పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )

చినుకుల వేట –అవీ ఇవీ అన్నీ -3

శ్రీనాధ కవి సార్వ భౌముడు

శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు  నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాదుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత మారన ను  ‘’వినమత్కాకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు .శ్రీనాధుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హనుడు మొదలైన ప్రౌఢ కవులు నర్తిస్తూఉంటారు  .అయితే భారవి శ్రీనాధుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం లోని కిరాతార్జునీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాం గీణ  కీర్తి ఖర్జువు ‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాధుడు ‘’కచ్చిపోతు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె సహించ లేడు.అందుకే ‘’కంటకుడైనా శాత్రవు డోకండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .

వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం నుండి వచ్చి రెడ్డి రాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు .పండితులు ‘’క్రోడ పత్రాలు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త్ర చర్చలు ఎడతెగక సాగేవి .పరస్పర అవహళనలే ఎక్కువ .సిద్ధాంత గ్రందాలకంటే పూర్వ పక్ష గ్రందాలపైనే అధికారం ఉండేది .ఉత్తరాది మతానికి చెందిన’’ సత్య ధ్యాన తీర్ధులు’’ద్వైతులు. దాన శూరులు .ఆది శంకరుల గ్రంధాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త్ర వద పద్ధతిని రాయలు నాలుగు పద్యాలలో భేషుగ్గా వర్ణించాడు .

వేదాంత దేశికులు  డిండిముడిని ఓడించారు .కాని శ్రీనాధుడు  డిండిమ భట్టును ఓడించి అతని కంచు ఢక్క పగల కొట్టించే దాకా నిద్ర పోలేదు .రాజసం శ్రీనాధుడి సొత్తు .అప్పుడే ‘’కర్నాటక దేశ కటక పద్మ వన హీళి’’అని పించుకొన్నాడు .రెడ్డి రాజులు రాసిన  మాళవిక ,గాదా ,అమరుకం మొదలైన కావ్యాలలో శ్రీనాధుడి హస్తం ఉండి ఉండచ్చు అని నారాయణాచార్యుల వారి ఊహ .కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా చేసుకొన్న కవి ఇంకోడు లేడు.’’దూడ పేడ ,పసిపిల్లల ఉచ్చ ,జంగమ రాలి వక్షోజాలు అన్నీ కవిత్వీకరించాడు .శ్రీశ్రీ గారి ‘’అగ్గిపుల్లా సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం ‘’కు శ్రీనాదుడే స్పూర్తి అనిపిన్స్తోంది నాకు .మగడు చచ్చిన మగువ బతక రాదని శ్రీనాధుడి అభిప్రాయం .వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు నీచం గా ‘’మగడు చచ్చిన ముండ ,ముండ దీవెన ,తలకు మాసిన ముండ ‘’అని తిట్టాడు ‘’విశ్వస్త వడ్డించటం హేయం గా భావించాడు .

శ్రీనాధుడికి దేనినైనా ‘’ఆస్ఫాలించటం ‘’ఇష్టం ఆ శబ్దాన్ని పలుమార్లు ఉపయోగిస్తాడు .శబ్దాలను ఆలోచించి ప్రయోగించడు మనల్నీ ఆలో చింప నీయడు  అంత వేగం గా పద్యం ప్రవిహిస్తుంది .పెద్దన గారి శబ్ద ‘’వశిత్వం ‘’ఎవరికీ రాలేదు .ఇతను వాచ్య కవి .’’కుల్లా యుంచితి కోక గట్టితి మహా కూర్పాసమున్ దొడ్గితిన్ –తల్లీ కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా నేను శ్రీనాదుడ న్ ‘’అని రాయల దర్శనానికి వెళ్లి చెప్పాడు పూర్తిగా కన్నడ వేషం వేసుకోన్నాననే చెప్పాడు తల్లీ అంటూనే నేను శ్రీనాదుదన్ అన్నాడు .శ్రీనాధుడు అంటే లక్ష్మీ దేవి భర్త .ఇది ఆలోచించకుండా ఆ వేగం లో అనేశాడు అంటారు సరస్వతీ పుత్రులు .కాళిదాసు ను అందుకోవాలనే తపన. కాని అది సాధ్యంకాలేదు. కాళిదాసు సున్నిత వీణాగానం .శ్రీనాధుడు ‘’ఆర్గాన్ ‘’ధ్వని .ఆయన జీవనాడి ఈయనకు చిక్కదు .అంటారు ఆచార్యులు .శ్రీనాధుని పద్యం పైన పటారం లోన లొటారం .

విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డం పెట్టుకొని బాగా గడించారట .అర్ధ గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రాలు అన్నీ చెప్పాయి. కాని శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక  ‘’ఆడమనిషిని ‘’ పెట్టాడు  దటీజ్ శ్రీనాధ –మగాళ్ళు రోత ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొతే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా .దాన్ని వాళ్ళకీ అంటించాడు .

శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని పొందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రుడు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి మీ సంస్కృతాన్ని తీసుకోండి ‘’అని ఆక్షేపించడట. అంటే అన్నీ సంస్కృత పదాలే నువ్వు పొడి చేసిందేమిటి ?’’అని దెప్పాడన్నమాట .’’శ్రీనాధుడు తప్ప మరే కవి అయినా నైషధం మీద చెయ్యి వేస్తె అది కోతి పిల్ల అయ్యి ఉండేది ‘’అని నిష్కర్షగా నిర్మొహమాటం గా హృదయ స్పూర్తిగా శ్రీనాదుడిని మెచ్చిన పుట్టపర్తి వారి ఔదార్యానికి జేజేలు .చిత్ర విచిత్రాలైన కల్పనలకు దూరాన్వయ ,క్లిస్తాన్వయాలకు  హర్ష నైషధం పెన్నిధి .హర్షుడికి ఉన్న రస కండూతి ఏ సంస్కృత కవికీ లేదన్నారు .’’అడుగడుగునా ‘’అమృతాంజనం ‘’‘’పట్టించుకోవాల్సిందే . భావాలకు హర్షుడు భోషాణం ‘’అన్నారు .’’శ్రీనాధుడికి నాలుక దురద ‘’ ఎక్కువ .హర్షుడు హర్షుడే శ్రీనాధుడు శ్రీనాదుడే –గురువు గురువే శిష్యుడు శిష్యుడే .ఒకరి చేతిలో ఇంకొకరు ఓడిపోలేదని తేల్చి చెప్పారు పుట్టపర్తి వారు .

రాయల సీమ పలుకు బడులు

Inline image 1

ఏ భాషకైనా ప్రాంతీయ భేదాలులుండటం సహజం .తిరువాన్కూర్ మలయాళానికి ,కొచ్చిన్ మలయాళానికి తేడా ఉంది. కొచ్చిన్ వాళ్ళది అనాగరక భాష అని తిరువాన్కూర్ వాళ్ళుఅంటారు. తమిళం లో నూ రకాలున్నాయి మధుర వాళ్ళు తమ భాషను ‘’శిన్దమిల్’’ అంటారు .అంటే శ్రేష్టమైన తమిళం అని .నిజానికి అపురూప  తమిళ కావ్యాలన్నీ మధుర లోనే పుట్టాయంటారు పుట్టపర్తి వారు .బెంగళూర్ దగ్గరి వైష్ణ వులను ‘’హెబ్బార్  అయ్యంగార్లు  ‘’అంటారట .వీళ్ళు తమిళాన్ని భ్రస్టు పట్టిస్తారట .గదగ్ ,ధార్వాడ కన్నడానికి మైసూర్ కన్నడానికి తేడా ఉందట .ధార్వాడ్ కన్నడం లో మహారాష్ట్ర పదాలు చేరాయి .ఉచ్చారణ మహా రాష్ట్ర యాస లో ఉంటుంది .మైసూరోళ్ళు  మాదే  గొప్ప భాష అని బుజాలేగారేస్తారట .

రాయల సీమలో ‘’బుర్ర గోక్కోవటం ‘’అంటే క్షౌరం చేయించుకోవటం ట.బిడ్డలు గుడ్డలు అనటానికి షార్ట్ కట్ గా ‘’బిడ్లు గుడ్లు ‘’అంటారట ..’ఏమప్పా లేసుగుండావు ?’’అంటే బాగా ఉన్నావు అని అర్ధం .’’రేగటం అంటే కోపం రావటం మనమూ దీన్ని వాడతాము వాడికి తిక్క రేగింది అంటాం కదా .కోలారు ప్రాంతం తెలుగు మరీ చిత్రం గా ఉంటుందట ..’’గూట్ల వున్వి ‘’అంటే గూటిలో ఉన్నాం అని అర్ధం ,’’కూస్తాడు అంటే పిలుస్తాడు అని .వాండు అంటే వాడు .’’మరం త్యా’’అంటే చేట తీసుకొని రా అని .పూడ్సటం  అంటే  పోవటం .’’సాటి నావా ‘’అంటే భోజనం చేశావా .’’వాడుదా పూడ్సేను ‘’అంటే వాడు  వెళ్లి పోయాడు .వా అనేది తమిళం నుంచి వచ్చి చేరిందట .

కడప జిల్లాలో స్వచ్చమైన తెలుగు ఉందన్నారు .కొంత ఉర్దూ ప్రభావమూ ఉందిట . వెయ్ అనటానికి ‘’బేయ్ ‘’అంటారు .యాకన అంటే తెల్ల వారుజామున మన వేకువ అన్నమాట .గుణమాడుకోవటం అంటే నిన్దిన్చుకోవటం .దొబ్బు అంటే తోయ్యటం దీన్ని పోతన్నకూడా వాడాడు .’’సంతన ‘’అని పోతన వాడిన పదానికి ‘’ఇంట్లో ఎవరూ చేసే వారు లేరు ‘’అని అర్ధం .ఇది రాయల సీమ పదమే నన్నారు ఆచార్య శ్రీ ..లి బదులు ల వాడటం ఇక్కడ సహజం రావాల ,పోవాల .

విజయ నగరం భాషలో ‘’ముది మది తప్పింద్యా ‘’అంటే ముసలితనం వచ్చి చాదస్తం పెరిగిందా అని .బందెకాడు అంటే పాలెగాడు .పచ్చిగా మాట్లాడటం అంటే రహస్యం లేకుండా చెప్పటం .మినుములు –రాయల సీమలో ‘’ఉద్దులు ‘’.కొబ్బరికాయ ‘’టెంకాయ ‘’తెన్’’అంటే దక్షిణ ప్రాంతం అక్కడ అవి దొరుకుతాయికనుక ఆపేరు .అరవ దేశం లో తెన్ అంటేనే కొబ్బరికాయ .మనకళ్ళ జోడు రాయల సీమలో ‘’కళ్ళద్దాలు ‘’.అన్నమయ్య పదాలన్నీ  పశ్చిమాంధ్ర పదాలే .ప్రబంధ సాహిత్యం రాయల సీమపుట్టినిల్లు .రాయల సీమ లేకపోతె భారతం తప్ప తెలుగుకు ఏమీ మిగలదు అనికరాఖండీగా చెప్పారు నారాయణాచార్యుల వారు .క్షేత్రయ్య, అన్నమయ్య వాడిన ‘’పామిడి గుఱ్ఱము ‘’అనంతపురం జిల్లా పదమే. గుర్రపు దండును ఉంచే శాల .మనుచరిత్రలో ‘’ఆళువ ‘’పదం రాయల సీమదే .ఇది ఒక  చిన్న జంతువు  వీపు మీద చిన్న చిన్న చిప్పలు ఉంటాయట .ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకొని దాని కింద కాళ్ళతో భూమిని ఉడుం కంటే గట్టిగా పట్టు కొంటుందట .ఆ చిప్పల్లో కాలో, చేయో పడితే ‘’గిల గిలా గిజా గిజా గోవిందో హారి .‘’.అళవుపట్టు ‘’అంటే హఠం’’అని అర్ధం .ఒకసారి పెద్దపులి ఒకటి ఆళువ మీద కాలు పెట్టిందట .అది బిగుసుకు పోయింది. ఆపులి అరిచి అరిచి చచ్చిందట .

‘’తెనాలి ‘’వాని చిలిపితనం

ఆముక్త మాల్యద లో కృష్ణ దేవరాయలు విష్ణు చిత్తునీపై    చెప్పిన పద్యం లోకం లో బాగా ప్రచారం అయింది –

‘’ ఆ నిస్టానిధి గేహ సీమ నడురే యాలించినన్ మ్రోయు –నెం-తే ,నాగేంద్ర శయాను పుణ్య కధలున్ దివ్య ప్ర బందాను సం-దాన ధ్వానము –నాస్తి శాక బహుతా –నాస్త్యష్ణతా –తాస్త్యపూ –పో నాస్త్యోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్యమన్ మాటలున్ .’’

విష్ణు చిత్తుని అతిధి మర్యాద గూర్చి చెప్పిన పద్యం ఇది .అతిధులకు సుస్టుగా భోజనం పెడుతున్నాడు .కాని ఏదైనా లోపం జరిగిందేమో నని లోపల బాధ అందుకే అతి వినయం గా మర్యాదగా ‘’అయ్యా  !నేను కూరలు ఎక్కువగా చేయించలేక పోయాను .మంచి కూరలు వండించలేక పోయాను .ఉన్నవి కూడా చల్లారి పోయాయి .పప్పు రుచిగా చేయించలేక పోయా .మంచి బియ్యం అన్నం వండించటం కుదర లేదు .దయ చేసి మీరు ఏమీ అనుకోకుండా ఉన్నవాటినే సంతృప్తిగా భోజనం చేసి నన్ను క్రుతార్దుడిని చెయ్యండి ‘’అని చేతులు జోడించి చేబుతాడట .ఏ రోజైనా అర్ధ రాత్రి కూడా ఆయింట్లో విష్ణు కధలు వినిపిస్తాయట. దివ్య ప్రబంధాసందానం జరుగుతుంది .

ఈ పద్యాన్ని రాయలు భువన విజయం లో చదివి ఉంటాడు .అక్కడే ఉన్న మన తెనాలి రామ లింగడు లేచి ‘’పప్పు లేదా !మంచి కూరలు లేవా!ఇంక వచ్చిన అతిధులు ఏం తింటారు ?వాళ్ళ పిండాకూడా  ?’’అన్నాడట .రాయలతో సహా పగల బడి నవ్వకేం చేస్తారు ఆ వికటకవి భాష్యానికి ?

Inline image 2  Inline image 3

సరస్వతీ పుత్ర డా . శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి ‘’త్రిపుటి ‘’వ్యాస సంపుటి లో నాకు నచ్చిన విషయాలను నాకు అర్ధమైన రీతిలో మీ ముందు ఉంచాను . యెంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే అనిపించింది .ఆ లోతుల స్పర్శ అనితర సాధ్యం .అందరూ ఆ పుస్తకాన్ని చదివి ఉండరుకనుక నా జిహ్వ చాపల్యాన్ని మీకూ ముడిపెట్టాను .ఈ వ్యాసం తో ముగింపు పలుకుతున్నాను .

‘’పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు ‘’అయిపోయాయి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-14-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.