ఊసుల్లో ఉయ్యూరు -55
మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు
ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం .గురుపూజోత్సవం .మహా తత్వ వేత్త ప్రాక్ పశ్చిమ తత్వ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి తులనాత్మక తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసి అందులో మన ఉత్కృష్ట తను నిర్ద్వందం గా ఆవిష్కరించిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జయంతి రోజు .ఇంతటి పవిత్రమైన రోజున నా చేత అక్షరాలూ దిద్దించి ,అక్షరాభ్యాసం చేయించి ,కన్న కొడుకుగా నా చిన్నతనం లో ఆదరించి అక్షర భిక్షా దానం చేసిన మా గురుదేవులు ,గురు బ్రహ్మ స్వర్గీయ కోట సూర్యనారాయణ మాస్టారు గారి ని సంస్మరించటం నా విధి గా భావిస్తున్నాను .ఇంతకాలం విస్మరించినందుకు వారికి క్షమాపణలు చెప్పుకొంటున్నాను .మాటల్లో రాయటం మరచినా మనసులో వారు కొలువయ్యే ఉన్నారు .వీలైనప్పుడల్లా వారిని నేనూ,వారి ప్రియ శిష్యులు ప్రస్తుత అమెరికా వాసి శ్రీ మైనేని గోపాక క్రిష్ణయ్యగారు గుర్తు చేసుకొంటూ నే ఉన్నామని సవినయం గా మనవి చేస్తున్నాను .
ఉయ్యూరులో రాజ గారి కోట బజారులో మెయిన్ రోడ్ కు వెనక మా మండువా పెంకుటిల్లు ఉంటుంది . మా ఇంటికి ఉత్తరం వైపు ఆనుకొని మా మేన మామ గుండు గంగయ్య గారిల్లు ఉంది .దక్షిణాన మా చిన్న నాయనమ్మ బ్రహ్మాజోష్యుల కళ్యాణమ్మ గారిల్లు ,దానికి అవతల దేవుల పల్లి వారిల్లు ఉన్నాయి .శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు దేవుల పల్లి సీతమ్మ గారింట్లో అద్దెకు ఉండేవారు .సీతమ్మ గారి సోదరి కావమ్మ గారు .వీరిని మా వాళ్ళందరూ ‘’సీతక్కాయ్ కాక్కాయ్ ‘’అని పిలిచేవారు .ఇద్దరూ చిన్న నాటే విధావ రాండ్రు అయ్యారు .మాకు వారు అలానే జ్ఞాపకం .వారికి ఒక చెల్లెలు నరసమ్మగారు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం లో ఉండేవారు .ఆవిడను ‘’నరసక్కాయ్ ‘’అని మా అమ్మా వాళ్ళు పిలిచేవారు .ఆమె వేలూరి వారి ఆడబడుచు అనిజ్ఞాపకం .శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి చెల్లెలని గుర్తు .శాస్త్రి గారింట్లో చాలాసార్లు చూశాను. ఉయ్యూరుకు కూడా ఆవిడా తరచూ వచ్చేది .మా రెండో అక్కయ్య శ్రీమతి దుర్గ ను చిరివాడ లో వేలూరి కృష్ణ మూర్తిగారి అబ్బాయి శ్రీ వివేకానందం బావ గారికిచ్చి వివాహం చేశాం . .శివరామ శాస్త్రిగారు మా బావకు బాబాయి గారు .మా అన్నయ్య గారి అమ్మాయి ఛి సౌ వేదవల్లిని కూడా చిరివాడ వేలూరి వెంకటేశ్వర్లుగారబ్బాయి రామకృష్ణ కు ఇచ్చాం .ఇలా వేలూరి వారితో మా బంధుత్వం బలపడటం వలన తరచూ చిరివాడ వెళ్ళే వాళ్ళం .ఇదికాక మా అమ్మమ్మ పుట్టిల్లుకూడా చిరివాడే అవటం మరీ కలిసొచ్చింది .
నా అక్షరాభ్యాసాన్ని సూర్య నారాయణ గురుదేవుల చేతనే మా నాన్న గారు చేయించిన జ్ఞాపకం .అంతకు మించి ఆ నాడు ప్రైవేట్ చెప్పే వారెవరూ లేరు .అంతేకాక మా నాన్న గారికి మాస్టారు శిష్యులు కూడా .కనుక శిష్యుడి చేత కొడుక్కి అక్షరాభ్యాసం చేయించాలనే తలంపు మా నాన్న గారికి ఉండి ఉండవచ్చు . అక్షరా భ్యాసాలు ఆ నాడు మా ఇళ్ళల్లో పెద్ద హడావిడిగా జరిగేవికాదు .మాస్టారును ఇంటికి పిలిచి పీట మీద కూర్చోబెట్టి వీలయితే నూతన వస్త్రాలు ,తాంబూలం దక్షిణా ఇచ్చి గౌరవించి అక్షరాలూ దిద్దించే వారు .నాకూ అలానే చేసిఉంటారు .కోటమాస్టారు దిద్దించిన అక్షరాజ్ఞానమే నాకు కలిగింది .అప్పుడు పలకా బలపం ఉన్న జ్ఞాపకమూ లేదు .పళ్ళెం లో ఇసుక పోసిచూపుడు వ్రేలితో ‘’ఓం నామహః శివాయహః సిద్ధం న మహః ‘’అని మూడు సార్లు గురువుగారు శిష్యుడి చేయి పట్టుకొని దగ్గరకూర్చుని లేక ఒళ్లో కూర్చోబెట్టుకొని దిద్దిం చే వారు .తరువాత ‘’అ ఇ ఈ ఉ ఊ ‘’వగైరా దిద్దిం చే వాళ్ళు .వీలయితే గురువుగారికి ఆ పూట ఇంట్లో అందరితో పాటు భోజనం పెట్టేవారు .లేక పొతే లేదు .గురువుగారు వరుసగా కొన్ని రోజులు శిష్యుడి ఇంటికి వచ్చి అక్షరాలూ దిద్దించే వారు .ఆ తర్వాత మంచిరోజు చూసి బడిలో చేర్చేవారు .ఇక రోజూ కుర్రాడు హుషారుగానో బెంగతో ఏడుస్తూనో ముక్కు చీదుకొంటూ నో ,మారాములు మనుగుడుపులూ కుడుస్తూనో బడికి వెళ్ళే వాడు .నేనేమీ దీనికి అతీతుడిని కాను
మా ఇంటికి రెండు దారులు .దక్షిణ వైపు సందును కల్యాణమ్మ గారి సందు అని ,ఉత్తరాన ఉన్న దాన్ని మామయ్య గారి సందు అని గుర్తుగా చెప్పుకొనే వాళ్ళం .దక్షణ సందు చివర రోడ్డుకు దగ్గరగా పెద్ద చింత చెట్టు ఉండేది .ఆ రోజుల్లో మాస్టర్ల చేతుల్లో పేము బెత్తాలు లేక ,చింత బరికెలు లేక వేప బెత్తాలు ఉండేవి .గురువుగారికి కోపం వస్తే వాటితో వీపు మీద ‘’రాం భజనే’’ .’’విమానం మోతే ‘’’’రాం డోలు వాయిం పే ‘’.అందుకే ‘’వేపా వారితో ‘పెళ్లి ‘’ అని ‘’పేకా వారితో పెళ్లి ‘’అని ఆనాడు ఈ’’ బాదుడును’’ అనే వారు .మా కోట మాస్టారి చేతిలో చింత బరికెలు ఎప్పుడూ ఉండేవి ఎవరికి చెప్పినా గబా గబా చెట్టెక్కి కోసి తెచ్చేవారు .అవి శిష్యులపై స్వైర విహారం చేసేవి .ఇది అన్ని చోట్లా మామూలే .కొట్టి చదువు చెప్పమని తలిదండ్రులే ఆ రోజుల్లో మాస్టారిని కోరేవారు .దెబ్బకు దెయ్యం దడుస్తుందని నమ్మకం .ఇంత హరికధ చెప్పి మా మాస్టారు ఎలా ఉండేవారు ఇంతవరకూ చెప్పలేదుకదూ .
కోటమాస్టారు నల్లగా లావుగా వెడల్పైన వీపు తో విశాలమైన నుదురు తో ఉండేవారు .గోచీ పోసి పంచె కట్టుకొనేవారు .పైన చొక్కా ఉన్న జ్ఞాపకం లేదు .యెర్రని కాశీ తువ్వాల బుజం పై ఉండేదని గుర్తు .లేకపోతె కోరా పొట్టి చేతుల బనీను ఉండేదని అనుకొంటా .తీక్ష్ణ మైన కన్నులు .కోటేరు తీసిన ముక్కు .చాలా గంభీరం గా ఉండేవారు .మినీ ఎస్వి రంగారావు అనుకోవచ్చు .మాస్టారుగారికి భార్యా పిల్లలూ ఉండేవారు .ఆమెతో మా అమ్మావాల్లకు మంచి స్నేహం ఉండేది .మా ఇళ్ళల్లో జరిగే కార్య కరామతులకు మాస్టారి కుటుంబం తప్పక హాజరయ్యేవారు.మాస్టారు సీతమ్మ గారింట్లో వసారాలో కొయ్య కుర్చీలో కూచుని చదువు చెప్పేవారు .అన్నితరగతుల వారు వారి దగ్గర చదివే వారు అందరికి అన్ని సబ్జెక్టులు మాస్టారు అతి శ్రద్ధగా బోధించేవారు .చెప్పింది చెప్పినట్లు బుర్రకు ఎక్కేదని చెప్పుకొనేవారు డిసిప్లిన్ కు మాస్టారు పెట్టింది పేరు .
నేను కోట గురువు గారి దగ్గర నాలుగవ తరగతి వరాకు చదివాననుకొంటాను .నాతొ పాటు మా అక్కయ్య లెవ్వరూ వారి దగ్గర చదివి నట్లు లేదు కనుక. అప్పుడు నేనొక్కడినే మా ఇంటి నుంచి రిప్రజెంటటివ్ ను అనుకొంటా .ఒక్కోసారి పై తరగతి పిల్లలు అక్షరాలూ సరిగ్గా రాయక పోతేనో ,చెప్పినది ఒప్పగించక పోతేనో మాస్టారికి కోపం వచ్చి బాదిపారేసేవారు .ఇది చూసి నాకు వణుకు పుట్టేది .రోజూ బడికి వెళ్ళను అని మారాం చేసేవాడిని .అప్పుడు మా ఇంట్లో పెద్ద భోషాణం మా సావిట్లో దక్షిణం వైపు ఉండేది .అంతే అదేక్కి పడుకోనేవాడిని .దుప్పటి ముసుగు తన్నేవాడిని .ఏడుస్తూ ముక్కు కారుస్తూ ఎక్కిళ్ళు పడుతూ ఉండేవాడిని .నేను బడికి రాలేదని గ్రహించి మాస్టారు ముందు గా నాతోటి ఆడ మగ పిల్లల్ని పంపించి నన్ను తీసుకొని రమ్మనే వారు .అంత తేలిగ్గా లొంగే వాడిని కాను . వాళ్ళు వెళ్లి చెప్పేవారు .ఒక పావుగంట తర్వాత మళ్ళీ పంపేవారు .అప్పటికీ వెళ్ళే వాడిని .అప్పుడు మాస్టారు స్వయం గా మా ఇంటికి వచ్చి నాదగ్గరకు వచ్చేవారు .అంతే ఒక్క ఉదుటున లేచి కూర్చుని జారి పోతున్న వెనక ముడి పొట్టి లాగూ ఎగేసుకొని ,ముక్కు చీమిడి చొక్కాకు తుడుచుకొంటూ బడికి పరిగెత్తేవాడిని .నన్నేమీ ఎప్పుడూ అనలేదు మాస్టారు గురువు గారి అబ్బాయి ని అని ఒక ప్రత్యెక అభిమానం .
మ నాన్న గారు అప్పుడు హిందూపురం లో తెలుగు పండితులుగా చేస్తున్న సమయం కనుక ఇక్కడ పిల్లల చదువులన్నీ మా అమ్మగారు చూసేవారు .నాకు ఇంట్లో మా నాన్న ,మా అమ్మ ల దగ్గర చనువు లేదు .మా నాన్న కు కోపం వస్తే నన్ను వీర బాదుడు బాదేవారు మొహమాటం లేదు .మా అమ్మ తిట్టేది .మధ్యవాడిని కనుక ఎవరికీ అంతఅభిమానం ఉండేదికాదేమో .మా తమ్ముడు అంటే మా అమ్మకు ముద్దు .మా అక్కయ్యలంటే మా నాన్నకు అభిమానం .రెంటికి చెడ్డ రేవడిని నేనే అప్పుడు .కోట మాస్టారి దగ్గర నాలుగవ తరగతి వరకు చదివిన జ్ఞాపకం .తరువాత హిందూపురం లో అయిదోక్లాస్ చదివి ,ఆరు ఏడు ప్రైవేట్ గా శ్రీ వేమూరి శివరామ క్రిష్నయ్య గురువుగారి దగ్గర ప్రైవేట్ చదివి ఎనిమిదికి ఎంట్రన్స్ రాసి ఎనిమిదిలో హైస్కూల్ లో చేరా .
మా దక్షిణ సందు చివర చింత చెట్టు ఉందని చెప్పాగా .అది ఒక గాలి వానకు కూకటి వేళ్ళతో సహా కూలి పడింది .దాని మీద విరిగిన కొమ్మల్లో ఉయ్యాల లూగే వాళ్ళం .అప్పుడు ఆటలకు ఆడా ,మగా భేదం లేదు .నా వయసుకంటే కొంచెం పెద్దమ్మాయి కూడా మాతో ఊగింది .ఏం జరిగిందో కాని ఆ అమ్మాయి కొమ్మ మీదనుంచి కింద పడింది. దెబ్బలు తగిలాయి .లంగాను గోఛీ పోసి కట్టింది .నేనే పడేశాను అనుకోని లావుపాటి ఇటుకరాయి తీసుకొని నా మీదికి విసిరింది .నా నుదిటికి తగిలి రక్తం కారింది .ఆ అమ్మాయి పరుగో పరుగు .మిగిలిన పిల్లలు కోట మాస్టారుకు చెప్పారనుకొంటా .వెంటనే వచ్చి నన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకు వెళ్లి గాయాన్ని దూదితో తుడిచి ,తన దగ్గరున్న మందు రాసి నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో మా అమ్మకు అప్పగించారు .జరిగింది అంతా చెప్పారు .ఆ రోజుకు ఏమీ అనలేదు మా అమ్మ .మర్నాడు పిల్లల్ని ఎంక్వైరీ చేసి ఆ పిల్ల ఎవరో తెలుసుకొని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తే వాళ్ళు వచ్చారు .ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ పిల్లకు చెప్పమని వార్నింగ్ ఇచ్చిపంపింది .ఆ గాయం చాలా రోజులకు కానీ నాకు నయం కాలేదు .ఇదొక గొప్ప అనుభవం మా కోట మాస్టారి బడిలో .
1951లో మేము హిందూపురం నుండి వచ్చేసరికి కోట మాస్టారు లేరు .గుడివాడ దగ్గర బేత వోలు లో ఉంటున్నారని తెలిసింది .మళ్ళీ మా రొటీన్ లో పడి మర్చిపోయాను .మా వేద వల్లి కి సంబంధం చూడటానికి రామ కృష్ణ వాళ్ళు బెతవోలులో ఉంటె వెళ్లాం నేనూ ఆ తమ్ముడు .అప్పుడు మాస్టారు జ్ఞాపకం వచ్చి రామ కృష్ణను మా వియ్యంకుడు వెంకటేశ్వర్లు గారిని అడిగితె మాస్టారి అబ్బాయిలు రామ కృష్ణ సోదరులు గుడివాడలో ఒకే కాలేజిలో చదువుతున్నామని చెప్పారు .మాస్టారి భార్య వారింటికి దగ్గర లోనే ఉంటున్నారని చెప్పగా ఏంతో అందం తో గురు పత్నిని చూడాలనే ఉత్సాహం గా వారింటికి వెళ్లాం .ఆమె పాత రోజులన్నీ గుర్తు చేసుకొన్నారు అప్పటికే మాస్టారు పరమ పదించారు .మేము వారింటికి వచ్చినందుకు ఏంతో సంతోషించారు .మళ్ళీ కాలగమనం లో ఇవన్నీ మరుపు ఖాతాలోకి వెళ్ళిపోయాయి .అయనా మా మాస్టారు నా మనసులో ఉన్నారు .అందరికి వారి గురించి చెబుతూనే ఉన్నాను .మా పిల్లలకూ తెలియ జేస్తూనే ఉన్నాను. కాని అంతకు మించి ఏమీ చేయలేకపోయాను .
ఇటీవల శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కోట మాస్టారు గారిని గుర్తు చేసుకొన్నారు .ఇద్దరం వారిపై మెయిల్స్ రాసుకోన్నాం .వారికి మాస్టారి ఫోటో ఎక్కడైనా సంపాదించాలనే కోరిక కలిగింది .మాస్టారి అన్నగారు కోట శ్రీరామ మూర్తిగారు గొప్ప జ్యోతిష్ శాస్త్ర వేత్త. కో ఆపరేటివ్ బాంక్ లో పని చేసి రిటైర్ అయ్యారు .
మా నాన్న గారి శిష్యులు .మా పిల్లల జాతకాలన్నీ వారే వేశారు .పెళ్ళిళ్ళ ఉపనయనాల ముహూర్తాలు వారు పెట్టినవే .వారి గతించి అయిదేళ్ళు దాటింది .వారి అబ్బాయిలను సంప్రదించాడు మా అబ్బాయి రమణ .వారికీ కోటమాస్టారి పిల్లలూ మనుమలు ఎక్కడున్నారో తెలియదు .చివరికి ఒక నిర్ణయానికి వచ్చాం .మా బావ మరిది ఆనంద్ మంచి చిత్రకారుడు .హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి .వాడికి మాస్టారి గురించిన హావభావాలు కవళికలు చెప్పి చిత్రం గీయమని నేనూ ,మైనేని గారు ఫోన్ లో చెప్పాం. సరే అన్నాడు .కాని ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’పుగ్రందావిష్కరణకు ముందే మాస్టారి పేర ఏదో చేయాలని మైనేని వారి సంకల్పం .మంచిదే అని అని స్థానిక శాంతినికేతన్ హైస్కూల్ లో పదవ తరగతి చదివే లంకె లావణ్య అనే పేద ,ప్రతిభ గల విద్యార్ధిని ఎంపిక చేసి , ‘’స్వర్గీయ కోట సూర్యనారాయణ మాస్టారి మెమోరియల్ పురస్కారం ‘’గా ఆ స్కూల్లోనే మైనేని వారు పంపిన పది వేల రూపాయల నగదును ప్రిన్సిపాల్ శ్రీ పిళ్లే ,విద్యా కుటుంబం సమక్షం లో అంద జేశాం .డెబ్భై ఏళ్ళ క్రితం అక్షరాలు నేర్పిన ,స్కూల్ లో చేర్చిన ఆ మాస్టారును గుర్తుంచుకోవటం వారిపేర పురస్కారం అంద జేయాలనే ఆలోచన రావటం మైనేని వారి సంస్కారానికి ప్రతీక .నేను మాటల వాడినే కాని చేతల వాడిని కాను అని రుజువు చేసుకొంటూ ,వారిచ్చిన నగదును నా చేతుల మీదుగా సరసభారతి తరఫున అంద జేసి నందుకు మైనేని వారికి దక్కిన పుణ్యం లో నాకు’’ చిన్న రేణువంత ఫలితం ‘’దక్కిందని సంతోషిస్తున్నాను .ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా ఈ తీపి గుర్తులను ‘’ఊసులుగా’’ రాసి మీ అందరికి తెలియ జేస్తూ అక్షరాలతోనే నా గురుదేవులు గురుబ్రహ్మ స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి గురు ఋణం తీర్చుకొంటున్నాను .వారు ఏ లోకం లో ఉన్నా నన్నూ మైనేని గారిని సదా ఆశీర్వ దించి మా కుటుంబాలకు మేలు కలిగిస్తారని నమ్ముతున్నాను .అలాగే వారి కుటుంబం వారు ఎక్కడున్నా సకల భోగ భాగ్యాలు ,సుఖ శాంతులు కలిగించాలని వారి పవిత్రాత్మ కు శాంతి కలగాలని మనసార భగవంతుని తరఫున శ్రీ గోపాల కృష్ణ గారి తరఫున ప్రార్ధిస్తున్నాను .
గురుపూజోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-9-14-ఉయ్యూరు