పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8
దేవీ స్తుతి
ఋగ్వేదం లో దేవీ సూక్తుం, రాత్రి సూక్తం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి సూక్తం ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తాయి .కేన ఉపనిషత్ లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు లోను దుర్గా స్తుతి ఉందని పుట్టపర్తి వారన్నారు .మార్కండేయ పురాణం లో దుర్గా స్మరణ ఉన్నది .అందులో ఎనభై ఒకటి నుండి తొంభై మూడు అధ్యాయాల్లో దుర్గా పూజ విశేషాలు వర్ణింప బడ్డాయి .మొహంజొదారో ,హరప్పా సింధు లోయాల్లో దుర్గా విగ్రహాలున్నాయి .ఇవి అయిదు వేల ఏళ్ళ కిందటివి .ఆ రోజుల్లో దుర్గా పూజ ఉండేది . పూజల్లో చండీ పూజకు విశేషం ఉంది .దీనికి ‘’దుర్గా సప్త శతి’’ ముఖ్య గ్రంధం .దానిలో మొదట కాళి,తర్వాత మహా లక్ష్మి ,సరస్వతి లలోని రూప భేద వర్ణన ఉంది .కాళికి గాయత్రీ ఛందస్సు ,మహా లక్ష్మికి ఉష్ణిక్ ఛందస్సు ,సరస్వతికి అనుష్టుప్ ఛందస్సు ఇష్టమైనవి అందులోనే వారుంటారు .తమో ,రజ సత్వ గుణాలు వీరికి ప్రతీకలు. సప్తశతి వేదం లోనే ఉంది అనే వారూ ఉన్నారు .దుర్గా ,కాళి,కుమారి ,చండి ,కాత్యాయని పేర్లు పురాణాలలో కూడా వింటాము .లలితా దేవికి నవావరణ పూజ ముఖ్యం .శాక్తం లో దక్షిణ ,వామాచారాలున్నాయి .రామాయణ భారతాలలో దుర్గా స్తుతి ఉన్న సంగతి మనకు తెలుసు .
ధర్మ రాజు దుర్గా స్తుతి చేసినట్లు వ్యాసుడు రాశాడు .విరాట ,భీష్మ పర్వాలలో ఇది కనిపిస్తుంది .ధర్మ రాజు దుర్గను మహిషాసుర మర్దినిగా వర్ణించాడు .వింధ్య వాసినిగా పేర్కొన్నాడు .యుద్ధానికి ముందు దుర్గా స్తవం చేయమని శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పాడు .రావణుడు ,ఇంద్రజిత్తు దుర్గా రాధకులని రామాయణం తెలియ జేస్తోంది .బెంగాలీలకు శక్తి పూజ ముఖ్యం .చండీ పారాయణం వారి నిత్య కృత్యం .చండీ సంప్రదాయం నర్మదా నదీ తీరం లోని ఉజ్జయిని లో పుట్టిందని ఆచార్య భాషణం .క్రీస్తు పూర్వమే ఈ ఆరాధన ఉన్నట్లు కనిపిస్తోంది .సప్త శతి పై ముప్ఫై వ్యాఖ్యానాలున్నాయి .శంకరుల గురువు గౌడ పాడులూ ఒక వ్యాఖ్యానం రాశారు .నాగోజి భట్ట వ్యాఖ్యానమూ గొప్పదే .దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .మన్మధుడు మరణించిన తర్వాత దేవతలు ఈశ్వరుడిని ప్రార్ధిస్తే అతడికి రూపం ఇచ్చాడు .వాడు భండాసురుడు అయ్యాడు .శోణిత పురాన్ని రాజధానిగా చేసు కొని దేవతలపైకి కాలుదువ్వాడు .దిక్కు తోచక దేవతలు పార్వతీ దేవిని అర్ధించారు .ఆమె త్రిపురసుందరి అయి భండాసుర వధ చేసింది .మళ్ళీ ఆమె మన్మధుని అనంగుడిగా చేసింది .ఇందులో ఒక శ్లోకం ఉంది –
‘’పుం రూపం వాస్మరేద్దేవిం స్త్రీ రూపం వావి చింత యేత్ –అధవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్ష.ణాం’’అంటే దుర్గ ను పురుష రూపం లోనూ ధ్యానించ వచ్చునని తెలుస్తోంది .ఆమె పురుష రూపం విష్ణు మూర్తి అట .కోప రూపం కాళికాదేవి.యుద్ధ రూపం దుర్గ .ఆమె ఉపాసనకు మంత్రం ,యంత్ర ,తంత్రాలు ముఖ్యాలు అన్నారు ఆచార్యుల వారు .పంచదశి మంత్రం .శ్రీ చక్రం యంత్రం .తంత్ర కలాపం ఎక్కువ .ప్రతి వాడి హృదయం శాక్తేయమే .బాహ్యం లో శివుడు ,పూజలో వైష్ణవుడు అంటారు పుట్టపర్తి వారు .అంటే ఈ మూడిటికి భేదమే లేదని భావం .అర్జునుడు గొప్ప శివ భక్తుడు .కాని శ్రీకృష్ణుని చెలికాడు బావ మరదికూడా .కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్గా పూజ చాలా నిష్టతో చేశాడు .కనుక ప్రతి హిందువు శాక్తుడు శివుడు వైష్ణవుడే అని తేల్చారు నారాయణా చార్యులవారు .ఈ సత్యాన్ని గుర్తించ కుండా మత భేదాలు పెంచుకొని ,విద్వేషాలతో మనుషులు ఒకరికొకరికి దూరమై పోతున్నారు . సరసం గా సమన్వయము గా బతకటం తెలియని మూర్ఖులుగా జీవించటం బాధకలిగిస్తోందని దుర్గా పూజ సప్త శతి సారం ఇదే అని గ్రహించాలని మనందరినీ ఆచార్యులవారు హెచ్చరిస్తున్నారు .ఇది తెలుసుకోకుండా చేసే పూజా ,పారాయణం ఫలితం ఇవ్వదు అని మనం గుర్తించాలి
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు