పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు

నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే కనిపించి ఆ జీనియస్ కు జేజేలు పలికించింది .నాకు చాలా నచ్చిన నేను ఇప్పటి వరకు వినని నా దృష్టికి రాని అమూల్య సాహితీ సంపద వాటిల్లో గోచరించింది .ఈ తరం వారికి అసలు తెలిసిఉండని సంగతులవి .అందుకని ఆ వ్యాసాలలో ని ముఖ్య విషయాలను మీ అందరికి తెలియ జేయాలనే తలంపుతో పై శేర్షికను ప్రారంభించాను .వీటిలో నన్ను బాగా ఆకర్షించింది ‘’త్యాగయ్య గారి ‘’పై ‘’అయ్యగారి’’ వ్యాసం .దానికి వారు పెట్టిన పేరు ‘’నాదమయుడు –త్యాగ రాజు ‘’.నేను దానిని ‘’నాద త(ధ)నువు –త్యాగయ్య’’ శీర్షిక తో వివరిస్తున్నాను .

నాద త(ధ)నువు – త్యాగయ్య

కర్నాటక సంగీతం అనే పేరు ‘’పురందర దాసు ‘’కాలం నుండి ఏర్పడి ఉండవచ్చు .దాసు గారికి ముందు ‘’మాయా మాళవ గౌళ ‘’లో స్వర సాధన చేసే పధ్ధతి ఉన్నట్లు లేదు .పురందరులు కీర్తనలు రాసి ‘’దాసర కూటములు ‘’మొదలు పెట్టటం తో అప్పటివరకు ‘’గాసట బీసట ‘’గా ఉన్న సంగీతానికి వేష పరిపుష్టి కలిగింది.రసికులైన ‘’అరవలు ‘’పౌష్టికత తోపోగు చేసిన గానాన్ని ‘’దాక్షిణాత్య సంగీతం ‘’గా చెప్పుకొంటారు .   రాగ కర్త స్వయం సృష్టి వలన వ్యక్తికీ వ్యక్తికీ భేదాలు రావటం సహజం .ఎవరు పాడినా రాగ భావాలను మార్చటానికి వీలు లేదు. దాక్షిణాత్యులు సంగతులు జోడించి స్వరకల్పన చేసి స్వర పంపకం చేసినా ధ్యేయం ఒకటే .రాగం లో లాగానే స్వర సమ్మేళనం లో కూడా భావాన్ని చూపించటం .కాని వాళ్ళు తమది ప్రత్యెక బాణీ అనే చెప్పుకొంటారు . ఈ రెండిటి పరిణామం ఒక్కటే .సంగీత సంప్రదాయానికి ‘’అర్చవతారుడు ‘’ఐన త్యాగయ్య నుండే ఈ సాదృశ్యం ఇంకా పెరిగింది .

దాక్షిణాత్య సంగీత మూల విరాట్టులు ముగ్గురు .వీరిలో గుణము ,కాలము చేతకూడా త్యాగరాజు గారు  సర్వ ప్రధములు  .వీరి తర్వాత నాద సుధారస సారాన్ని అను భావించిన వారంతా వీరిని’’త్యాగ బ్రహ్మ ‘’అనే పిలిచారు .వారిపై ఎంతటి గౌరవమో అంతటి ప్రేమ వారిది .రెండవ వారు ముత్తు స్వామి దీక్షితులు .వీరి తండ్రి రామ స్వామి దీక్షితులు .అతి ఉదాత్తమైన ‘’హంస ధ్వని ‘’రాగాన్నిదీక్షితులు  పాడి ప్రచారం లోకి తెచ్చారు .తిరుత్తని లోని కుమార స్వామి దయతో ‘’సంగీత సార్వ భౌమత్వం ‘’అబ్బింది .అందుకే ‘’గురు గుహ ‘’ముద్రతో కృతులు రాశారు .వీరిది త్యాగయ్య సాహిత్యం అంత సులభం కాదు .రాగ సంచార పద్ధతీ క్లిష్టం గానే ఉంటుంది .పాండిత్యం మీద ఆసక్తి ఉన్న విద్వాంసులు దీక్షితార్ నే ఎక్కువ ఇష్టపడతారు .మూడవ మూర్తి శ్యామ శాస్త్రులు .వీరి రచనలు ‘’శ్యామ కృష్ణ ‘’ముద్ర తో ఉంటాయి. వీరికి ప్రచారం తక్కువే .దీక్షిత ,శాస్త్రుల ఉపాసనా పధ్ధతి  తాంత్రిక మైనది .అందుకే ‘’హృదయ ధర్మం ‘’వారిలో కనిపించదు .త్యాగరాజు గారికి ఉపాసనా విధానం ‘’చక్కని రాజ మార్గం ‘’.,’’పూజా కలాపం ,’’జపం ‘’.

త్యాగయ్య గారి భాష సులభం సుస్పష్టం .భాష వారి హృదయం అంత సరళం .ఇరవై నాలుగు వేల కృతులలో రామయణార్ధం అంతటినీ తెలియ జేశారట .మనకు మిగిలింది కొన్ని వందల కృతులే .అప్రసిద్ధ రాగాలలో కృతులు చేయాలనే ఆశ వారికి తక్కువ .ఎక్కువభాగం ఖర హర ప్రియ ,భైరవి రాగాలలోనే రాశారు .త్యాగయ్య గారికి ముందు గేయాలన్ని సాహిత్య ప్రధానమైనవి .అప్పుడు సంగీతం ఎలా ఉండేదో తెలియదు .అంటే అన్నమయ్య ,క్షేత్రయ్య ,రామదాసు రచనలలో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత సంగీతానికి లేదన్న మాట .కృతి అనే మాట సంగీతానికే కొత్త మాట .కీర్తనలలో పల్లవి చరణాలు మాత్రమె ఉంటాయి .అనుపల్లవి ఉండదు .పల్లవి అనుపల్లవి ,చరణం అనే ‘’అచ్చు కట్టు ‘’త్యాగయ్య గారు ఏర్పరచి ముద్దులు మూట కట్టారు .అప్పటి నుండి కృతి అనే పేరు వాడుక లోకి వచ్చింది .

త్యాగయ్య గారి ప్రతి  చరణం లోను వైవిధ్యం ఉంటుంది .అది చాలా మంది గాయకులూ తెలుసుకోకుండా పాడి ఖూనీ చేస్తూంటారు .త్యాగరాజ కృతులలో సమగ్ర సాహిత్యాన్ని మెప్పించిన వారు ‘’బిడారం కృష్ణప్ప గారు ‘’మాత్రమే. ‘’ముందు వేనుకలిరు ప్రక్కలతోడై –మురఖర హర రారా ‘’కృతిని అయ్యవారు దర్బారు రాగం లో రాస్తే మనవారు కొందరు ‘’మధ్యమావతి’’లో పాడి బుజాలేగారేస్తున్నారు .త్యాగరాజు గారు వైరి సమాసాలను ఎక్కువగానే ఉపయోగించారు ‘’బాపరామితమ తాపము ,లాందరు(లాంతర్)వంటి ఇతర దేశ పదాలు కూడా వాడారు .ఇవి మన వ్యవహారం లో ఉన్నవే .మిశ్రమ సమాసాలు శివకవుల నుండి వచ్చినవే .

త్యాగయ్య గారి సాహిత్యానికి స్పష్టత అనేది జీవ ధర్మం .గాయకులకూ శ్రోతలకు అర్ధమయ్యే భాషలోనే వాగ్గేయ కారులు రాయాలి .ఆరభి రాగం రజో గుణ ప్రధానమైంది .వీరరస ద్యోతకం .పంచరత్న కీర్తనలో ‘’సాధిం చెనే ‘’ఈ రాగం లోనిదే.ఇందులో సాహిత్యం నలిగిపోయింది .’’సార సార కాంతార చార మదవి-దార ,మందరాకార సుగుణ సుకు –మార ,మా రమణ ,నీరజాప్త కుల –పారావార సుధా రస పూర్ణ ‘’కృతిలో సంస్కృతం బరువెక్కువైంది .శ్లేష శబ్దప్రయోగాలూ చేశారు –‘’జనకజా మాతలి –జనక జామాతవై ‘’లో ..పరిణతి గాంచినది మొదలు రాముడికి కృష్ణుడికి భేదమే వారిలో నశించింది .కృష్ణ లీలలను వర్ణిస్తూ’’నౌకా చరిత్రం ‘’రాశారు .

శృంగారాన్ని చెప్పేటప్పుడు త్యాగయ్య గారు హద్దులు పాటించారు .ఇది అన్నమయ్య క్షేత్రయ్యలలో లేదు .పదాలతో రెచ్చగోట్టారిద్దరూ .త్యాగయ్య గారిది దాస్య భక్తీ . మధురభావ స్పర్శ అరుదుగా ఉంటుంది .ఆత్మోప లబ్ధికి సాహిత్యం సాధనమే కాని త్యాగయ్య గారికి మాత్రం సంగీతమే ‘’శరం ‘’.సంగీతజ్ఞానం విధాత  రాస్తే కాని అబ్బదు అని ఖచ్చితం గా చెప్పారు .పిలిస్తే చాలు రాముడు తన ముందు వచ్చి వాలిపోతాడనే దృఢ విశ్వాసం త్యాగ బ్రాహ్మది.

 

మన సంగీతానికి ‘’గాడిద గొంతు హార్మోనియం’’ దాపురించింది ‘’అని బాధ పడ్డారు ఆచార్యుల వారు .హార్మోనియం శ్రుతిలో గాత్రాన్ని పాడి పాడు చేసినవాల్లెందరో ఉన్నారంటారు .’’హార్మోనియం శృతి భక్షకుడు ‘’అని ముద్దుపేరు పెట్టారు పుట్టపర్తి వారు .తంబురా శృతి చేయటం మహా విద్య .గాయకుడు దాన్ని శృతి చేయటం లోనే అతని నేర్పును దాక్షిణాత్య సంగీత విద్వాంసులు గుర్తిస్తారు .

త్యాగయ్య గారి రాముడు ‘’నాద సుధారసము ఇలను నరాక్రుతి అయిన వాడు ‘’.’’స్వరములు ఆరాక గంటలు –వరరాగము కోదండము –దురాయణ దేశ్యము త్రిగుణము –నిరత గతి శరమురా –సరస సంగతి సందర్భము గల వేదములురా ‘’అన్నారు .సప్త స్వరాలే శ్రీరాముని శరాసనానికి కట్టిన గంటలు .అంతు లేని ఘన రాగం రాముని కోదండం .అలాంటిదే రాగాలాపం .ఒక సారి బిడారం కృష్ణప్ప అనే సంగీత విద్వాంసుడు ‘’కల్యాణి ‘’రాగాన్ని వారం రోజులు ధారావాహికం గా పాడారట .అప్పటికి మన ‘’’లిమ్కా ‘’రికార్డు రాలేదు .ద్వానా శాస్త్రి గారినాన్ స్టాప్ సాహిత్య ప్రసంగానికిముందే  బిడారం గారు గుడారం వేశారు .టైగర్ వరదా చారిగారు మనసు బాగా ఉండి గాత్రం పాడితే స్వర్గం దిగి వచ్చినట్లే .విన్న వారి జన్మ ధన్యమే .వీణ శేషన్న రాగం, తానం చేస్తూ తమ రాగ సంచారానికి తామే వలచి కన్నీటి తో వీణే పై బడి ఏంతో కాలం ఉండేవారు .ఒక సారి  తిరుపతిలో మేళ గాండ్రు’’ తోడి రాగాలాపన’’ రాత్రి అంతా చేసి రికార్డు సృష్టించారు .మన కూచిభొట్ల ఆనంద్  గారికి ఇవన్నీ ప్రేరణలేమో ?

నాద స్వరూపుడైన శ్రీరాముని గూర్చిపాడిద,పాడి త్యాగయ్య నాగ త(ధ)నువు ,నాద మయుడు అయ్యారు .త్యాగ రాజు గారి శివుడు ‘’వీణా లోలుడు ‘’’’సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమ పదవీవర సప్త స్వర విద్యాలోలుడు .’’త్యాగయ్యది మహత్తర సంగీత యోగం ‘’ప్రాణానిల సంయోగం ‘’.రాముడిని ‘’నాదస్వరం అనే నవ రత్న వేదిక పై కూర్చో బెట్టారు త్యాగ రాజు .’’నాదలోలుడై బ్రహ్మానంద మందవే మనసా –స్వాదు ఫల ప్రద సప్త స్వర గణ నిచయ సహిత ‘’అని విశ్లేషించారు .’’సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను చొక్కా జేయ దీరుడేవ్వడో ?’’అని ప్రశ్నించారు .శంకరాభరణ రాగం లో వారి స్వర పంపకం వారి హృదయం అంత సరళమైనది .

త్యాగ బ్రహ్మకు  సమస్తనాద స్వరూపం ఓంకారం గా నే భాసిస్తుంది .రుక్ సామాదుల్లోను ,గాయత్రీ హృదయం లోను సుర భూసుర మానసాలలోను ఒక్క ఓంకార నాదమే  అనుసృతం గా వినిపిస్తుంది వారికి .జీవిత పరిపక్వ దశలో త్యాగ బ్రహ్మ పరమోత్క్రుస్ట  స్తితిని అందుకొన్నారు .త్యాగయ్యే నాదం అయ్యారు  అందుకే నాద తనువు అన్నాను నేను .నాద ధనువు కూడా అన్నాను .అంటే నాద ధనుస్సునుండే రాగ శరపరంపరను వర్షించాడు .త్యాగరాజ సంగీతానికి మానవులతో  బాటు దేవతలూ ఆనందం పొందారు. త్యాగరాజు గారు సర్వ ప్రియులు ‘.అని నారాయణాచార్యుల వారు వ్యాసాన్ని ముగించారు . ఎన్ని విషయాలు ఎతానికి ఎత్తినట్లు ఎత్తి మనకందించారో ఆసరస్వతీ పుత్రులు .వారి విద్వత్తు కు ,విశ్లేషణకు  నా కై మోడ్పు లందజేస్తున్నాను .

సుమధుర స్వర హేల  ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ పెండ్యాల నా (రా )గేశ్వర రావు గారి 30వర్ధంతి సందర్భం గా –ఈ వ్యాసం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-14-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.