తండ్రి సందేశాత్మక సంచలనాల దర్శకుడు. కొడుకు ఎంటర్టైన్మెంట్ను కొత్త పుంతలు తొక్కించిన దర్శకేంద్రుడు. ఆ తండ్రి దగ్గర నుంచి ఈ కొడుకు ఏ పాఠాలు నేర్చుకున్నాడు? ‘ప్రేమనగర్’ వంటి చిత్రాల దర్శకుడు కె.ఎస్ ప్రకాశరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాఘవేంద్రరావు ‘నవ్య’తో పంచుకున్న జ్ఞాపకాలివి..
‘‘గుర్రానికి ఆకలి వేసినప్పుడు గడ్డి పెట్టాలి.. హల్వా పెడితే ప్రయోజనం ఉండదు’’ – ఇది మా నాన్న నాకు చెప్పిన ఒక సూత్రం. ఒక సినిమా దర్శకుడిగా నాన్న తానున్న కాలం కన్నా ఒక పదేళ్లు ముందే ఉండేవారు. ‘దీక్ష’, ‘కన్నతలి’్ల లాంటి సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఒక దర్శకుడు కమర్షియల్ సక్సెస్ సాధించాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న తరం పల్స్‌ను పట్టుకోవాలి. నాన్న తీసిన సినిమాల్లో ‘ప్రేమనగర్’లాంటి మరపురాని సినిమాలూ ఉన్నాయి. కొన్ని ప్లాప్‌లు ఉన్నాయి. నాన్న దగ్గర నేను నేర్చుకున్న సినీ పాఠాల గురించి చెప్పేముందు- ఆయన నేపథ్యం కూడా కొద్దిగా చెప్పాలి. నాన్న స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు. ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయలేదు. నేరుగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వారిలో నాన్న కూడా ఒకరు. అయితే ఆయన తీసిన అనేక సినిమాలు విజయవంతం కావటానికి వెనక బలమైన స్ర్కీన్‌ప్లే ఉంది. నాన్న తాను తీసిన ప్రతి సినిమా స్ర్కీన్ ప్లేలో షాట్ వైజ్ డిస్ర్కిప్షన్ రాసుకొనేవారు. ఉదాహరణకు ఒక సీనులో హీరో డైలాగ్ చెప్పి కప్పు టేబుల్ మీద పెట్టాలనుకుందాం. నాన్న తయారు చేసిన స్ర్కీన్‌ప్లేలో మొత్తం సీనంతా కళ్లకు కట్టినట్లు ఉండేది. అందువల్ల ఆ స్ర్కీన్‌ప్లే ఉంటే చాలు.. ఎవరైనా సినిమా తీసేయవచ్చు. ఈ విషయంలో నేను పూర్తి విరుద్ధం. మొత్తం స్ర్కీన్‌ప్లే అంతా నా బుర్రలో ఉంటుంది. సెట్ మీదకు వెళ్లిన తర్వాత అక్కడున్న పరిస్థితుల ఆధారంగా షాట్ ప్లాన్ చేసుకుంటా. నాన్న తన చిన్నప్పుడు విపరీతంగా చదివేవారు. పురాణాలు, శాస్త్రాలు, సాహిత్య పుస్తకాలు- ఇలా దేనిని వదలిపెట్టలేదు. ఆయన రాసిన వ్యాసాలు భారతి పత్రికలో కూడా ప్రచురితమయ్యాయి. వాటిని చూసే దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆయనను పిలిపించారు. బహుశా అందువల్లే అనుకుంటా- ఆయనకు తాను తీస్తున్న కథపై పూర్తి అవగాహన ఉండేది.
నాన్న దగ్గర నేను కూడా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. కొన్నిసార్లు స్ర్కిప్టు ఇచ్చి నన్ను కూడా సీన్లు తీయమనేవారు. సినిమా తీయటం ఇంత సులభమా అనిపించేది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ స్ర్కిప్టులో నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉండేవి. నాన్నతో పనిచేస్తున్న సమయంలో వాటిని ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఉదాహరణకు ‘ప్రేమనగర్’లో- చివరి సాంగ్. ఆ రోజుల్లో చాలా మంది క్లైమాక్స్‌లో అలాంటి సాంగ్ ఏమిటి? అని, విషం తాగిన వ్యక్తి అంత సేపు పాట పాడతాడా? అనీ.. అనేక విమర్శలు చేశారు. కానీ దానిని ప్రేక్షకులు ఆదరించారు. ఎమోషన్స్ రిచ్‌గా ఉన్నప్పుడు వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను తీసిన ‘కొండవీటి సింహం’లో కూడా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌కు బులెట్లు దిగుతాయి. అయినా ఫైట్ చేస్తాడు. అప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఏ సినిమా చూడండి.. కడుపులో కత్తి దిగి.. లీటర్ల కొద్దీ రక్తం కారిపోతున్న వ్యక్తి కూడా ఫైట్స్ చేస్తాడు. ప్రేక్షకులకు డ్రామా ఉన్నప్పుడు లాజిక్ పట్టదు. నాన్న తీసిన సినిమాల్లో మెసేజ్ అంతర్లీనంగా ఉండేది. నా సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటాయి. ఇది మా ఇద్దరికీ ఉన్న తేడా. మేమిద్దరం కలిసి షూటింగ్లో పాల్గొన్న సమయాలలో- నేను షాట్‌ను ఒకలా తీయాలని ఊహించుకొని వచ్చేవాడిని. నాన్న వాటిని వేరే విధంగా ప్లాన్ చేసేవారు. దానితో నేను అలిగేవాడిని. ఏ బెడ్రూం సెట్ లోపలికో వెళ్లి పడుకునేవాడిని. నేను అలిగిన విషయం ఎవరైనా చెబితే- ‘రెండు నిమిషాలు ఆగితే వాడే వస్తాడు..’’ అనేవారు. నాకు కూడా కొద్ది సేపు అయిన తర్వాత షాట్‌ను ఆ విధంగా ప్లాన్ చేయటం వెనకున్న లాజిక్ అర్థమయ్యేది. మాట్లాడకుండా మళ్లీ పని మొదలుపెట్టేవాడిని. షూటింగ్లో మేమిద్ధరం ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకొనేవాళ్లం కాదు. అంతే కాదు. అవతల వ్యక్తిని పొగిడే విషయంలో నాన్న చాలా కచ్చితంగా ఉండేవారు. ప్రతిభ లేకపోతే ప్రశంసే వచ్చేది కాదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రామానాయుడుగారు నాకు చాన్స్ ఇస్తానన్నారు. అప్పుడు నాన్న- ‘‘ ఇంకా వాడికి ఎక్స్పీరియన్స్ రాలేదు.. తర్వాత చూద్దాం..’’ అన్నారట. నేను సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన నన్ను నేరుగా ఎప్పుడూ పొడగలేదు. నేను తీసిన ‘జ్యోతి’ చిత్రాన్ని చూసి- గుమ్మడిగారితో- ‘మావాడు బాగా తీశాడండీ’ అన్నారట.
నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్న మరో విషయం లెంగ్త్. సినిమాను అనవసరంగా సాగదీస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అవసరమైన షాట్లు మానేస్తే మొత్తానికే మోసం వస్తుంది. దర్శకుడికి ఈ బ్యాలెన్స్ చాలా అవసరం. దీనిని నేను నాన్నను చూసే నేర్చుకున్నా. అందుకే నా సినిమాలు ఎక్కువ లెంగ్త్ ఉండవు. స్ర్కీన్‌ప్లే సిద్ధంగా ఉంటే అనవసరపు షాట్స్ చాలా తగ్గిపోతాయి. ఒక వేళ ఎక్కడైనా లెంగ్త్ తగ్గించాల్సి వస్తే నాన్న ఒక సూత్రం చెప్పారు. ప్రతి సినిమాలోను 80 నుంచి 90 సీన్లు ఉంటాయి. ఒక వెయ్యి అడుగుల సినిమా తగ్గించాలనుకుందాం. అప్పుడు సాధారణంగా మూడు, నాలుగొందల అడుగులు ఉన్న సీన్లను కట్ చేయటానికి ప్రయత్నిస్తాం. కానీ నాన్న ప్రతి సీనులోను అనవసరంగా ఉన్న లెంగ్త్‌ను కట్ చేయమనేవారు. అందువల్ల స్టోరీ నెరేషన్‌కు ఎక్కడా ఇబ్బంది రాదు. సినిమా కూడా క్రిస్ప్‌గా వస్తుంది. లెంగ్త్‌తో పాటుగా ప్రేక్షకులకు స్టోరీని ఎలా చెప్పాలనే విషయాన్ని కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నా. ‘తాసీల్దార్గారి అమ్మాయి’ సినిమాలో ఎనిమిది ప్లాష్బాక్లు ఉంటాయి. సినిమాలో ప్లాష్బాక్ల వల్ల ఉండే సౌలభ్యమేమిటంటే- ప్రేక్షకుడు లాజిక్ ఆలోచించడు. హీరో అలా ఎందుకు చేశాడు.. హీరోయిన్ అలా ఎందుకు చేయలేదు.. అనే ఆలోచనలు రావు.
ఒకప్పుడు మంచి స్ర్కీన్‌ప్లే రాయాలంటే ప్రకాశరావే రాయాలనేవారు. నాన్నను ఇండసీ్ట్రలో అందరూ గౌరవించేవారు. ఆదరించేవారు. ఆత్రేయలాంటి మాటల కవిని పాటల కవిగా మార్చింది నాన్నే. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. వీరి స్నేహానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన గుర్తుకొస్తోంది. ఒక రోజు ఆత్రేయ నడుచుకుంటూ వెళ్తున్నారు. నాన్న ఆత్రేయను చూసి కారు ఆపారట. ‘‘ఆత్రేయ.. మాకో పాట రాయి..’’ అని అడిగారట. ఆత్రేయ- ‘‘నేను మాటలు రాసేవాడినే కాని పాటలు రాసేవాడిని కాను..’’ అన్నారట. నాన్న అప్పుడు- ‘‘ఆ మాటలనే పాటగా రాయి’’ అన్నారట. అలా పుట్టిందే.. ‘దీక్ష’ సినిమాలోని ‘పోరా బాబు పో.. నీ దారి నీదే..’ పాట. సినిమాల నుంచి విరమించుకున్న తర్వాత కూడా నాన్న సినిమా వాళ్లతో గడపటానికే ఎక్కువ ఇష్టపడేవారు. ప్రివ్యూలకు వెళ్లి సినిమాలు చూసేవారు. చూసిన తర్వాత ఇంటికి వచ్చి వాటిపైన పూర్తి స్థాయిలో రివ్యూ రాసేవారు. సినిమా బావుంటే వెంటనే ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పేవారు. నాన్న రాసిన రివ్యూలు చదివితే- ఆయా సినిమాల్లో ఉన్న లోపాలన్నీ తెలిసిపోయేవి. అన్నమయ్య సినిమా చర్చలప్పుడు ఆయన ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మరణించారు. నాన్న ఆ సినిమాను చూస్తే బావుండేదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అన్నమయ్య బావుందని అనేక మంది పొడిగారు. కానీ నాన్న కూడా పొడిగితే బావుండేదనిపిస్తుంది. అది ఒక వెలితిగానే మిగిలిపోయింది.
నటునిగా చిత్రరంగంలోకి అడుగుపెట్టి, నిర్మాతగా. దర్శకునిగా, స్టూడియో అధిపతిగా చిరస్మరణీయమైన సేవలు అందించి, సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన విశిష్టవ్యక్తి కోవెలమూడి సూర్యప్రకాశరావు. 1914 ఆగస్ట్ 27న ఆయన జన్మించారు. అంటే బుధవారం ఆయన శత జయంతి. ఎంతోమంది ఆర్టిస్టులను, సాంకేతికనిపుణులను గాయనీమణులను పరిచయం చేసిన ప్రకాశరావు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే చిత్రం ‘ప్రేమనగర్’. తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ఆయన కీర్తికిరీటంలో కలికితురాయి. . తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 40 చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాశరావు అగ్రహీరోలందరితోనూ పనిచేశారు. అలాగే అందరూ బాలనటులతో ఆయన తీసిన ‘బాలనందం’ చిత్రం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. మూడు లఘుచిత్రాల సంకలనం ఈ సినిమా. సినీ చరిత్రలోనే ఇది అరుదైన విషయం.
నాన్న గారి పెద్దనాన్న కొడుకు రాజగోపాలం అని ఉండేవారు. ఆయనకు నాన్నకు చాలా స్నేహం. ఆయన ఇంటికి వచ్చి- ‘ప్రకాశరావు నీ సినిమాలు వెన్నపూసలా ఉంటాయి. మిగిలిన వాళ్లవి బఠానీల్లా ఉంటాయి’ అనేవారు. వెన్నపూస త్వరగా కరిగిపోతుంది. అంటే ఎక్కువసేపు ఆస్వాదించడానికి వీలుగా ఉండదు. అదే బఠానీలను ఆస్వాదిస్తూ తినవచ్చు అనేది ఆయన ఉద్దేశం.
నాన్న సినిమావారితోనే గడపటానికి ఎక్కువ ఇష్టపడేవారు. సినిమాల నుంచి విరమించిన తర్వాత బ్రిడ్జి ఆడటం మొదలుపెట్టారు. బ్రిడ్జి మేధకు సంబంధించిన ఆట. దేశంలోనే మొదటి ఐదుగురు బ్రిడ్జి ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగారు. ఆయన బ్రిడ్జి ఎందుకు నేర్చుకొని ఆడటం మొదలుపెట్టారనే విషయం నాకు చాలా కాలం తెలియదు. ఒక సారి తన మిత్రుడితో- ‘‘ఖాళీ సమయం గడపాలంటే ఏవైనా సినిమా ఆఫీసులకు వెళ్లాలి. వారు రెండు మూడు రోజులు ఆదరంగా చూస్తారు. ఆ తర్వాత ఆ ఆదరణ తగ్గుతుంది. వాళ్లకీ పనులుంటాయి కదా.. అందుకే క్లబ్‌కు వెళ్లి బ్రిడ్జి ఆడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు..’’ అనటం నేను విన్నా.. |