గీర్వాణ కవుల కవితా గీర్వాణం -5
‘’మట్టి బండి ‘’ప్రకరణ కర్త -శూద్రక మహా కవి
సూద్రక మహాకవి నాటక నవలా కారుడు .మూడవ శతాబ్దికి చెందిన వాడు .సూద్రకనామం కలం పేరు అసలు పేరు అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహిస్తున్నారు .ఇంద్రాణి గుప్తుడు లేక ఈశ్వర సేనుని తండ్రి శివ దత్తుడే సూద్రాక మహా రాజు అని భావిస్తున్నారు .’’పద్మ ప్రభ్రుతిక ‘’అనే భాణం ఏకాంకిక నాటక రచనా చేశాడు .ఇది ఒకే వ్యక్తీ తన అంతరంగాన్ని వివరిస్తూ స్వగతం(మోనోలోగ్) గా చెప్పుకొనే తమాషా ప్రయోగం .మృచ్చకటికం లేక మట్టి బండి నాటకం తో లోక విఖ్యాతుడైనాడు .దీనికే ప్రకరణం అనే పేరుంది .ప్రకరణ రచనకు ఆద్యుడు సూద్రకుడు .
శూద్రక మహాకవిరాజు కు సకల శాస్త్రాలలో పాండిత్యం ఉంది .శివుడి అనుగ్రహం తో లోకోత్తర దర్శనం పొందాడట .గొప్ప యోధుడని ,పరాక్రమ శాలి అని ,వందేళ్ళపై పది రోజులు జీవించి అశ్వమేధ యాగం చేసి ,రాజ్యాన్ని కుమారుడికి అప్పగించాడు . ‘’సర్వస్వ హరం ‘’అనే యజ్ఞం చేసి దాని విధి విధానం ప్రకారం అగ్ని ప్రవేశం చేశాడనేది ప్రచారం లో ఉంది .పాశ్చాత్యులు కొందరు మృచ్చకటికం ఈతని రచన కాదన్నారు .కాని విల్సన్ డాక్టర్ స్మిత్ లు మాత్రం శాతవాహన రాజు శ్రీముఖుడే శూద్రకుడు అన్నారు .అయితే క్రీ పూ.రెండవ శతాబ్ది వాడై ఉండాలి . ప్రాచీనకాలం లో ‘’శూద్రకు ‘’అనే గణ రాజ్యం ఉండేదని ,అలేక్సాండర్ భారత దేశం పై దండ యాత్ర చేసినప్పుడు వీరు ఎదిరించారు ,వీరిని గ్రీకులు ‘’సోద్రోయి ‘’అని పిలిచేవారట. అలేక్సాందర్ తో వీరోచితం గా యుద్ధం చేసినట్లు గ్రీకు చరిత్రకారులే రాసుకోన్నారట . ,వ్యాకరణ కర్త పాణిని ‘’శౌద్రాయణులు ‘’అని అంటే పతంజలి బ్రాహ్మణేతరులని పే ర్కొన్నాడని తెలుస్తోంది .శూద్రులు ,మహా శూద్రులుఅని వీరిలో రెండు తెగలున్నాయట.
శూద్రకుడు వామన కవి చేత ఉద్ధరింప బడ్డాడని ప్రచారం లో ఉంది .బాణుడు, దండి కూడా ఇతనికి పరిచయస్తులే .భేతాళ పంచ వింశతిక లో సూద్రక ప్రసక్తి ఉంది .విక్రమాదిత్యుని సమకాలీనుడు కావచ్చుననే వారూ ఉన్నారు .ఆయనకంటే ఇరవై ఏడేళ్లకు పూర్వం శూద్రక మహారాజు రాజ్య పాలన చేశాడట .రాజధాని ‘’శోభావతి ‘’అని కదా సరిత్సాగరం లో ఉన్నది .కాళిదాసుకు పూర్వం భాసుని తర్వాతి వాడు అని మరికొందరివాదం. కాదు మృచ్చకటికం లో కాళిదాసును అనుసరించిన సందర్భాలున్నాయికనుక కాళిదాసు తర్వాత వాడు అన్నారు మరికొందరు . .
మృచ్చకటిక ఔన్నత్యం
ఈ నాటకం లో పది అంకాలు న్నాయి .భాసమహాకవి రాసిన ‘’చారుదత్త ‘’నాటకం ఆధారం గా కద నడుస్తుంది .ఇది ప్రకరణం అనే రూపక భేదానికి చెందింది .ఇందులో నాయకుడు చారుదత్తుడు వ్యాపారి .ఆస్తి అంతా దాన ధర్మాలు చేసి దరిద్రం పాలైనాడు .నాయిక వసంత సేన వేశ్య .వీరిద్దరూ గాఢప్రేమికులు .ఈమెను రాజుగారి బావమరిది శకారుడు కోరుకొంటాడు .వసంత సేన ప్రియుడిని కల్సుకోటానికి వెడుతూ శకారుడి చేతిలో పడుతుంది .మెడ పిసికేస్తే మూర్చ పోతుంది .చనిపోయిన్దనుకొని చారుదత్తుడే చంపాడని ప్రచారం చేస్తాడు .దత్తుడికి మరణ శిక్ష పడుతుంది .వద్య స్తానానికి తీసుకొని వెడతారు .వసంత సేన ఒక బౌద్ధ భిక్షువు చేత కాపాడ బడి అక్కడికి చేరుకొంటుంది .చారుదత్తుని స్నేహితుడు ఆర్యకుడు గోపాల వేషం లో పాలకుడు అనే వాడిని తొలగించి రాజు అవుతాడు చారుదత్తు ని క్షమించి వారిద్దరికీ పెళ్లి చేయటం తో సుఖాంతం అవుతుంది
చారుదత్తుడి కొడుకు మట్టి బండీ తొ ఆడు కొంటాడు .చారు కు సాయం చేయ దలచి వసంత తన నగలను మూటకట్టి ఆ బండిలో పెడుతుంది .ఆమె నగలకోసం చారుదత్తుడే చంపాడని అభియోగం మోపి మ్రుచ్చకటికాన్ని న్యాయ స్తానానికి తెస్తారు ..బండిలో నగలు సాక్ష్యం కనుక మరణ దండన పడుతుంది .మట్టి బండి గొప్ప పాత్ర పోషించిన్దికనుక నాటక కర్త ఆ పేరు పెట్టటం ఏంతో సముచితం గా ఉంది . చిన్న సంఘటన ఇతి వృత్తమై ఆసాంతం రక్తి కట్టిస్తుంది .రక్షించాలనే ఉద్దేశ్యం తో ప్రియురాలు బండీలో పెట్టిన నగలు ప్రియుడికి మరణ శిక్ష పడటం దాకా వెళ్ళింది .కనుక నామౌచిత్యం భేషుగ్గా ఉంది .
నాటక రచన శాస్త్రీయ పద్ధతిలో సాగలేదంటారు ,నీతి బోధకం కాదు సాంఘిక పరిస్తితికి దర్పణం .పాశ్చాత్యుల ‘’కామెడీ’’కి దగ్గర ..ప్రదర్శన యోగ్యత లేదని కొందరి వాదన .సంభాషణలు అర్ధ వంతంగా సన్నివేశ కల్పనా మహత్తరం గా ఉంటుంది .అనేక రకాల మనస్తత్వాలున్న మనుషులు కనిపిస్తారు నాటకం లో .గణికలు, వేశ్యలు, విటులు పాత్ర దారులే .సముద్ర వ్యాపారం ఆకాలం లో ఉండేదని తెలుస్తోంది .
సూద్రక మహా కవిరాజు ప్రాసాద గుణం తో మాధుర్యం తో కవిత్వ రచన చేశాడు .చక్కని శైలి నాటక గమనానికి బాగా తోడ్పడింది .ఉదాత్త భావాల్న కల్పలనలను చేసి మెప్పు పొందాడు .వర్ణనలు అతి సహజం గా ఉండటం ప్రత్యేకత .దృశ్యకావ్యం గా మలిచాడు .శృంగారం ప్రధాన రసంగా ప్రవహిస్తుంది .దరిద్రం మీద సూద్రకుడు చెప్పిన శ్లోకాలు చిరస్మరణీయాలై అందరి నాలుకల మీదా నేటికీ నర్తిస్తున్నాయి –‘’
‘’దారిద్ర్యాత్ పురుషస్య బాంధవ జనో వాక్యేన సంతిస్టతే-సుస్నిగ్దా విముఖీ భవంతి సుహృదః సపరీ భావంత్యాపదః –సత్వంహాసముపైతి శీల శశినః కాంతిః పరిమ్లాయతే –పాపం కర్మచ యత్న రైరపి కృతం తత్తస్యసంభావ్యతే ‘’-దీని అర్ధం
‘’దరిద్రం తో ఉన్న వాడి మాటలు బంధువులు వినరు .మిత్రులు విముఖులౌతారు .కస్టాలు రోజు రోజుకూ పెరుగుతాయి .తేజస్సు క్షీణించింది .శీల కాంతి మలినం అవుతుంది .ఇతరులు చేసే చెడ్డ పనులు కూడా వాడి నెత్తినే పడతాయి .’’
మృచ్చకటికం తర్వాతే భవ భూతి మాలతీ మాధవం ప్రకరణం రాశాడు .కనుక ప్రకరణానికి ఆద్యుడు సూద్రక కవి .ఈ నాటకం అనేక ఇతర భాషల్లోకి అనువదింపబడి ప్రదర్శింప బడి విఖ్యాతమైంది ..ఫ్రాన్స్ ,జర్మనీ లలో రంగస్థల నాటకం గా ఆడబడి ప్రేక్షకాదరణ పొందింది .’’వసంత సేన ‘’పేరిట తెలుగు సినిమా వచ్చింది .నాగేశ్వరరావు బి సరోజా నాయకా నాయికలు .రాజేశ్వరరావు సంగీతం .అందులో ‘’బంగారు బండిలో వజ్రాల బొమ్మతో ‘’అనే పాట ప్రజాదరణ పొందింది .
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు