డాక్టరేట్ వస్తుందని
ఆ రోజే ఊహించా… -సుద్దాల అశోక్ తేజ
తెలుగుచిత్రపరిశ్రమకు సంబంధించి ఇద్దరు ప్రతిభామూర్లులు ఈ రోజు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం బహూకరించే గౌరవ డాక్టరేట్లు స్వీకరించనున్నారు. జనరంజకమైన సినిమాలతో పాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరైతే, 1700కు పైగా పాటలు రాసి తెలుగు పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సుద్దాల అశోక్‌తేజ మరొకరు. ఈ సందర్భంగా వారిద్దరి గురించి చిత్రజ్యోతి అందిస్తున్న వివరాలు…
‘‘కేవలం సినిమా పాటలు రాసి పేరు తెచ్చుకోవాలనే తపన కన్నా, సినిమా మాధ్యమం ద్వారా మానవ, సామాజిక సంబంధమైన విషయాలను గురించి పాటల రూపంలో ప్రజలకు తెలియజెప్పాలనే ప్రత్యేకమైన స్ఫూర్తితో గేయ రచయితగా మారాను. ఈ విధంగా ఉండాలని 20 ఏళ్ళ క్రితమే నిర్ణయించుకున్నాను. అల్లరి పాటలు, వినోదాత్మక పాటలు రాసి పేరు తెచ్చుకోవడం కోసం నేనిక్కడికి రాలేదు. పాటంటే సినిమా చూసి ఈలలు వేసి బయటికొచ్చాక మరచిపోయేలా ఉండకూడదు. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలి. నా సాహిత్యం జనాల మనసులో చెరగని గుర్తులా ఉండేందుకు అనుక్షణం శ్రమిస్తాను’’ అని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. 2000కు పైగా ఉద్యమ, సామాజిక, విప్లవ గీతాలు, 800 సినిమాలకు 1700 పాటలను రచించారాయన. గీత రచయితగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు వైజాగ్‌లోని గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రజ్యోతితో ప్రత్యేకంగా సంభాషించారు అశోక్‌తేజ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…..
సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. దీంతో కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చు. తరగతిలో 60 మందికి పాఠాలు చెప్పడం కంటే 6 కోట్ల మందిని పాటతో సులభంగా ప్రభావితం చెయ్యొచ్చనే ఆలోచనతో 20 ఏళ్ళ క్రితం ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి గేయ రచయితగా మారాను. నా ఆలోచనా రీతికి తగ్గట్టే నాకు చక్కని అవకాశాలొచ్చాయి. అదృష్టవశాత్తు చక్కని ఆదరణ లభించడంతోపాటు పరిశ్రమ నుండి మంచి గుర్తింపు పొందాను. దాసరి నారాయణరావుగారి స్కూల్ నుంచి వచ్చినవాణ్ణి నేను. రాఘవేంద్రరావుగారితో కూడా పనిచేశాను. నేటితరం దర్శకుల్లో కృష్ణవంశీ, రాజమౌళి, వి.వి.వినాయక్ వంటి దర్శకులతో కూడా పనిచేస్తున్నాను. వీరంతా నా ఆలోచనా రీతికి తగ్గటే అవకాశాలిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, సినిమాకు సంబంధం లేకుండా నేను రాసిన ఉద్యమ గీతాలు, జన్మభూమికి సంబంధించి ‘తరలుదాం రండి మన జన్మభూమికి.. తల్లిపాల రుణం కొంత తీర్చడానికి’’, ‘నేలమ్మ నేలమ్మ’(రైతన్న కోసం), ‘ఆకుపచ్చ చందమామ’, ‘టపటప చెమట బొట్టు’ (పాట ఎలా పుట్టిందనే పాట), ఓ లంబాడి తల్లి పాలివ్వలేక కల్లు తాగించిన సమయంలో నా గుండె కదలి కన్నీటి గీతంగా ‘కమ్లి’ సినిమా కోసం రాసిన పాట నాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. చెప్పుకుంటూపోతే ఇంకెన్నో పాటలున్నాయి.
నేను రాసిన సినిమా గీతాలు ఒక ఎత్తైతే, సామాజిక గీతాలు ఒక మరో ఎత్తుగా భావిస్తాను. ఈ 20 ఏళ్ళుగా సినిమా, సమాజం అనే సవ్యసాచిత్వాన్ని నేనొదిలిపెట్టలేదు. రెండింటిని సమస్థాయిలో నిర్వర్తించుకుంటూ వచ్చాను. మాటల, పాటల రూపంలో నేను వేసిన విత్తనాలే ఈ డాక్టరేట్ రావడానికి కారణమని నేను నమ్ముతున్నాను. నా సేవలను గుర్తించి ‘గీతం’ యూనివర్శిటీ డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
అంచనా ప్రకారమే
డాక్టరేట్ అనేది ఒక పాటకు సంబంధించి ఇచ్చేది కాదు. సాహిత్యరంగంలో నిరంతరం కృషి చేస్తూ… పాటలతో అనేక మంది హృదయాలను ఆకట్టుకున్న వారికి అనేక పరీక్షల జల్లెడలు, పలు అధ్యాయనాలు చేసి ఇచ్చే పురస్కారమిది. మన కెరీర్‌ను బట్టి ఒక అంచనాకు వచ్చి మనం రాసిన పాటలో సందేశాన్ని గ్రహించి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. సంగీత రంగంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి తరువాత మా తరం గేయ రచయితల్లో అతి తక్కువ సమయంలో డాక్టరేట్‌ను అందుకుంటోంది నేనే కాబోలు. గేయ రచయితగా 20 ఏళ్శ కెరీర్ చాలా తృప్తికరంగా ఉంది.
ఆనాడే ఊహించా
ఏ రంగంలోనైనా నిజాయితీగా పనిచేసే ప్రతి మనిషికి పదివేల చేతులు సహకరిస్తాయి. రచయితలుగా మేం చేసేది అద్భుతమైన పని అని నేను భావిస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జన్మభూమి కార్యక్రమం కోసం ‘తరలుదాం రండి మనం జన్మభూమికి’ పాట రాశాను. ఆరోజు వేదికపై చంద్రబాబునాయుడుగారు ప్రశంసించిన విషయాన్ని ఎప్పటికీ మరువలేను. అప్పట్లోనే నేనూహించా, ఏదో రోజు నాకు ఇలాంటి పురస్కారం వరిస్తుందని. కానీ ఎప్పుడనేది మన చేతిలో లేదుకదా. ‘నేను సైతం’ పాట కోసం ఉత్తమ రచయితగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను. అదొక మెట్టయితే డాక్టరేట్‌ను అందుకోవడం నా కెరీర్‌కి మరో మెట్టుగా భావిస్తున్నాను. |