ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర వంటి పరిశోధకులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు, చేకూరి రామారావు వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని ఆచార్య వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ (1777-1819) :
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో తమ సామ్రాజ్య వ్యవస్థను సుస్థిరం చేసుకోవడానికి తమ సివిల్ అధికారులందరూ దేశభాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించవలసిన అవ సరాన్ని గుర్తించారు. ఇది భారతీయభాషల అధ్యయనం కొత్త పుంతలు తొక్కడానికి కారణమయింది. దక్షిణ దేశ భాషలలో సివిల్ పరీక్షల ప్రాథమిక దశలోని బ్రిటిష్ విద్యార్థులకు శిక్షణనిచ్చేటందుకు ఎల్లిస్ ఫోర్టు సెయింట్ జార్జి కళాశాలను (1812) స్థాపించాడు. ఈ కళాశాల పర్యవేక్షక సంఘానికి అలెగ్జాండర్ డంకన్ కాంబెల్ (1812-1821) కార్యదర్శిగా పనిచేశాడు. ఎల్లిస్, కాంబెల్ తెలుగు భాషను గురించి పరిశోధించడానికి ఆ కళాశాలలోనే పనిచేసిన వేదం పట్టాభిరామశాసి్త్ర, మచిలీపట్నం వాస్తవ్యుడు మామిడి వెంకయ్య తమ సహాయ సహకారాలను అందజేశారు. వేదం పట్టాభిరామశాసి్త్ర రాసిన ‘ఆంధ్రధాతుమాల’ (1814-15), వెంకయ్య సిద్ధం చేసిన ‘ఆంధ్రదీపిక’ (1806) అనే ప్రాథమిక నిఘంటువు, వ్యాకరణం వీరికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ రెండు గ్రంథాలు 1816లో ద్రావిడభాషా కుటుంబావిష్కరణకు మూలాధారాలు. ఆధునిక కాలంలో ద్రావిడభాషా కుటుంబావతరణకు తెలుగుభాష వేదిక. ద్రావిడభాషా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తెలుగుభాషా చరిత్రకారులు అంతగా పట్టించుకోని రెండు అంశాలను వెంకటేశ్వర్లు సాధికారికంగా ప్రతిపాదించారు. 1. కళాశాలలో పాశ్చాత్య పరిశోధకులు, దేశీయ పండితులు సంయుక్తంగా తెలుగు భాషాధ్యయనాన్ని చేపట్టారు. ఇదొక అద్భుతమైన ప్రయోగం. భిన్న ప్రాక్ పశ్చిమ భాషాశాస్త్ర అధ్యయన సంప్రదాయాలు పద్ధతులు సంవాద పద్ధతిలో పరస్పర ప్రభావితమై కొత్త భాషాశాస్త్ర విజ్ఞానానికి నాందీ ప్రస్తావన చేసిన భూమికది. ఆధునిక ప్రపంచంలో భాషాశాస్త్ర అధ్యయనాన్ని, పరిశోధనను నడిపిస్తున్న చారిత్రక తులనాత్మక భాషాశాస్త్రం (Historical Comparative Linguistics) ఆవిర్భవించిన కాలమది. కళాశాలలో జరిగిన తెలుగు భాషాఽధ్యయనం, మామిడి వెంకయ్య గారి ‘ఆంధ్రదీపిక’ కొత్త భాషాశాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన దశ అది. 2. 1816లో ద్రావిడభాషా కుటుంబ రూపకల్పనకు సంప్రదాయ తెలుగు వ్యాకరణ విజ్ఞానం, మామిడి వెంకయ్య గారి ‘ఆంధ్రదీపిక’ పరస్పర పరిపోషకాలుగా నిలిచిన స్థితి అది.
ద్రావిడ భాషలు సంస్కృతం నుంచి పుట్టలేదని, అవి స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రత్యేక భాషా కుటుంబానికి చెందినవని వెల్లడించిన మొదటి భాషాశాస్త్రవేత్త ఎల్లిస్. ఈ అంశాన్ని కాల్డ్‌వెల్ ‘ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణము’ అనే తన గ్రంథం మొదటి ప్రచురణ పీఠికలో పేర్కొన్నాడు (1856). తదుపరి ముద్రణలలో దీనిని పేర్కొనలేదు. కాంబెల్ ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణానికి ‘Note to the Introduction’ (1816) అనే పేరుతో పీఠిక రాస్తూ ఎల్లిస్ మొదటగా ద్రావిడ భాషావాదాన్ని ప్రతిపాదించాడు. కలకత్తా కేంద్రం గా భారతీయ భాషలను అధ్యయనం చేసిన కేరే, ఛార్లెస్ విల్కిన్‌సన్, హెన్నీ ధామస్ కోల్‌బ్రూక్ వంటి పాశ్చాత్యులు భారతీయ సంప్రదాయక భావనను అనుసరిస్తూ ద్రావిడ భాషలు సంస్కృతం నుంచి పుట్టినవని భావించారు. ఎల్లిస్ ఈ వాదాన్ని నిరాకరిస్తూ ద్రవిడ భాషల ప్రత్యేకతను స్థాపిస్తూ కాంబెల్ రాసిన వ్యాకరణానికి ఒక పీఠిక రాసాడు. ఈ ప్రయత్నంలో భాగంగా సంస్కృతాంధ్ర ధాతువులను తులనాత్మకంగా పరిశీలించాడు. సంస్కృత ధాతువులను ఒక వరుసలోను, తెలుగు ధాతువులను ఇంకొక వరుసలోను సమాంతరం గా చూపించి వాటి మధ్యనున్న భేదాన్ని తెలియజేశాడు. తమిళ, కన్న డ, తెలుగు ధాతుపాదాలను సమాంతరంగా పట్టికలుగా ఇచ్చి వాటి మధ్య నుండే పోలికలను చూపించడంతో పాటు, తెలుగు ధాతువులు తమిళ, కన్నడ ధాతువుల కంటే కొంత విలక్షణంగా, స్వతంత్రంగా ఉండడం ఆ భాష ప్రాచీనతకు నిదర్శనమని భావించాడు.
ఎ.డి. కాంబెల్ (1789-1857)
తెలుగు నేర్చుకొనే బ్రిటిష్ ప్రాథమిక సివిల్ ఉద్యోగుల ఉపయోగం కోసం కాంబెల్ తెలుగు భాషకు ఇంగ్లీషులో ఒక వ్యాకరణ గ్రంథాన్ని ఉదయగిరి వెంకటనారాయణయ్య క్రియాశీల సహాయంతో రాసాడు. ఆ గ్రంథంలో తెలుగు వ్యాకరణం ప్రాథమిక సూత్రాలతో ఎలా నిర్మితమయిందో, తెలుగు వాక్యనిర్మాణం ఎంత పొందికైనదో నిరూపించడానికి కాంబెల్ ప్రయత్నించాడు. తెలుగుపదాలు రెండు, మూడు అక్షరాలతో కూడి ఉంటాయని, వాటి చివర అచ్చు ఉంటుందని, అర్థం తేలికగా ఉంటుందని కాంబెల్ చెప్పాడు. తెలుగు దేశ్య పదాలకు, తమిళ-కన్నడ పదాలతో కలసి ఉన్న తెలుగు పదాలకు మధ్య గల తేడాలను అతడు గుర్తించాడు. తెలుగు తీయనిదని, చెవికింపైనదని, ఇతర భాషాపదాలను సులభంగా తనలో కలుపుకునే లక్షణం కలదని ఆయన చెప్పాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలు ఒక మూలభాష నుంచి ఉద్భవించాయని సూత్రీకరించాడు.
మన దేశంలో సివిల్ ఉద్యోగుల నియామకానికి పోటీ పరీక్షలు నిర్వహించడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుండి నేటి వరకు కొనసాగి వస్తున్న సంప్రదాయపు పూర్వాపరాలను అధ్యయనం చేసే నిమిత్తం ఆచార్య వెంకటేశ్వర్లు చెన్నైలోని పురాతన సమాచార సం రక్షణ కేంద్రానికి వెళ్లారు. ఆ సందర్భంలో కాకతాళీయంగా ఆచార్య వెంకటేశ్వర్లుకు తెలుగు భాషాచరిత్రపై ఆసక్తి ఏర్పడింది. ఆ సందర్భంలో ఆయన థామస్ ఆర్.ట్రాట్‌మన్ అనే చరిత్రకారుడితో కలిసి ఎల్లిస్ రాసిన Introduction’ని చదివి చర్చించారు. ఈ అధ్యయన ఫలితంగా ఆచార్య వెంకటేశ్వర్లు తెలుగు సంస్కృతజన్యం కాదని, తనదైన ధాతుమూలాలు కలిగిన స్వతంత్రప్రతిపత్తి గల భాష అని నిరూపించడానికి ప్రణాళికాబద్ధమైన పరిశ్రమ చేసారు. దక్షిణ భారత ప్రాంత సంస్కృతి-నాగరికత, భాషావిశేషాలు ప్రత్యేక లక్షణాలతో కూడుకున్నవని, స్వతంత్రమైనవని పేర్కొంటూ ఆ విశేషాలనన్నింటినీ వ్యక్తం చేసే పరిశోధనలు పూర్తిగా వెలుగులోకి రాకుండా మరుగున పడి ఉండడానికి విద్వాంసుల మధ్య ఉండే స్పర్థలు కారణమయ్యాయని వెంకటేశ్వర్లు భావించారు. సి.పి.బ్రౌన్, కాంబెల్‌ల మధ్య ఇటువంటి స్పర్థ ఉన్న కారణంగానే కాంబెల్ రచనలు మరుగునపడి తరువాతి తరాల తెలుగుభాషా పరిశోధకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. బ్రౌన్ అపార పాండిత్యాన్ని, తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూనే ఆచార్య వెంకటేశ్వర్లు బ్రౌన్‌లోని ఈ లోపాన్ని ఎత్తి చూపించారు. ప్రచురితమైన ఆధారాలను ప్రదర్శిస్తూ ఆచార్య వెంకటేశ్వర్లు తెలుగు ఆంధ్రప్రాంత ప్రజల భాష అని, అది చారిత్రక యుగానికి 1500 సంవత్సరాలు ముందు కాలానిదని, ద్రావిడభాషలలో ప్రాచీనమైనదని నిరూపించారు. పుట్టుకతోనే అది మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని ఆయన ప్రతిపాదించారు. బహుభాషా సమ్మిశ్రితాలైన గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందన్నారు. తెలుగు తన ప్రత్యేకతను అభివృద్ధి పరచుకొని ఆంధ్ర ప్రాంత ప్రజల సాంస్కృతిక సమైక్య సాధకశక్తిగా ఎదిగిందని భావించారు. ద్రావిడభాషా పరిశోధకులలో ఎక్కువమంది తమిళభాష ప్రాచీనతను, ప్రాధాన్యాన్ని అంగీకరించడాన్ని వెంకటేశ్వర్లు సమర్థించలేదు. ‘తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది’ అనే అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. తెలుగు భాషకు పురాతనమైన వ్యాకరణ, నిఘంటుచరిత్ర ఉందన్నారు.
ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర, మామిడి వెంకయ్య వంటి పరిశోధక పండితులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని ఆచార్య వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఎల్లిస్ బృందం తెలుగుభాష ప్రత్యేకతను స్థాపిస్తూ తొలిదశలో చేసిన పరిశోధనలను తార్కికంగా సమర్థిస్తూ ఒక నూతనకోణం నుండి బలమైన సాక్ష్యాధారాలతో ద్రావిడ భాషలలో తెలుగు ప్రాచీనమైనదని నిరూపించే లక్ష్యంతో ఆచార్య వెంకటేశ్వర్లు ఆరు ప్రకరణాలలో అపురూపమైన సాధన సంపత్తితో కూడిన గ్రంథరచన చేశారు. ఆధునిక భారతంలో తెలుగు వారికి గల స్థానాన్ని, తెలుగువారి ఆరంభదశను తెలుసుకోగోరే వారికి ఆచార్య వెంకటేశ్వర్లు గారి పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. దక్షిణ భారతదేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస దశలలో తెలుగువారు, తెలుగు ప్రాంతం నిర్వహించిన క్రియాశీలక పాత్రను కొత్తకోణం నుంచి లోకానికి వెల్లడించే ప్రయత్నంలో ఆచార్య వెంకటేశ్వర్లు కృతకృత్యులయ్యారు. ఇంకొకరు సమర్థంగా, సప్రమాణంగా కాదనేటంత వరకు ఆయన పరిశోధనా ఫలితాలు మనకు శిరోధార్యమైనవి.