మన బాపు! |
మానవజాతిలో కళాకారులు సర్వోత్కృష్టులు. రససిద్ధులు. డబ్బూ, అధికారమూ అంటిపెట్టుకున్న వ్యక్తులు ఆ కొద్దిసేపే ప్రముఖులు. తర్వాత వారిని ప్రజలు మరచిపోతారు. కానీ రససిద్ధులయిన కళాకారులకీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. కీర్తికాయం ద్వారా వారు జరామరణ భయంలేని చిరంజీవిత్వాన్ని పొందుతారు. ఇది ప్రముఖ చిత్రకారుడు బాపు విషయంలో అక్షరసత్యం.
చిన్నికృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టిన యశోదలా, మూడు నాలుగేళ్ళ వయసులో అల్లరి చేస్తున్న బాపును ఆయన తల్లి స్తంభానికి కట్టిపడేస్తే, బొగ్గు ముక్కలతో గోడలమీద గీసిన బొమ్మలు తెలుగువారికి గీతోపదేశం చేశాయి. తొలి బొమ్మ బాల పత్రికలో అచ్చయి, అనంతరం ‘కవ్వపు పాట’కి జత కలవడంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్ట్‌గా చేరిన తరువాత ఆ కుంచె నుంచి జాలువ్రాలిన కార్టూన్లూ, బొమ్మలూ వేలు. జడగంటలు, జరీ అంచు తెల్లచీర, మామిడాకులు, ముత్యాలముగ్గులు, పసుపు కుంకుమలు, పారాణి తెలుగుతనానికి పర్యాయపదంగా బాపుతనం వెలసింది. తెలుగుబొమ్మలే కాదు, తెలుగు అక్షరాలు కూడా బాపుతనాన్ని పుణికి పుచ్చుకున్నాయి. గుండ్రంగా రాయడం రాక, ఓపిక లేక వంకరటింకర అక్షరాలను బాపు ఫ్యాషన్ చేశాడన్నాయి కాకులు. అవి అక్షరాలు కాదు ముత్యాల ముగ్గులన్నారు లోకులు. బాపు లిపి కంప్యూటరుకెక్కి తెలుగువారి రాతమార్చేసింది. బాపు రాత, గీత వంకరకాదు, చక్కదనానికి నిలువుటద్దం. సాక్షినామ సంవత్సరంలో (1967) దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సాక్షి’తో ‘బాపు ఫ్రేం’ దిశానిర్దేశం చేసింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్. కథానాయికకు కట్టూబొట్టూ మాత్రమే కాదు, కనుబొమలు అల్లార్చడాన్ని కూడా నేర్పిన అద్భుత దర్శకత్వం. ఎవ్వరి దగ్గరా శిష్యరికం చేయకుండా బొమ్మలు వేసినట్టే, దర్శకత్వంలోకి కూడా నేరుగా దిగి, యాభైకి పైగా తెలుగు, హిందీ, తమిళభాషల్లో తీసిన సినిమాలతో ప్రేక్షకహృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ సినిమాలు విజయం సాధించినా, పరాజయం పాలైనా పొంగిపోయిందీ లేదు, కుంగిపోయిందీ లేదు. మనిషన్నాక కాస్తంత హస్యప్రియత్వం ఉండాలనీ, అనడం అనిపించుకోవడం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందన్న ఫిలాసఫీని తూచ తప్పకుండా కడదాకా పాటించిన మనీషి. కనుకనే, సినిమాలు విజయం సాధించినప్పుడు ఎంత వినూత్నంగా ప్రకటనలు రూపొందించారో, ఖరీదైన సినిమాలు చావు దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఖర్చుపెట్టి ‘అంచనాలు తారుమారు చేసిన చిత్రం’ అని సృజనాత్మకంగా ప్రకటనలు ఇవ్వగలిగారు. ‘బంగారు పిచ్చుక’ సినిమా ఘోరపరాజయం పాలైనప్పుడు ఓ పిచ్చుక తలకిందులుగా నేలను తాకి కళ్ళు తేలవేసినట్టుగా కార్టూన్ వేయగలిగే ధైర్యం, హాస్యప్రియత్వం ఆయన సొంతం. కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడే కాదు, కథకుడుగా ఆయన మబ్బూ వానా-మల్లెవాసనా, అమ్మబొమ్మ వంటి కథలు రాశారు.
ప్రపంచతెలుగు మహాసభల సత్కారం దగ్గరనుంచీ మొన్నటి పద్మశ్రీ వరకు ఆయనకు ఏవో కొన్ని పురస్కారాలొచ్చాయి. రానివి చాలా చాలా ఉన్నాయి. ‘నువ్వే కనుక ఏ బెంగాల్లోనో, అమెరికాలోనో పుట్టివుంటే…’ అంటూ ఆప్తులు తరచూ వాపోవడం ఆయనలో అహాన్ని పెంచలేదు. అనేక దశాబ్దాల పాటు పాతికాముప్పయిలకు కథల బొమ్మలూ, వంద రూపాయలకు కవర్ పేజీ బొమ్మా వేసుకుంటూ బతుక్కొచ్చినా, అందమైన ముఖచిత్రాలను గీయించుకొని అనంతరం ప్రచురణ కర్తలు మొఖం చాటేసినా, ఈ తెలుగునేలమీద ఆయన అలిగింది లేదు. పైగా ఇక్కడ పుట్టడం తన అదృష్టమనీ, ‘పూర్వ జన్మ సుకృతశుభం వలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువల్ల గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింద’నీ చెప్పుకున్న వినయ సంపన్నుడు. ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకే చెల్లింది. ఎంత ఒదిగినా కాలం కనికరించలేదు. ముందు మిత్రుడు ముళ్ళపూడిని, తర్వాత భార్య భాగ్యవతిని తీసుకుపోయి ఆయన్ని ఒంటరిని చేసింది.
బాపు రామభక్తుడు. రామాయణాన్ని పదిసార్లు పలువిధాలుగా చిత్రీకరించడమే కాదు, రాముని తలంపులు ఆయన్ని నిత్యం వెంటాడుతూండేవి. ‘ఎంతవాడైనా తన మంచీ గొప్పా తాను చెప్పుకోవాల్సిందే కానీ, ఇంకోడికి ఆ పని అప్పగిస్తే మనసు పెట్టి చేయడు. అందుచేత రాముడే త్యాగరాజస్వామిగా పుట్టి తనివితీరా కీర్తనలు కట్టాడు’ అంటూ అంతర్మథనంలోంచి పుట్టిన ఓ ఆలోచన మిత్రుడికి చెప్పి నవ్వేశారట బాపు. మరి ఈయన సంగతేమిటి? ఇంటర్వ్యూలంటే విముఖత. సన్మానాలంటే ససేమిరా. వేదికలెక్కడానికి వెనుకంజ. లాక్కొచ్చి కూర్చోపెట్టినా, మొహమాటంతో మెలితిరిగిపోతూ, కుర్చీలో ఓ మూలకు ఒదిగిపోతూ, తలెటో తిప్పుకొని కూర్చొనే సిగ్గరి. నువ్వు సామాన్యుడివి కాదంటూ ఎవరెంతగా ఆకాశానికెత్తేసినా చెవులకు సోకదు. మనసుకు పట్టదు. పొగడ్తలకు విమర్శలకు అతీతంగా ఉంటుంది ఆ మోము. మైకు ముందు మాట్లాడటం మరీ తప్పనిసరి అయితే ముక్తసరిగా మూడుముక్కలతో సరిపెట్టి దణ్ణం పెట్టి దిగిపోవడమే. మరి, త్యాగరాజస్వామిలాగా ఎప్పుడు పుడతారు మహానుభావా? |
|
|