తెలుగు” చిత్ర ”సీమ ప్ర ”ముఖ ” -” ముఖ” చిత్రం-బాపు -రమణ అన్న నటుడు రచయితా -ఉత్తేజ్

తెలుగు ‘చిత్ర’సీమ ప్ర‘ముఖ’ చిత్రం …. బాపు, రమణ
బాపుగారు పోయి మూడేళ్లయింది. నిజం… ఉత్తి బాపుగారు మొన్నే పోయారు…. మూడేళ్లకిత్రమే వెంకటరమణుడితో ‘బాపు ఆత్మ’ వెళ్లిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.. రమణగారు పోయినప్పుడే …‘ఈయన మాత్రం ఎన్ని రోజులుంటాడు? రమణని వదిలి ఉండలేడు’ అని మనమంతా అనుకోలేదూ…
మూడేళ్ల క్రితమే… 
కలాన్ని బాపుకిచ్చేసి రమణెళ్లాడు
కుంచెను రమణకిచ్చేసి బాపు మిగిలాడు
అక్కడా.. అక్షరం లేని తెల్ల కాగితం
ఇక్కడా … గీత పడని తెల్లని కాన్వాసు
తెల్లగా.. శూన్యంగా .. అసంపూర్ణంగా.. ఆవేదనగా..
పసుపూకుంకుమ, డోలూసన్నాయి, అమ్మాగోరుముద్ద, వానామబ్బు, చంద్రుడూ ఆకాశం , వెలుగునీడా, కలం కాగితం, కుంచెకాన్వాసు, నదీ అలా, బుడుగు రెండుజెళ్ల సీగానపసూనాంబ, బాలూ పాటా, బాపురమణ…. వీటిని విడివిడిగా ఎలా చూడగలం.. ఎలా రాయగలం, ఎలా మాట్లాడగలం…. రెండూ కలిస్తేనే అందం.. ఆనందం.
ఇద్దరూ ఒక్కరే.. తెలుగుదనం.. తెలివిధనం.
మన తెలుగాస్తి ఆ ఇద్దరూ… మన స్థిరాస్తి ఆ ఇద్దరి ‘అక్షరాలు, నిశ్చలచిత్రాలు, చలనచిత్రాలు, గీతల చతురోక్తులు, రాతల మధురోక్తులు.
నవ్వించారు, కవ్వించారు, వలపించారు, మురిపించారు, మైమరపించారు, తెరిపించారు, తెలుగించారు, తడిపించారు. గుర్తు చేశారు.. గుర్తుండేలా చేశారు. తెలుగులో మునిగి తీశారు.. తెలుగులో ముంచి తీ(రా)శారు.. దృశ్యకావ్యాలిచ్చారు.. షడ్రుచులిచ్చారు.. కూసింత గర్వాన్నిచ్చారు, గర్వమై నిలిచారు. ఉదాహరణై వెలిగారు.. మిగిలారు. .. బాసింపేట వేసుక్కూర్చున్న తెలుగు అక్షరాలను లేపి, ఊపి ‘బాపు లిపి’ అందించారు, అందలమిచ్చారు.
తెలుగు సినిమాకు పదహారణాల తెలుగుతొడుగులేసి, తెలుగు వెలుగుల ‘సాక్షి’ సంతకం చేశారు. తెలుగు సినీ‘వంశవృక్షానికి’ తామింత తెలుగు సిరాపోసి, తెలుగు సిరిలోసి వటవృక్షంగా పెంచారు. తెలుగు సినిమా ముంగిట ‘ముత్యాలముగ్గు’లు తీర్చారు. తెలుగు సినిమా చరిత్రలోని పేజీలని ‘పెళ్లిపుస్తకం’లా మనతో తిరగేయించారు. తెలుగెత్తు మూర్తిమత్వాన్ని ‘భక్తకన్నప్ప’లై ఆరాధించారు. రెపరెపలాడుతున్న తెలుగు ‘గోరంతదీపాల’కి తెలుగు చమురోసి కొండంత వెలుగులందించి దారి చూపించారు. తెలుగు సినిమా తెరపై ‘రామాయణాన్ని’ అద్ది దృశ్య కావ్యగౌరవాలు ఆపాదించారు.
మన తెలుగూరి పాండవులు బాపూరమణలు
మన తెలుగందాల రాముళ్లు బాపూరమణలు
మన తెలుగంత బుద్దిమంతుళ్లు బాపూరమణలు
తెలుగు సాహిత్యమై ఎగసి, తెలుగుసినిమాలై మెరిసి అసామాన్యంగా ఎదిగి, సామాన్యంగా ఒదిగి… కుంచె పట్టుకుని ఒకరు, కలం పట్టుకుని ఒకరు.. చెట్టాపట్టాలేసుకు తిరిగీ, తెలుగు నీడన సేద తీరిన, సేద తీర్చిన స్నేహగాన కోవిదులు.. తెలుగమ్మ ముద్దుబిడ్డలు, తెలుగిళ్ల గారాల పట్టీలు, గౌరవాల జెట్టీలు.
అందుకే ఇరువురిలా కనిపించే ఒకే ఆత్మకు శాంతే చేకూరుతుంది.
తెలుగు అక్షరాలు ఏడుస్తున్నాయి.. ఒళ్లోకి తీసుకుందాం పదండి.
మనది భారతదేశం. మన దగ్గర ఆలయాలు, హిమాలయాలు, కృష్ణాగోదావరులు, భద్రాద్రి రాముడు, తిరుమలవేంకటేశుడు, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, భాగవతం, రామాయణం, బాపు, రమణ ఉన్నారు.
సముత్తిళ్లరాపూజుడి లవేంక్ష్మీకనాటరారయమణణ
విడివిడిగా రాయలేక
ఎటూ పాలుపోక
కన్నీళ్లతో.. జ్ఞాపకాలతో
-ఉత్తేజ్‌

సినిమా డైరెక్టర్‌ కంటే ముందు బాపు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్‌. ఎవరివద్దా పనిచేయకుండానే దర్శకుడయ్యారు. ఇది తెలుగువాళ్ల అదృష్టం. తెలుగు సంప్రదాయానికి, సంస్కృతికీ ప్రతీకగా ‘బాపు బొమ్మ’ చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది బాపు గీత గొప్పతనం. దాన్ని బట్టే ఆయన ఎంత గొప్ప కళాకారుడో అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడంటే ‘బాపు బొమ్మ’ను పాటల్లో రాసుకునేంత గొప్పవాడు. ఒక్కో జనరేషన్‌లో బాపు వంటివారు ఒక్కరే ఉంటారు. మహానుభావులు మాత్రమే భౌతికంగా వెళ్లిపోయినా, మనలో బతికే ఉంటారు. వాళ్లు లేరనే బాధ ఉండదు. బాపు గీసిన బొమ్మ, బాబు తీసిన సినిమా తెలుగుజాతి ఉన్నంతకాలం ఉంటాయి. కాకపోతే ఇకనుంచీ వారి నుంచి కొత్తగా అలాంటివి రావనే కించిత్‌ బాధ మాత్రం ఉంటుంది.
వాళ్లకు రుణపడిపోయా
1977 సెప్టెంబర్‌లో రాజేంద్రప్రసాద్‌ అనే అతన్ని తమ ‘స్నేహం’ చిత్రంతోనే వెండితెరకు పరిచయం చేశారు బాపు-రమణ. ప్రపంచంలో ఎక్కడా చూడని మహోన్నత స్నేహం వాళ్లది. ఆ సినిమా వచ్చిన 14 సంవత్సరాల తర్వాత ‘పెళ్లి పుస్తకం’ చేశా. ఆ సినిమా వచ్చిన తర్వాత నుంచీ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాళ్ల పెళ్లి జరిగినా అందులోని ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట వినిపించకుండా లేదు. ఆయన సినిమాల్లో నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా అదే. ఆ సినిమా చేయడం నాకు దక్కిన ప్రాప్తం. దానితో వాళ్లకు రుణపడిపోయాను. ఆ రుణాన్ని సంపూర్ణంగా తీర్చుకునే అవకాశం నాకు కలగలేదు. అది తెలుగు సమాజంపై చూపించిన ప్రభావం సామాన్యమైంది కాదు. ఎవరైనా భార్యాభర్తలు గొడవలుపడి, తన వద్దకు కౌన్సిలింగ్‌కు వస్తే వాళ్లకు ఓసారి ‘పెళ్లి పుస్తకం’ సినిమా చూడమని చెప్పేవాణ్ణని ప్రఖ్యాత సైకాలజిస్ట్‌ బి.వి. పట్టాభిరామ్‌గారు చెప్పారు. అదీ ఆ సినిమా గొప్పతనం.
ఆ ఇంటి బిడ్డనయిపోయా
బాపు ఎక్కువగా మాట్లాడరు. ఏమన్నా చెప్పాలనుకుంటే చెవిలో చెప్పేవారు. ఆయన చెప్పే విషయాలకు నవ్వకుండా ఉండలేకపోయేవాడిని. ఆయన కోపంగా, పరుషంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. మనం ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. కానీ ఇంతటి సౌమ్యుణ్ణి మనం ఎక్కడా చూసుండం. కళాకారుడిగా ఎంత గొప్పవాడో, నిజ జీవితంలో వ్యక్తిగా అంత గొప్పవాడు. అంటే గొప్ప మనీషి. ‘పెళ్లి పుస్తకం’లో నా పేరు కె. కృష్ణమూర్తి. అందుకే అప్పట్నించీ, ఇప్పటిదాకా నన్ను ‘కేకే’ అని పిలుస్తూ వచ్చారు. ‘కేకే’ అనే సంతకం ఎలా చేయాలో కూడా తన గీతల్లో నాకు చూపించారు. ఆ సినిమా నుంచే నేను ఆ ఇంటి బిడ్డనయిపోయా. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయకుండా పంపలేదు.
ఆ భాగ్యం కలిగింది
తెరపై భార్యాభర్తల అనుబంధాలను బాపు చూపించినంత అందంగా ఎవరూ చూపించలేదు. నేను నటించిన ‘పెళ్లి పుస్తకం’, ‘మిష్టర్‌ పెళ్లాం’ సినిమాలు అందుకు మంచి ఉదాహరణలు. నా కెరీర్‌లో ఆ రెండూ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. రామాయణం అంటే ఆయనకు పిచ్చి. సీతారాములన్నా, ఆంజనేయుడన్నా ఆయనకు విపరీతమైన భక్తి, ప్రేమ. ‘రాంబంటు’లో నా పాత్ర ఆంజనేయుడి పాత్రే. ఆ సినిమా నిర్మాతను నేనే. నేనే అంటే నా భార్య. బాపూ రమణలు ‘రాంబంటు’ను నా సినిమాగా కాక వాళ్ల సొంత సినిమాలా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తీశారు. అలాంటి గొప్ప సంస్కారవంతులను మనం మళ్లీ చూడలేం. ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదనే బాధ లేదు. టీవీలో ఎప్పుడు వేసినా దాన్ని జనం బాగా చూస్తూనే ఉన్నారు. వాళ్లతో ఆ సినిమా సొంతంగా తీసే భాగ్యం కలిగింది. అంతే చాలు.
వన్‌మోర్‌ వితౌట్‌ యాక్టింగ్‌
యాక్టర్‌ ఎవరైనా ‘నటిస్తున్నార’ంటే బాపు భయపడిపోతారు. ఎవరైనా పాత్రలో లీనమై సహజంగా ప్రవర్తించాలని కోరుకునేవారు. అందుకే ఇంకో షాట్‌ తీయాలనుకున్నప్పుడు ‘వన్‌మోర్‌ వితౌట్‌ యాక్టింగ్‌’ అనేవారు. దాంతో అర్థమైపోయేది, ఆయనకు నటన నచ్చలేదని. అందరూ అటెన్షన్‌లోకి వచ్చేవాళ్లు. ఆయన సినిమా షూటింగ్‌ అంటే కొట్టొచ్చిన్నట్లు కనిపించే ఇంకో విషయం, సెట్స్‌పై ఆయన తీసే సన్నివేశానికి సంబంధించిన శబ్దాలు తప్ప వేరే గోల వినిపించకపోవడం.
తెలుగుతనానికి చిరునామా
బాపు ఏ సీను తీసినా అందులో ‘అందం’ అనేది తప్పకుండా ఉంటుంది. తెలుగుతనమంటే అందం. ఆ అందాన్ని బాపుగారి చిత్రాలు కళ్లముందుంచుతాయి. ఎవరికైనా ఏదైనా సింపుల్‌గా, అందంగా, ప్రేమతో ఎలా చెప్పాలో బాపుగారి నుంచే తెలుసుకున్నా. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు ఆయనను ప్రేమించేస్తాం. ఆయనలా మనమూ ఉంటే, ఆయనలా మనమూ మాట్లాడగలిగితే ఎంత బాగుండునో.. అనిపిస్తుంది.
భగవంతుడి వరం
రమణగారు ఎప్పుడో దేవుడి వద్దకు వెళ్లిపోయారు. బాపుగారికి ఇష్టమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేను, మాలాంటి కొద్దిమందిమి అప్పట్నించీ భయపడుతూనే ఉన్నాం, ఈయనేమైపోతారోనని. అలాగే జరిగింది. ఎక్కువకాలం ఒంటరిగా ఉండలేక రమణగారి వద్దకు వెళ్లిపోయారు బాపు. అంతే మానవ జీవితం. ఎప్పుడో అప్పుడు మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ అలాంటి మహనీయులు, సంస్కారవంతులు మళ్లీ పుడతారా? అని దిగులు వేస్తుంటుంది. ‘బాపూ రమణలు నాకు తెలుసు, వారికి ఇన్నేళ్లు సన్నిహితంగా ఉన్నాను’ అని అనుకోవడమే భగవంతుడు నాకు ఈ జన్మకిచ్చిన వరం, నాకు దక్కిన అదృష్టం.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.