రాగాల వనమాలి- ఏం ఎస్ అంటున్న శ్రీ వి యె.కె రంగారావు

రాగాల వనమాలి
సంగీతానికి రాగద్వేషాలు, భాషాభేదాలు ఉండవని నిరూపించిన గాయని ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మీ. తన మధురమైన స్వరంతో కోట్లమంది మనసులు చూరగొన్న ఆ గానకోకిల జయంతి సందర్భంగా ప్రముఖ విమర్శకుడు, సంగీత విశ్లేషకుడు ఎ.వి.కె. రంగారావు రాసిన వ్యాసమిది..
మా అమ్మ రావు సరస్వతీదేవి (తేలప్రోలు మేకా అప్పారావుల ఆడపడుచు, నూజివీడు) చిన్నప్పుడు విస్సయ్యగారి వద్ద వీణ నేర్చుకుంది. ఆ రోజుల్లో వీణే కాదు, ఏ వాయిద్యం నేర్పినా గాత్రంతోటే నేర్పేవారు. పెళ్లయిన తరువాత గురుముఖతా ఆ విద్య నేర్వలేదు కానీ వైణిక విదుషీమణుల గ్రామఫోను రికార్డులు పదే పదే వింటూ తన వాదనను మెరుగుపరుచుకునే ప్రయత్నం అమ్మ చేసేది. వీటిలో ముఖ్యమైనవి లలితా వెంకటరామన్‌వీ (బొంబాయి), వీణ షణ్ముగ వడివువీ (మధురై). లలిత పాడుతూ వాయించిన ‘హారతిగైకొనుమా’, ‘కృష్ణ మోముజూపరా’ నాకు సరదా అనిపించినా, అమ్మగారికి, నాకు బాగా యిష్టమైనది. షణ్ముగ వడివు ‘శివదీక్షాపరురాలనురా’ అన్న ఘనం శీనయ్యపదం. వీణా ధనం పాడుతూ వాయించిన రికార్డులు మా దగ్గర ఉన్నా అందులో మాటలు స్పష్టంగా తెలిసేవి కావు. లలితావి, షణ్ముగ వడివువీ అలా కాదు; ప్రతి అక్షరం ప్రత్యేక ప్రయత్నం లేకుండా సులభంగా బోధపడేది.
అమ్మకు ‘శివదీక్ష’ (యీ పాటకు ‘పూజాఫలం’లో ఎల్‌.విజయలక్ష్మి చేత పసుమర్తి కృష్ణమూర్తిగారి నృత్యరచన చూడవచ్చు) నచ్చడానికొక కారణం దీని కురంజి రాగం. నాకు ఆ రాగాలు భోగాలు ఆనాటి.కి (అయిదారేళ్ల వయస్సు) తెలియవు కానీ ఆ పాట మరొక విధంగా తెలుసు. ఆవూరి దేవుడు, మా రాజవంశీయులకే రాజు అయిన వేణుగోపాలుని ఆలయసాని గడ్డిభుక్త సీతారాం (ఆమెను మాడుగుల నుంచి గుడిసేవకు మా ముత్తాత ఆర్‌.వి.ఎస్‌ రంగారావు రప్పించారు). ఆమే బొబ్బిలి రాజదర్బారు నర్తకి కూడా అవడం చేత, ఆలయవిధులు ముగించుకొని మా చిన్నపిల్లలం వుండే రాణివాసానికి వచ్చి పాటలూ పద్యాలు (చేతిలో వెన్నముద్ద) వినిపించేది. అందులో ఒకటి ‘శివదీక్ష’. ఇది ఆమె వేణుగోపాలుని ఊరేగింపులోనూ అభినయం పట్టడం నేను చూశాను.
దీనంతటికీ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మికీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అది యిదీ! ఆ వీణా షణ్ముగ వడివు సుపుత్రికే సుబ్బులక్ష్మి. ఆమె మొదటి గురువు ఎందరో సానివారికైనట్లు ఆమె తల్లే. తల్లి గ్రామఫోను రికార్డులు యిస్తున్న రోజుల్లోనే చిన్న బాలిక సుబ్బులక్ష్మి కూడా యిచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె కంఠం యింకా దోరగా కూడా ముగ్గనిది; కసుగాయకుండే వగరే ఎక్కువ. తల్లి కంఠాన ఉండే మాధుర్యం లేదు కానీ ఆమె తప్పక పైకివస్తుందనే నమ్మకం కలిగించేదని అమ్మ, అమ్మమ్మ (రాజరాజేశ్వరి, తేలప్రోలు రాణి) చెప్పేవారు.
నాకు ఆ నాటికి యిష్టపడే కర్నాటక సంగీతం పాటలు సానివారు ఆడి పాడే పదాలు జావళీలే. సారంగపాణి ‘ఇచ్చిన మంచిదే’ (ధన్యాసి), మూవనల్ల్లూరు సభాపతయ్య ‘మంచిదినము నేడే’ (ఆనందభైరవి; ‘స్వర్గసీమ’లో వేదాంతం రాఘవయ్య సానపెట్టగా భానుమతి అభినయం చేసింది), చిత్తూరు సుబ్రహ్మణ్యం ‘మధురానగరి’లో (ఆనందభైరవి; తెలుగులో వచ్చిన రెండు ‘త్యాగయ్య’లలోనూ ఉన్నదీ పాట). మొదట్లో పదాలు, జావళీలు సుబ్బులక్ష్మి పాడేది కానీ ఆమెను సదాశివం చేపట్టిన తరువాత ఆమెపై ఉన్న సాని ముద్రను తొలగించడానికని ఆ తదుపరి ఆమెను అటువంటి పాటలు పాడనివ్వలేదు.
అయితే ఏమయింది? అన్పమాచార్య సంకీర్తనలను కర్నాటక సంగీతానికి చోటున్న యావత్‌ ప్రపంచానికీ, వేర్వేరు సంగీతకర్తల (వీరి పేర్లు గ్రామఫోను కంపెనీ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా మరుగుపరచి వారికి రాయల్టీగా వచ్చే అపార ధనం రాకుండా నష్టపరిచారు) మనోహర స్వరావళులతో శ్రోతల తలకెక్కించారు. ఆమె పాడిన ‘సుప్రభాతం’ కోట్లాది భక్తుల యిళ్లలో వెంకటేశ్వరుని నిద్ర లేపింది. ఇవే కావు ఆమె పాడిన యింకెన్నో పాటలు మానసికోల్లాస కారకాలు, స్వర్ణదీతీరాన పూచిన కాంచన కోరకాలు. ఆ నల్లవాళ్ల (కొండనెత్తిన వాడొకడు, కొండ నెత్తినవాడొకడు) మెడలకు కుబ్జ పూసిన మంచి గంధం, విష్ణుచిత్తుడు వేసిన తులసీమాల. కానీ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది సుబ్బులక్ష్మి తమిళచిత్రం ‘మీరా‘లో పాడిన ‘కాట్రినిలే వరుం గీతం’ అన్నది. ‘గాలిలో తేలి వచ్చే పాట’ అంటూ ఆ వేణుగానలోలుని వంశీనాదాన్ని మూర్తీభవింపజేస్తుందీపాట (రచన కల్కి, వరస ఎస్‌.వి.వెంకట్రామన్‌). ఆమె కంఠంలో పొంగే భక్తిని గమనిస్తే అది పాడిందొక ముగ్ద గోపిక అని ఒకమారూ, కాదు ఒక ప్రౌఢ రాధిక అని ఒకమారూ అనిపిస్తుంది. ఆమెను చరితార్థను చేయటానికి యీ ఒక్క పాట చాలు!
ఫ వి.ఎ.కె.రంగారావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.