గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11

12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –

సంస్కృత రూపక కర్త  భాసమహా కవి చరిత్ర కూడా లభ్యం కాక పోవటం దురదృష్టం .కాని మహా కవి కాళిదాసు మాళవికాగ్ని మిత్రం లో ‘’భాస ,కౌమిల్ల ,కవి పుత్ర వంటి కవులను మరిచి పోతున్నామా?నవీనుడైన కాళిదాసునే ప్రేక్షకులు ఆదరించటం న్యాయమా?”’అని ప్రశ్నించాడు .భాసుడి కాలాన్ని క్రీ పూ రెండవ శతాబ్ది అని కొందరు క్రీ శ. రెండు వ శతాబ్ది అని కొందరన్నారు .కాని అయిదవ శతాబ్దానికి చెందిన వాడుగా ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు .880-920 కు చెందిన రాజ శేఖరుడు రాసిన ‘’కావ్య మీమాంస ‘’ భాస రూపకం స్వప్న వాసవ దత్త  గురించి ,భాసుని  గురించి ప్రస్తావన ఉంది .1912లో శ్రీ టి .గణపతి శాస్త్రి కేరళలో భాస నాటకాల వ్రాత ప్రతులను సేకరించి ప్రచురించేవరకు భాసుడి గురించి ఎవరికీ తెలియదు .ఇవన్నీ మళయాళ లిపిలో ఉన్నవే .సంస్కృత లిపి లో ఉన్నవి దొరక లేదు .

సూత్ర దారుని చేత ప్రారంభింప బడిన భూమిక తో ఉన్న పతాక శోభితమైన నాటకాల వలన భాసుడు గొప్ప కీర్తి పొందాడు ‘’అని బాణ కవి ప్రశంసించాడు .దండి కూడా అవంతీ సుందరి లో భాసుని నాటక లక్షణాలను మెచ్చుకొన్నాడు .ప్రాక్రతకవి వాక్పతి రాజూ ప్రశంసించాడు .జయ దేవుడు ‘’భాసో హాసః కవికుల గురుః కాళిదాసో విలాసః ‘’అన్నాడు అంటే ‘’కాళిదాసు కవితా కామిని విలాసం .భాసుడు కవితా కామిని హాసం’’.భాసుడు పదమూడు రూపకాలు రాశాడు   .ఇవన్నీ ఒకే రకమైన  నాంద్యంతం తో ప్రారంభమైనాయి .ప్రస్తావనను స్థావన అన్నాడు .ప్రస్తావనలో తనను గురించి ఎక్కడా చెప్పుకోలేదు .ప్రతి నాటకం చివర ఒకే రకమైన వాక్యాన్ని రాశాడు .దాదాపు అన్నీ ఒకే రకమైన శైలీ ,ఛందస్సు కలిగి ఉన్నాయి .వ్యాకరణ విరుద్దాలెన్నో ఉన్నాయి .భాసుని గొప్ప నాటకం స్వప్న వాసవ దత్తం .ఇందులో నాటక కళ ,సంస్కృత ప్రాకృత భాషల వాడకం శైలీ   ఛందస్సు ఆయన మిగిలిన నాటకాల్లాగానే ఉన్నాయి కనుక ఇది భాస కృతమే .కాదు అనటానికి వీల్లేదు .చరిత్ర పరిశోధకుడు కీత్ పండితుడూ దీన్ని సమర్ధించాడు .ప్రతిమా నాటకం లో ‘’బృహస్పతి ‘’రాసిన అర్ధ శాస్త్రాన్ని గురించి ప్రస్తావించాడు .కౌటిల్యుడి అర్ధ శాస్త్రం ప్రస్తావన లేదు. అయినా అందులో ఒక శ్లోకాన్ని ఉటంకించాడు .స్వప్న నాటక రాజు ఉదయనుడు బుద్ధుని సమకాలికుడు .కనుక భాసకాలం క్రీ పూ. అయిదు లేక ఆరవ శతాబ్దం అవచ్చు .కౌతటిల్యుడికి ముందు ,ఉదయనుడికి తర్వాత ఉండి ఉండచ్చు.ఏతావాతా భాసుని కాలం క్రీ పూ.నాలుగు అయిదు శతాబ్దాల మధ్య అని తేల్చారు .ఇంతటి తో కాలానికి గొళ్ళెం పెడదాం .భాసుడు దక్షిణాత్యుడు అని కీత్ అభిప్రాయ పడితే ,,ఉజ్జయిని వాడని కొందరన్నారు . భాసుని కృష్ణ భక్తి  నాటకాలలో ప్రస్పుటం గా కని  పిస్తుంది .

‘’దావకాపర నామాయం భాసో భాసయతే జగత్ తత్తైరివాదిపురుష  శ్చతు ర్వింశతి రూపకం ‘’  అనే లోకం లో ప్రచారం గా ఉన్న శ్లోకాన్ని బట్టి భాసుడు ఇరవై నాలుగు రూపకాలు రచించాడని తెలుస్తోంది .కాని దొరికింది పదమూడు మాత్రమె .రాసిన వరుస -దూత వాక్యం ,కర్ణ భారం ,దూత ఘటోత్కచం ,ఊరు భంగం ,మధ్యమ వ్యాయోగం ,పంచ రాత్రం ,అభిషేకం ,బాల చరిత్ర ,అవిమారకం ,ప్రతిమా ,ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,స్వప్న వాసవ దత్త ,చారు దత్త అని ‘’పుసాల్కర్ ‘’అనే విశ్లేషకుడు చెప్పాడు ..భాసుని నాటకాలను ‘’భాస నాటక చక్ర ‘’అని రాజశేఖరుడు అన్నాడు .ఇందులో రామ కద ఉన్నవి –ప్రతిమ ,అభిషేక నాటకాలు .మహా భారత కద కలవి –పంచ రాత్ర ,మధ్యమ వ్యాయోగ ,దూత ఘటోత్కచ  ,కర్ణ భార ,దూత వాక్య ,ఊరు భంగ నాటకాలు . భాగవత పరమైనవి –బాల చరిత్ర ఒక్కటే  . ఉదయన రాజు తో సంబంధం ఉన్నవి –ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,స్వప్న వాసవ దత్త –సామాన్య లోక కద వృత్తం కలవి –దరిద్ర చారు దత్త ,అవిమారక నాటకాలు .

భాసుడు కిరణావళి ,ఉదాత్త రాఘవం కూడా రాశాడని ప్రతీతి .హర్షుడి రచనల్లో భాసుని చాటువులు కనిపిస్తాయి ‘’వీణా వాసవ దత్త ‘’అనే నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం దొరికింది .ఇది భాస కృతం కాదని తేల్చారు .రాజ వైద్య కాళిదాసు ‘’యజ్న ఫల ‘’నాటకాన్ని 1914లో భాస నాటకం గా ప్రచురించాడు .ఇదీ భాస రచన కాదని నిర్ణయించారు .

భాస నాటకాల విషయాలు

ప్రతిమ నాటకం లో ఏడు  అంకాలున్నాయి .దశరధుడి మరణం నుండి రామ పట్టాభిషేకం వరకు కద ఉంటుంది . తండ్రిచనిపోయిన తర్వాత మేనమామ ఇంటి నుంచి వస్తూ దారిలో భరతుడు ‘’ప్రతిమా గృహం ‘’లో తన వంశ పూర్వ రాజుల ప్రతిమలను చూస్తాడు .అందులో దశరధుని ప్రతిమ కనిపించి తండ్రి చనిపోయాడని తెలుసుకొంటాడు .అందుకే దీనికి ప్రతిమ అని పేరు పెట్టాడు .మిగతా కద మనకు తెలిసిన రామాయణ కదయే.

అభిషేక నాటకం  తొమ్మిది  అంకాలున్నది .రామాయణం లో  కిష్కింద , సుందర యుద్ధ కాండ విశేషాలతో రచింప బడింది .రామ పట్టాభిషేకం ఉంది కనుక ‘’’అభిషేకం ‘’అన్నాడు .నాటక ధర్మాని కి విరుద్ధం గా వాలివధ రంగ స్థలం మీద చూపించాడు .రాముడిని నారాయణా వతారుడిగా తీర్చాడు .

బాల చరిత్ర –అయిదు అంకాలు .శ్రీకృష్ణ జననం బాల్యం ఇతి వృత్తం .శ్రీకృష్ణ చరిత్ర ఉన్న అతి ప్రాచీన నాటకం ఇదే యుద్ధం, కంస వధ  బాల్య క్రీదలూ అన్నీ రంగ ప్రదర్శన చేసిన నాటకం .

పంచరాత్రం –మూడు అంకాలు .మహా భారత కద.దుర్యోధనుడు యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని ఏదైనా కోరుకొమ్మన్నాడు .పాండవులకు అర్ధ రాజ్యం ఇవ్వమన్నాడు .శకుని దుర్యోధనులను సంప్రదించి సరేనన్నాడు .అజ్ఞాత వాసం లో ఉన్న వారి జాడ  అయిదు రోజుల్లో తెలిస్తే ఇస్తానని షరతు పెడతాడు . జాడ తెలియదు .ఇంతలో ఉపకీచకుల వధ గురించి తెలుస్తుంది .చంపింది భీముడే అని భీష్ముడు అంటాడు .  నియమానికి ఒప్పుకోమని ఆచార్యుడితో చేబుతాడు  గోగ్రహణానికి బయల్దేరుతారు .ఉత్తరుడు అర్జున సాయం తో విజయం సాధిస్తాడు  ద్రోణుడి కిచ్చిన  మాట ప్రకారం పాండవులకు అర్ధ రాజ్యం ఇస్తాడు చిన్న రాజు .ఈ నాటకం లో దుర్యోధన  కర్ణులను మంచివాళ్ళుగా చిత్రించాడు .శకుని ఒక్కడే దుష్టుడు .అభిమన్యుడు కౌరవ పక్షాన పోరాడటం విశేషం. కురుక్షేత్ర యుద్ధం జరగ కుండానే పాండవులకు అర్ధ రాజ్యం ఇప్పించాడు భాసుడు ..

మధ్యమ వ్యాయోగం –ఏకాంకిక .ఇది దశ రూపకాలలో ‘’వ్యాయోగం ‘’అనే దానికి చెందింది .పాండవ వనవాసమే కద  హిడింబ ఘటోత్కచుడికి భీముడు తండ్రి అని చెప్పుతుంది . భవిష్యత్తులో బ్రాహ్మణులకు ఆపద తలపెట్టనని ప్రతిజ్ఞాచేస్తాడు  భీముడు .భీముడే కదా నాయకుడు  కుంతీ పుత్రా మధ్యముడు భీముడు కనుక ‘’మధ్యమ వ్యాయోగం ‘’అయింది .

దూత ఘటోత్కచం-ఇదీ ఒకే అంకం ఉన్న నాటిక .అభిమన్యు వధ తర్వాత శ్రీకృష్ణుడు  ఆదేశిస్తే ఘటోత్కచుడు దుర్యోధనుడి దగ్గరకు రాయబారి గా వెడతాడు .అర్జునుని చేతిలో కౌరవ నాశనం జరుగుతుందని భవిష్యత్తు చెబుతాడు .కల్పిత కద.

దూత వాక్యం –ఇదీ ఏకాంకిక యే   .దీన్నీ వ్యాయోగం అనే అంటారు .శ్రీకృష్ణ రాయ బారం కద విశ్వ రూప సందర్శనం ఉన్నాయి .

కర్ణ భారం –ఏకాంకిక .బ్రాహ్మణ వేషం లో వచ్చిన ఇంద్రుడికి సహజ కవచ కుండలాలను కర్ణుడు దానం చేసే కద

ఊరు భంగం –ఏకాంకిక .దుర్యోధన భీముల గదాయుద్ధం .తొడలు విరిగిన దుర్యోధన మరణం ఉంటాయి దుర్యోధనుడి పాత్ర చిత్రణ అపూర్వం .ఈతని  ఏకాంకిక లలో  ఇది ఉత్తమమైనది .గ్రీకు ట్రాజెడీ వాసన కనిపిస్తుంది .

ప్రతిజ్ఞా యౌగంద రాయణం నాలుగు అంకాలు .ప్రకరణ విభాగ రూపకం గా భాసుడే చెప్పాడు ప్రస్తావన లో .ఉజ్జయిని రాజు ప్రజ్జ్యోతుడు కౌశాంబి రాజు ఉదయునుడిని మాయోపాయం తో  బంధిస్తే రాజును విడిపిస్తానని మంత్రి యుగంధరుడు ప్రతిజ్ఞ చేస్తాడు . కారాగారం లో ఉన్న ఉదయనుడు ప్రజ్యోతుడి కూతురికి వీణ నేర్పుతాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .ఆమెను వదిలి తాను  విముక్తికి ఒప్పుకోడు .అప్పుడు యుగంధరుడు –ఉదయనుడిని   అతని  ,ఘోష వతి  అనే వీణ ను ,నలగిరి అనే ఏనుగును వాసవ దత్త ను విడిపిస్తానని మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడు .సఫలుడౌతాడు అందుకే ‘’ప్రతిజ్ఞా యౌగంద రాయణం ‘’.ఇందులో నాయకుడు యౌగంద రాయణుడే .ఇందులో  కృత్రిమ ఏనుగు ఉంటుంది .ట్రోజన్ వార్ లోని ట్రోజన్ గుర్రం గుర్తుకొస్తుంది .

స్వప్న వాసవ దత్త –ఆరు అంకాలు .దాదాపు అదేకద. ట్రీట్ మెంట్ అద్భుతం .ఉదయన రాజు భార్య పద్మావతి ప్రేమికురాలు వాసవ దత్త .ఉదయనుడు అర్ధ జాగ్రత్ అవస్తలో  కలను నిజాన్ని  కలబోసుకొన్న అనుభవాన్ని కవి బాగా తీర్చి దిద్దాడు .అనంగ హర్ష మాత్రు రాజు రాసిన ‘’తాపస  వత్స రాజ ‘’నాటకం ఇదే కద ఆధారం గా నడుస్తుంది .

అవిమారకం –ఆరు  అంకాల నాటకం –నాయకుడే అవిమారకుడు ‘’.అవి’’ అనే పేరున్న రాక్షసుడిని చంపాడుకనుక ఆపేరు .రుషి శాపం తో రాజరికం కోల్పోతాడు  మేనమామ కూతురు కురంగిని ప్రేమించి అక్కడ తిష్ట వేస్తాడు రహస్యం బయట పడితే కురంగి అగ్నిలో దూకి ఆత్మ హత్యకు పాల్పడితే విద్యాధరుడు ప్రత్యక్షమై మాయా ఉంగరాన్నిస్తాడు .దాని సాయం తో ఆమెను రక్షిస్తాడు .నారదుడు వచ్చి విషయంతెలిపి ఇద్దరికీ తండ్రి అనుమతితో పెళ్లి చేస్తాడు .ప్రతిజ్ఞ లోలాగానే ఇందులోనూ విదూషకుడు ఉన్నాడు .షేక్స్పియర్ రాసిన రోమియో –జూలియెట్ నాటకాన్ని తలపిస్తుంది. ఈ కద వాత్సాయన కామ సూత్ర , గుణా ధ్యుడి బృహత్కధ లో చోటు చేసుకొన్నది .

చారు దత్త –నలుగు అంకాలు .అభినవ గుప్తుడు దీన్ని ‘’దరిద్ర చారు దత్తం ‘’అన్నాడు , వసంత సేన అనే వేశ్య ,చారుదత్తుడనే బీద పెళ్లి అయిన బ్రాహ్మణుడి ప్రేమ కద. మృచ్చకటికం కద.అసంపూర్ణ నాటకం .సూద్రకుడి మ్రుచ్చకటికానికి సంక్షిప్తం ఇది అన్నారు. ఇది నిజం కాదు శూద్రకుడే భాసుడి కధను ఆధారం గా చేసుకొని పెంచి నాటకం గా రాశాడని అందరి అభిప్రాయం ‘ .భాస నాటకాలను గుజరాతీ ,మణిపురి భాషల్లోకి గోవర్ధన పంచాల్ అనువాదం చేశారు .వీటిని రవీంద్రుని విశ్వభారతిలో ప్రదర్శించారు .భాసుడు కృష్ణుడి ఆయుధాలను కూడా సజీవ పాత్రలుగా మార్చటం విశేషం అని సునీల్ కొఠారి అనే చారిత్రిక విశ్లేషకుడు తెలిపాడు .

కవితా గీర్వాణం

భాసుని ప్రతినాటకం ఒక ప్రత్యేకతను  సంత రించుకోన్నది .ఏదీ పూర్వ రచయితల అనుకరణలు కానే కావు .అతని శైలి సంభాషణలు రస సంపూర్ణాలు .కల్ప నలు, సన్నివేశాల నిర్వహణ మహా ప్రతిభా వంతం గా చేశాడు .ఒక రకం గా అతని సంభాషణా రచన అనితర సాధ్యం అని పిస్తాయి .సులభం గా హృదయాలను తాకుతాయి .ప్రదర్శన యోగ్యం గా నాటకాలు రాయటం భాసుని ప్రత్యేకత .అందుకే కేరళ  నటులు ‘’చాక్యారులు ‘’వంద ఏళ్ళ నుండి భాస నాటకాలు ప్రదర్శిస్తున్నారు .అందుకే ఇప్పటికి సజీవం గ నిలిచాయి .భాసుడంత సమర్ధం గా తర్వాత నాటకరచయితలు చేయ లేక పోయారు .  ఏకాంకికలను కూడా సర్వాంగ సుందరం చేశాడు .ఊరు భంగం లో నాటక కళపరి పుష్టి పొందింది .బాల చరిత్ర లో కధాకధనం లేక పోయినా ,సంఘటనల కూర్పుతో చిరస్మరణీయం చేశాడు .పంచ రాత్రం నాటకం ‘’సామవ కార భేదం ‘’అనే దానికి చెందింది .కదా కల్పనా చాతురికి ఇది గొప్ప ఉదాహరణం .అభిషేకం ప్రౌఢ నాటకం .నీరస కధలను రాసమయం చేసన కవి మాంత్రికుడు భాసుడు .వాలి వధ ను రంగం పై చూపించాడు .భాసుని అనుసరించి భవ భూతి మహా వీర చరిత్ర ,ఉత్తర రామ చరిత్ర రాశాడు .భాసుని ప్రతిమా నాటకం పాత్ర చిత్రణ ,కళా దృష్టిలో ఉత్తమ నాటకం .

స్వప్న వాసవ దత్త లో భాసుని నాటక కళా ప్రతిభ విశ్వ రూపం దాల్చింది. ప్రౌఢ కవిత్వం, సన్నివేశ కూర్పు ,అన్ని ఒక దానిని మించి ఒకటి అమిరాయి .విధి  విలాసాన్ని(ఐరనీ ఆఫ్ ఫేట్ ) చక్కగా చిత్రించాడు .మధ్యమ వ్యాగోగం ,ప్రతిజ్ఞా నాటకాలలో నాటకీయ శిల్పం పరా కాస్ట  కు చెందింది .పతాక సన్నివేశాలను ప్రతిభా వంతం గా నిర్వహించాడు .తన అభిరుచి ననుసరించి స్వతంత్రించి కద లను మార్చాడు .పాత్రల  చుట్టూ  కొత్త కద అల్లాడు .అదే అతని నేర్పు .అవి ఎబ్బెట్టు గా లేకుండా ప్రేక్షకాభిరుచిని పొందాయి .

సలక్షణ  మైన మన కవిత్వం రాశాడు భాసుడు .వర్ణనలు ఔచిత్యం గా చేయటం భాస ప్రక్రుతి .చమత్కారాలు ఉండనే ఉండవు .ఉపమానాలు ప్రక్రుతి నుంచే తీసుకొంటాడు .అనవసర శ్లోకాలు రాయడు .లోకోక్తులతో భావ వ్యక్తీకరణం చేశాడు .భాస భావాలు సూటిగా గుండెల్లోకి దూరిపోతాయి .మనుష్యులంతా భాసుడికి మంచి వారుగానే కని పించటం మరో ప్రత్యేకత .మానవ జీవితాన్ని సూక్షం ద్రుష్టి తో దర్శించి చిత్రించాడు .కవికుల గురువు కాళిదాసు కు భాసుడు అంటే అభిమానం ఎక్కువ .భాస సౌమిల్లాది కవుల ముందు తాను  తీసికట్టు అని కాళిదాసే చెప్పుకొన్నాడు భాసుడిని అనేక సందర్భాలలో అనుసరించాడు .ప్రతిమా నాటకం లోని రఘువంశ క్రమాన్నే కాళిదాసు రఘు వంశం లో పాటించాడు భవ భూతిపైనా భాస ప్రభావం పడింది. మాలతీ మాధవం భాసుని అవికార నాటకం లా ఉంటుంది .హర్షుని రత్నావళి, ప్రియ దర్శకాలు భాస వాసవ దత్త అనుకరణలే .నాగానందం మీదా భాస ప్రభావం ఉంది. విశాఖ దత్తుడు ముద్రా రాక్షం కూడా భాసుని చారు దత్త నాట కం మీదే ఆధారపడి రాశాడు .ఇలా నాటక కళా చాతుర్యం ,కదా కల్పనా నైపుణ్యాలతో భాసుడు ఎందరో తరువాత కవులకు ప్రేరణ  స్పూర్తిగా నిలిచాడు .

మన గీర్వాణ కవుల్లో కాళిదాసు కంటే పూర్వం వాడు భాసుడు .క్రీ.పూ వాడుకూడా .కనుక మన సీరియల్ లో మొదటి స్థానం భాసుడిదే .ఆ తర్వాతే మిగాతాకవులు అని విన్న విస్తున్నాను .

  Inline image 1

Inline image 2   Inline image 3

ఉదయన రాజు వేషం

 

మరో కవితో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-14—ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.