మానవత్వమున్నసాహితీమూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం
నేను రాసిన ఎనిమిదవది ,సరసభారతి ప్రచురించిన పన్నెండవపుస్తకం అయిన ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘ ‘ను ఆత్మీయులైన నాఅమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ గారైన ప్రముఖ వైద్యులు , వితరణ శీలి ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత ,గ్రంధ కర్త ,అనువాదకులు డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారికి అంకిత మిస్తున్నాం.వారి ప్రతిభా విశేషాలను వివరిస్తున్నాను .
నరసింహ శర్మ గారు ప్రఖ్యాత కదకులు నవలా రచయితా అయిన స్వర్గీయ రా .వి .శాస్త్రి (రాచకొండ విశ్వనాధ శాస్త్రి )గారి తమ్ముడు స్వర్గీయ .శ్రీ నారాయణ మూర్తి ,శ్రీమతి సీతా మహాలక్ష్మి గార్ల కుమారులు .శ్రీకాకుళం జిల్లాలో 28-8-1924 లో జన్మించారు .వీరికి ఇద్దరన్నలు శ్రీ మహాదేవ శాస్త్రి ,కీ.శే.విశ్వ నాద శాస్త్రి ,ఒక తమ్ముడు ,శ్రీ సుబ్బారావు చెల్లెలు డాక్టర్ శ్రీమతి నిర్మల .హైస్కూల్ విద్యాభ్యాసం తర్వాత కాలేజీ విద్య నేర్చి ,విశాఖ పట్నం లోని ఆంద్ర వైద్య కళాశాలలో ఏం బి బి ఎస్ లో 1948లో చేరి మెడిసిన్ చదివారు . 1959లో ఏం డి పొందారు .వైద్య వ్రుత్తి స్వీకరించి ఆంద్ర ప్రదేశ్ వైద్య శాఖలో వైద్యుడిగా 1950నుండి 1967వరకు పని చేశారు .1967లో అమెరికా వెళ్లి 18 ఏళ్ళు మెసా చూసేట్స్ వి. ఏ. హాస్పిటల్ (లెబనాన్, పెన్సిల్వేనియా).వివిధ వైద్యాలయాలలో,వివిధ రంగాలలో వైద్య సేవలందించారు ..1945లో అనాటమిలో ఒకసారి 1947 లో మెడిసిన్ లో రెండవ సారి స్వర్ణ పతకాలను పొందారు .పదికి పైగా విలువైన రిసెర్చ్ పేపర్స్ తయారు చేసి విదేశీ జర్నల్స్ తో సహా అనేక జర్నల్స్ కు రాశారు .వీటిని గమనించిన అమెరికా లోని కెంటకి యూని వర్సిటి లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురావిజ్ శ్రీ శర్మ గారిని అమెరికాకు వచ్చి సేవ లందించ మని ఆహ్వానించారు .వారి కోరిక మేరకే వెళ్లి సేవలు అంద జేశారు .
తన తో పాటు వైద్య విద్య ను అభ్యసిస్తున్నకృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన మైనేని వారి ఆడపడుచు శ్రీమతి అన్న పూర్ణా దేవిని వలచి వలపింప జేసుకొని పెద్దల అంగీకారం తో వర్ణాంతర వివాహం చేసుకొన్నారు .ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు .పెద్ద కుమారుడు శ్రీ సుధాకర్ కోడలు శ్రీమతి శోభ .మనవ రాళ్ళు ఛి సౌమ్య ,శ్రీ వాణి.చిన్న కుమారుడు శ్రీ రమేష్ కోడలు శ్రీమతి లక్ష్మి .మనుమరాళ్ళు నైమిష ,సమీర .పెద్ద కూతురు శ్రీమతి జ్యోతి ,అల్లుడు శ్రీ కృష్ణ కుమార్ –మనుమడు ఛి గౌతం ,మనవరాలు ఛి మమత .చిన్న కూతురు శ్రీమతి సంధ్య అల్లుడు శ్రీ ప్రసాద్ .మనవళ్లు ఛి రేవంత్,రాహుల్ మనవ రాలు ఛి తార రాధిక .
శర్మ గారి వృత్తి వైద్యమే అయినా ప్రవృత్తి గ్రంధ పఠన,గ్రంధ సేకరణ ,తో బాటు ఆంగ్లం ఆంధ్రాలలో కవితా రచన .ఆంగ్ల కవితలను తెలుగు చేయటం .ఈ దిశలో కృషి చేసి ఆనురాగాలు –ఆత్మీయతలు పడమటి సంధ్యా రాగం పుస్తకాలను రాసి ప్రచురించారు .వివిధ పత్రికలలో ఎన్నో వ్యాసాలూ రాశారు . అమెరికా లోని ఆంగ్ల పత్రికలలో వీరి అంగ్ల కవితలు ప్రచురితాలు .తెలుగు కవితలు ఆంద్ర జ్యోతి ,విశాలాంధ్ర ,అమెరికాలోని తెలుగు జ్యోతి లలో ముద్రణ పొందాయి .అమెరికాలోని ‘’తానా పత్రిక‘’గుంటూరు లోని ‘’భావ వీణ’’ ,విశాఖ లోని ‘’ప్రసన్న భారతి’’ పత్రికలలో వీరి రచనలు ప్రచురింప బడ్డాయి . ‘’పడమటి సంధ్యా రాగం ‘’,కుప్పం లోని ద్రవిడియన్ విశ్వ విద్యాలయం ప్రచురించిన రావి శాస్త్రి కదల ఆంగ్లాను వాదానికి సమన్వయ కర్త గా,అనువాదకులుగా ఉన్నారు .ఇటీవలనే ‘’హ్యూమన్ టచ్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ఆంగ్ల కవితా సంపుటి వెలువరించారు .కంద పద్యాలను రసకందాయం గా రాసే నేర్పు వారిది .సీసాలతో శ్రీనాదునిలా ఉయ్యాల లూగిస్తారు .సృజనాత్మక రచనలు చేయటం లో దిట్ట .ఆయన సేకరించిన గ్రంధాలు అసంఖ్యాకం .ప్రకృతిప్రేమికులు ,ఆరాధకులు శర్మాజీ
‘’ఎన్నెస్ రాచ కొండ ‘’గా మిత్రులు శర్మ గారిని ఆప్యాయం గా పిలుచుకొంటారు ‘’.విశాఖ సాగరానికి యారాడ కొండ,జనసాగరానికి ఈ రాచ కొండ శిఖరాయమానాలు ‘’ అంటారు . ‘’అన్నపూర్ణాక్షరం ‘’పేర శర్మ గారు రాసిన ఆంగ్ల కవితలకు ప్రముఖ రచయితా విమర్శకుడు శ్రీ రామ తీర్ధ తెలుగు అనువాదం తో ద్విభాషా కవితా సంపుటి గా వెలువడింది .ఇంతటి సాహితీ మూర్తికి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ అంకిత మివ్వటం సముచితమే కదా .
మానవత్వం వికసించిన వ్యక్తీ శ్రీ శర్మ గారు .అత్తవారింటికి ఉయ్యూరు వచ్చినప్పుడు సెంటర్ లో దిగి ,ఒక ముస్లిం కూలీ ని మాట్లాడుకొని అతి తేలికైనవి కూలీ చేతికిచ్చి బరువైన సామాను తాను మోస్తూ అత్తవారింటికి నడిఛి చేరే వారు .ఇల్లు చేరగానే స్టేత స్కోప్ తో ఆ కూలీని పరీక్షించి అధిక బరువులు మోయవద్దని సలహా ఇస్తూ,మామూలుగా అందరూ ఇచ్చే కూలికి పది రెట్లు అతని జేబులో పెట్టి ,ఆరోగ్యకరమైన భోజనం చేయమని చెప్పి ,అతనికి ఆప్యాయం గా అత్తగారు భార్య ల తో విస్తరిలో వడ్డింప జేసి కమ్మని భోజనం పెట్టి పంపించేవారు .
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ లో పని చేస్తున్నప్పుడు తెలిసిన ముసలి రిక్షా డ్రైవర్ ను కుదుర్చుకొని గోల్కొండకు అందులో కూర్చుని వెళ్ళే వారు .ఎత్తు పల్లాలోచ్చినప్పుడు దిగి ,రిక్షా తోస్తూ ,రిక్షా వాడు అలసి నట్లు కనిపిస్తే అతన్ని రిక్షాలో కూర్చో పెట్టుకొని తానే రిక్షా తొక్కిన మానవీయ మూర్తి .రిక్షా దిగగానే అందరూ ఇచ్చే మామూలు కూలి కంటే కనీసం మూడు రెట్లు డబ్బు ఇచ్చి పంపే వారు .
హాస్పిటల్ లో పని చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగి కి అప్పు తీసుకొనేటప్పుడు గారంటీ సంతకం పెట్టమంటే ఆలోచించ కుండా సంతకం పెట్టేసే వారు .ఆ డబ్బులు అసలు వాడు చెల్లించక పొతే ఈయనే చేతి చమురు వదిలించుకొన్న సందర్భాలెన్నో ఉండేవి .పేషెంట్లను ఆప్యాయం గా పలక రిస్తూ వ్యాధి లక్షణాలను పూర్తిగా వివరం గా తెలుసుకొంటూ సరైన మందులను సూచిస్తూ మానవత్వం తో ప్రవర్తించేవారు .అందుకని నిర్ణీత సమయం లో ఎక్కువ మందిని చూడటం కుదిరేదికాదు .మిగిలిన డాక్టర్లు త్వర త్వరగా పేషెంట్ లను చూసి గబా గబా మందులు రాసి పంపించే వారు . దీనికి బాస్ అభ్యంతరం చెప్పి‘’ప్రొమోషన్ ‘’ఇవ్వలేనని అన్నాడు .మందులను రాయటానికి డాక్టర్ శర్మ గారికి అభ్యంతరం లేదు కాని అది చిట్ట చివరి అంశం అనే వారు .మాటలతో, ఓదార్పు తో రోగులకు ఉపశమనం కల్గిం చాలే తప్ప మందులతో కాదు అని నమ్మి అలానే ప్రవర్తించారు .
బంధువులందరితో ఏంతో ఆప్యాయం గా .పెద్దలలో పెద్దగా, పిన్నలలో చిన్నవాడి గా ఉంటూ సందడి చేస్తారు శర్మ గారు .అందరికి అనురాగం ఆత్మీయతలను పంచిపెట్టే కుటుంబి .మమతానురాగాలు మూర్తీభవించిన మూర్తి మత్వం శర్మ గారిది .మనుష్యులంటే వల్ల మాలిన ప్రేమ .దేనిలోనైనా సంపూర్ణత సాధించటం అయన ధ్యేయం .ఈ డాక్టర్ దంపతులు ప్రస్తుతం విశాఖ పట్నం లో స్థిరపడి ఉంటున్నారు .శ్రీమతి అన్న పూర్ణాదేవి గారితో వారి దాంపత్యం ఆదర్శ ప్రాయమైనది .సంపూర్ణ ఆరోగ్యం తో ఆ దంపతులు అన్యోన్యం గా జీవిస్తున్నారు ..ఇలాంటి వ్యక్తిత్వం ,అర్హత ఉన్న, మానవత్వం మూర్తీభవించిన ప్రేమ మూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటం ఏంతో సముచితం అని భావిస్తున్నాం .వారి బావ మరది శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఇది ఎంతో సంతృప్తి నిస్తుందని భావిస్తున్నాం .. సరస భారతి స్థాపించి నప్పటి నుండి శర్మ గారికి సంస్థ తోనూ ,నాతోనూ పరిచయం ఎక్కువైంది .. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మెచ్చుకొంటూ ఫోన్లు చేస్తూంటారు .సరసభరతి ప్రచురించిన ”శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ”పుస్తక ముద్రణకు అడగ కుండానే అయిదు వేల రూపాయలు భక్తీ తోవిరాళం సమర్పించిన సహృదయ సుమనస్కులు . అందుకే ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’‘డాక్టర్ శర్మ గారి 90వ జన్మ దినోత్సవం రోజు 28-8-2014న అంకిత మిచ్చి సరసభారతి ధన్యమైందని భావిస్తున్నాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-14-ఉయ్యూరు