పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3
వాల్మీకి –రామాయణం
భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్టపర్తి వారు .రామాయణం రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొందారు .మహారాష్ట్రలో పాండు రంగ విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తాగ్రేసరుడు తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో రామ చరిత మానసాన్ని రచించాడు .తమిళం లో ‘’కంబ కవి’’ రామాయణం మలయాళం లో ‘’ఎజుత్తచ్చన్ ‘’రామాయణాలు ప్రసిద్ధాలు .ఆ తర్వాత ప్రతి భాషలో ఎందరోకొందరు రామాయణాలను రాస్తూనే ఉన్నారు. రామాయణ కల్ప వృక్షం రాసి జ్ఞాన పీఠం సాధించారి విశ్వనాధ. రంగ నాధుడు ,మొల్ల భాస్కరాదులు రాసినా వాల్మీకి స్థాయి ఎవరూ అందుకోలేక పోయారు. అరవింద మహర్షి ‘’వాల్మీకి వంటి రచన చేయ లేక పోయానే ‘’అని బాధ పడ్డారట .భవ భూతి రాసిన ఉత్తర రామ చరిత్ర చూస్తె భవ భూతి రామాయణాన్ని పూర్తిగా అర్ధం చేసుకో లేక పోయాడే అని అని పించిందట నారాయణా చార్యుల వారికి .
సంస్కృత సాహిత్యం లో మహా కవులు ఇద్దరే వ్యాస ,వాల్మీకులు .వ్యాసుడు చేసిన పని ఊహించటానికే శక్యం కానిది అంటారు .అందుకే వ్యాసో నారయణో హరిః అన్నారు లోకులు .కాని కావ్యం విషయానికి వస్తే కవి అంటే వాల్మీకి యే.కావ్యం అంటే రామాయణమే .భాసుడు ,కాళిదాసాదులు రామ కదా సరస్సులో మునకలు వేశారు .వాల్మీకి చెప్పిన సూక్ష్మ విషయాన్ని కాళిదాసు విస్తృతం చేశాడు .విక్రమోర్వశీయ నాటకం లో వాల్మీకి శ్లోకాన్నే యదా తదం గా ఇరి కిం చే శాడుకూడా .వాల్మీకిని దోసిళ్ళతో తాగేద్దామనే ‘’ఆబ ‘’ ఆయన లో అధికం గా ఉంది .’’శక్య మంజలి భిహ్ పాతుం వాతాఃక –కై తిక గందినః ‘’ అంటాడు వాల్మీకి . ఆ కైతవ గంది సమీరం వాల్మీకి అయి తానూ తాగితే యెంత బాగుండేదో అని మహాకవి ఎన్నో సార్లు అనుకోని ఉంటాడని సరస్వతీ పుత్రుల ఊహ .వాల్మీకి లో తాదాత్మ్యం చెందటానికి ఆయన భాష అడ్డం వచ్చిందట .అంటే కాళిదాసు భాషలో కొంత కృతకత్వం ఉందన్న మాట .’’కాళిదాసు కంటే భాసుడు వాల్మీకి భాషలోను భావం లోను దగ్గరయ్యాడేమో నని పించింది పుట్టపర్తి వారికి .
గుంటూరు లో ఉండేవ్యాకరణ వేత్త సాహితీ భూషణులు ‘’పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యుల’’ వారి దగ్గరకు శ్రీనాధ రావు అనే ఆయన వెళ్లి తనకు వాల్మీకి రామాయణం చదవాలని ఉందని అన్నాడట. దానికి వారు ‘’చదువు .ఇందులో కష్టం ఏముంది ?అదంతా తెలుగే కదా ?’’అన్నారట .కన్నడిగులకు కన్నడం లాగా ,మళయాళీలకు వారి భాష లాగా ,మిగిలిన ఆర్య భాషలకు వారి వారి భాషలలాగా వాల్మీకం అని పిస్తుంది .అదీ గొప్పతనం అంటారు నారాయణా చార్యులు .గారు .తమిళానికి మాత్రమె ఈ ప్రత్యేకత లేదన్నారు .వాల్మీకం ఏ భాషలోనైనా ఒదిగిపోయి అది తమ భాషే అనిపించేంత గొప్పది అని తేల్చారు .వ్యాసుడి రచనలలో అనేక గ్రంధులు అంటే ముడులు ఉంటాయి అవి విప్పుకొని వేడితేనే పరమార్ధం తెలుస్తుంది .వాల్మీకిది కోమల సరళ హృదయం .క్లిష్ట సమస్య వస్తే ‘’ఏషాద్ధర్మ స్సనాతనః ‘’అని జారుకొంతాడట వాల్మీకి .
‘’ఇదం మరుసత మిదం స్వాదు ప్రఫుల్ల మిద మిత్యపి –రాగ మత్తో మధుకరః కుసుమేష్వేవ లీయతే ‘’దీని అర్ధం తేనే రుచిగా ఉంది .పువ్వు బాగా వికసించింది .ఇక్కడ తేనే బాగా దొరుకుతుంది అని ఒక తుమ్మెద ప్రతి పుష్పం మీదా వాలుతూ పోతోందట .’’రాగ మత్త’’అనే మాట వలన దానితో బాటు ఆడ తుమ్మెద కూడా ఉంది అని భావం ధ్వనితం అవుతోంది .ఇలాంటిదే కాళిదాసు ఒక సందర్భం లో ‘’మధు ద్విరేఫః కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వామను వర్త మానః ‘’అంటాడు సులభం గా ఉన్నా భాషలో లాలిత్యం కరువైంది .భాసుడు వాల్మీకిని పూర్తిగా అనుసరిస్తాడు .రామాయణం లో ఏ పాత్రను చూసినా మితం గా మాట్లాడుతుంది ఇంకో రెండు ముక్కలు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది .త్యాగయ్య గారిలో శృంగారం అంతర్గతం గా ఉన్నట్లు వాల్మీకిలో ఏ రసంపైనా పెద్దగా అభినివేశం ఉన్నట్లు గోచరించదు అన్నారు ఆచార్యుల వారు .’’ఏ చిన్న సౌందర్య రేఖ కూడా వాల్మీకి నుంచి తప్పించుకు పోలేదు ‘’అంటారు శ్రీరాముడు పరమ సౌందర్య దృష్టికలవాడు .అంతటి నియమ శీలి జీవితాన్ని ఎలా గడిపాడా అని ఆశ్చర్యమేస్తున్దన్నారు .వాల్మీకి మనస్సు ఒక్కో సారి తీవ్రం గా స్పందిస్తున్దికూడా .
సుగ్రీవుడు చేసిన ప్రతిజ్ఞ ను గుర్తు చేయటానికి తమ్ముడు లక్ష్మణుడి ని పంపిస్తూ ‘’సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పద మన్వగాః –నచ సంకుచితః పదా ఏవ యేన వాలి హతో గతః ‘’అంటే –‘’ముందుగా చేసుకొన్న వాగ్దానం ప్రకారం నడువు ,వాలి తొక్కిన మార్గం తోక్కద్దు. నాబాణం తో చచ్చిన వాలి ఏ మార్గం ద్వారా వెళ్ళాడో ఆ మార్గం ఇరుకేమీ కాదు ‘’అంటే అందులో సుగ్రీవుడు కూడా పడతాడు అనే ధ్వని ఉంది .అంటే నీకూ అదే గతి .అని సూచన .’’న చ సంకుచిత పదాః’’అని ఆపెయ్యటం లోనే ఉంది మజా .
రావణ సంహారం తర్వాత మండోదరి వచ్చి కింద పడిపోయిన భర్తను చూసి ‘’ఇన్ద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా –స్మరద్భిరివా తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః ‘’అంటూ విలపిస్తుంది ‘నాధా !నువ్వు ముందు రజో గుణం తో కూడిన తపస్సు తో ఇంద్రియాలను బల వంతం గా పాముల్ని బుట్టలో పెట్టినట్లు కట్టేశావు .ఆ రజోగుణం తోనే మూడు లోకాలు జయిన్చావుకూడా .తమల్ని బల వంతం గా అణచిపెట్టావని నీఇంద్రియాలు పగ బట్టాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి .సీతా దేవి అనే చిన్నఆధారం దొరలక గానే అవి విజ్రుమ్భించాయి .తిరగ బడి నిన్ను కాటేసి చంపేశాయి .వివేకం తో ఇంద్రియాలను నువ్వు లోబరచుకోలేదు .అందుకని నిన్ను చంపింది నీఇంద్రియాలే తప్ప రాముడు కాడుఅని గ్రహించు ‘’అన్నది .అంతకు ముందుచాలా సార్లు అడ్డుపడింది తనకన్నా సీతా దేనిలోనూ దీటు కాదని చెప్పింది .భర్త ప్రవ్రుత్తి మండోదరికి బాగా తెలుసు .
రామానుజుడు సుగ్రీవ మందిరానికి రాముని పంపున వచ్చినప్పుడు రాజు బయటికి రాకుండా తార ను పంపాడు .తార గొప్ప రాజ నీతిజ్నురాలు. ఆమె సలహా వినకుండా తాను చనిపోతున్నానని వాలి చివర్లో ఏడుస్తూ ‘’క్లిష్ట సమయం లో తార సలహా తీసుకో ‘’అని సుగ్రీవుడికి చెప్పి మరణించాడు .ఆమెలకష్మణుడి దగ్గరకు ‘’సా ప్రస్కలంతీ మద విహ్వ లాక్షీ –ప్రలంబ కాంచీ గుణ హేమ సూత్రా-సలక్ష్నా లక్ష్మణ సన్నిధానం –జగామ తారా నమితాంగ యస్తిః ‘’’’నువ్వు ముందు వెళ్లి రామానుజుడిని శాంత పరచు తర్వాత నేనొచ్చి అనునయిస్తాను ‘’అని తారకు చెప్పిపంపాడు సుగ్రీవుడు .‘కాని ఆవిడ వచ్చిన వేషం చూస్తె మనకే మతి చలిస్తుంది .పచ్చి శృంగారాన్ని సుగ్రీవుడితో అనుభవిస్తూ అదే మేకప్ తో వచ్చింది అదీ తమాషా .తార ఒక అప్సరస .సముద్ర మధనం లో సుషేణుడు అనే వానర రాజుకు దొరికితే కూతురు లాగా పెంచి వాలికిచ్చి చేశాడు .కానీ ఆమెకు సుగ్రీవునిపై మనసేక్కువ .కాపురం వాలితో మనసు సుగ్రీవునిపై అదీ ఆమె వాలకం .ఏ విషయాన్ని అంతా వాల్మీకి ‘’ఈప్సిత తమాం’’అనే మాటలో ధ్వనింప జేశాడు. అంతేనా అతని ముఖ్య కోరిక అయిన తారను కూడా పొందాడు అనే అర్ధమూ ఉంది .తమప్ ప్రత్యయం పొట్టలో అంత అర్ధం దాక్కొని ఉందన్నారు సరస్వతీ పుత్రులు .తార ను చూసి లక్ష్మణుడు జావ గారిపోయాడు ఆది శేషుని బుసలు లేనే లేవు .తార ముఖం కళ్ళూ తిప్పుతూ అనేక భంగిమలు పెడుతూ ‘’రాజేంద్ర కుమారా !నీకెందుకు కోపం వచ్చింది?నీ ఆజ్ఞను ఎవరు దిక్కరించారు ?దావాగ్నికి ఎవరు ఎదురు నిలవ గలడు?’’అన్నది .మెత్తబడ్డాడు లక్ష్మణ స్వామి .ఇలా ధ్వని పూర్వకం గా ఎన్నో సందర్భాలలో వాల్మీకి కధను నడిపిస్తాడు .
మేనకా విశ్వామిత్రుల కధను మహర్షి పతనాన్ని నాలుగే నాలుగు శ్లోకాలలో చెప్పేశాడు వాల్మీకి అంటారు పుట్టపర్తి వారు .ఇది విశ్వామిత్రుడి లో ఉన్న చిన్న దౌర్బల్యం దీన్ని పెంచి పెద్దగా రాయకూడదని, ఔచిత్య భంగమనీ వాల్మీకి భావించాడు .జనక సభలో జనకుడు శివ ధనుస్సు గురించి చాలా చెబుతాడు .విశ్వామిత్రుడికి ఇది కేవలం అతి సామాన్య విషయం అనిపించి ‘’వత్స రామ ధనుః పశ్య ‘’అని మాత్రమె అంటాడు .రాముడు కొంచెం చేత్తో ధనుస్సును తాకుతానని మాత్త్రమే అంటాడు . అది విరిగి పోతుంది ఇక్కడ రెండే రెండు శ్లోకాలు రాస్తాడు మహర్షి –
‘’తస్య శబ్దో మహా నాసీత్ నిర్ఘాతసమ నిస్వనః –భూమి కంప శ్చ సుమహాన్ ,పర్వతస్యేవ దీర్యతః ‘’
నిపెతుశ్చనరాస్సర్వే తేన శబ్దేనా మోహితాః –వర్జయిత్వా మునివరం ,రాజానం తౌచ ,రాఘవౌ ‘’ఇవే ఆ రెండు శ్లోకాలు .
రాముడికి కూడా ధనుర్భంగం సామాన్యమైన విషయమే .సీతా రామల శృంగారాన్నే అంతే ఉదాత్తం గా చెప్పాడు మహర్షి .ఈ పెళ్లిని తలి దండ్రులు చేశారు ‘’దారాః పిత్రుక్రుతా ఇతి ‘’అదే వాళ్ళ అనురాగానికి కారణం .’’గుణాద్రూప గుణాచ్చాపి ‘’రూపం తో పరస్పరం ఉన్న సద్గుణాలతో పెరిగింది వారిమధ్య అనురాగ బంధం. రాముడి మనసులో సీత కంటే సీత మనస్సులో రాముడు ఎక్కువగా కొలువై ఉన్నాడంటారు .అడవికి వెళ్ళేటప్పుడు సీతకు నార చీర కట్టుకోవటం రాక పొతే రాముడే చుట్టాడు .సీతారాముల ప్రేమను ఆలంకారికులు ‘’నీలి రాగం ‘అన్నారని ఆచార్య వాక్కు .ప్రతి వర్ణనలోను వాల్మీకి సంయమనం తో చిత్రిస్తాడు .మంత్రం శాస్త్రం లో రామాయణానికి ప్రచారం ఉంది .కార్య సిద్ధికోసం సుందర కాండ ,పారాయణ చేస్తారు .సుఖ ప్రసవానికి రామ జన్మ సర్గ పారాయణ ,కన్యా వివాహానికి సీతారామ కళ్యాణ సర్గ ,’’ధర్మాత్మ సత్య సంధశ్చశ్లోకాన్ని ఆపద నివారించుకోవటానికి జపిస్తారు .లలితా ఉపాసకులు రామాయణాన్ని లలితా దేవిగా భావించి పారాయణ చేస్తారు. శాక్తులూ దీన్ని పారాయణ చేస్తారు .లలితాదేవి శ్రీరాముడిగా అవతరించిందని శాక్తేయుల నమ్మకం .శ్యామలా దేవికి పురుష వేషం వేస్తె శ్రీ కృష్ణుడు అవుతాడట ‘
రేపు 10-9-14బుధవారం విశ్వనాధ వారి 120వ జయంతి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-14-