నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు

నా దారి తీరు -76

బదిలీ పై బదిలీ

ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు

ఉయ్యూరు హైస్కూల్ లో కాలక్షేపం బాగానే అవుతోంది ,వ్యవసాయం ,ట్యూషన్ అన్నీ సక్రమం గానే జరిగిపోతున్నాయి అనుకొంటే గన్నవరం హైస్కూల్ కు నన్ను బదిలీ చేశారు .8-10-1983 ఉదయమే ఉయ్యూరు హైస్కూల్ లో రిలీవ్ అయ్యాను .కనుక సాయంకాలం తప్పక గన్నవరం లో రిపోర్ట్ అవ్వాలి .అవి దసరా సెలవలు .బుడమేరు ఉద్ధృతం గా పొంగి రోడ్లన్నీ జల మయం అయి ప్రయాణ సౌకర్యాలన్నీ బందు అయ్యాయి .అప్పటికి కంకిపాడు గన్నవరం షటిల్ సర్విస్ కూడా నడవటం లేదు .కాటూరు మీదుగా తేలప్రోలు వెళ్ళాలి .లేక పొతే బెజవాడ వెళ్లి గన్నవరం  చేరాలి .ఉంగుటూరు దగ్గర బుడమేరు తీవ్రం గా ఉండటం తో ఆ దారి  బంద్ అయింది .ఇక తప్పని సరిగా బెజవాడ వెళ్లి వెళ్ళాల్సిందే .

ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి బెజవాడ చేరుకొన్నాను .అక్కడి నుండి ఏలూరు బస్సు ఎక్కి గన్నవరం లో దిగాను .దారంతా వర్షాలతో మునిగిపోయి ఉన్నాయి పంటపొలాలన్నీ .గుండె చెరువు అయింది ఆ దృశ్యాలు చూస్తుంటే .మెరక చేలు పరవాలేదు కాని పల్లాలు నీళ్ళల్లో నాని ఉన్నాయి .ఆ నీరంతా తీసేది ఎప్పుడో రైతు పంట చేతికి దక్కేదేప్పుడో ? గన్నవరం తో ఇదివరకెప్పుడో కోర్ట్ పని మీదో లేక తాసిల్దార్ సంతకం కావాల్సి వస్తేనో వెళ్ళే వాళ్ళం తప్ప మిగిలినప్పుడు వెళ్ళాల్సిన అవసరం కలగ కలగ లేదు .గన్నవరం సెంటర్ లో దిగి నెమ్మది గా హైస్కూల్ కు నడిచి వెళ్లాను .ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం కూడా లేదు .ఉన్నా వానల వలన కమ్మ్యూనికేషన్ లు అన్నీ దెబ్బ తిని ఉన్నాయి .స్కూల్ లో అటెండరొ ,వాచ్ మనో ఉన్నాడు .దసరా సెలవలు కదా ..ఇంకెవరూ లేరు .జాయిన్ అవటానికి వచ్చానని అతనికి చెప్పాను .హెడ్ మాస్టారు స్కూల్ కు దగ్గరలోనే ఉంటారని చెప్పి హెడ్ మాస్టారింటికి తీసుకొని వెళ్ళాడు .

వెళ్లి నమస్కరించా.ఆయన ఎల్ వి.రామ గోపాలం గారు .జిల్లాలో గొప్ప సైన్స్ మేష్టారు గా పేరుపొందారు .ఆయన మామ గారు అంతకంటే పేరు మోసిన వారు శ్రీ ఉమా రామ లింగ మూర్తిగారు .మేడూరు హెడ్ మాస్టారు గా చేశారు .నేను సర్వీస్ లోకి వచ్చేసరికే రిటైర్ అయిన జ్ఞాపకం.కాని ఆయన్ను అందరూ తలుచుకొంటారు .నిర్భీతికి ,నిజాయితీకి ఆత్మ గౌరవానికి ,విద్య నేర్పటానికి క్రమశిక్షణకు మారుపేరు .అలాంటి వారు జిల్లా మొత్తం మీద వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగినంత మంది మాత్రమె ఉన్నారని చెప్పుకొనే వారు .అందులో వెంపటి పురుషోత్తం గారొకరు .రామ లింగ మూర్తి గారి కాలానికి ఇంకా హెడ్ మాస్టర్లు పంచె లోపల చొక్కా పైన కోటు వేసుకొనే వారు మూర్తిగారిది ఒక స్పెషాలిటి.వీటన్నిటి తో బాటు ఖండువాను మెడకు చుట్టి కొసలను మడత కిందుగా వదిలేవారు .అదీ ఆయన్ను గుర్తు పట్టే విధానం .సరే హెడ్ మాస్టారు రామ గోపాలం గారితో నాకు కొద్ది పాటి పరిచయం ఉండేది సైన్స్ మాస్టారుగా చేస్తున్నప్పుడు .ఆయనా కపిలేశ్వర పురం మేడూరు లలో చేశారు .మనిషి చామన చాయగా కొంచెం పొట్టిగా తెల్లటి గ్లాకో పంచ గోచీపోసి కట్టేవారు .తెల్లటి గ్లాస్కో  హాఫ్ షర్ట్ తొడిగే వారు .పైన కండువాతో ఉండేవారు . ముఖాన విభూతి రేకలు స్పష్టం గా కనిపించేవి .ఆయనకు బండ గుర్తు ముక్కు .కోటేరు తీసిన ముక్కుముందు భాగం లో ఒక వైపు కత్తిరించి నట్లు వింతగా ఉండేది అదీ ఆయన స్పెషాలిటి   .కొంచెం ముక్కు తో మాట్లాడే వారని గుర్తు .కూచో మని చెప్పి ,స్కూల్ సెలవులుకనుక నా జాయినింగ్ రిపోర్ట్ ముందే రాసుకొని వేళ్ళానుకనుక అది తీసుకొని  ‘’joined on the after -noon of 8-10-83అని రాసేసి సంతకం పెట్టారు .’’మాస్టారూ !మీరు ఇక్కడ డ్యూటీ లో చేరినట్లే .నిశ్చింతగా ఇంటికి వెళ్లి రిపోపెనింగ్ రోజున స్కూల్ కు రండి .మీ ఎస్ ఆర్ ,తీసుకు రండి ‘’అని చెప్పి కాఫీ ఇచ్చి పంపారు .మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరేసరికి రాత్రి అయింది .

రోజూ గన్నవరం వెళ్లి రావటం కష్టమే .కాని ఫామిలీని మార్చే ఆలోచన నాకెప్పుడూ లేదు కనుక తప్పదనుకోన్నాను .మర్నాడు నాదగ్గరకు ఉయ్యూరుకు గన్నవరం నుండి పామర్రుకు బదిలీ అయిన కృష్ణ గారు వచ్చారు .ఆయన్ను ఏదో కారణాల మీద బదిలీ చేశారు .గన్నవరం వదిలి వెళ్ళలేడు, వెళ్ళినా నిల దోక్కుకో  లేడు.నాకూ గన్నవరం ఇబ్బందే ,ఆతను మేమిద్దరం ‘’మ్యూచువల్ ట్రాన్స్ ఫర్  ‘’పెట్టుకొంటే చైర్మన్ గారు చేస్తానన్నారని అక్కడి ఏం ఎల్ ఏ బోస్ తన శిష్యుడేకనుక ట్రాన్స్ ఫర్ చేయించే బాధ్యత తనదేనని చెప్పాడు .తంతే గారెల బుట్టలో పడినట్లైంది నాకు .వెంటనే ఒప్పుకొని మ్యూచువల్ కు సంతకాలు చేశాం .అప్లికేషన్ మీద .ఆ ఇప్పుడప్పుడే అయిందా అనుకొన్నా .

దసరా సెలవల తర్వాత స్కూల్ పదమూడో తారీకున తెరచిన గుర్తు .అలాగే పొద్దున్నే ఇంట్లో భోజనం చేసి వీలయితే కొద్దిగా టిఫిన్ చేయించి బాక్స్ లో పెట్టించుకొని ఎనిమిదింటికే బయల్దేరే వాడిని .స్కూల్ కు పావుతక్కువ పదికి తప్పక వెళ్ళే వాడిని .అసెంబ్లీ ఉండేది .ఫస్ట్ అసిస్టంట్ అయిన ఒక యెన్ సి సి ఆఫీసర్ నిర్వహించేవారు హెడ్ మాస్టారికి బదులు .హెడ్ మాస్టర్ రామ గోపాలం గారు పూజా, అభిషేకాలు అన్నీ పూర్తీ చేసుకొని ,భోజనం చేసి పదకొండు గంటలకు వచ్చేవారు .ఆయన వచ్చినా రాక పోయినా స్కూల్ యదా ప్రకారం జరిగేది .కృష్ణ కు ఇచ్చిన క్లాసులకే నేను వెళ్లి చెప్పేవాడిని .అక్కడ నాకు మెంటార్’’శ్రీ తోట కూర  అప్పరాయ వర్మ గారు ‘’అనే సీనియర్ హిందీ పండిట్ .ఆయన గిల్డ్ ప్రెసిడెంట్ గా సెక్రెటరి గా గిల్డ్  ముఖ్యులుగా  చైర్మన్ గారి  అంతేవాసిగా కొల్లూరికి అభిమాన గణం లో ఒకరుగా  ఊళ్ళో పెద్దమనిషిగా ఉండేవారు. నేను అంటే చాలా అభిమానం వారికి .కారణం ముక్కు సూటిగా మాట్లాడతానని .ఒకప్పుడు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కి అధ్యక్షులు గా శ్రీ పసుమర్తి శర్మ గారు ,కార్య దర్శి గా శ్రీ అప్పారాయ వర్మ గారు పని చేశారు .వారి అభినందన సభ జరిగింది .నన్ను అందులో మాట్లాడమంటే ‘’శర్మా  వర్మా కలిసి గిల్డ్ కు బర్మా వేయకండి ‘’అన్నాను జనం పగల బడి నవ్వారు .ఇద్ద్దరూ స్పోర్టివ్ గానే తీసుకొన్నాను .ఇద్దరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది .వర్మ గారి అబ్బాయి తోటకూర ప్రసాద్ గారు ‘’తానా’’అధ్యక్షులైనారు .ఆతని అన్నయ్య పేరూ ప్రసాద్ యే .మంచి వాలీబాల్ బాడ్ మింటన్ ,ఖోఖో కబాడీ ప్లేయర్ .జిల్లా విన్నర్ .గన్నవరం హైస్కూల్ ఆటగాళ్ళు జిల్లా అంతా పేరుపొందారు .డిస్ట్రిక్ట్ విన్నర్స్ గా గుర్తింపు వారికి ఉంది .ఆతను బెజవాడ ప్రభుత్వ కాలేజిలో పి డి. గా ఉంటున్నాడిప్పుడు. నేను అంటే మహా అభిమానం, గౌరవం ఆతనికి .జిల్లా పరిషత్ లో పని చేసినప్పుడు  జిల్లా టీచర్ టోర్న మెంట్స్ లో కలిసే వాళ్ళం .నేను సర్వీస్ లో మొట్టమొదటగా మోపి దేవి హైస్కూల్ లోసైన్స్  మేస్టర్ గా 1963లో చేరినపుడు శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారు హెడ్మాస్టారు ,శర్మ గారు సోషల్ మేష్టారు ,ఫస్ట్ అసిస్టంట్ కూడా .వారం రోజులు  పెదప్రోలు లో  వారిం ట్లోనే  నేనూ లెక్కల మేష్టారు జమ్మల మడక రమణారావు గారు భోజనం ..’’మనుగుడుపుల పెళ్లి కొడుకుల్లాగా ‘’మమ్మల్ని స్వీట్లు హాట్లు కాఫీలు టిఫిన్లు , పంచ భక్ష్య పరమాన్నాలతో రాచమర్యాదాలతో ’’ మేపారు  ‘’.నాకు అప్పటికి పెళ్ళికాలేదు .ఆయన చెల్లెల్ని నాకు ఇవ్వాలని మనసులో ఉండేది అని తర్వాత తెలిసింది .వీటన్నిటికంటే నిర్దుష్టమైన ,ముక్కు సూటి మనిషి శర్మగారు .నాకు మహా ఆత్మ్త్మీయులు .రమణారావు గారికి పెళ్లి అయి ఒక పిల్లాడు కూడా .ఇద్ద్దరం ఇంకా కాపురాలక్కడ పెట్టని కాలం .

గన్నవరం స్కూల్ లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ జలగం వెంగళ రావు చదివారు .ముఖ్య మంత్రి అయిన తర్వాత ఆ స్కూల్  అభి వృద్ధికి అన్ని రకాల సహాయం చేశారు .ఫిజిక్స్ కు బయాలజికి వేరు వేరు లేబరేటరిలు ఉండేవి  . .కృష్ణ ఏనాడు అక్కడ పాఠాలు సరిగ్గా చెప్పలేదని వినే వాడిని .లాబ్ ను వాడటం ప్రయోగాలు చేయటం లేనేలేదని చెప్పేవారు .లాబ్ అసిస్టంట్ ఒకతను చాలా నీట్ గా హుందాగా ఉండేవాడు. వెంకటేశ్వర రావు అని జ్ఞాపకం .ఎవరి మాటలూ లెక్క చేసేవాడు కాదు .కాని నా అదృష్టం ఏమిటో నన్ను విపరీతం గా గౌర విన్చేవాడు ప్రయోగాలకు అన్నీ సిద్ధం చేసేవాడు చాలా మర్యాదగా ఉండేవాడు .అతనూ గిల్డ్ మీటింగులకు వచ్చేవాడు కనుక  గుర్తించి తెలుసుకొన్నాడు .కిళ్ళీ ఎప్పుడూ ‘’దట్టించేవాడు ‘అని కాని నేనున్నప్పుడు వేయ టం లేదని చెప్పారు .’అందరూ ఆశ్చర్య పోయేవారు వర్మ గారితో సహా .యెంత అణకువగా ఉన్నాడో అని .క్లాసులు బాగా చెప్పటం ,ఆ రోజు  పాఠంపై మర్నాడు ప్రశ్నలు అడగటం అంతా పిల్లలకు కొత్తగా ఉండేది .రెండు రోజుల్లో అలవాటు పడిపోయారు .వర్మ గారు నాతొ ‘’ప్రసాద్ గారూ !మీ బోధనకు పిల్లలు మురిసి పోతున్నారు .మీరు ఇక్కడే ఉండండి మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి ‘’అనేవారు కృష్ణా నేనూ మ్యూచువల్ పెట్టుకొన్న సంగతి  హెడ్ మాస్టారికి మా ఇద్దరికితప్ప్ప ఎవరికీ తెలీదు .

అటెండరు బారుగా సన్నగా ఉండేవాడు. చాలా మంచి వాడు నమ్మకస్తుడు.అన్నీ తెలిసినవాడు కష్ట పడేవాడు .అతనూ నన్ను ఇక్కడే ఉండిపొమ్మని గోల చేసేవాడు .సుమారు ఒక వారం పని చేశానేమో .నాకు పామర్రుకు కృష్ణ కు గన్నవరానికి ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి .19-10-83 సాయంత్రం నన్ను విధుల నుంచి విడుదల చేసి మంచివీడ్కోలు విందు ఏర్పాటు చేశారు .వర్మ గారు నన్ను ఎంతగానో శ్లాఘించారు. హెడ్ మాస్టారు తో సహా అందరూ నన్ను అభినందించారు వారం రోజుల్లో అందరి హృదయాలలో నిండి పోయానని అందరూ అన్నారు .

కాని అక్కడ ఒక డ్రిల్ మాస్టారు రోజూ తాగి వచ్చి గొడవ చేసేవాడు .నాకు మహా చిరాకుగా ఉండేది .తాగక పొతే చాలా మంచిగా ఉండేవాడు .అందరితోను కలుపుకోలు గా ఉండేవాడు .అతన్ని హెడ్ గారితో సహా ఎవరూ ఏమీ చేయలేక పోవటం బాధ అనిపిస్తుంది .రాజకీయ నాయకులూ కిమిన్నాస్తి గా వ్యవహరించేవారు .అక్కడ నాతో పాటు పని చేసిన సోషల్ మేష్టారు వెంకటేశ్వర రావు గారు తర్వాతెప్పుడో గిల్డ్ ప్రెసిడెంట్ అయ్యారు .కబుర్లు బానే చెప్పేవాడుకాని క్రియా శూన్యం .ఇరవై తారీకు ఒకరోజు ట్రాన్సిట్ వాడుకొని ఇరవై వ తేదీన పామర్రు వెళ్లి హెడ్ మాస్టారు శ్రీ డి వి ఎస్ .హయగ్రీవం గారింటికే  వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను .ఆయన మేడూరు హైస్కూల్ లో హెడ్ గా పని చేసినప్పుడు టెన్త్ క్లాస్ ఇన్విజి లేషన్ కు వెళ్లాను .అదే పరిచయం .నేను జాయిన్ అయినందుకు ఎంతో  సంతోషించారు .టీ కాచి  ఇచ్చారు .ఆయన ఒక రూమ్ తీసుకొని అద్దె కున్నారు .వంట చేసుకొనే వారు ఫామిలీ విజయ వాడలో ఉండేది .ఇలా పదకొండు రోజుల్లోనే అందులో వారం రోజుల పని లోనే బదిలీ అయి రికార్డ్ సృష్టించాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-14-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.