పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14
చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2
కన్నడ –తెలుగు భారతాలు
పంప కవి అనువదించిన భారతం లో అర్జునుడు నాయకుడు .ద్రౌపది ఆయనకే భార్య .అర్జునునికే పట్టాభి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జునుడిని సరిపోల్చి వర్ణిస్తాడు .అభేదమే చూపిస్తాడు .నన్నయ గారుకూడా ధర్మ రాజును తన రాజు రాజ రాజ నరెంద్రునితో అభేదం కల్పించాడు .అంటే పంప మార్గాన్ని అనుసరించాడు .అంతే కాదు. ఒక మహా రాజు ఎలా ఉండాలో కూడా వివరించినట్లే .అరికేసరి బిరుదులన్నీ అర్జునుడికి తగిలించాడు పంపడు ..అలాగే ‘’రన్నడు ‘’కవి కూడా ‘’గదా యుద్ధం ‘’లోతైలవ రాజు కుమారుడిని భీమునితో పోలుస్తాడు .ఇదొక సంప్రదాయం గా కన్నడం లో సాగిపోయింది .
సంస్కృతం లో గ్రంధాన్ని అంకితం ఇవ్వటం కని పించదు. ప్రాక్రుతకావ్యాలలో కూడా ఈ ధోరణి లేదు .కన్నడం లో మొదలైంది .నన్నయ రాజ రాజు కు భారతాన్ని అంకితమిచ్చాడు .నన్నయ సంస్కృతపదాలు ,సమాసాలలో స్పష్టత ఎక్కువ .ముత్యాల్లాంటి ప్రాసలు గొప్ప అలంకారాలు .నన్నయ గారి వస్తుకవిత పంపని లోనిదే అంటారు పుట్టపర్తి వారు .పంప కవిలో నవీన కల్పనా ,రసానుగుణమైన కదా శరీర రచనా ,వస్తువు అనుసరించి రూప నిర్మాణం ,రసానికి తగిన ఛందస్సు ,కావ్య గౌరవాన్ని పెంచే అంగ, ఉపాంగ వర్ణన గొప్ప గుణాలు .ఇవన్నీ మన నన్నయ గారిలో దర్శనమిస్తాయి .తిక్కన గారి పలుకు బడులు చూస్తె ఆయనకూ కన్నడ భాషా పరిచయం ఉన్నట్లే తోస్తోందంటారు డాక్టర్ పుట్టపర్తి .ప్రసన్న కదాత్వం నన్నయది .పంపనిది ప్రసన్న కవితా గుణం ,ఉత్తమ విన్యాసం .
శిశుపాల వధ
కాళిదాసు మూడు కావ్యాలను ‘’లఘు త్రయి ‘’అంటారు .మాఘ ,హర్ష ,భారవి కావ్యాలకూ ఇదే పేరు .శాబ్దిక దృష్టితో చూస్తె కాళిదాసు రచనల కంటే ఈ మూడూ ప్రౌఢ రచనలు అంటారు పుట్టపర్తి వారు .మాఘుడు గుజరాతీయడని అతని రచన ‘’ఘన తర ఘూర్జరీ కుఛ యుగ స్తితి ‘’లాగా గూఢం గా ఉంటుందన్నారు .’’మేఘే మాఘే గతం వయః ‘’అన్నాడు మల్లినాద సూరి .అంటే కాళిదాసు మేఘ దూతం మాఘుని శిశుపాల వధ కావ్యాలపై వ్యాఖ్యానాలు రాయటానికే జీ వితం సరిపోయింది అని .మాఘుడికి ‘’ఘంటా మాఘుడు ‘’అనే పేరుంది అంటారు .మాఘుడు మహాదాత .ఉన్నదంతా దానం చేసి దరిద్రం తో జీవిత చరమాంకం గడిపాడు .ఆ చింత తోనే చనిపోయాడు. భార్య సహగమనం చేసింది .మాఘుని కావ్యాన్ని పోచిరాజు వీరన ,గోపీనాధ కవులు తెలుగు చేశారట .గూపీనాద రామాయణం కూడా ప్రసిద్ధి చెందింది .
వసు చరిత్ర
వసు చరిత్రలోని మంజువాణి పురుషులకన్నా ప్రగల్భాలు పలుకుతుంది .గిరిక ను వర్ణిస్తూ భట్టుమూర్తి అయిన రామ రాజ భూషణుడు ‘’సురభిళాంగి ‘’అన్నాడు అంటే సువాసనలు విరజిమ్మే దేహం ..దేవతా వృక్షాలు అయిదు –హరి చందన ,పారిజాత ,మందార ,కల్ప ,సంతాన వృక్షాలు .మూర్తి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .వీణ బాగా వాయిస్తాడు .నరసభూపాలీయం కూడా భట్టు రాసినా అందులో సంగీత విషయాలేమీ లేవు .తిక్కన లో ధారా శుద్ధిఉన్నా సంగీతానికి పనికి రాదు .నన్నయ లో ధారా శుద్ధి ఉన్నా సంగీతం తక్కువ .వసు చరిత్ర రెండు సీస పద్యాలలో లో ‘’సల’’గణాలు ఎక్కువ .అయిదు మాత్రలతో నడిచాయి .కనుక దీన్ని ‘’ఖండ గతి ‘’అంటారు .’’వసు’’ లో
‘’ఉద్ధరితపు విద్ధ తపన –పధ్ధతి క రిభావన దవని పట దంబుధి సం –పద్ధరణ సముద్ధరణ స –మిద్ధరణ రజో ప్రజోద్యది భమద స్మ్రుతికిన్ ‘’అనే కంద పద్యం ను ‘’మృదంగ సాంకేతిక ధ్వనులుగా ‘’మార్చ వచ్చు .
అక్షరాలను క్రమగా తగ్గించుకొంటూ రాసే ‘’గోపుచ్చయతి ‘’-‘’పనిదపమ-నిదపమ-దపమ పమ –మ ‘’లాంటివి ‘’శ్రోతోవహతి ‘’-ఆకక్షరాలను క్రమంగా పెంచుకొంటూ పోయేది –రిస –మారిస –పామరిస –దపమరిస-నిదపరిస –సనిదపమరిస ‘’లాగా పద్యాలు రాశాడు భూషణ కవి .అలాగే ‘’డమరు యతి ‘’లోనూ చేశాడు .వీటి వల్ల చెవులకు ఇంపైన సంగీత వినిపిస్తున్ది పదాల్లో .’’పదమెత్త గల హంస లీల –యధరస్పందంబు సేయన్ శుభా ‘’పద్యం లో పాదం ఎత్తితే కలహంస నడక లా ఉందన్నాడు .అంతేకాదు ‘’కల హంస ‘’అనే రాగం కూడా ఉందని ఆచార్య ఉవాచ శృతి –శ్రీరాగ విలాసం .శ్రీరాగం ప్రాచీన రాగామేకాక ‘’ఘన రాగాలలో ఒకటి ‘’.చేయి సాచితే కోమల పల్లవాలు – అంటే’’ ఏల పట’’లన్నారు .అన్నమయ్య ఒక్కఏల పదమే దొరికిందిట .ఇవన్నీ సంగీత శాస్త్ర విశేషాలే .అంతపాండిత్యం రామ రాజ భూష నుడికిఉంది .అలాగే ‘’నాదం బొక్కటి పిక్కటిల్లె దిశల న్నవ్యామ్రుతా వ్యాహతా ‘’పద్యం చూస్తె విక్రమోర్వశీయం లో కాకాళిదాసు శ్లోకం –‘’మత్తానాం కుసుమ రసేన షట్పదానాం –శబ్దోయం పరభ్రత నాద ఏష ధీరః –ఆకాశే సురగణ సేవితా సమంతాత్ –కిం నార్యః కల మధురాక్షరం ప్రగీతాః ‘’గుర్తుకు వస్తుంది అంటారు సరస్వతీ పుత్ర .
విజయ నగర సామ్రాజ్య వైభవం
ఒకప్పుడు వింధ్య నుండి కన్యాకుమారి వరకు రాయల సీమ గా ఉండేది విజయ నగర రాజులలో సంగమ వంశ రాజులు శ్రీ విద్యారన్యుల ఆశీర్వాదం తో వర్ధిల్లింది .ఆయన రాజకీయ సంస్కృతిక చైతన్యం తెచ్చిన మహాను భావుడు .’’హక్కుడు –బుక్కుడు ‘’అనే వారిద్దరూ అతి సామాన్య రాజులు .అన్యమతాన్ని స్వీకరించిన వారు కూడా .వీరిని హిందూమతం లోకి మార్చాడు విద్యారణ్యుడు .మార్చటమే కాదు సింహాసనాదిపత్యం కల్పించాడు .పాండ్యులు చోళులు ప్రాచీన కులస్తులే .చేరులు పరశురామునితో సంబంధం ఉన్న వారు. ఈ వంశాల వారినందర్నీ విజయ నగర సామ్రాజ్యానికి విదేయుల్ని చేయటానికి విద్యారన్యులు యెంత కష్ట పడ్డారో అంటారు పుట్టపర్తి వారు .ఈయనకు అక్షోభ్య దీక్షితులు వేదాంత దేశికులు సహకరించారు .సిద్ధాంత భేదాలను మరచి వీరంతా ఆయనతో చేయీ చేయీ కలిపి విజయ నగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయటానికి సహకరించారు .ఇతరమతాల వారూ తోడ్పడ్డారు .
తుగ్లక్ ‘’ఆనె గొంది’’ ప్రాంతాన్ని జయించి’’మల్లిక్ నబీ ‘’ని ఇక్కడ ప్రతినిధిగా చేసి దిల్లీకి బయల్దేరాడు .వాడు బయటికి వెళ్ళగానే ప్రజలలో అశాంతి రెచ్చ గొట్టించాడు విద్యారణ్యుడు .నబీ మెల్లిగా జారుకొన్నాడు .అప్పుడు హరి హర బుక్క రాయల పట్టాభిషేకం చేశాడు .అయన తెలుగువడని కర్నటకడని వాదాలున్నాయి. కానీ ఆయన ఉపాసించింది హంపీలోని ‘’భువనేశ్వరీ దేవి ‘’ని మాత్ర్తమే .ఆలయ ప్రతిష్ట ఆలయానికి బయట ఉంటుందిక్కడ .శ్రీసూక్తాన్ని వాగ్వాదినీ విద్య తో జోడిం చాడు .ఆ దేవికోసం తపస్సు చేస్తే ఆమె మెచ్చి బంగారు వాన కురిపించిందట .దాన్ని హరిహర బుక్కలకు రాజధాని రాజ్య పరిపాలనకు ఇచ్చేశడట .ఇంకొక కధనం ప్రకారం హోయసల రాజుల ఇంటి అల్లుడు అళియ మాచయ్య పెనుగొండలో దాచిన గుప్త ధనాన్ని విద్యారణ్యుడు హరిహర రాయలకు చూపించాడని దాన్ని సామ్రాజ్యాభి వృద్ధికి ఉపయోగించాడని కధనం .
ఇప్పుడు మైసూరు పరకాల మఠం లో ఉన్న ‘’లక్ష్మీ నారాయణ ‘’విగ్రహాలు పెనుగొండలో యజ్ఞం చేసేటప్పుడు భూమిని తవ్వుతుంటే దొరికినవే .హంపీ నగరం ‘’శ్రీ చక్రాకారం ‘’లో ఉంటుంది అన్నారు నారాయణా చార్యుల వారు .విద్యారన్యులు వేదాలకుడెబ్భై అయిదు మంది నిష్ణాతులైన పండితులతో భాష్యాలు రాయించాడు .ఆయన నిలిపిన సింహాసన చత్ర చ్చాయలో జరిగిన పని ఆకాశం అంత అని పొంగిపోయారు .మూడు వందల ఏళ్ళు ఆంద్ర –సంస్కృత –కన్నడాలలో జరిగిన సృష్టి అంతా విద్యా రన్యుల చలవే .అంత నిలకడగా సాహిత్యం ఏ కాలం లోను వర్ధిల్ల లేదు .ఆ రాజులందరూ మహా విజ్ఞులు ,కళాభిమానులు ,కళను అభ్యసించిన వారు .భరత శాస్త్రానికి సంగీతానికి సాహిత్యానికి అది నందన వనం గా భాసించింది .విద్యారన్యునికి భోగనాధుడు ,సాయనుడు అనే ఇద్దరు సోదరులు వీరు అన్నగారికి ఏంతో తోడ్పడ్డారు .విద్యారణ్యుడిని మాధవ విద్యారన్యడని లేక మాధవుడు అనీ అంటారు .కన్నడ సాహిత్యానికి ప్రౌఢ దేవరాయల కాలం వసంతం .అంతకు ముందు రాజులు కన్నడాన్నే పోషించారు .నాచన సోమనాధుడు బుక్క రాయల కాలం లోప్రసిద్ధుడు .వీర కంప రాయని భార్య గంగా దేవి తిక్కన కవిని ఎంతగానో స్తుతిమ్చిందట .కన్నడ సాహిత్యం తో బాటు వీరశైవమూ పెరిగింది .కన్నడ కవులంతా వీర శైవులే .అయితే రాజులకు మతోన్మాదం లేదు .వారి అంతః పురం లోనే భిన్న మతాల వారుండేవారు .
జైన రాజులు కూడా మత దురభిమానం చూపలేదు .’’గజ భేంటకార ‘’ప్రౌఢ దేవరాయలు కన్నడాన్ని ప్రధానం గా ,తెలుగును అప్రధానం గా పోషించాడు. ఆయన కొలువులో వీర శైవులేక్కువ .గౌడ డిండిమ భట్టుకు శ్రీనాధుడికి ఈయన ఆస్థానం లోనే వాదం జరిగి గెలిచి ఆయన ‘’కంచుఢక్క’’ను శ్రీనాధుడు పగుల గొట్టించాడు .కనకాభిషేకం చేయిన్చుకొన్నాడు .శ్రీనాధుడు అద్వైతి అయినా శివాభిమాని .కుమార వ్యాసుడు రాసిన భారతాన్ని చూసే ఉంటాడు లక్కన ,ముద్దన ,దందేశ మొదలైన కన్నడ రచయితలతో శ్రీనాధుడు స్నేహం చేశాడు .మద్దెన కన్నడ క్రియా పదాలను తన రచనల్లో వాడాడు .రాజ మాహేంద్రం శ్రీనాధుడు వెడితే అతని తెలుగు అక్కడి వారికి వింతగా తోచిందట .అందుకేనేమో ‘’నాకవిత్వంబు నిజము కర్నాట భాష ‘’అని చెప్పుకోన్నాడని ఆచార్య స్వాముల ఊహ .
ఇక శ్రీకృష్ణ దేవరాయల యుగం ఒక స్వప్న ఖండం అన్నారు .కళలు శాస్త్రాలు రెక్కలు విప్పి రాజ హంస ల లాగా నడిచిన సౌభాగ్య కాలం .రాయలకు వీణ నేర్పింది మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి గారి తాత గారే నట .ఆ రోజుల్లో బొమ్మ లాట ఆడే’’ కాలుడు’’ ప్రసిద్దుట .అష్ట దిగ్గజ కవులకు ఎంత గౌరవమో ఇతనికీ అంతే గౌరవం ఉండేదట .విద్వత్ సభా రంజక ‘’శ్రీ రంగ రాజు ‘’సుప్రసిద్ధుడు .రాజ నర్తకి ‘’కుప్పాసాని ‘’కి గౌరవం ఉండేది .తిరుమల వాసునికి అగ్రహారాలు దానం చేసింది .వాకిట కావలి తిమ్మన కూ ఆదరం ఎక్కువే .అంటే రాయలు అన్నివిద్యల్ని, అన్నికళల్ని సమానం గా చూశాడు.రాయల భువన విజయం గురించి యెంత చెప్పినా తక్కువే .తిమ్మ రుసు మహా మంత్రి ప్రతిభకు దీటైన వారు చాణక్యుడు తప్ప ఎవరూ లేరు .రాయలేకాదు సామంతులూ సంగీత సాహిత్యాలకు ఎన లేని సేవ చేశారు .శైవ వైష్ణవ జైన ,వీర శైవాలు మైత్రితో వర్ధిల్లాయి .
అచ్యుత రాయలు గొప్ప సాహిత్య సేవ చేశాడు .రాయల కాలం లో ప్రారంభమైన ‘’వసు చరిత్ర ‘తిరుమల దేవరాయల కాలంలో పూర్తయింది .రాయల సీమ లేనిది ఆంద్ర సాహిత్యమే లేదుఅన్నారు పుట్టపర్తి వారు .రాజకీయాలు నిలవవు .విజ్ఞానము కళలే నిలుస్తాయి .మాండలీకాలను సేకరించాలి ‘’భాషను చదువుకొన్న వారు సృస్టిం పరు .సామాన్య జనులే అవసరాన్ని బట్టి పదాలను సృస్టిస్తారు ‘’జానపద సాహిత్యం పై ఇంకా దృష్టిపెట్టాలి .అవేతెలుగు జాతి రక్తమాంసాలు .జానపద నృత్యాలను సేకరించాలి ,భద్ర పరచాలి .అనేక ఆంగ్ల పుస్తకాల అనువాదాలు ఇంకా తెలుగు లోకి రావాలి . కాల్డ్ వెల్ చనలూ తేవాలి .రెడ్డి రాజులు సాహిత్యానికి చేసిన సేవ మరిచిపోలేనిది .రష్యా ఏ చిన్న కళనీ చావ నివ్వకుండా బతికించు కొందిది.అదే అందరికి ఆదర్శం కావాలి
.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-14-ఉయ్యూరు