Water Sheds – వాలుగట్లు, Checkdam – వరద కట్ట, Tsunami – కడలి పొంగు, Signal – రెక్కమాను, Torch light – కోలదివ్వె, Berth – పడక, Mineral Water – తేట నీరు, Reservation – ముంగాపు, Calling bell – పిలుపు గంట మొదలయిన పదాలకు చక్కని సమానార్థకాలు కల్పించుకోవచ్చు. దీని కి ప్రాచీన సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది. శాస్ర్తీయత లేని సాంకేతికత, సాంకేతికత లేని పరిశోధన, లోతైన పరిశోధన లేని నూత్న పదకల్పన తెలుగు భాషను ఎదగకుండా చేస్తున్నాయి. గిడుగు కన్న కలలు కల్లలు కాకుండా సాకారం కావాలంటే చిత్తశుద్ధి, భాషాభిమానం కావాలి. భాషను సాంకేతికంగా ఫలవంతం చేయాలంటే శాస్ర్తీయ మూలాలను పట్టుకోవాలి. అప్పుడే తెలుగుకు వెలుగు. గిడుగుకు ఆత్మ శాంతి.
– డా. అద్దంకి శ్రీనివాస్
(ఆగస్టు 29న గిడుగు జయంతి, తెలుగు భాషా దినోత్సవం) |