ముచ్చట్లు ”పై సమీక్ష – ”కీర్తి చంద్రికలు” – డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్

కీర్తి చంద్రికలు                       డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్

‘’తే వంద్యాస్తే మహాత్మనః -తేషాం లోకే స్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని –ఏచ కావ్యే ప్రకీర్తితాః ‘’

లబ్ధ ప్రతిస్టూ లైన కవి చంద్రులు వారి కావ్య శోభిత  వెన్నెల కాంతులతో సదా ప్రకాశిస్తూనే ఉంటారు .

‘’More words ,but O ,how crystal clear they shine –How like the chime of silver bells they are

A voice for those who have no voice at all –A song sung in the dark ,and heard afar’’

‘’కవిత్వం మానవ హృదయాలను స్వర్గ తీరాలకు ఉప్పొంగ జేసి ఆ భగవానుని నేలపై అవతరించేట్లు చేయ గలుగుతుంది ‘’అంటుంది గ్రేస్ నొల్ క్రాం వెల్ .

దివ్య లోక ప్రేరణో,జీవితానుభావమో కవిలోని కవిత్వ ఝరిని జాలు వారించగా ,జీవితానికి ప్రతీకమైన సంగీతం కవిత్వానికి పూవుకు అబ్బిన పరిమళం లా ,సెల ఏటి గలగలలా రూపొంది మధురాను భూతిని కలిగిస్తుంది .

‘’God is the author ,and not man –He laid the key note of all harmonies –He planned all perfect combinations and He made us so that we could hear and understand ‘’.

సంగీతం దైవ సృష్టి. ప్రక్రుతి నుంచి దానిని రవ్వంతైనా గ్రహించడానికి మనం ప్రయత్నిస్తే ధన్యులమవుతాము .కవులకు ఆశక్తి జన్మతః లభ్యమవుతుందేమో !వాళ్ళు ‘’రవి గాంచని వాటిని ‘’కూడా గ్రహించి సామాన్యులకు కవితా రూపాన అందించిన చిరస్మరణీయులౌతారు .

కవిత్వాన్ని చదివి కవి జీవితాన్ని అర్ధం చేసుకోవడం ,కవి జీవితాన్ని చదివి అతడి కవిత్వాన్ని పునర్యానించడం ,విమర్శకుల విశ్లేషకుల కున్న విచిత్రమైన వ్యాపకం .సాధారణ పాఠకులు కవిత్వాన్ని ఆనందించి ,తమ తమ వ్యాసాల్లో మునిగిపోతారు .కవికి పేరు ప్రతిస్టలోచ్చాక విమర్శకులు ఆ కవి పూర్వాపరాల ఆచూకీ లో రంద్రాన్వేషణలు చేసి అతడు ప్రస్తుత ఉన్నత స్తితికి కారణాలు కనుగొని ప్రపంచానికి వెల్లడి చేసి సంతృప్తి పొందుతారు .మహా కవి అన్నట్లు ‘’ప్రైవేటు జీవితాలు వారి వారి స్వంతం .పబ్లిక్ లోకి వస్తేనే ఏమైనా అంటాం ‘’.

కవుల పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా అతడు లేక ఆమె దృక్పధాన్ని ఆర్ధిక ,సామాజిక ఇతర పరిస్తితుల్లో మారిన దృక్కోణాన్ని ,వయసు తో వచ్చే పరి పక్వతను ,సామాజిక స్తితి గతుల్ని అంచనా వేయ వచ్చు .అలాగే కవుల జీవితాన్ని పరిశీలించటం వలన వారి కుటుంబ జీవనాన్ని ,వాళ్ళు ఎదుర్కొన్న ఒడి దుడుకులను ,వారి కవిత్వ కడలి ఆటు పోట్లను అర్ధం చేసుకో వచ్చు .

Louis Untermeyer తన ‘’Lives of the poets’’అనే దాదాపు ఏడు వందల పేజీల గ్రంధం లో ఒక సహస్రాబ్ది లోని ఆంగ్ల ,అమెరికన్ కవుల జీవిత చిత్రాల్ని ముప్ఫై భాగాలుగా వర్గీకరించి Geoffrey Chaucerనుంచి Dylan Thomas వరకు నూట ఇరవై అయిదు మంది కి పైగా కవుల జీవితాల్నిసంక్షిప్తం గా పాఠకుల దృష్టికి తీసుకు వచ్చినాడు .

వాటిని 55 భాగాలుగా విఖ్యాత రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ప్రేరణ తో తేనె లోలికే తీయని తెలుగు భాష లోకి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ,సరళ సుందరం గా ,సహజ ప్రవాహ ధోరణిలో అనువదించి సరసమైన శీర్షికలతో తెలుగు పాఠకుల ముంగిటి లోనికి తీసుకు రావడం ముదావహం ,అభినంద నీయం ,శ్లాఘ నీయం .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి వైద్యులు ,కవి ,అనువాదకులు అయిన శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారి ఆశీస్సులు ,ప్రోత్సాహం లభించటం అదృష్టం .

‘’అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతి ష్టితం –మృత్యు రాపద్యతే మోహాత్ సత్యే నా పద్యతే మృతం ‘’

మోహము వలన మృత్యువును ,సత్య దర్శనము వలన అమృతాన్ని మానవులు పొందుతున్నారని విజ్ఞులు చెబుతారు .వెయ్యేళ్ళ ఆంగ్ల కవితా మూర్తుల జీవిత సత్య దర్శనాన్ని కవిత్వామృతాన్ని ,జీవన సారార్ధాన్ని మనం ఈ పుస్తకం ద్వారా పొంద గలుగుతున్నాము .అందుకు మనం శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి శాశ్వతం గా రుణ పడి ఉంటాము.

As they sang –

Of what I know not ,but the music touched Each cord of being –I felt my secret  life stand open to it as the parched earth yawns to drink the summer rain – ఆ విధంగా కవి చంద్రుల వెన్నెల కిరణాల నార గించ టానికి  తహ తహ లాడే చాతక పక్షులం మనం .

     క్రీ .శ.1340లో చాసర్ జన్మించాడు .అంతకు ముందు ఆంగ్ల కవిత్వం లేదా?(వీళ్ళకూ మన తెలుగు వాళ్ళకూ గొప్ప పోలిక లున్నాయి ఈ విషయం లో ).Stone lenge లాంటి బృహత్ శిలా నిర్మాణాలు గావించిన ఘనత కలిగి  క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన ట్రాయ్ యుద్ధం లో (Trozen war)పరాజితులు పక్షాన ఉన్న ఎయినీస్(Aenes)యుద్ధ సమా ప్తికాలం లో తప్పించుకొని ,రోమన్ రాజ్య మూల పురుషుడి గా రూపొందటం అతని మనుమడైన బ్రూటస్ వంశీకులే బ్రిటన్లు గా తామర తంపరగా వృద్ధి చెందటం చరిత్ర విషయాలే అయినా ,అప్పటి నుంచి క్రీ శ .14వ శతాబ్దం వరకు ఆంగ్లం లో కవిత్వ సంపద లేదనడం సమంజసం గా తోచదు .అయితే ఆనాటి  ఆంగ్ల భాష లోనే పండితులకు భాషా కోవిదులకు తప్ప అన్యులకర్ధం కానట్లు ఉంటుంది .

ఆదికవి ఎవరు ?నన్నయ భట్టారకుడా ,కాదా అని మనం తర్జన భర్జనలు పడుతున్నట్లే ,అక్కడా కొంత గొడవ ఉంది .Anglo –saxon సాహిత్యం లోBeowulf, Caedmon  వ్రాత ప్రతులు The sea farer,The wanderer ,wid sith ,The dream  of the road ‘’వ్రాత ప్రతులు ఇప్పుడు మ్యూజియం లలో భద్ర పరచ బడి ఉన్నాయి .అంతకు  ముందున్నదంతా మౌఖిక సాహిత్యమే .జానపద వీరుల (Heroic) భక్తీ (devotion),కవిత్వం ఆ రోజుల్లో ప్రాచుర్యం లో ఉండేది .

ఆధునిక ఆంగ్ల సాహిత్యం Geoffrey Chauser తో ప్రారంభమైందని చెప్ప వచ్చును .’’He is the father of English poetry and perhaps the prince of it ‘’అంటాడు John Dryden .మానవుల బాహ్యాంత రంగాలు క్షుణ్ణంగా తెలిసిన catalyst గా ,The Canterbury tales’ తో గత ఏడు వందల ఏండ్లుగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్న కవి గాయకుడు Geoffrey Chauser .The Canterbury tales  చదివినప్పుడల్లా నాకు మన కాశీ మజిలీ కధలు ,గుర్తు కోస్తుంటాయి .

Pearl poet –William Langland  జనకవి .నిరంకుశత్వం పై నిరసన తెలిపిన వాడు .భాష ప్రజా బాహుళ్యం దగ్గర గా ఉండి ,,మన తిక్కనా మాత్యుడి లా జనానికి చేరువైనాడు .స్కాటిష్ చాసరియన్లు చాసర్ కు వీరాభిమానులు .వీరు చాసర్ గురించి గొప్ప గా చెప్పుకున్నారు .వీరి తరువాతి కవులలో రాజ కవి మొదటి జేమ్స్ (1394-1437)మన కృష్ణ దేవ రాయలు లా కవి ,గొప్ప రాజు .The king;s Quair రచించి ప్రసిద్ధి కెక్కినాడు .తరువాతి కాలం ‘’Miracles and moralities ప్రాముఖ్యత ఉన్న సాహిత్యం ,నాటక రంగం లో అడుగు పెట్టింది .బైబిల్ విషయాల ప్రధాన అంశం కాగా ,ముద్రణా యంత్రం (Gutten Berg)రాకతో 1477లో caxton తొలి ఇంగ్లీషు పుస్తకాన్ని ముద్రించాడు .కవిత్వం ఎల్లలు దాటింది .బంధనాలున్న మత సాహిత్యాన్ని నిరసించి ,మకార త్రయం (మగువ ,మద్యం ,మంచిపాట)తో కూడిన goliardic verse (gula –gluttony –తిండి పోతు )ప్రాచుర్యం లోకి వచ్చింది .

భారత కవిత్రయం ప్రశస్తి తగ్గి స్వంత గొంతు వినిపించే నేపధ్యం వచ్చి నట్లు శ్రీ నాధుడి లాంటి కవి జాన్ స్కేలిటన్ (John skeleton )1460లో పుట్టి ,ఎనిమిదవ హెన్రి  కు ఆస్థానకవి గా గౌరవింప బడి ,రాజుతో కలిసి రాజ భోగాలను అనుభవించిన వాడితడు .నాలుగు దీర్ఘాక్షర సముదాయపు ఛందస్సు తో  (skeltonic  meter)గా సద్యోగర్భిత భావ జాలం తో తన తరువాతి తరాలను కూడా ప్రభావితం చేశాడు .శ్రీనాధుడి సీస పద్యం ,జాన్ స్కెల్టన్  Skeltonic meter శాశ్వత కీర్తి దాయకాలే .ఇతడి జీవితమూ శ్రీ నాధుడి జీవితం లా చరమాంకం కస్టాల పాలైంది .

పద్నాలుగు పంక్తుల sonnet ను లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్ లోకి తెచ్చి సుందరీకరించిన కవిగా wytt సంక్షిప్త త కు ప్రాధాన్య మిచ్చే ‘’Blank verse’’కు ఆద్యుడు .Surrey (Henry Howard)ఇద్దరూ ఆంగ్ల కవితా ఛందస్సు ,శైలి ని మార్చిన మొదటి సంస్కర్తలు .-జంట కవులు .వీరి జీవిత చరిత్ర అత్యద్భుతం గా ఉంటుంది .సర్రే ను 30వ ఏట శిరచ్చేదం చేశారు .

సాహస నౌకా యాత్రికుడు Sir walter Raleigh ,కవులకు కవి Edmund Spenser కవిత్రయం Sidney ,Daniel ,Dray ton ,జగదేక సుందరి హెలెన్ ను ‘’is that the face that launched thousand lips?’’ అని కీర్తించి జగత్ప్రసిద్ధి కెక్కిన ‘’The muses’’,Darling –Christopher Marlowe(వాణి నా రాణి అన్న పిల్లల మర్రి పిన వీర భద్రుడు గుర్తుకు రావడం లేదా?)-వీరి జీవితాలను ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు కమనీయం గా  వర్ణించారు .

ఇప్పుడు ఆంగ్ల నాటక కవితా పితామహుడు –William Shakespeare జగమెరిగిన బ్రాహ్మణుడికి  జంధ్య మేల?విశ్వనాధ సృష్టి మనకేలాగో ఇంగ్లీషు భాష పరిచయం ఉన్న ప్రతి వారికీ షేక్స్ పియర్ సృజన అలాంటిదే .’’take all my loves ,my love ,yea take them all –loves fire heats water,-water cools not love ‘’మూడు భాగాలలో షేక్స్ పియర్  జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తామీ  గ్రంధం లో .

కాలం ముందుకు సాగి పోతూనే ఉన్నది .’’man is the beauty of the world ,the paragon of animals ‘’అన్న భావన స్పష్టమైంది .ఎలిజ బెత్ శకం అంతరించింది .తళుకు బెళుకు యుగం ప్రారంభమై,మొట్ట మొదటి రాజాస్థాన కవి Ben Johnson ,యువకవి Thomas Nashe ,పాటల కవిCampion జంట కవులు .Beaumont, Fletcher ల  రోల్ద్ గోల్డ్ తళుకుల  కాలమది .

పది హేడవ శతాబ్దం మెటాఫిజికల్ (మెట్ట)వేదాంతపు కాలం .John Donne ( మృత్యు కవిత్వం  )John Herbert ( బంధ కవిత్వం –Anagram).Richard Crashaw ,Abraham Cowley ,Henry Vaughan ,Thomas Traherne ల కవిత్వం తో ఈ యుగం పరి సమాప్తికి వచ్చింది .

ప్యూరిటన్లు అనబడిన రంద్రాన్వేషకుల కాలం చార్లెస్ రాజు –ఆలివర్  క్రాం వెల్ల మధ్య విద్వేషాగ్నులు రగిలినప్పడిది .క్రాం వెల్ ను బల పరచి సుఖాలు ,కస్టాలు పడ్డ కవి .John Milton . అతడి Paradise Lost and Paradise regained అందరికి తెలిసినవే .అని బద్ధ కవితా పిత –A verbal Wizadry జాన్ మిల్టన్ .

John Dryden ,John Wilmont  కవయిత్రులైన Cavendish ,Aphra  Behn, Anne  French లు .ఆ తర్వాత అలేక్సాండర్ పోప్.సొగసు ,లాలిత్యాల పతన కాలం లో Samuel Johnson  ఇత్యాదులు .బ్రిటన్ జాతీయ గీతాన్ని రచించిన James Thompson  కాపీ కవి గా పేరు బడి (forgery) ఆత్మ హత్య చేసుకున్న Thomas  Chatterton .ఆ తర్వాత స్వర్గ నరాకాలను అను సంధానం చేసిన చిత్ర శిల్ప కవి William Blake (ఈయనలో హాలిక కవి ,భక్త కవి పోతన ఛాయలు కని  పిస్తాయి )ముఖ్యులు .

మరో హాలిక కవి Robert Burns ,ప్రక్రుతికవి William Words Worth  నల్ల మందు మత్తు లో అజరామరమైన కవిత్వాన్ని అందించిన Coleridge . వీళ్ళతో కలిసి భూతల స్వర్గం స్తాపించాలను కున్న (Utopia),Robert Southey  మనకు శ్రీ శ్రీ ,తిలక్ ,నారాయణ రావు లను గుర్తుకు తెస్తారు .

శేషేంద్ర శర్మ లాంటి Lord Byron లేక బైరన్ లా శేషేంద్ర ,P.B..Shelley (కృష్ణ శాస్త్రి ) John Keats (దాశరధి ),Robert Browning (పాను గంటి).పందొమ్మిదవ శతాబ్దపు చీకటి వెలుగుల్లో తళుక్కుమన్న Tennyson (గురజాడ).నవలా కారిణి Emily Bronte (హేమలత ) ముని కవి Mathew Arnold (జాషువా ),Rosetti  ,swin Burne ,Thomas Hardy  లాంటి కవుల అనంతరం కవిత్వ కాల రధం కొత్త ప్రపంచం లోకి ప్రవేశించింది .

Bryant ,Emerson ,Long fellow ,Edgar Allen Poe ల సమకాలీనులు వేమన ,కాళోజి లాంటి walt Whitman  ఆత్రేయ లా మనసు కవులు .Emily  Dickenson ,Gerald Hopkins ,వచనమే  ఎక్కువ  రాసిన Rudyard Kipling ,మొదటి నోబెల్ బహుమతి పొందిన ఐర్లాండ్ కవి William Butler Yeats (సి .నారాయణ రెడ్డి ).వీరితో ఆంగ్ల కవితా వనం రమణీయ పుష్పోద్యానవనమై భాసిల్లింది .

అమెరికాలో E.A .Robinson ,Robert Frost ,Carl sand burg, Lindsay .ఇంగ్లాండ్ లో Mase field ,Lawrence ,అమెరికా స్టైలిస్ట్ కవులు .Ezra Pound ,T.s .Eliot లు ప్రసిద్ధి కెక్కారు .యాంత్రిక యుగ  విజ్రుంభణం ఇంగ్లాండ్ ,అమెరికాలు ప్ప్రపంచాన్ని శాశించే స్థితికి చేరుకొని ,అభి వృద్ధి చెందిన దేశాలుగా  మారినాయి .

రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజలలో ఆందోళనలను పెంచాయి .అదే కవులలో నూ ప్రతి బింబిం చింది .యుద్ధ కవులు (war poets),శాంతి కవులు ,దిగంబర కవులు ,నిరంతర కవులు లాంటి వాళ్ళు దాదాపు రెండు వందల మంది ప్రసిద్దులయ్యారని (మనమను కొంటున్నట్లే )అనుకున్నా ,ఒక పద హారు మందిని తరువాతి తరాలు గుర్తుంచుకో వచ్చు .వారిలో Auden ,Spender ,Empson ,Sitwell ,Wilfred Owen ,Graves ,Wallace Sterns ,Williams ,Marianne Moore ,Ranson ,Conrad Aiken ,Arch bald  ,Macleish  ,E.E..Cummings  ,Hart Crane  ,Robert Lowell ,Dylan Thomas లు అగ్ర గణ్యులు .

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’(Lives of the Poets )అనే గ్రంధాన్ని తెలుగు లోకి తీసుకు రావటం ఓ సాహసం .యజ్ఞం .ఎంతో పుణ్యం చేసుకున్న వారికే ఇటు వంటి అదృష్టం లభిస్తుంది .

‘’యజ్న దాన తపః కర్మ నత్యాజ్యం కార్య మేవ తత్ –యజ్ఞో జ్ఞానం  తపశ్చైవ ,పావనాని  మనీషిణాం ‘’అని  భగ వానుడు గీత 18-5-లో వచించాడు .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ఈ మహా యజ్ఞాన్ని అద్భుతం గా నిర్వహించి నారు .

మన తెలుగు కవులపై కూడా ఇటు వంటి గ్రంధం రావాల్సి ఉన్న ఆవశ్యకత ను గుర్తు చేయడానికే అక్కడక్కడా నేను పోలికలు వాడినాను ..అవి నా దృక్కోణానికి పరిమిత మైనవి .

ఈ గ్రంధం ద్వారా రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,వారికి ప్రోత్సాహ మిచ్చిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ,గ్రంధాన్ని  అంకితమొందుతున్న  డాక్టర్ శ్రీ రాచ కొండ నరసింహ శర్మ గారు ధన్యులైనారు .ఈ కొద్ది మాటలు వ్రాసే అవకాశమిచ్చి నందుకు నేను వారికి సర్వదా కృతజ్ఞుడిని .

ఆంగ్ల కవుల కవిత్వాన్ని ,కవి జీవితాన్ని సాదికారికం గా అర్ధం చేసుకోడానికి ఈ గ్రంధం ఉపకరిస్తుందని ,తెలుగు భాషా ప్రియులు ఈ ప్రయత్నాన్ని విశేషం గా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను .

‘’సర్వ స్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు –సర్వః సద్బుద్ధి మాప్నాతు సర్వః సర్వత్ర నందతు ‘’ ‘

ఓం   శాంతిహ్ శాంతిహ్ –శాంతిహ్

డాక్టర్ లంకా శివ రామ ప్రసాద్

8-7-14-

వరంగల్ ,కరీం నగర్ .

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.