అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –

D25507054 D25508416 D25507962

అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో ‘నవ్య’ జరిపిన ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలు మీకోసం…‘‘చిన్నప్పుడు చిక్కటి పెరుగు తాగే అలవాటు ఉండేది నాకు. గ్లాసుల కొద్దీ తాగేవాణ్ణి. దానికి తోడు బుగ్గలకు మెరుపొస్తుందని, చర్మం నిగనిగలాడుతుందని ఎవరైనా చెప్పారో లేక సొంత వైద్యమో తెలియదు కాని నాన్నగారు ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి…రెండు పూటలా వెన్నముద్దలను కప్పులో వేసుకుని తినేవారు. తను తినడమే కాదు నాక్కూడా తినిపించడం అలవాటు చేశారు. దీంతో మా ఇద్దరికీ చర్మానికి మెరుపు మాట అటుంచి వొంట్లో కొవ్వు పేరుకుపోయింది. అదే నాన్నగారికి గుండె జబ్బును తెచ్చిపెట్టింది. మొదటి నుంచి నాన్నగారికి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో చేసే పిండి వంటలంటే చాలా ప్రీతి. ఆపరేషన్‌ తర్వాత ఆ ఇష్టాలన్నీ వదిలేసుకున్నారు. అంతకుముందు వరకు రోజుకు నాలుగైదు పెట్టెల సిగరెట్లను తాగేవారాయన. ఆ తర్వాత అటు వైపు చూస్తే ఒట్టు. ఆ రోజు నుంచి నేను కూడా పెరుగు, వెన్నకు గుడ్‌బై చెప్పేశాను.
నాన్నకు కోపమొస్తే…
నేను పుట్టింది మద్రాసులో. నా ఎనిమిదవ ఏట 1960లో నాన్నగారు హైదరాబాద్‌కు తరలిరావడంతో మేమంతా కూడా ఇక్కడకు వచ్చేశాము. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క సత్యవతి(దివంగతులయ్యారు). నేను రెండవవాణ్ణి. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు సుశీల, సరోజ. ఆఖరువాడు నాగార్జున. నాకు ఊహ వచ్చేసరికే నాన్నగారు పెద్ద హీరో. చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ వారం పదిరోజులకో ఓసారి ఆయనను చూసేవాళ్లం. మేము లేచేసరికి ఆయన వెళ్లిపోయేవారు. ఆయన వచ్చేసరికి మేము నిద్రపోయేవాళ్లం. అయితే ప్రతి వేసవి సెలవులకు మాత్రం కొడైకెనాల్‌, ఊటీ.. ఇలా ఏదో ఒక హిల్‌ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఓ పది రోజులు షూటింగ్‌ పెట్టుకునే వారు. మిగిలిన రోజులు షూటింగ్‌కు దూరంగా మాతోనే గడిపేవారు. అమ్మానాన్నలు ఎంత సరదాగా ఉంటారంటే హైదరాబాద్‌లో చూసే నాన్నేనా అని మాకు అనిపించేది. నిజం చెప్పాలంటే నాన్నగారితో గడిపే ఆ సెలవుల కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. ఆ సెలవులు గడిచిపోతే ఆయనను చూసే అవకాశం మళ్లీ అలా ఎక్కడ దొరకదని దిగాలుపడేవాళ్లం.
నాన్నగారు ఇంట్లో ఉండడం తక్కువ కాబట్టి మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఆయన ఇంటి పట్టున ఉన్న రోజున మా అమ్మగారు ఫిర్యాదుల చిట్టా ఇచ్చేది. దాంతో కొందరికి చీవాట్లు…మరి కొందరికి బడితపూజ…ఇలా ఎవరి కోటా వాళ్లకు అందచేసేవారు. చిన్నప్పుడు నాన్నగారితో మాకు సాన్నిహిత్యం చాలా తక్కువ కాబట్టి ఆయనంటే మాకు విపరీతమైన భయంగా ఉండేది. అయితే పెరిగే కొద్దీ ఆ భయం పోయింది. మేము చెప్పింది శ్రద్ధగా వినడం, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చేసేవారు. తాను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నది నాన్నగారికి బలంగా ఉండేది. 1950వ దశకంలో నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. మొత్తం బ్యాంక్‌ బ్యాలెన్స్‌ 45 వేలు ఉందట. అందులోనుంచే 25 వేల రూపాయలను ఆంధ్రా యూనివర్సిటీకి విరాళంగా అందచేశారంటే నాన్నగారికి చదువు పట్ల ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.
నాన్నగారికి పుస్తక పఠనమంటే కూడా చాలా ఇష్టం. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనది. మహాకవి కాళిదాసు సాహిత్యం, పురాణాలు బాగా చదువుతారు. ఆ పద్యాలన్నీ ఆయనకు కంఠోపాఠమే. మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మొదటి నుంచి లేదు. నాన్నగారు వృత్తినే దైవంగా భావించారు తప్ప ప్రత్యేకంగా పూజలు, దైవభక్తి లాంటివి ఆయనకు లేవు. నాదీ అదే పద్ధతి.
స్థితప్రజ్ఞత

మా అమ్మగారు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెను కంటికి రెప్పలా నాన్నగారు చివరి క్షణం వరకు చూసుకున్నారు. మా అమ్మగారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలిసినపుడు ఆయన కృంగిపోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నారు. మేము దిగులు చెందుతుంటే ధైర్యం చెప్పే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. ‘‘ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. మీ అమ్మ మనల్నందరినీ వదిలి వెళ్లిపోతోంది… మీరంతా నిబ్బరంగా ఉండాలి.. తట్టుకుని నిలబడాలి’’ అంటూ మమ్మల్ని ఓదార్చారు. మా అమ్మానాన్నలది దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన జీవిత భాగస్వామ్యం. అన్యోన్య దాంపత్యం. వారిద్దరు పరస్పరం కలహించుకోవడం నా జీవితంలో చూడలేదు. అమ్మంటే నాన్నగారికి అంతులేని ప్రేమ. అమ్మ దూరమైన బాధను ఆయన ఏనాడూ వ్యక్తం చేయలేదు. అమ్మ లేని లోటు తెలియకుండా ఉండేందుకు కాబోలు తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు.
ఒంటి చేత్తోనే చేశారు

నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించినప్పుడు నేను విదేశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో నాన్నగారికి షూటింగ్‌లు చేసుకోవడానికి హైదరాబాద్‌లో స్టూడియో లేకుండా పోయింది. సారథి స్టూడియోస్‌ ఉన్నప్పటికీ అది నష్టాలలో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండేది. ఆయన నటజీవితాన్ని కొనసాగించాలంటే బెంగళూరుకో, మద్రాసుకో వెళ్లక తప్పదు. ఆ దశలో సొంతంగా తానే స్టూడియో నిర్మించాలన్న ఆలోచన నాన్నగారికి వచ్చింది. అప్పుడే నేను మద్రాసు లయోలా కాలేజ్‌లో బిఎ పూర్తి చేసి పైచదువుల కోసం విదేశాలకు వెళుతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన చేసిన రోజున ఉన్నాను… రెండేళ్ల తర్వాత నేను చదువు ముగించుకుని వచ్చేసరికి స్టూడియో రెండు ఫ్లోర్లు పూర్తయిపోయింది. స్టూడియో నిర్మాణమంతా నాన్నగారు ఒంటి చేత్తో చేశారనే చెప్పవచ్చు.

Related News
అక్కినేని చిత్రాలకు పని చేయటం వరం -శ్రీనివాస చక్ర వర్తి -ఆంద్ర జ్యోతి -20-9-14
తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా భాషల్లో 50కి పైగా చిత్రాలకు రచన చేసి, ఎన్నో అవార్డులు అందుకొన్న రచయిత శ్రీనివాసచక్రవర్తికి డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావుతో చిరకాల అనుబంధం ఉంది. అక్కినేని జయంతి సందర్భంగా శ్రీనివాసచక్రవర్తి ‘చిత్రజ్యోతి’కి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…అక్కినేనిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. సుమారు అర్ధశతాబ్దం పైమాటే! నేను అనేక సూపర్‌హిట్‌ చిత్రాలకు కథకుడినే అయినా ఆయనను కలిసిన ప్రతిసారీ నాకొక ఇన్‌స్పిరేషన్‌ అనిపించేది. నేను ఆయనను ‘భాయ్‌ సాబ్‌’ అంటే ‘ఏమోయ్‌’ అని ఆయన ఆత్మీయంగా పలకరించేవారు. 1961 ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని రవీంఽద్రభారతిలో ‘మూగమనసులు’ షూటింగ్‌ జరుగుతున్న రోజులవి. . ఆ సినిమా హీరోహీరోయిన్లు అక్కినేని, సావిత్రిని కార్లో హనీమూన్‌కి పంపే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు ఆ చిత్ర దర్శఽకుడు. ఆ సన్నివేశంలో కారు మొరాయిస్తుంది. దానిని తోయడానికి ముందుకు వచ్చే నలుగురు కుర్రాళ్ళుగా నేను, విజయ్‌చందర్‌, నూతన ప్రసాద్‌, శ్రీరంగం శ్రీధరాచార్య నటించాం. అదే అక్కినేని గారిని తొలిసారి కలవడం.
1968లో ‘బంగారు గాజులు’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాత. సి.ఎస్‌.రావు దర్శకుడు. నాగేశ్వరరావుగారికి జోడీగా భారతి. చెల్లెలుగా విజయనిర్మల నటించారు. సూర్యకాంతం, రేలంగి ఇతర పాత్రధారులు. ఆ సినిమా షూటింగ్‌ సారథి స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతుండగా రెండోసారి నాగేశ్వరరావుగారిని కలిశాను. నాటి నుండి నేను మద్రాస్‌ వెళ్ళిపోయేవరకు నాగేశ్వరరావుగారికి ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 20న పుట్టినరోజు శుబాకాంక్షలు తెలిపేవాడిని.
1973లో బాపుగారి దగ్గర దర్శకత్వశాఖలో చేరినప్పటి నుండి నాగేశ్వరరావుగారితో నా అనుబంధం మరింత బలపడింది. ప్రత్యక్షంగా ఆయనను కలిసి మాట్లాడేవాడిని. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 20న ఆయన ఇంటికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేవాడిని. ఆ అదృష్టం ఆయన మరణానికి ముందు జరిగిన పుట్టినరోజు వరకూ కొనసాగింది. కథకుడిగా నాగేశ్వరరావుగారితో డా.డి.రామానాయుడు నిర్మించిన ‘గురుబ్రహ్మ’, నంది రామలింగేశ్వరరావు నిర్మించిన ‘భలే దంపతులు’, భోగవల్లి ప్రసాద్‌ నిర్మించిన ‘దాగుడు మూతల దాంపత్యం’ చిత్రాలకు పనిచేయడం భగవంతుడు నాకిచ్చిన వరంగా భావిస్తాను.
మరచిపోలేని సంఘటన
ఒకసారి కథ చెప్పడానికి నేను, నా సహధ్యాయి సత్యానంద్‌, దర్శకుడు రేలంగి నరసింహరావు నాగేశ్వరరావుగారి ఇంటికి వెళ్లాం. నాకు కొంచెం నోటి దురద ఎక్కువ. కథ మధ్యలో ‘భాయ్‌సాబ్‌ కొంచెం టీనో, కాఫీనో ఇప్పిస్తారా..’ అని అడిగాను. వెంటనే ఆయన లేచి లోనికి వెళ్ళిపోయారు. అప్పుడు సత్యానంద్‌, రేలంగి ‘పెద్దాయనను ఇబ్బంది పెట్టావుకదా..!చాలా అమర్యాదగా ప్రవర్తించావు’ అని మందలించారు. ఆ తరువాత కాసేపటికి భుజం మీద నాప్‌కిన్‌ వేసుకుని ట్రేలో కాఫీ పెట్టుకుని నాగేశ్వరరావుగారు వచ్చారు. నేను తప్పు చేశానో, భగవంతుడు నా నోట అలా పలికించాడో తెలీదు గానీ, ఎవ్వరికీ దక్కని భాగ్యం, నాగేశ్వరరావుగారి స్వహస్తాలతో చేసి ఇచ్చిన కాఫీ త్రాగడం నా సౌభాగ్యంగా భావించి ఇప్పటికీ పులకించిపోతాను. కాఫీ తాగిన తరువాత నాగేశ్వరరావుగారు నాతో ఏమన్నారో తెలుసా… ‘మా ఇంట్లో పనివాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మాన్పించేశాను. అందుకే నేనే కాఫీ పెట్టాల్సి వచ్చింది. ఇక మీదట నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నీకు, నాకు సరిపడా కాపీ ఫ్లాస్క్‌లో పోసుకుని తీసుకురా’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నాకు అలాగే గుర్తుండిపోయాయి.
2013 సెప్టెంబర్‌ 20న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి అక్కినేని గారి ఇంటికి వెళ్ళాను. ‘భాయ్‌సాబ్‌ మీతో ఓ ఫోటో తీయించుకుంటాను’ అని అన్నాను. ‘ఏమోయ్‌ ఇది నా 90వ పుట్టినరోజు. మరో 10 సంవత్సరాలు ఈజీగా బ్రతికేస్తాను’ అనడమే కాదు ‘నేను నటిస్తూనే మరణిస్తాను’ అని కూడా అన్నారు. ఆ సన్నివేశం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. ‘మనం’ సినిమా చూసిన తరువాత ఆయన సంతృప్తిగా మరణించారనిపించింది. చెప్పినట్లుగానే నటిస్తూ మరణించినప్పటికీ అనుకున్నట్లుగా 100 ఏళ్ళు జీవిస్తే యావత్‌ భారత చిత్రసీమ పులకించిపోయేది. తన తండ్రికి ‘మనం’ రూపంలో చివరి కానుకగా అందించిన ఆ చిత్ర నిర్మాత నాగార్జున ధన్యజీవి. 
ఏలోకాన ఉన్నా ప్రతియేడులాగానే ఆ యేడు కూడా
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
దయజేసి స్వీకరించండి ‘భాయ్‌సాబ్‌’ .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.