పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11

జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2

షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దోస్తీతఎక్కువ .దారా షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్  వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞుడు దారా .వాటికి ‘’సిద్ర అక్బర్ ‘’అని పేరు పెట్ట్టాడు .పండితరాయలు తన ‘’జగదాభరణం ‘’కావ్యం లో దారా ను బాగా కీర్తించాడు .ఈ హిందూ అభిమానమే దారా చావుకు కారణమైంది .చిన్న తమ్ముడు ఔరంగ జేబు దారాను చంపి సింహాసనం ఎక్కాడు .ఆసిఫ్ ఖాన్ షాజహాన్ కు  మామ నూర్జహాన్ తమ్ముడు .జహంగీర్ మరణ కాలం లో ‘’ఖుర్రం ‘’అన బడే షాజహాన్ దక్షిణ దేశం లో ఉంటె ఆసిఫ్ వార్త పంపి పిలిపించాడు .షాజహాన్ గా పేరు మార్చుకొని ఆగ్రాలో సింహాసం ఎక్కాడు .ఆసిఫ్ జహంగీర్ కాలం లోను అతని కొడుకు షాజహాన్ కాలం లోను ముఖ్య మంత్రిగా చేశాడు .

ఒక రోజు జగన్నాధుడు చక్ర వర్తి తో చదరంగమాడుతుంటే ‘’లవంగి ‘’అనే దాసీ మదిర తీసుకొస్తే దాన్ని చూడగానే పండితుడు దిల్ ఖుషీ అయి మనసు అరేసుకొని పారేసుకొన్నాడు .వాలు చూపులు విసురుతున్నాడు .మంచి మందు నిషాలో ఉన్న షాజహాన్  ఏం కావాలి అని  పండితుడిని అడిగితె ‘’లవంగీ కురంగీ మదంగీ కరోతు ‘’అని ఆశువుగా శ్లోకం చెప్పాడు .లవంగిని తనకు దయచేయమని ‘’లవంగం అడిగి నంత తేలిగ్గా .అడిగేశాడు .లవంగి పై మనసు ఎందుకు పడ్డావని ప్రశ్నిస్తే ‘’యవనీ రమణీ విపదశ్మనీ –కమనీయతమా –నవనీతతమా –ఊహి ఊహి వచోమృత పూర్ణ ముఖీ –ససుఖీ జగతీహ యదంక గతా ‘’అన్నాడు నిర్భీతిగా .రాజు లవంగి వైపు సాభిప్రాయం గా చూస్తె ,ఆమె కూడా ఇతనిపై మనసు పారేసుకోన్నట్లు అర్ధమయింది .సరే నని దారా లవంగిని జగన్నాధుడికి దానం చేశాడు .ఇద్దరూ హాయిగా ప్రేమ శృంగారాల్లో విహరించి సంతానమూ కన్నారు .లవంగి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పండితుడు తనను తాను  పోగుడుకొంటాడని పుట్టపర్తి వారన్నారు .భామినీ విలాస కావ్యం లవంగి మెప్పు కోసం చెప్పినదే నన్నారు .

రస గంగాధరం లో చెప్పిన శ్లోకాలు కూడా అప్పుడప్పుడు ఆశువు గా చెప్పినట్లు అనిపిస్తుందని నారాయణా చార్య ఉవాచ .లవంగీ జగన్నాధులకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడట .వాడిపై ‘’అపహాయ సకల బాలధవ –చింతా ,ముద్వాస్య గురుకుల ప్రణయం –హా తనయ వినయ శాలిన్ కధమివ పరలోక పది కో భూః’’అని దుఃఖించాడు .అల్పాయుష్కుడైన ఈ కొడుకు తప్ప  వాళ్ళిద్దరికీ మళ్ళీ సంతానం కలిగినట్లు లేదంటారు ఆచార్యుల వారు .’’కామేశ్వరీ హృదయతో దయితా నయాతి’’అనే శ్లోకం వల్ల  జగన్నాధుని భార్య పేరు కామేశ్వరి అని తెలుస్తోంది .పండితరాయలకు ఒక మనవడున్నడట .అతని పేరు ‘’మహా దేవ సూరి ‘’.జగన్నాధుడి తమ్ముడిపేరు రామ చంద్ర భట్టు .మహాదేవ సూరి ఈయన మనవడు అయిఉంటాడని పుట్టపర్తి వారి ఊహ .

పండిత రాయలు గొప్ప ఉపాసకుడు .మరణ కాలం లో లవంగితో కాశీలో ఉన్నాడు .’’గంగా లహరి ‘’స్తోత్రం చెప్పాడు . చాలా ధారా పాతం గా భక్తీ వినయాలతో చెప్పాడు .గంగమ్మ ఒక్కో శ్లోకానికి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ  వీళ్లిద్దరిని తనలో కలుపు కొందట .ఈ రోజుకీ జగన్నాధ పండిత రాయల గంగా లహరి స్తోత్రాన్ని పాడి గంగమ్మకు నీరాజనం ఇవ్వటం సంప్రదాయం గా వస్తోంది .నిత్య విధులు నిర్వ హిం చే వాడట పండితుడు .ఒక  రోజు రాయలు పాదుషా తో చలికాలం లో ‘’పాదుషా వారు విరహం అనే అగ్ని తో ఉన్న స్త్రీల హృదయాల్లో చేరి చలి కాచుకొంటున్నారు  ‘.మాకు స్త్రీలూ లేరు ,చలిమంటా లేదు మా గతేమిటి ?’అని శ్లోకం లో చమత్కరించాడు .ఆ హుషారులో ‘’నాస్మాకం వసనం నవా యువతః కుత్ర వ్రజా మోవయవం ‘’అని తోక తగిలించాడు .అంటే రాజ్యం లోని స్త్రీ లందర్నీ పాదుషాకే కట్టశాడాన్నమాట .అంత తీవ్రం గా చెప్పటం లో ఔచిత్యం జారిపోయిందని అంటారు ఆచార్య శ్రీ .

జగన్నాదుడి కాలం లోనే ‘’వంశీ ధరుడు ‘’అనే కవి అక్కడే ఉండేవాడు .అతడు ముంతాజ్ మహల్ ద్వారం దగ్గర కాపలా ఉండేవాడట .ఈయన్ను ఏమైనా అంటే ఆవిడకు కోపం నషాళానికి  అంటు తుందట  .షాజహానే జగన్నాధుడికి ‘’పండిత రాయలు ‘’ బిరుదు ప్రదానం చేశాడు. ఆస్థాన విద్యధి కారీ అయి ఉండచ్చు .పండితుడికి వంశీ ధరుడికి స్పర్ధ ఉండి ఉండచ్చు. జగన్నాధుడు ఎవరి మీదికైనా శ్రీనాధుడి లాగా ఒంటి కాలితో రెచ్చిపోతాడు .ఒక శ్లోకం లో చెప్పాల్సిన దాన్ని పది శ్లోకాలలో చెబితేకాని పండితుడికి తృప్తి ఉండదు. శ్రీ నాధుడే జగన్నాధ పండిత రాయలుగా మళ్ళీ జన్మించాడని నారాయణా చార్యుల వారి నమ్మకం .కొన్ని శ్లోకాలు శ్రీనాధ పద్య వ్యాఖ్యానాలుగా ఉంటాయంటారు .వంశీధరుడి తో ఉన్న స్పర్ధ తో భామినీ విలాసం లో ఒక శ్లోకం రాశాడు జగన్నాధుడు .-

‘’దిగంతే శ్రూయంతేమద మాలిన గండాః కరటినః—కరిన్యకారున్యాస్పదశీలాః ఖాలు మృగాః

ఇదానీం లోకే స్మిన్ అనుపమ శిఖానాం పునరయం -నఖానాంపాండిత్యం ప్రకతయతు కస్మిన్ మృగ పతిః’’

అర్ధం –మదం తో ఉన్న గండ స్థలాలతో దిగ్గజాలు దిక్కులా చివరల్లో ఉన్నాయి .ఆడ ఏనుగులను చంపుదామంటే ‘’అయ్యో పాపం ‘’అని పిస్తోంది .పరాక్రమాన్ని ఆడంగులపై ఏమిటి? కనుక నా గోళ్ళపాండిత్యాన్ని ఎవరిపై చూపాలి అని మృగరాజు వాపోతున్నదట .ఈశ్లోకాన్ని శిష్యుడైన నారాయణుడు అనే వాడికిచ్చి వంశీధరుడి దగ్గరకు పంపిన కాలు దువ్వే కవి సింహం జగన్నాధుడు .దీనికి దీటుగా వంశీధరుడు కూడా తనను సింహం తోనే పోల్చుకొని జవాబు పంపాడట .ఈ విషయాలు ‘’రసిక జీవనం ‘’అని పుస్తకం లో ఉన్నాయని ఆచార్య ఉవాచ .వంశీధరుడే రాసిన ఇంకో శ్లోకం మాత్రమె కన పడిందట.

షాజ హాన్ మరణం తో జగన్నాధుడి అదృష్టం’’ ఉల్టా –పల్టా ‘’అయింది  .ఔరంగ జేబు కు ‘’కవిత్వం గివిత్వం  జాంతా నై ‘’.అక్కడి నుంచి మధురకు వెళ్ళిపోయాడు అప్పుడొక శ్లోకం చెప్పాడు-

‘’పురాసరాసి మనసు వికచ సార సలిస్కలత్ –పరాగ సురభీకృతే పయసి యస్య యాతమ్ వయః

సపల్వల జలే దునా మిళిదనేక భేకాకులే –మరాళ కువలయ నాయకః కద యరేకదం వర్తతాం  ‘’దీని భావం –

‘’ఒక రాజ హంస ఆయుస్సంతా మానస సరోవరం లోనే గడిచి పోయింది .ఆ జలంశతపత్రాలతో ,సహస్ర పత్రాలతో నిండి ఉండేది. వాటి పరాగం నీళ్ళ లోకి తెప్పల్లాగా రాలుతూ ఉండేది .ఆ సువాసన పీలుస్తూ ,ఆ కమలాల పై ఉయ్యాలలూగుతూ ,శ్రేష్టమైన తామర తూళ్ళను తింటూ ,ఇంతవరకు కాలం గడిపింది సుఖం గా హాయిగా .ఇప్పుడు ఆ రాజ హంసకు కాని కాలం వచ్చింది .నీటి గుంటలను ఆశ్రయించింది .ఇక్కడ ఏముంటాయి?నిరంతర కప్పల బెక బెకలు తప్ప !పాపం అది ఎలా జీవిస్తుందో?’’ శ్రీనాధుడి చివరి రోజులూ ఇంతేగా?చాలాకాలం మహమ్మదీయ రాజుల కొలువులో ఉండటం చేత ‘’జగ్గయ్య ‘’కవిత్వం లో మహామ్మదీయ ఆచారాలు ప్రవేశించాయి .ఆ కాలం లో మహామ్మదీయులే పావురాలను పెంచేవారు .ఇదీ కవిత్వం లోకి ఎక్కింది .ఎక్కడ చూసినా పాములు స్వైర విహారం చేసే ఘట్టాన్నీ కవిత్వీకరించాడు .-

‘’ప్రతి నగరం ,ప్రతి రధ్యం –భుజంగ సంవాస రుద్ధ సంచారే –అమ సఖి!సమ్మత మేతత్ –న కుల ప్రతి పాలనం శ్రేయః ‘’

‘’ ఏ నగరం  లో చూసినా ఏ వీధిలో చూసినా పాముల సంచారం ఎక్కువగా ఉంది .రోడ్ల మీద నడవ టానికి జనం భయ పడుతున్నారు .కనుక ఒక ముంగిస ను పెంచుకోవటం మంచిదేమో?అన్నాడు .ఇందులో ‘’భుజంగ’’అనే శబ్దానికి రెండు అర్ధాలున్నాయి .ఎటు చూసినా విటులే తిరుగుతున్నా రని మరో అర్ధం .శ్లేష తో తమాషా చేశాడు జగ్గూ భాయి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-14-ఉయ్యూరు

 

 

.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.