విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం

విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం

10-9-14కవి సమ్రాట్ ,పద్మభూషణ్ ,కళాప్రపూర్ణ ,జ్ఞాన పీఠ పురస్కృత బ్రహ్మశ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 120వ జయంతిఉత్సవం ఉదయం  విజయవాడ మాచవరం లోని వారి స్వగృహం ‘’కల్ప వృక్షం ‘’లోవారి మనుమల చేత , సాయంత్రం శ్రీ ఘంట సాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యం లోను నిర్వహించ బడింది. రెండిటికి భక్తీ శ్రద్ధలతో  నేనూ నా భార్య ప్రభావతి హాజరై జీవితాలను ధన్యం చేసుకోన్నాం  .ఉదయం ఎనిమిదింటికే ఉయ్యూరులో టిఫిన్ చేసి బయల్దేరి మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ,తర్వాత విశ్వనాధ వారింటికి వెళ్లి ఉదయం కార్యక్రమం లో పాల్గొని ,హోటల్ లో భోజనం చేసి ,తర్వాత ఐ టి ఐ దగ్గరున్న స్టేట్ బాంక్ కాలనీలో  ఉంటున్న మా తోడల్లుడి గారింటికి వెళ్లి నాలుగింటిదాక విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయల్దేరి సీతారాం పురం లో ఉంటున్నడాక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారింటికి వెళ్లి  ,వారిని దర్శించి ,అక్కడినుండి సత్యనారాయణ పురంలో ఘంట సాల మ్యూజిక్ కాలేజ్ లో జరిగిన విశ్వనాధ వారి పై ప్రభుత్వ కార్యక్రమం అయిన శ్రీ గారిక పాటి వారి ప్రసంగం  విని ,నిన్నటి రోజును పూర్తిగా సార్ధకం చేసుకోన్నాము .ఆ విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .

ముచ్చటైన చిరంజీవులు – ముగురన్న దమ్ములు

ఒక కార్యక్రమాన్ని స్వంత భుజ స్కంధాలపై భారం వేసుకొని దానికొక సంపూర్ణ రూపాన్నిచ్చి ,ఆచరణ లోకి తేవటం తేలికైన విషయం కాదు .దాన్ని సుసాధ్యం చేశారు విశ్వానాధ గారి మనుమలు ఛి విశ్వనాధ సత్యనారాయణ ,మనోహర శ్రీ పాణిని ,శక్తిధర పావకి .తాతగారి సాహిత్యాన్ని ఆసాంతం చదివి ఆకళింపు చేసుకొని దారాపాతం గ వారి కలప వృక్ష పద్యాలను నోట పలుకుతూ ,అనన్యమైన భక్తీ శ్రద్ధలతో తాతగారి ఆశయాన్ని తండ్రి కీ .శే పావని శాస్త్రి గారి ఆశయానికి అంకితమై ,అందరికీ ఆదర్శ ప్రాయమైనారు .ఇందులో మొదటి చివరి కుర్రాళ్ళది ముఖ్య పాత్ర అయితే మధ్యలో ఆతను అన్నా తమ్ములను వీర విదేయం గా అనుసరిస్తున్నారు .ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధార పడకుండా తమ సంపాదనలో కొంత భాగాన్ని తాతగారి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకొంటున్న ధన్యులా సోదరులు .వారిని యెంత అభినందించినా తక్కువే .దాదాపు పది ఏళ్ళనుంచి జనవరిలో జరిగే పుస్తక మహోత్సవం లో విశ్వనాధ వారి స్టాల్ పెట్టి సమగ్ర సాహిత్యాన్ని అందజేస్తున్న పుణ్య మూర్తులు .అంతకు ముందు తండ్రి పావని గారికి అండగా నిలబడేవారు .అప్పటి నుంచే నాకు పరిచయమే .ఈ  మధ్య ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్రం నుండి విశ్వనాధ పైస్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి సారధ్యం లో ప్రసారమైన ‘’వేయి పడగలు ‘’నవలపై వారం వారం వచ్చిన కార్యక్రమాలపై నేను రాసిన సమీక్షలు వారి మెయిల్ అడ్రస్ కు పంపటం తో మనుమడు సత్యనారాయన తో పరిచయం గాఢ మైంది .ఫోన్లు చేసి మాట్లాడటం అలవాటైంది . బుధ జన విధేయులు ,తల వంచని దీరుల్లా కన్పించారు ఆసోదర త్రయం .వారిని తీర్చి దిద్దుతున్నది వారి తల్లిగారు శ్రీమతి రాజేశ్వరి గారు .ఆమె విశ్వనాధకు కూతురు బిడ్డ ,పావని భార్యయై కోడలైన మనుమరాలు కూడా .ఇంటి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి మమ్మల్నీ రమ్మంటే వెళ్లాం .ఇంటి వద్ద తాతగారిజయంతి జరపటం వాలళ్ళకోచ్చిన గొప్ప ఆలోచన. కార్య రూపం దాల్చింది .సఫలమైంది .వారికి శుభాభినందనలు .

కల్ప వృక్షం

శిధిలమైన తాత గారి ఇంటిని తమకున్న వనరులతో సర్వాంగ సుందరం గా రూపు మార్చి ‘’కల్ప వృక్షం ‘’అని సార్ధక నామం పెట్టిన వారి సుమనస్కత ఎన్న తగినది .తాతగారికిస్టమైన ‘’కదంబ వృక్షం ‘’ను పెంచుతున్న వారి భక్తీ కి ఆశీస్సులు . ఆయింటిని గొప్ప సందర్శక కేంద్రం గా మార్చాలనుకొంటున్న వారి భావనకు అభినందనలు .ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొంటే ఇక ఇంతే సంగతులు .ఆ విషయంలో  వారు జాగ రూకులై ఉంటారని ఆశిస్తున్నాను .ఇంటిలో తాతగారి చాయా చిత్రాలు ,ఉపయోగించిన వస్తువులు ,రాసిన పుస్తకాల ప్రదర్శన పెట్టాలనే వారి కోరిక త్వరలో కార్య రూపం దాలుస్తోంది .విశ్వనాధ విగ్రహమూ అక్కడ వెలువ బోతోంది .’’విశ్వ నాద ఫౌండేషన్ ‘’ను సోదరులు ఏర్పరచి కృషి చేసి అందరి దృష్టికి ఆయన సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు .కల్ప వృక్షం రామాయణానికే కాక ‘అందరికి ‘’సాహిత్య కల్ప వృక్షం ‘’కావాలని నా కోరిక. చేయగల సమర్ధులు  వారు అనే నమ్మకమూ కనిపించింది .

శ్రీమతి  రాజేశ్వరి గారు

మేమిద్దరం లోపలి వెళ్లి రాజేశ్వరి గారిని చూసి మాట్లాడాం .ఉయ్యూరు నుంచి వచ్చాం. అంటే ఎంతో సంబర పడిపోయారు .మా విషయాలు అడిగి తెలుసుకొన్నారు .విశ్వనాధ గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరులో ట్యుటోరియల్ కాలేజిలో తెలుగు పండితులుగా పని చేశారని ,మా ఇంటికి నెల నెలా వచ్చి పాత ఒడ్లు బస్తాలు కొని తీసుకొని వెళ్ళేవారని ,తరచుగా కలిసి మాట్లాడుకోనేవారమని ,తానె తమ అన్నగారు చెప్పిన వ్యాసాలను పుస్తకాలను రాశానని చెప్పేవారని గుర్తు చేసుకొన్నాను ఆమెతో .అంతేకాదు వెంకటేశ్వర్లుగారి అబ్బాయి వ్స్వర్గీయ వేణుగోపాల్ నా దగ్గర ట్యూషన్ చదివే వాడని ,అతని చదువు సంగతి ని ఎప్పటికప్పుడు ఇంటికొచ్చి తెలుసుకొనే వారని చెప్పాను .గోపాల్ కుమారుడు మురారికి హైదరాబాద్ లో ఉంటున్న మా పెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ కుమార్తె ఛి సౌ భార్గావి నిచ్చి వివాహం చేశారాని ఈరకం గా బాంధవ్యమూ ఉందని చెప్పాం . విశ్వనాధ ఎస్ ఎస్ ఆర్ కాలేజిలో పని చేసినప్పుడు నేను 1956-60కాలం లో ఇంటర్ ,డిగ్రీలు చదివానని ,అయన నాక్లాసుకొచ్చి పాఠాలు చెప్పారని దువ్వూరి రామి రెడ్డి గారి ‘’పాన శాల ‘’చెప్పటం ఇంకా గుర్తుందని అన్నాను .

మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు  అనంత పురం జిల్లా హిందూ పురం మునిసిపల్ హై స్కూల్ లో ఇరవై రెండేళ్ళు సీనియర్ తెలుగు పండితులు  గా ఉండేవారని నా చిన్నతనం అక్కడే గడిచిందని చెప్పా .అప్పుడు విశ్వనాధ వారు సభలకోసం హిందూ పురం ,చుట్టూ  ప్రక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవారని ఆతిధ్యాన్ని మా తలిదండ్రులు ఇచ్చేవారని మ అమ్మగారు భవానమ్మ గారు ఎప్పుడూ చేబుతూ ఉండేవారని ,మా నాన్న గారికి విశ్వనాధ అంటే విపరీతమైన అభిమానం అని ఉయ్యూరుహైస్కూల్ లో పని చేసినప్పడు విశ్వనాధను ఆహ్వానించి1952లో  వారం రోజులు కల్ప వృక్షం పై మాట్లాడిం చటం నాకు ఇంకా గుర్తుందని చెప్పా. ఇంగ్లీష్ లెక్చరర్ .శ్రీ జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారు సంస్కృత అధ్యాపకులు  శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు కూడా హిందూ పురం లో మా ఇంట ఆతిధ్యం పొందారని మా అమ్మగారు గుర్తుచేసుకున్న విషయాన్నీ వివరించా .అప్పటినుంచి మా కుటుంబాకి విశ్వనాధ తో పరిచయం అని చెప్పాను .చాలా ఆనంద పడి మా ఇద్దరినీ బంధువులుగా భావించి టీ తెప్పించి తోటి కోడలు చేత ఇప్పించారు .కుమారులకు ఆమె గొప్ప ప్రేరణ గా కనిపించారు .తాతా, మామ అయిన విశ్వనాధ కు సేవ చేసి మెప్పుపొందానని  ఆమె అన్నారు .మా శ్రీమతి విశ్వనాధ గారి ప్రధమ కళత్రం గారి పుత్రులు శ్రీ కృష్ణ దేవరాయలు గారి భార్య తో వారి పిల్లలతో తానూ ప్రక్క ఇంట్లో తన చిన్నతనం లో ఆడుకోన్నానని ,జ్ఞాపకం చేసుకొన్నది .నేను కృష్ణ దేవరాయలు గారు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’అనే పేరుతొ వచన రామాయణాన్ని రాశారని అమెరికా తెలుగు పత్రిక లో అది ధారావాహికం గా ప్రసారమిందని నేను చదివానని గుర్తు చేసుకొన్నాను .  అక్టోబర్ పందొమ్మిదవ తేదీ ఆదివారం  విశ్వనాధ స్వగ్రామం నందమూరు లో వారి వర్ధంతి సభను ‘’సరసభారతి ‘’నిర్వ హిస్తోందని ,పింగళి వారి చిట్టూర్పు లోను ,పెండ్యాల వారి స్వగ్రామం కాటూరు లోను ఇలాగే నిర్వహించామని తెలియ జేస్తే ఆమె ఏంతో సంతృప్తి చెందారు .సరసభారతి ప్రచురణలు, నేను రాసిన ‘’శ్రీహనుమత్ కదా నిధి శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధ యోగి పుంగవులు మహిళా మాణిక్యాలు ,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అయిదు పుస్తకాలు మనువళ్ళ పేర ఆప్యాయం గారాసి  రాజేశ్వరిగారికి అందజేస్తే ఆమె ఇవన్నీ తప్పక చదవాల్సినవే నని చదివి సార్ధకం చేస్తానన్నారు .

కల్ప వృక్షం లో   విశ్వనాధ జయంతి  సభ

పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభ పదకొండుకు ప్రారంభమైంది . ముందు కాసేపు పావకి విశ్వనాధ పద్యాలు పాడి వినిపించాడు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు రాగానే విశ్వనాధ చిత్రానికి పూల మాల వేసి నమస్సు లర్పిచారు మా అందరి చేతా చేయించారు .బుద్ధ ప్రసాద్ గారికి ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’ఇస్తూ ‘’మీ ఆవిష్కరణకు నోచుకోని పుస్తకం ‘’అని చెప్పి నవ్వాను .ఆయనా నవ్వారు .పూర్ణ చంద్ నా ప్రక్కనే ఉండి’’దుర్గా ప్రసాద్ గారి తీవ్ర పరిశోధనా గ్రంధం ఇది ‘’అన్నారు బుద్ధ ప్రసాద్ గారితో .పావకి ప్రార్ధన  లెక్చరర్ బాలకృష్ణ పర్య వేక్షణ  లో సభ జరిగింది .నేపధ్యాన్ని సత్యనారాయణ వివరించాడు .తమ తాతగారి తండ్రిగారు విశ్వనాధ శోభనాద్రి గారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే శివలింగం రెండు చేతుల్లోకి దైవ సంకల్పం గా వచ్చి చేరిందని అప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా  నంద దమూరు లో ప్రతిష్ట చేసే దాకా దాన్ని కింద పెట్టకుండా చేతుల్లోనే ఒకరితర్వాత ఒకరు జాగ్రత్తగా పట్టుకొని ఉండి ప్రతిష్టించి దాని శక్తిని కాపాడిన మహా చరితులని గుర్తు చేసుకొన్నాడు .ఇప్పటికీ  అక్కడి ఆలయం తమ కిందే ఉందని చెప్పాడు .ఫౌండేషన్ ఏర్పాటు గురించి వివరించాడు .ఆశయాలు ,పడిన పాట్లు ముందుకు, దూసుకొని పోతున్న మొక్క వోని ధైర్యాన్ని వివరించి అందరి ప్రశంసలు అందుకోన్నారా సోదర త్రయం .ప్రతినెలా కల్ప వృక్ష చాయలో ఒక కార్య క్రమం నిర్వహించాలనే ఆశయం లో ఉన్నారు వారు .శుభం భూయాత్ అనారు అందరూ .

తాతయ్య మామ

ముందుగా శ్రీమతి రాజేశ్వరి గారు తమ అనుభవాలను తెలియ జేశారు సుదీర్ఘం గా ఆత్మీయం గా ఆర్ద్రం గా .’’నేను విశ్వనాధ  కుమార్తెకు కూతురిని .నేను పుట్టగానే ఎత్తుకొని తాతయ్య విశ్వనాధ మా అబ్బాయి పావని ని పెళ్లి చేసుకో . ఆస్తి అంతా రాసిస్తాను .అన్నాడు .ఆయన వశ్య వాక్కు .దానికి మహిమ ఉంది అలానే ఆయనకు  కోడలినైన మనవరాలు అయిన   నాకు ఈ ఇంట్లో రెండు బాధ్యతలు కోడలిగా మనవ రాలిగా .ఆయన నన్ను మనవరాలిగానే ముద్దు చేశాడు .ఏనాడు పెత్తనం చేయలేదు. తాతయ్యా అమ్మమ్మా వారిఇంట్లో పిల్లగానే పెరిగాను .పావని గారితో కాపురం చేశాను .తాతయ్యకు వంట బాగా వచ్చు .అన్నీ సాయం చేసేవాడు .అమ్మమ్మా కు నేను ప్రాణం .పిల్లలు ఇంట్లో అరుస్తున్నా అల్లరి చేస్తున్నా తాతయ్య ఏకాగ్ర మైన రాతకు ,చదువుకు ఇబ్బంది పడేవాడు కాదు. అసలు పట్టించుకోనేవాడు .అంతటి ఏకాగ్రత ఉండేది .సినిమాకు డబ్బులడిగితే ఉంటె పంపేవాడు .లేక పొతే చేతికొచ్చిన తర్వాత ‘’సినిమాకి అఘోరించండి ‘’అని చెప్పి చేతిలో డబ్బు పెట్టేవాడు .ఆయన చూడని ఇంగ్లీష్ సినిమా ఉండేదికాదు .అయన పుస్తకాలు చదివితే ప్రపంచం అంతా తెలుస్తుంది .అర్ధం కాక పోవటం ఉండదు. ఆయన రాసినవన్నీ నేను చదివి లోక జ్ఞానం పొందాను .ఒక సారి నేను పుస్తకం  చదువుతో అందులో లో లీనమై పోయా .అమ్మమ్మ పిలిచినా విన పడలేదు .అప్పుడు తాతయ్య’’ అమ్మాయీ అమ్మమ్మ పిలుస్తోంది విన పడలేదా?’’ అని అడిగితె లేదని చెప్పాను  ఏంచేస్తున్నా వని అడిగితె’’విశ్వనాధ ట. ఎవరో రచయిత ట .ఆయన రాసిన కాశ్మీర రాజుల నవల కవలలు చదువుతున్నా .లోకమే తెలియ లేదు .ఇది రాసిన ఆయనది తప్పుకాని  తప్పునాదా?  అని దబాయించాను.ఆయన ముసి ముసి నవ్వులు నవ్వాడు .నేను ఎప్పుడైనా మా పుట్టిల్లు గుంటూరు వెడితే వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేసేవాడు. నేను ఇంట్లో తిరుగుతూ ఉంటె ఆయాయనకు ఆనందం సంతృప్తి .వేయిపడగలు నవలకు వచ్చిన డబ్బుతో అరవై ఏళ్ళ క్రితం ఇక్కడే స్థలం కొని ఇల్లుకట్టాడు .అప్పుడు నేను పుట్టాను .అంటే ఈ ఇంటికి షష్టి వత్సరం కూడా .అందరూ విశ్వనాధ ను చదవండి జీర్ణం చేసుకొని అనుస్టించండి ఆయనకు తెలియని విషయం లేదు. చదవని ఇంగ్లీష్ పుస్తకం లేదు .అన్నీ చదివి ఆకళింపు చేసుకొన్నా వాడే అయినా తన దోరణిలో తానూ రాసి గొప్ప సృష్టికర్త అయ్యాడు .జ్ఞాన పీఠ పురస్కారం వస్తే, దీనికంటే కిలో ఇరవై రూపాయలకు పెరిగిన మిర్చి ధర తగ్గిస్తే సంతోషించేవాడిని అన్న నిర్లిప్తుడే కాక అందరికి ప్రభుత్వం మేలు చేయాలనే సామ్య వాది విశ్వ నాధ ను మించి సోషలిస్టు కమ్యూనిస్టూ లేడు .కాని సనాతనం అనే ముద్ర వేసి తమను తామే వేలివేసుకొన్నారుపాపం  కొందరు .తాతయ్య నాకు అన్నీ ఇచ్చాడు .ఈ ఇల్లు అయన ఆన్నట్లే నాకే రాశాడు .నా భర్తా, పిల్లలు తాతయ్య వారసత్వానికి అంకితం అవటం నాకు గర్వం గా ఉంది .నేనేదో పైనుండి చెప్పేదాన్నే కాని వాళ్ళే అన్నిటా స్వంతం గా ఆలోచించి మంచి నిర్ణయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు .మా అంద కోరికా  ఈ కల్ప వృక్షం ఒక ప్రముఖ దర్శనీయ  కేంద్రం గా వర్ధిల్లాలని. మా శక్తి మేరకు మేము ఆ దిశలో సాగుతున్నాం .మీ అందరి తోడ్పాటు ఉంటె సుసాధ్యమే  అవుతుందని నమ్ముతున్నాం .’’అని చాలా భావా వేశం గా కన్నీరు  కారుస్తూ గత స్మృతులను నేమరేసుకొంటూ  సందర్భానికి తగినట్లు విశ్వనాధ సాహితీ విశ్వరూపాన్ని   బాంధవ్య మాధుర్యాన్ని విశ్వనాధ కుటుంబం తో తనకున్న కోడలి మనవరాలి పాత్రలను అందరి ప్రేమాస్పదాలను చాలా గంభీరం గా ,తడబాటులేకుండా విశ్వనాధ కోడలిగా తాతయ్య రచనలను సర్వం జీర్ణించుకొన్న మనవరాలిగా పావని గారి భార్యగా సోదరాత్రయానికి  తల్లిగా తన అనుభవాలను అతి సరళం గా గుండె లోతుల్లోంచి అందించి అందరి ప్రశంసలు పొందారు శ్రీమతి రాజేశ్వరి గారు  .

శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’విశ్వనాధ  తమ తండ్రిగారు మండలి వెంకట కృష్ణా రావు గారికి ఒక పుస్తకం అంకితమిచ్చిన నాటి నుండి తెలుసనీ ,తెలుగు పండితులు శ్రీజోశ్యుల  సూర్య నారాయణ  గారు దగ్గరుండి విశ్వనాధ సాహిత్యాన్ని చదివించి ,ప్రభావితం చేశారని విశ్వనాధ సోదర త్రయం చేస్తున్న కృషి అపారం అని వచ్చేనెలలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఇక్కడే విశ్వనాధ విగ్రహావిష్కరణ చేస్తారని ,ఆయన గురించి సభలు రాష్ట్రం లో చాలా చోట్ల నిర్వహిస్తున్నామని  ,ఈ తరం వారు  చదివి  స్పూర్తి పొందాలని ,రసజ్నుడైన మహా కవి అని, అలాంటి వారు అరుదుగా జన్మిస్తారని ,కృష్ణా జిల్లా వారి పుట్టుక చేత ధన్యమయిందని వారికి తగిన రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుందని ,ఇలాంటి ప్రైవేట్ సంస్తలే నిర్వహణ బాధ్యతలు బాగా చేస్తాయని షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ లాంటి ఆంగ్ల కవుల గృహాలు మాన్యుమెంట్లు లా ఇంగ్లాండ్ లో ఉన్నాయని ,ప్రభుత్వం గురజాడ ఇంటిని స్మారక చిహ్నం గా చేసే ప్రయత్నం లో చాలా అశ్రద్ధ వహిస్తే తానె ఫండు విడుదల చేయించి కొంత మార్పు తెచ్చానని అన్నారు .రాజేశ్వరి గారి అనుభవాలు గ్రంధ రూపం లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు .నందిగామ ఎన్నిక ఉన్ది కనుక కోడ్ అమల్లో ఉందని మినిస్టర్లేవరూ పాల్గొనలేక పోతున్నారని అన్నారు .తెలంగాణలో కూడా సిద్ధిపేట ఎన్నిక ఉన్నా అక్కడి ముఖ్య మంత్రి కే సి ఆర్ .కాళోజి  శత  జయంతిలో పాల్గోన్నా డు ,విగ్రహావిష్కరణ చేశాడు మంత్రులలో వేర్వేరు చోట్ల జరిపారు .వాళ్లకు లేని ఎన్నికల కోడు మనకేందుకోచ్చిందో నాకు మాత్రం అర్ధం కాదు .’’తెగించిన వాడికి —‘’అనే సామెత గుర్తుకొచ్చింది . వీటికీ కోడ్ కు సంబంధం ఉండదు .ఇక్కడేమీ వాగ్దానాలు చేసేది ఉండదు .స్మరించుకోవటం మరో సారి కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటమే .ఇది మరిచారు మన నాయమ్మన్యులు .

శ్రీ చివుకుల సుందర రామ మూర్తి తానూ విశ్వనాధ పై చేసిన రిసెర్చ్ ఇంకా అజ్ఞాతం లోనే ఉందని ,విశ్వనాధ అంతే వాసుల్లో తానూ ఉన్నానని సాయం వేళల్లో విశ్వనాధ తో కబుర్లు విజ్ఞానదాయకాలని ,అవి మర్చిపోలేని తీపి గురు తులని అన్నారు .ప్రముఖ న్యాయ వాది శ్రీ వరప్రసాద్ తమ అనుభవాలు చెప్పారు .శ్రీగోళ్ళనారాయణ రావు ఆర్ధికం గా పుస్తక ముద్రణకు సహకారం ఇస్తానని వాగ్దానం చేశారు .శ్రీ వేదాంతంరాజగోపాల చక్ర వర్తి సందర్భం లేని అసందర్భపు మాటలు ,సీత రాముడికి కుడిపక్క ఉంటుందా ఎడమ పక్క ఉంటుందా అనే సందేహం ,విశ్వనాధ తిండికి లేక ఎవరిమీదో కవిత్వం చెప్పి డబ్బు సంపాదించాడనీ ,తమ తండ్రి తాతలనుండి సంప్రదాయాన్ని గ్రహించాడని పనికి రాని  అవాస్తవమైన  మాటలు మాట్లాడి విశ్వనాధ ధిషణకు  పాదరస బుద్ధికి ఆయన చెప్పుకొనే ‘’అవిచ్చిన్న సంప్రదాయానికి ‘’అవమానం తెచ్చారని పించింది. ఆయన మాట్లాడకుండా ఉంటె సభ ఇంకా హుందాగా ఉండేదని మాత్రం నాకు అనిపించింది .విశ్వనాధ కు అయన తీవ్ర అపకారం చేశారు .ఆయన కవిత్వం లో మెరుపులు చెబితే ఏంతో ఆనందించేవాళ్ళం .సొల్లు కు సమయం కాదు విశ్వనాధ వ్యక్తిత్వాన్ని భావి తరాలకు అందించాలి .సోదరుల కృషిని  అప్రస్తుత ప్రసంగం తో నీరు గార్చారని బాధ గా ఉంది నాకు .

నేనూ మాట్లాడతాను రెండు నిమిషాలు అన్నాను కాని సమయాభావం వలన కుదరలేదు .అయినా నేను చెప్పా దలచుకొన్నది ఇది –‘మొదటిది -’అమెరికా సాహిత్య కారుడు ‘’ -ఎడ్గార్ ఆలెన్ పో  ‘’పై ఒక సమగ్ర ‘’విజ్ఞాన సర్వస్వం ‘’వెలువడింది .దాన్ని మొదటి సారి 2002లో అమెరికా వెళ్ళినప్పుడు నేను చదివాను .అందులో పో కవి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ,అన్నికధలు నవలలు హారర్ డిటెక్టివ్ కధలు నాటకాలు సాహిత్య వ్యాసాలూ పోయేటిక్స్ పై ఆయన అసాధారణం గా రాసిన విమర్శలు పుస్తక సమీక్షలు ఒక టేమిటి అందులో ‘’పో సాహితీ విశ్వ రూప సందర్శనం’’ దర్శన మిస్తుంది .నేను ప్రతి సభలోనూ విశ్వనాధ పై అలాంటి సర్వస్వం రావాలని చెబుతూనే ఉన్నా .దాన్ని తీసుకొచ్చి ఒక మాన్యుమెంట్ గా చేయాలి .దీన్ని సోదరత్రయం ఇతర సాహితీ వేత్తలతో సంప్రదించి తీసుకు రావాలి .

రెండవది విశ్వనాధ ను పూజిస్తున్నామనే వారు ఆయన్ను సమగ్రం గా అర్ధం చేసుకోలేని వాళ్ళే .ఒక సారి హైదరాబాద్ అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీలో విశ్వనాధ కల్ప వృక్షం పై  మాజీ ఐఎస్ అధికారి  శ్రీ కనమలూరి వెంకట శివయ్య గారు మాట్లాడితే విన్నాను  అంతా అయి పోయి మేడ దిగి వస్తుంటే ‘’శివయ్య గారూ !విశ్వనాధను ఇందులో బాగా ఆవిష్కరించానని అనుకొంటున్నారా ?’’అని అడిగా ‘’అదేమిటి గంట మాట్లాడా అన్నీ చెప్పాగా “’అన్నారు .అసలైనది చెప్ప లేదు అన్నా ఏమిటది అన్నారు .’’విశ్వనాధ ఏది రాసినా ఒక యజ్న స్పూర్తి తో రాశారు ఏ కాండలో చూసినా అదికనిపిస్తుంది సృష్టియజ్న కార్యం అని  వేదోపనిషత్తులు చెప్పినదాన్నే ఆయన వ్యాఖ్యానించారు .దాన్ని అందరూ వదిలేశారు మీతో సహా ‘’అన్నారు అవాక్కయ్యారు .’నేను దాన్ని గురించి ఆలోచించలేదండి మంచి విషయం నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు ‘’అన్న సంస్కారి .

‘’అలాగే విశ్వనాధ ఇంట్లో చనువుగా తిరిగిన సాహితీ కారుడు ,విశ్వనాధ రామాయణం పై వాల్మీకి రామాయణం పై అధారిటీ శ్రీ జానకీ జాని నాతో చెప్పిన ఎన్నో అమూల్య విషయాలున్నాయి. ఇద్దరినీ తులనాత్మకం గా పరిశీలించిమాట్లాడేవారు .వారొక సారి ఉయ్యూరు మా ఇంటికి ఆకస్మికం గా వస్తే దాదాపు యాభై మంది సాహిత్యాభిమానులతో సమావేశం ఏర్పాటు చేయించి వారితో రెండు గంటలు కల్ప వృక్షం పై మా ఇంట్లోనే మాట్లాడిస్టే జనం మరో లోకం లో తేలిపోయారు .ఆయన చదివే పద్యం తీరుకూడా మహా గొప్పది .ఇంగ్లీష్ లెక్చరర్ గా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేసి ,రామాయణం పై వందలాది ప్రసంగాలు చేసిన మహా మనీషి జానకీ జాని .వారితో నా పరిచయం నా పూర్వ జనం సుకృతం .

మూడు –విశ్వనాధ పై  శరభయ్య గారు ,భరత శర్మ గారు ,ఆయనే విశాఖ నుండి వచ్చే సద్గురు సదానంద మూర్తి ర్గారి పత్రిక ‘’సుపద ‘’లో రాసిన అమూల్య వ్యాసాలు ,’’పొరబాటై జని యించితిని ప్రభూ ‘’అన్న పద్యం తో విశ్వనాధకు కైమోడ్పు పల్కి వారిపై చిరస్మరణీయ వ్యాసాలూ రాసిన కేత వరపు వారివి ,జీనియస్ జీవి ఎస్ వారివి ,వెల్చాల కొండల రావు గారివి ,మొదలైన వారి వ్యాస సంగ్రహాలను ఒకచిన్న  పుస్తకం గా తెచ్చి ఈ నాటి తరానికి అందిస్తే లాభదాయకం .

నాలుగు –కల్ప వృక్షం లో అత్యంత అద్భుత పద్యాలను ఏరి ఒక లఘు పుస్తకం గా వివరాలతో ప్రచురిస్తే కొత్తతరానికి అందుబాటులో ఉంటుంది.మొత్తం కావ్యంపై సమగ్ర టీకా తాత్పర్యలు తేవాలనుకోవటం గొప్ప పనే .కాని అది లైబ్రరీలకే పరిమితమైపోతాయి .అలా కాకూడదని నాఉద్దేశ్యం .నేనే నాకు నచ్చిన నాలుగు వందల దాకా కల్పవృక్ష పద్యాలను స్వదస్తూరితో రాసుకొని దాచుకోన్నానని –

విశ్వనాధ సోదరులు అతిధులను శాలువాలు కప్పి సత్కరిస్తే ,బుద్ధ ప్రసాద్ గారు విశ్వనాధ సత్యనారాయణకు తల్లిగారు రాజేశ్వరిగారికి శాలువాలు కప్పి గౌరవించారు .

తోక ముక్క –ఇంత అభిమానం తో సోదర త్రయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెండుకాలేజీలకు చెందిన ఒక ముప్ఫై మంది విద్యార్దినీవిద్యార్ధులు లేక పోయి ఉంటె సభ పేలవం గా  ఉండేది. వీళ్ళకైనా వాళ్ళ పాత్ర ఏమీ లేక పోవటం  వెనకాల లేక్చారర్లున్నారనే భయమే తప్ప ఆసక్తి కనిపించలేదు .శోచనీయం .పద్యాలు నేర్పి వాళ్ళతో పాడిస్తే శోభాయ మానం గా ఉండేది .ఇక మిగిలిన జనం మాత్రం ‘’నిలయ విద్వాంసులే ‘’అవటం బాధకలిగించింది .ఆ బజారులోరెండుమూడుకాలేజీలున్నా  తెలుగు అధ్యాపకులూ ,ప్రిన్సిపాళ్లు కూడా రాకపోవటం మరో విషయమ  .పిలిచి ఉండక పోవచ్చని నాకు నేను సమాధానం చెప్పుకొన్నాను . వారెవరూ కన్నెత్తి చూదడక పోవటం ఆశ్చర్యం .తమ  బజారులోని ఇంతటి మహనీయునికి ఇచ్చే మర్యాదా ఇది?అని వేదన కలిగింది .సరే గతం గతః .

గాన ‘’రజనీ ‘’గంధం

సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి స్వగృహం ‘’నాగా లాండ్ ‘’కు మేమిద్దరం వెళ్లి ఆ93ఏళ్ళ  వృద్ధ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తి ని సందర్శించాము. ఏంతో ఆదరం గా మాట్లాడారు .మాట కొంచెం స్పుటత్వం తగ్గింది కాని చక్కగా మాట్లాడారు .1956లో నేను ఎస్ ఎస్ ఆర్ కాలేజి లో ఇంటర్ చదివేటప్పుడు ‘’తెల్లటి పైజమా లాల్చీ’’లతో కాలేజి లోని సమావేశ రేకుల షెడ్  హాల్ ‘’R4 ‘’లో శ్రీమతి వింజమూరి లక్ష్మి తో కలిసి లలిత సంగీత విభావరి నిర్వహించిన విషయం జ్ఞాపకం చేసుకొని చెప్పాను .తర్వాత రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ప్రతి కవి  సమ్మేళనానానికి నేనూ మిత్రుడు స్వర్గీయ టి ఎల్ కాంతారావు ,మొదలైన వారితో వెళ్లి చూసిన విషయం జ్ఞాపకం చేసుకొన్నాను వారితో .వారి ‘’సూర్య నారాయణా ‘’స్తోత్రం ఏంతో అభిమానం అని ఆ పాటను మైమరచి వింటానని మా శ్రీమతి చెప్పితే ఏంతో సంతోషించి ‘’పొడుస్తూ భానుడూ ‘’కదా అని కాసేపు పాడి వినిపించి ఆయన గానం రజనీ గంధమే ఇప్పటికీ అని రుజువు చేశారు .ఆయన చుట్టూ అనేక పుస్తకాలు అందుబాటులో  ఉంచారు చదువుకోవటానికి  వీలుగా .కాళ్ళ జోడు అక్కర్లేదు వారికి .ఇటీవలె విడుదలైన పామర్రు డాక్టర్ శ్రీమతి భార్గవి ‘’గీతాంజలి ‘’అనువాదం కూడా చదివి సంతోషించిన సాహితీ మూర్తి రజని . వాగ్గేయ కారులు రజని  గారి పాదాలకు భక్తిపూర్వకం గా  నమస్కారాలు చేసి అక్కడినుండి బయల్దేరాం .

విశ్వనాధ జయంతి –ప్రభుత్వ వేడుక

సాయంత్రం అయిదింటికి మొదలు పెట్టాల్సిన శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి విశ్వనాధ పై ప్రసంగం రెండు గంటలు ఆలస్యం గా ఏడు గంటలకు ప్రారంభమైంది .రాజసంగా అన్నా వదినే గార్లతో వచ్చారు గారిక పాటి .సత్యనారాయణ వేదికపై కి ఆహ్వానించాడు విశ్వనాధ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్ర్రజ్వలన చేసి ప్రసంగం ప్రారంభించారు నర  సింహా వధాని .ఆశువుగా విశ్వనాధకు జోహార్లు అర్పించారు .నిద్రాణమైన జాతిని నిర్నిర్ద్ర సిద్ధిసమాధి తో  తో జాగృతం చేశారు  విశ్వనాధ అని తాత్పర్యం .రాసిన ప్రతిదాన్ని రసనిస్టం చేశారని .అదొక వాజ్మయ లోకం అని స్తుతించారు .మామూలు ధోరణి లోకి దిగి అందర్నీ దెప్పుతూ వెక్కిరిస్తూ  మా అమ్మాయి రోజూ ఆయన మాటలు చానెల్స్ లో వింటూ  అనే మాటా ,లేక పెట్టిన పేరు అయిన  ‘’పల్లీలు బటానీలు ‘’గాచానెళ్ళలో తన మామూలు ప్రసంగం గా  ప్రసంగాన్ని మార్చేశారు .విశ్వనాధ లోకోత్తర కవితా భావ సంపత్తిని అందిస్తారనుకొంటే ఈ బాధేమిటిరా బాబూ అనుకోని ఒక అరగంటమాత్రమె ఉన్నాం  . మొదట్లో జనం లేరుకాని ఏడింటికి ఫుల్ అయ్యారు గరిక పాటివారి ‘’దంపుడు’’ వినటానికి వచ్చిన వాళ్ళే తప్ప విశ్వనాధ గురించి తెలుసుకొనటానికి వచ్చిన వారుకాదని ఆ ‘’చప్పట్ల’’ వలన తెలిసింది   .అక్కడే ఒక రూమ్ లో ఏర్పాటు చేసిన విశ్వనాధ పుస్తక, ఫోటో ప్రదర్శన చూశాం .సోదర త్రయ తీవ్ర అభినివేశానికి ఈ ప్రదర్శన ఒక ఉదాహరణ మాత్రమె   .గరికపాటి ప్రసంగం తర్వాత వచ్చే తమ వంతుకోసం ముసలికవి ముఠా మేకప్పులేసుకొని ప్రాక్టీస్ చేసుకొంటూ సాయంత్రం అయిదింటి నించి పడిగాపు పడి ఉన్నారు .వారిని చూస్తె జాలి వేసింది . ప్రసంగం అయ్యేదేప్పుడో వీళ్ళు స్టేజి ఎక్కి తమ పాత్రల్ని ప్రదర్శించటం ఎప్పుడో ?  బెజవాడ  .బస్ స్టాండు కాంటీన్ లో టిఫిన్ లాగించి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర .అప్పుడే మా అమ్మాయి అమెరికా  నుంచి ఫోన్ చేస్తే విషయాలన్నీ పూసగుచ్చి  నట్లు వివరం గా తెలియ జేసి , పడుకోన్నాం  .

దీన్ని ఈ తెల్లవారు జామున అయిదింటికి ప్రారంభించి మధ్యలో ఒక అరగంట  సంధ్యా  పూజా వగైరాలకు వినియోగించి మళ్ళీ మొదలెట్టి ఇప్పుడే పదకొండుం బావుకు పూర్తీ చేశా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.