కొందరు గురు శిష్యుల గూర్చి
అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము.రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు .ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది .శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు .కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి .త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్ శిష్యుడు. ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా ..సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ , విద్యారన్యులకు హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు .ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు ముఖ్య శిష్యుడు .రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు. గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యుడు .రఘు పతి వెంకట రత్నం గారికి కృష్ణ శాస్త్రి లాంటి శిష్యపరమాణువు లెందరో .చెళ్ళ పిళ్ళ వారికి విశ్వనాధ ,పింగళి ,కాటూరి వంటి కవి శిష్యులకు లెక్కే లేదు .విశ్వనాధకు ధూళిపాళ శ్రీరామ మూర్తి ,పేరాల భరత శర్మ జమదగ్ని జువ్వాడి గౌతమ రావు, పొట్ల పల్లి సీతారామ రావు మొదలైన వారు ప్రసిద్ధి చెందిన శిష్యులు .ఇప్పుడు గురు పదం ఆశ్రమ వాసులకే చెల్లుతోంది .దైనిక జీవితం లో మేష్టారు ,మేస్టరు ,టీచరు ,ఉపాధ్యాయుడు ,అధ్యాపకులయ్యారు . సెప్టెంబర్ అయిదు శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినోత్సవం .అంటే ఉపాధ్యా దినోత్సవం అదే గురు పూజోత్సవం .అందుకే ఇప్పుడు కొందరు ప్రత్యెక గురువులు వారికి తగిన శిష్యుల గూర్చి తలచుకొందాం . .
తంజావూరు జిల్లా జయం పేటలో సౌరాష్ట్ర కుటుంబానికి చెందిన నన్నుసామి భాగవతార్ కుటుంబ సమేతం గా తిరుమలకు వచ్చారు .స్వామి దర్శన ఫలితం పొంది భక్తీ గల కుమారుడిని ప్రసాదించమని వేడుకొన్నాడు .స్వామి అనుగ్రహం తో 18-2-1781నఒక కుమారుడు జన్మిస్తే వెంకట రమణుడు అని పెరుపెట్టుకొన్నారు .ఇతన్ని త్యాగరాజ స్వామి వారి శిష్యునిగా చేశారు. ఆయన శ్రీరామ మంత్రాన్ని ఉపదేశించారు .వెంకటరమణ ఉత్తమ శిష్యుడై త్యాగయ్య గారి కృతులను పారవశ్యం గా పాడేవాడు .గురు సేవలో ఏ లోపమూ లేకుండా చేసేవాడు .శిష్యుడు సేకరించి తెచ్చిన పూలతోనే త్యాగయ్య పూజ చేసేవారు .ఒకసారి యెంత వెదికినా పుష్పాలు దొరక్క పొతే తులసీ దళాలు కోసి తెచ్చి ఇచ్చి తన అశక్తతను గురువు గారికి తెలిపాడు .వాటితోనే త్యాగరాజు ‘’ఇవి పుష్పాలుకాదు తులసిదళాలు శ్రీరామా ‘’అంటూ పూజ చేశారు .కొద్దిసేపట్లో అవి పుష్పాలుగా మారి వింత శోభను కూర్చాయి .గురు శిష్యులిద్దరికి ఆశ్చర్యం వేసింది .ఇది శిష్యుని భక్తీ యా లేక గురుని రామ భక్తిమహిమా అని అందరూ అనుకొన్నారు
త్యాగ రాజ స్వామి శ్రీ కృష్ణ లీలలను వర్ణించే ‘’నౌకా చరితం ‘’ తెలుగు లో రాశారు. తంజావూర్ రాజాస్థాన పండితులు అది శృంగార రస ప్రధానం అని దాన్ని నిషేధించాలని రాజుపై ఒత్తిడి తెచ్చారు .రాజు త్యాగయ్యను సభకు హాజరుకావలసినదిగా ఆజ్న జారీ చేశాడు .రాజు నౌకా చరిత్ర విని ‘’పరమాద్భుతం గా ఉంది స్వామీ .దీనికి మాతృక సంస్కృతం లో ఉందా “?అని అడిగాడు ‘’.ఉంది ‘’అని గబుక్కున సమాధానం చెప్పాడు త్యాగయ్య .కాని లోపల బెరుకుగా ఉంది .అక్కడే ఉన్న వెంకట రమణను ‘’నాయనా నౌకా చరిత్రకు సంస్కృత మూలం ఉందని తెలియ కుండా చెప్పేశాను .ఇప్పుడెం చెయ్యాలో తోచటం లేదు ‘’అన్నారు .గురువుకు తగ్గ శిష్యుడైన వెంకట రమణ ‘’స్వామీ !నేను నౌకా చరిత్రను చదివి ముగ్దుడినై సంస్కృతం లో రాసి ఉంచుకోన్నాను ..దాన్ని మీకు సమర్పిస్తాను ‘’అన్నాడు. ఆ యన మూడు రోజుల్లోనే నౌకా చరిత్రను సంస్కృతం లో రాసేశాడట .గురువుకు తగ్గ శిష్యుడాయే .రాజుతో అన్న మాట ను శిష్యుడు ఈవిదం గా చేసి, గురు ఋణం తీర్చుకొన్నాడు సద్గురు త్యాగరాజ స్వామి శిష్యుడు వెంకట రమణ .
త్యాగయ్య గారింట్లో ఏకాదశి భజనను శిష్యుడే జరిపించేవాడు దగ్గరుండి .ఒక నాటి ఏకాదశినాడు భారీవర్షం వచ్చి జయం పేట నుండి తిరువయ్యూరుకు వెళ్ళటం వెంకట రమణుడికి వీలు కాలేదు .మనసులో ‘’గురుదేవా !ఎలాగైనా పూజలో పాల్గోనేట్లు అనుగ్రహించండి ‘’అని వేడుకొన్నాడు .శిష్యుడు రాలేదని త్యాగయ్య గారు బాధ పడ్డారు .అప్పుడొక పిల్లాడు హఠాత్తుగా అక్కడికి వచ్చి త్యాగయ్య గారి భార్యతో వెంకట రమణ వర్షం లో చిక్కుకు పోయారని ,భజన కానిస్తే ఆయన వచ్చి మంగళం పాడతారని అయ్య వారితో చెప్పండి ‘’అని చెప్పి మెరుపు లాగా మాయమయ్యాడు .భార్య ఈ విషయాన్ని భర్తకు చెప్పింది .వచ్చిన వాడు సాక్షాత్తు బాల కృష్ణుడే అని త్యాగ రాజు గారు గ్రహించి ఆనంద బాష్పాలు రాల్చారు .ఇంతలో శిష్యుడు లోపలి వచ్చాడు ‘’రండి వెంకట రమణ భాగవతార్ గారూ !మీరే ఇవాళ బాల కృష్ణునికి మంగళ హారతిపాడాలి ‘’అన్నారు .శిష్యుడు ‘’ఆలస్యానికి మన్నించండి స్వామీ !దయ చేసినన్ను ‘’గారు’’ అని పిలవ కండి ‘’అని ప్రార్ధిం చాడు .
గురు సేవకు అడ్డు వస్తుందేమో నని వెంకట రమణ చాలాకాలం పెళ్లి చేసుకో లేదు .త్యాగయ్య గారే పూనుకొని తలి దండ్రుల అనుమతితో వెంకట రమణ వివాహం దగ్గరుండి జరిపించారు .41వ ఏట అతని వివాహం వైభవం గా జరిగింది .తరువాత 26ఏళ్ళు త్యాగ రాజ స్వామి వారికి సేవలందించాడు వెంకట రమణ .తర్వాత వాలాజ పేటలో కాపురం ఉన్నాడు .ఇద్దరు కుమారులు ,శిష్యులతో ఒక ఆశ్రమం ఏర్పరచి సద్గురు త్యాగ రాజ స్వామి ,శ్రీ కృష్ణ ,శ్రీ రాములపై సౌరాష్ట్ర ,సంస్కృతం తెలుగు భాషల్లో కీర్తనలు రాశాడు .గానం చేసి భక్తిని వ్యాప్తి చేశాడు .త్యాగ రాజ స్వామి కుమార్తె సీతా లక్ష్మి వివాహానికి వెంకట రమణుడు తానూ స్వయం గా పూజిస్తున్న కోదండ రాముని చిత్రాన్నితీసుకొని తిరువయ్యారు కు నడిచి వచ్చాడు .గురువు దేవుడిని తలచుకొని ఆ చిత్రపటాన్ని సోదరిగా బావించే త్యాగయ్య గారి కూతురుకు కానుకగా అందించాడు .అప్పుడు త్యాగయ్య గారు ‘’నను పాలింపా నడచీ వచ్చితివా నా ప్రాణ నాదా ‘’అని పరవశించిపాడారు .
త్యాగరాజ స్వామి అవసాన దశ లో శిష్యుడు వెంకట రమణకు తన శ్రీ రామ విగ్రహాన్ని ,కీర్తన తాళ పత్ర గ్రంధాలను అందజేసి వాటిని నిత్యం పరిరక్షించమని కోరారు .దీనిని గురువు ఆజ్నగా నెర వేర్చసాడు శిష్యుడు .దాదాపు యాభై ఏళ్ళు భక్తి, సంగీతానికి యెనలేని సేవలందించి గురు ఋణం తీర్చుకొన్నాడు .1874లో అవసాన దశలో వెంకటరమణ ‘’శ్రీ రామా !నా తరువాత నా గురుదేవులు త్యాగ బ్రహ్మ గారు ఉపాసించిన శ్రీరామ విగ్రహం ,తంబూర ,తాళపత్ర గ్రంధాలు ఆయన పాదుకలు భక్తులచే పూజింప బడాలి ‘’అని నిస్వార్ధం గా మనస్పూర్తిగా కోరుకొన్న ఘన శిష్యుడు వాలపేయాజుల వెంకటరమణ .ఆయన కోరినట్టే అవి ఈనాటికీ పూజింప బడటం మనందరి అదృష్టం .వెంకట రమణ పుట్టిన జయం పేట లో ఏటా ఆయన జన్మ తిది రోజున సంగీతోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు .తిరువయ్యూరు లో వెంకట రమణ భాగవతార్ పేరిట ఒక ఆలయం వెలసి అక్కడ నిత్య పూజలు, జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి . అదీ గురు శిష్య సంబంధం అంటే అర్ధం ,పరమార్ధమూ .,(సెప్టెంబర్ శ్రీ రామ కృష్ణ ప్రభ చిత్ర కదా ఆధారం గా )
మరో గురు శిష్య సంబంధాన్ని చూద్దాం –తంజావూర్ లో బృహదీశ్వరాలయ నిర్మాణం జోరుగా సాగుతోంది .స్థపతి తదేక దీక్షతో శిల్ప రచన చేస్తున్నాడు .గురువుగారి శిల్ప విన్యాసాన్ని తదేక దీక్ష తో గమనిస్తున్నాడు శిష్యుడు ఆయనకు పరి చర్యలు చేస్తూనే .స్థపతికి మాటిమాటికీ తాంబూలం వేసుకొనే అలవాటుంది .అది కావలసినప్పుడు యాంత్రికం గా చెయ్యి చాపుతాడే కాని ద్రుష్టి అంతా శిల్పం మీదే ఉండేది .శిష్యుడు ఆయన చేతిలో తాంబూలం పెట్టగానే నోట్లో వేసుకొని మళ్ళీ పనిలో మునిగిపోయేవాడు .ఈ ఆలయాన్ని నిర్మిప జేస్తున్నవాడు చోళ చక్ర వర్తి రాజ రాజ చోళుడు ఒక సారి నిర్మాణం ఎలా సాగుతోందో చూడటానికి వచ్చాడు .స్థపతి పద్మినీ జాతి స్త్రీ అయిన మదనిక విగ్రహాన్ని సమాదిస్తితిలో ఉండి చెక్కుతూ పరిసరాల స్ప్రుహలోలేక రాజును గమనించలేదు .రాజు మహాదాశ్చర్య పడ్డాడు .దీక్ష తో కనుబొమలు చెక్కుతున్నాడుశిల్పి . .అప్పుడే రాజు అతని సమీపానికి వచ్చాడు .శిష్యుడు గమనించి గురువు కు హెచ్చరిక చేస్తున్నాడు సౌజ్ఞాలతో .రాజు అతన్ని వారించి దూరం వెళ్ళిపొమ్మని తానూ సౌజ్ఞ చేశాడు .వెళ్ళిపోయాడు .స్థపతికి ఈ డ్రామా తెలియదు .యధాలాపం గా తాంబూలం కోసం చెయ్యి చాచాడు .చక్ర వర్తి తాంబూల కరండ వాహక అవతారం ఎత్తాడు ఆ సీనులో .పరమ శివుడైన ఆ స్థపతికి తాంబూలం అందించాడు .దాన్ని యధాలాపం గా నోట్లో వేసుకొన్నాడు .సున్నం ఎక్కువై రుచిలో తేడా కనిపించింది . స్థపతికి విపరీతమైన కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి .చేతిలో ఉన్న సుత్తి తీసి శిష్యుడిని కొట్టబోయి తల ప్రక్కకు తిప్పాడు .ఎదురుగా చక్రవర్తి నవ్వుతూ కనిపించాడు .
స్థపతి ఒణికి పోయాడు.’’చోళ చక్ర వర్తీ !నీ వంటి కళాకారుడు ఉండటం నా అదృష్టం ‘’ అన్నాడు తనకీ కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా .ఆ శిల్పి ఏకాగ్రతకు రాజరాజు కళ్ళల్లో కూడా నీళ్ళు కారి ప్రవహించాయి .ఇందులో చోళుని రసజ్ఞత ,శిల్పి అంకితభావ శిల్ప విన్నాణం చరిత్ర కెక్కాయి .
రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ గారి సంస్కృత గురువులు పరకాల మఠాధిపతి అయిన కృష్ణ బ్రాహ్మ పర తంత్రుల వారు .గురువుగారు శాస్త్రాలలో వీర విహారి .కళల్లో మనస్వి .శర్మ గారికి సంగీతం మీద మహా మక్కువ .బిడారం కృష్ణప్పగారి శిష్యరిక చేసి సంగీత సాధన చేసేవారు . కృష్ణప్ప గారు సంగీత సరస్వతి .గురువుగారు చెప్పిన పాఠాన్ని మఠం లోనే తన గదిలో సాధన చేసేవారు శర్మ గారు .ఇది గిట్టని ఇతర శిష్యులు గురువుగారికి ‘’మూటలు’’.మోశారు .ఆ నాడు నట విట గాయకులూ పంక్తి బాహ్యులు .కృష్ణ పర బ్రహ్మ యతీంద్రులు ఈ చాడీలను వినీ విననట్లు ఊర్కున్నారు .అదీ శిష్య వాత్సల్యం .శిష్య సాధనకు చేయూత .
మరొక జంట గురుశిష్యులను చూద్దాం ఏకనాధుని గురువు జనార్దన స్వామి. గురువు గారి కరణంలెక్కలన్నీ శిష్యుడే చూసే వాడు .ఒక సారి లెక్కలో ఒక పైసా తేడా వచ్చి మూడు రాత్రులు నిద్ర లేకుండా లెక్కలు చూస్తూనే ఉన్నాడు .రాత్రి ఇంట్లోపాము ప్రవేశించినా ఏక నాధుడికి ఆ గొడవ పట్టలేక లెక్కల్లో మునిగి తేలుతున్నాడు .ఈ దీక్షను మెచ్చి గురువు అతనికి దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించాడు .చాలాకాలం జపించినా ఏక నాదునికి సిద్ధి కలుగ లేదు .చివరికి గురువు జనార్దన స్వామి పిచ్చి వాడుగా వచ్చిన దత్తా త్రేయుని నోట్లో ఉన్న ఎంగిలి తాంబూలాన్ని శిష్యుని నోట్లో వేశాడు .వెంటనే ఏక నాధుడికి కవితా స్పూర్తికలిగింది .మహా రాష్ట్ర భాషలో భాగవతాన్ని రాశాడు .దీన్ని బట్టి తెలిసిందేమిటంటే సద్గురువు ఒక సారి శిష్యుడిని పట్టుకొన్నాడు అంటే శిష్యుడు ఎంత గిన్చుకొన్నా వదిలి పెట్టడు .
మరో కద చూద్దాం .షిరిడీ సాయి బాబా దగ్గరకు ‘’ఉపాసనీ బాబా ‘’వచ్చాడు .సాయి వేష భాషలు చూసి భయపడి కొంపకు పారి పోవాలనుకొన్నాడు. పొమ్మన్నాడు బాబా .అప్పుడు టైం యెంత అని అడిగితె పన్నెండు అన్నాడు ,ఆరోజు ఏవారం అంటే గురువారం అన్నాడు ఉపాసనీ .సరే మళ్ళీ గురువారం పన్నెండు గంటలకు మళ్ళీ ఇక్కడికే వస్తావు అన్నాడు బాబా .బాబా పీడా వదిలి పోయిందని ఉపాసనీ ఇంటికి బయల్దేరాడు .ఎనిమిది రోజులు ప్రయాణం చేశాడు కానీ షిరిడీ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు .అనుకొన్న గురువారం పన్నెండు కు బాబా దగ్గరకొచ్చాడు. నవ్వాడు బాబా .ఊరు అవతల పాడుగుడి లో ఉపాసనీ ని కూర్చోమన్నాడు .ఏ పనీ లేదు సమయానికింత రొట్టె పడేస్తే తింటున్నాడు .ఎవరూ మాట్లాడటం లేదు .పదమూడేళ్ళు అలానే గడిపాడు .ఒక రోజు బాబా ఉపాసనీ బాబాకు హారతి ఇవ్వమని శిష్యులకు చెప్పాడు .అంతే.బాబా సర్వ శక్తులు ఉపాసనీ లోకి చేరిపోయాయి .ఆ రోజు నుండి అయన కృష్ణ స్వరూపుడుగా అందరికి కనిపించాడు .సద్గురువుల చర్యలు ఇలా ఉంటాయి .వాటి వెనక పరమ మహా సత్యం దాక్కొని ఉంటుంది .
ఈ విషయాలన్నీ సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు చెప్పినవే . వారి ‘’త్రిపుటి’’లో గ్రంధస్తాలే
రేపు గురుపూజోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-14-ఉయ్యూరు
.
.
మీరు రూపొందించిన వ్యాసం ఎంతో ఉత్తమంగా, విపులంగా విశదీకరిస్తు ఉన్నది.ఇది మాలాంటి
ఉపాధ్యాయులకు ఎంతో ఉపయుక్తం….
మీకు మా హృదయపూర్వక నమస్కా రము లు
____కేశవయ్య..తెలుగు సహాయకులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,
పెద్ద తుం బలం.. ఆ దోని మండలము,, కర్నూ లు జి ల్ల..