కాళోజి ప్రజల మనిషి -ఆంధ్రజ్యోతి సంపాదకీయం – ననుమాన స్వామిరాసిన ”తెలంగాణా కీర్తి పతాక ”

అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్‌ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అణగారిపోయిన తరువాత, ఎటువంటి అలజడీ లేని కాలంలో కూడా ప్రతి రాషా్ట్రవతరణ దినోత్సవాన అసెంబ్లీ ఎదుటి గన్‌పార్క్‌ దగ్గర నివాళు లర్పిస్తూ వచ్చిన అతి కొద్దిమందిలో కాళోజీ ఒకరు. విశ్వసించిన అంశాలపై గట్టి కట్టుబాటు, దాన్ని ప్రకటించడానికి సాహసమూ – రెండూ ఉన్న అరుదైన వ్యక్తిత్వం కనుకనే, కాళోజీని ఫ్రెంచి కవి, రచయిత లూయీ ఆరగాన్‌తో శ్రీశ్రీ పోల్చారు. అత్యంత సంక్షోభ కాలంలో కూడా ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీని వదలకుండా నిలబడ్డ రచయిత లూయీ ఆరగాన్‌.
కాళోజీ కవిత్వమూ రచనలూ ఆయన జీవితం నుంచి వేరు కావు కనుకనే, జీవితాచరణే ఆయన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతి అంశంలోనూ ప్రజాహితమైన వైఖరి తీసుకోవడం, న్యాయం మీద ఉద్వేగపూర్వకమైన ఆకాంక్షను ప్రకటించడం, స్వార్థరహితమైన జీవితాన్ని గడపడం- క్లుప్తంగా చెప్పవలసివస్తే ఇవీ ఆయన గుణగణాలు. మహారాష్ట్ర కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, తెలుగు సాహిత్యంలో, సమాజంలో విశేషమైన పాత్రను పోషించడం ఒక విశేషమైతే, తెలుగు భాషపై ఇతర భాషల ఆధిపత్యాన్ని, తెలుగు భాషలోని కొన్ని రీతులపై సొంతవారే ప్రదర్శించే వివక్షను ప్రతిఘటించడం మరో విశేషం. తెలంగాణ తోను, ప్రత్యేక ఉద్యమంతోను కాళోజీ అనుబంధం ఆయన వ్యక్తిత్వంలో ఒకానొక పార్శ్వం మాత్రమే. ఆయనకు తెలుగునేల నాలుగుచెరగులా మిత్రులున్నారు, ఆయన ఇష్టపడిన రచయితలు, ఆయనను ఇష్టపడిన పాఠకులు అన్నిప్రాంతాలలోను ఉన్నారు. అటు శ్రీశ్రీకి, ఇటు విశ్వనాథ సత్యనారాయణకి ఆయన సన్నిహితుడు. ప్రజాస్వామికవాదిగా ఆయన గళం విప్పని తెలుగు జిల్లా లేదు. ఆయన పోరాడని అంశం లేదు. అందుకే, ఈ రోజు రెండు తెలుగు రాషా్ట్రలలోను కాళోజీ శతజయంతిని అభిమానులు జరుపుకుంటున్నారు.
కాళోజీ తన కవిత్వాన్ని ‘గొడవ’ గానే చెప్పుకునేవారు. తన గొడవ ప్రజలందరి గొడవ అని ఆయన అనేవారు. కొంత వాడుక భాష, కొంత సరళగ్రాంథికం, కొంత లయ, కొంత ప్రాస- ఇవన్నీ కలిస్తే ఆయన కవిత. తాననుకున్నది, తాను చూసింది వెంటనే కవిత అల్లడం ఆయన అలవాటు. ఆయన కవితలు అనేకం సూక్తులుగా జనం నోట నానాయి. కబీర్‌ వంటి భక్తకవుల ‘దోహా’ సంప్రదాయం కాళోజీదని భారత ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన మిత్రుడు పి.వి. నరసింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎంతటి దగ్గరివారినైనా, ఎంతటి గొప్పవారినైనా నిర్మొహమాటంగా తప్పుపట్టే కాళోజీ సోదరులంటే తనకు ఎంతో భయమూ బెరుకూ అని పి.వి. అనేవారు. కాళోజీ అన్న, ఉర్దూ కవి షాద్‌ కాళోజీ రామేశ్వరరావు, తమ్ముడి ద్వారానూ, తాను సొంతంగానూ పరిసరాలను, సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. మిత్రుడు పి.వి. అభ్యర్థనను కాదనలేకనే కాళోజీ ‘పద్మవిభూషణ్‌’ గౌరవాన్ని స్వీకరించారు. ఆ పురస్కారాన్ని స్వీకరించిన తరువాత కూడా కాళోజీ ప్రజానుకూలత రవ్వంత కూడా తగ్గలేదు, ఏలికలపై విమర్శల పదునూ తగ్గలేదు.
తెలుగుసమాజానికి ఒక పెద్దదిక్కుగా, ప్రజాస్వామికవాదులందరికి అండగా వ్యవహరించిన కాళోజీ, మలిదశ తెలంగాణ ఉద్యమం బలపడే దశ వరకు సజీవులుగా ఉండి ఉంటే, విమర్శనాత్మకమైన మార్గదర్శకత్వం అందించి ఉండేవారు. ఆయన లోటు గత పన్నెండేళ్లుగా తెలుగుసమాజం అనుభవిస్తూనే ఉంది. ఆయనకు తిరుగులేని నైతికాధికారం కానీ, గౌరవం కానీ సంక్రమించడానికి కారణం కేవలం ఆయన కవి కావడం మాత్రమే కాదు, గాంధేయవాదో, ప్రజాస్వామిక వాదో కావడం మాత్రమే కాదు. ఏ సిద్ధాంతాన్ని కూడా ఆయన బేషరతుగానో, తాను రాజీపడి కానీ ఆమోదించలేదు. ‘పార్టీవ్రత్యం’ తనకు లేదని ఆయన చేసిన వ్యాఖ్య ఒకనాడు వివాదాస్పదమైనది కూడా. తాను సొంతంగా ఏది న్యాయం, ఏది ధర్మం అని భావించారో దానిని గాఢంగా, మమత్వంతో దగ్గరకు తీసుకోవడమే ఆయనలోని బలం. దేనినీ ఖాతరు చేయకపోవడం, కష్టనష్టాలను స్థితప్రజ్ఞతతో స్వీకరించడం, చిరునవ్వును కన్నీటిని ఏ తెరలూ లేకుండా ఉప్పొంగించడం- కాళోజీని పసిబాలుణ్ణి చేశాయి, ప్రజల మనిషిని చేశాయి. పుట్టుకనూ చావునూ సొంతం చేసుకుని, తక్కినదంతా దేశానికి ఇచ్చిన త్యాగశీలిని చేశాయి.
అన్యాయాన్ని, ఆగ్రహాన్ని, పోరాటాన్ని, నిర్వేదాన్ని పాడుకుంటూ సంచరించిన ప్రజాకవి కాళోజీ. తన జీవితాన్ని, స్మృతిని గొప్పస్ఫూర్తిగా మిగిల్చిపోయిన ధన్యజీవి కాళోజీ. ఆయన తన గురించి పాడుకున్న ఈ కవిత అక్షరాలా ఆయన జీవితవేదం.
‘‘అతిథివోలె వుండి వుండి
అవని విడిచి వెళ్లుతాను
…..
గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను
లోయలలో దూకి దూకి లోతులెన్నొ చూచినాను
..
నే ప్రాకని ఎత్తు లేదు
నేజారని లోతు లేదు

మూలజేరి మునుల వోలె మూగనోము బట్టినాను
ఈగవోలె దోమవోలె
వాగుచు తిరుగాడినాను’’
కాళోజీలో నిజాయితీగల నాయకత్వం, ప్రాణాన్ని సహితం లెక్క చేయక ప్రశ్నించే తత్వం, నిలువెల్ల నింపుకొన్న తెలంగాణ సెంటిమెంట్‌ ఆనాటి యువతకే గాదు ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ‘అక్షరరూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటూ కవులకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. అన్యాయాన్నెదిరించడమే జీవితలక్ష్యమైన వారు కాళోజీ.

తెలంగాణ కవుల్లో ఎవరికీలేని విలక్షణత ఒక్క కాళోజీ నారాయణరావులోనే కనిపిస్తుంది. ఆయన పూర్తిపేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరావు రాజారాం కాళోజీ. అమ్మమ్మది కర్ణాటక, తండ్రిది మహారాష్ట్ర. తాను జీవించింది తెలంగాణ ప్రాంతంలో కావడంతో ఆయన జీవితం మూడు రాష్ట్రాలతో ముడివడి వుంది. 1947 తరువాత దేశంలో చోటుచేసుకున్న ఉద్యమాలలో ఆయన సమరశీలమైన పాత్రనే వహించారు. సాయుధ పోరాటాన్ని సమర్థించారు. నిప్పుకుచెదలంటుతుందేమో గానీ ఆయన జీవితానికి అంటదు. బుద్దెరిగిన నాటి నుంచి ఏ సిద్ధాంతాలను నమ్మాడో జీవితాంతం వాటికోసమే పనిచేశారు. ధిక్కార స్వరం, తిరగబడేగుణం, తెలంగాణ పౌరుషం కొట్టొచ్చినట్టు ఆయనలో కనిపిస్తుంది. 1952లో తెలంగాణలో తొలిసారి పెల్లుబికిన ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటం, తుదిదశ తెలంగాణ పోరు(2002)లో అంటే అరవై యేండ్లు తెలంగాణ జెండా ఎత్తుకొని భుజం మీద మోశారు. ఖలీల్‌ జీబ్రాన్‌ ‘ది ప్రాఫెట్‌’ను ‘జీవన గీత’గా అనువదించడమే గాదు ప్రతిఘటన కావ్యం ‘నా గొడవ’ లాంటివి రచించి పేరొందారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మవిభూషణ్‌’ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
కాళోజీకి సంబంధించిన అన్ని వాదాలు దేశ ప్రజల పరమైనవయితే, ఒక్క తెలంగాణ వాదం మాత్రం ఆయనకు స్వంతమయింది. ఆయన తనువూ మనసూ తెలంగాణదే. తొలి సాధారణ ఎన్నికలు 1952లో వచ్చాయి. ఆ సంవత్సరమే ‘గైర్‌ (నాన్‌) ముల్కీ గో బ్యాక్‌ ’ ఉద్యమం పుట్టింది. ఎక్కడ ఉద్యమం పుడితే అక్కడ ప్రత్యక్ష మయ్యే గైర్‌ ముల్కీ గోబ్యాక్‌ ఉద్యమంలోనూ ప్రత్యక్షమై దాన్ని వేగవంతం చేశారు. కాళోజీ పిలుపందుకున్న ప్రజలు తామర తంపరలుగా ఉద్యమంలోకి చేరి ఆనాటి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఉప్పెనలా ఉద్యమించిన ప్రజలను బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపిస్తే ఆ తుపాకి తూటాలకు 18 మంది బలయ్యారు. 1953లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పరిచింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. తెలంగాణకు న్యాయం జరగలేదు. 1968 జూలై 10న ‘తెలంగాణ రక్షణ దినం’ పాటించాలని వచ్చిన నిరసన ఉద్యమంలో కాళోజీ కీలక పాత్ర వహించారు.
1969 జనవరిలో తెలంగాణ పోరురగుల్కొని ఉధృతంగా సాగింది. అదే నెల 22న కాళోజీ ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ తరఫున పెద్ద సదస్సును జరిపారు. మరునాడే వరంగల్‌లోని జయప్రకాష్‌ నారాయణ్‌ రోడ్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారి వ్యాపార సముదాయాలపై తెలంగాణ వాదులు దాడులు చేశారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి మింట్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ, శ్రీరామాంజనేయ రైస్‌ మిల్లు, ఫిలిప్స్‌ రేడియో షాపు, మరికొన్ని దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఉద్యమానికి ఒక జెండా, ఎజెండాను సిద్ధం చేసుకొని 1969 ఫిబ్రవరి 29న రాజకీయేతరంగా తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది. అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ పిలుపు మేరకు తెలంగాణ పోరాట దినాన్ని పాటించడం జరిగింది. అది జరిగిన వారం రోజులకు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిలో చేరారు.
1969 మే లో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి ఉద్యమంలోకి దూకారు. జూన్‌ 6న కాళోజీ అధ్యక్షుడుగా రచయితల సదస్సు జరిగింది. పది రోజుల తర్వాత 1969 జూన్‌ 16న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. కాళోజీ, చిరంజీవి, జయశంకర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు హింసకు దిగారు. ఆ రాత్రికి రాత్రే పోలీసులు ప్రజాసమితిలో ఉన్న విద్యార్థిసంఘ నాయకులను అరెస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. నర్సంపేటలో చింతకింది వీరమల్లు, ననుమాసస్వామి, ఆయన గాయక బృందాన్ని, కె.సుదర్శనరావు, పింగిళి మాధవరావులతో సహా 94 మందిని తొలుత అరెస్ట్‌ చేశారు. బహుశా 1969 ఉద్యమానికి సంబంధించి విద్యార్థులు క్రిమినల్‌ కేసుల కింద అరెస్ట్‌ అయినారు. నర్సంపేట వారేనని చెప్పాలి. ఆ విధంగా అరెస్ట్‌చేసిన పోలీసులు 1969 జూన్‌ 17న నుంచే రోజుకు 25 మంది విద్యార్థుల చొప్పున జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరుస్తూ జూన్‌ 20న తేదీ దాకా వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు పంపుతూ పోయారు. ఒక్క వారం రోజుల్లోనే అంటే జూన్‌ 21 నాటికే 94 మంది నర్సంపేట విద్యార్థులను కోర్ట్‌ ఆదేశాలతో వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కుక్కారు. జూన్‌ 24 నాటికి ఈ నర్సంపేట పోరాటయోధుల అరెస్ట్‌ 260కి చేరింది. ఆ తర్వాత ఉద్యమ నాయకుడైన కాళోజీని, విద్యార్థి నాయకుడు చిరంజీవిని 151వ సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేశారు.
న్యాయవాది వృత్తిలో చట్టాన్ని కరతలామలకం చేసుకొన్న కాళోజీ పౌర హక్కుల పరిరక్షణకు దాన్నొక ఆయుధం చేసుకొన్నారు. ఆయన 37 సంవత్సరాల వయస్సులో అంటే 1952లో ‘గైర్‌ ముల్కీ గో బ్యాక్‌’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటికి ఉద్యమాల్లో అనుభవం గడించి నాటి యువతకు స్ఫూర్తిని కలిగించారు. జూన్‌ రెండో తేదీన జరిగిన కాల్పులకు నిరసనగా మూడో తేదీన అనుకొంటాను ఆనాడు వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో పెద్ద బహిరంగ సభ జరిగింది. సభ మొదలయింది. వరంగల్‌ జిల్లా తెలంగాణ ప్రజాసమితి నాయకులను నిర్వాహకులు పిలుస్తున్నారు. అప్పుడు వేదికకు ఎదురుగా కాళోజీ మా (ననుమాసస్వామి)గాయక బృందం మధ్య కూర్చొని వున్నారు. మేము పాడే రెండు పాటలు అయ్యయ్యో బ్రహ్మయ్యా, ఉల్లిచెట్టు మల్లిగాదు నచ్చాయని, అయితే తెలంగాణ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే గీతాలు రాయాలని ఉపదేశించారు. ఆయన స్ఫూర్తితో ‘నా తెలంగాణ సమరాలకు నెలవైన నేల’ అనే పల్లవితో స్వామి రాసిన దానిని మా గాయక బృందం వినిపించి ప్రశంసలు పొందారు. కాళోజీలో నిజాయితీగల నాయకత్వం, ప్రాణాన్ని సహితం లెక్క చేయక ప్రశ్నించే తత్వం, నిలువెల్ల నింపుకొన్న తెలంగాణ సెంటిమెంట్‌ ఆనాటి యువతకే గాదు అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ‘అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటూ కవులకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు.
తెలంగాణ ప్రజలందరికీ కాళోజీ ప్రాణంలో ప్రాణమై మెదిలారు. ఇక్కడి జనజీవన చారిత్రక గమనంలో అప్రమత్తమై ప్రజలను ముందుకు నడిపించారు. అన్యాయాన్ని ఎదిరించడమే జీవితలక్ష్యమైన వారు కాళోజీ. వందేమాతర ఉద్యమం, సత్యాగ్రహోద్యమం, రజాకార్ల నిరసనోద్యమాల్లో పాల్గొన్న అరుదైన కవి కాళోజీతో తెలంగాణ ఉద్యమంలోనే గాదు, ఆ తర్వాత నడిచిన ఉద్యమాలతో కలిసి నడవడం అపూర్వంగా భావించేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మరణం లేని ఆయనకు సజీవ గుర్తులమై మేమున్నామనే గర్వం మాకు ఉందనే వాళ్ళలో నేనొకణ్ని. త్యాగం కాళోజీది బతుకంతా తెలంగాణది. ఇంతటి మహోన్నతుని శతజయంతి తెలంగాణ ఇంటింటి పండగ కావాలి.
ుఽ ప్రొఫెసర్‌ ననుమాసస్వామి
రాష్ట్ర అధ్యక్షుడు, 1969 పోరాటయోధుల సంఘం
(నేడు కాళోజీ శతజయంతి)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.