శ్రీ శ్రీ –మహిళల గౌరవాన్ని మంటగలిపిన విశృంఖలవాది (అభ్యుదయ సంస్కృతికి అపకీర్తి)

24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో పనిచేసేవారి దగ్గర చూస్తాను. కానీ ఈసారి సినిమా కవి శ్రీశ్రీ ‘అనంతం’ పుస్తకంలో వేశ్యలతో గడిపినట్లు రాసుకోవడం ఆయనకు స్ర్తిలపై, ప్రేమపై సదభిప్రాయం లేనట్లుగా తెలుస్తోంది. ఈమధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను. నాకు ఒక కూతురు ఉంది. ఆమెకు పదునాలుగేళ్ళు. ఒక స్కూల్లో చదువుకుంటోంది. నేను శ్రీశ్రీ‚రాసిన కొన్ని రచనలు చదివాను. కాని కొన్ని విషయాలను నా కూతురు చదవకపోతేనే బాగుంటుంది అని అనిపించింది. అందుకే వాటిని చాటుగా దాచాను. నేను సినిమాలో నటించాలని ఇంట్లో పోరాడి హైదరాబాద్ వచ్చాను. ఒక పెద్దాయన ప్రేమ పేరుతో మోసగించి నా మానాన నన్ను వదిలేశాడు. ఆ తరువాత సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. నాకు వేరే పని రాదు. వేషం రావాలంటే ఇష్టం లేని పని చేయాలన్నారు. నిలదొక్కుకోవడం కోసం, పొట్టకోసం తప్పలేదు. అలా ఒకరి తర్వాత ఒకరు నయాన భయాన, పోలీసుల పేరుతో, డబ్బు పేరుతో నన్ను బయట పడకుండా చేశారు. వీళ్ళలో కొందరు శ్రీశ్రీ గురించి మాట్లాడేవారు. వారిలో కొందరు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులలో కొందరు కమ్యూనిస్టులని తెలిసేది. అయినా వాళ్ళు మా పట్ల మిగతా వారికన్నా ఎక్కువ (లైంగికంగా) మమ్మల్ని వాడుకునేవారు. కడుపునిండా తిని తాగి బలసిన వారి చేష్టలు వేరు. నిత్యం పొట్టకూటి కోసం పనిచేసేవారి సెక్స్ అవసరాలు వేరు. శ్రీశ్రీ వంటి కవులు, రచయితలు హాయిగా తిని బతికే రకం. అందుకే వారికి కామప్రకోపం ఎక్కువ అనుకుంటాను. అలా కాని పక్షంలో గొప్పవాడు, మంచివాడు అని చెప్పే ఆ మనిషిలో ఇంత పశువాంఛ ఎలా వుంటుందో అర్థం కావడం లేదు. వంచితులు, పతితులు, ఇంట్లో భార్యలు లేనివారు ఇలాంటి పనులు చేస్తారని అనుకుంటాం. కానీ గౌరవం, డబ్బు, పేరు అన్నీ ఉండి స్ర్తిలను కేవలం కామకేళి దృష్టితో చూడటం, వేశ్యల కోసం పిచ్చిగా స్వైరవిహారం చేయడం విచిత్రమైన విషయం. మాలాంటి వారికి బయటి ప్రపంచంలో ఏదైనా పనివుంటే చేసిపెట్టే తమ్ముడు శ్రీను నా దగ్గర సాహిత్య పుస్తకాలు, పేపర్ల కటింగులు చూసి ఆశ్చర్యపోయి విషయం అడిగాడు. అన్నీ చెప్పాను. అతను కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. ‘వర్గ కవి శ్రీశ్రీ’ అనే పుస్తకం చదవమని ఇచ్చాడు. దానిలో ‘వ్యక్తిత్వం-కవిత్వం’ అనే భాగంలో శ్రీశ్రీ గురించి రాసినదంతా చదివి దిమ్మెరపోయాను. పీడితులపట్ల నిలబడి పోరాటం చేసిన కవి స్ర్తిల గురించి, స్ర్తి పురుషుల కలయిక గురించి ఎందుకు అంత చీప్‌గా రాశాడు. అందుకు కారణాల గురించి ఆలోచించాను. శ్రీనుతో, డాక్టర్ గారితో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడాను. ఎవరూ సరైన కారణం ఎత్తిచెప్పలేదు. అందుకే ఆయన అభిప్రాయాలను రాపిడి చేసి నాకు నేనే తెలుసుకోవడం సరియైనదని అనిపించింది. సెక్స్ క్రియ మూత్రంతో సమానం అని శ్రీశ్రీ అనడం కిరాతక భావన. మరి శ్రీశ్రీ ఇద్దరు భార్యలతో మూత్ర సమానంగానే సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడా? అలా చేసివుంటే చాలా తప్పు. వేశ్యలతో అలా చేస్తే అతనొక ఔళ్పూళూఆళజూ. యుద్ధ నేరాల గురించి పదవీ విరమణ చేసిన సైన్యాధిపతితో మాట్లాడాలి అంటారు. అలాగే సెక్స్ అసహజత్వాల గురించి నేను చక్కగా వివరించగలను. లోకానికి తెలియని అసలు స్వరూపం మా వంటివారికి తెలుస్తుంది. అందుకే ఇష్టం లేకున్నా, కష్టమైనా ఈ మాటలు రాస్తున్నాను. శ్రీ అంటే సిరి. సిరి అంటే మగసిరి మాత్రమే అని శ్రీశ్రీ అనుకున్నాడు. బలహీన సెక్స్ అయిన స్ర్తిలను కించపరచడం వెనుక, చెప్పరాని హీనమైన బలహీనత దాగివుంది. దానిని కప్పిపుచ్చడానికి కవిత్వం, కాకరకాయలు రాశాడు అనిపిస్తున్నది. అభ్యుదయం, విప్లవం అన్నాడు. అలా అన్న ప్రతిదానిని ఖండించుకున్నాడు. విటుడికి రోగాలున్నాయని తెలిసిన తర్వాత అత్యంత పేద వేశ్య అయినా తెలిసి తెలిసి తన శరీరాన్ని అప్పగించదు. కాని శ్రీశ్రీ అలాంటి వేశ్యలను ఎంతోమందిని కలిశాడు. అతనిలో తెలియని కసి, ద్వేషం గూడుకట్టుకుని ఉంది. అతను స్ర్తి ద్వేషి లాగా నాకు కనిపిస్తున్నాడు. తన మొదటి భార్యను వేరేవాడి దగ్గర పడుకుంటావా అని అడిగాడట. అందుకు ఆమె అంగీకరించిందట. మరి వేశ్యలను ఎందుకు చిన్నచూపు చూస్తారు ఈ రచయితలు. మిత్రులతో కలిసి వేశ్యలను తార్చుకునేవారు తమ భార్యలను ఎంత బాధపెట్టి ఉంటారు? పెద్ద కులాలవారు, డబ్బున్నవారే మానాన్ని నిలువునా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోలేదు. మాలాంటి పేద, కింది కులాలవారు వేశ్యలు అవుతారు. పెద్దలు సంసారులు, పతివ్రతలు అవుతారు. రచయిత్రి రంగనాయకమ్మగారు ‘మీరు మాకు మార్గదర్శకంగా ఉండండి కానీ, మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడేట్టు, బాధపడేట్టు చేయకండి’ అని రాసిన దానిలో ఎంతో నిజం ఉంది. అయినా శ్రీశ్రీ పదేపదే సెక్స్ విశృంఖలతని విప్లవ పోరాటం చేసినట్లుగా రాయడం సబబా. ఐదు రూపాయల నోటు ఆశ చూపి ఒక రోగిష్టి, పేద, బలహీన స్ర్తిని పశువులాగా సెక్స్ పేరుతో ఆమె శరీరంపై దాడి చేస్తే అది తప్పు కాదు, అలాంటి రాతలు రాయడం తప్పు కాదు, వాటిని చదివి విప్లవకారుల పిల్లలు శ్రీశ్రీలాగా చేయాలని అనుకుంటారని తెలిసి మరీ భారమైంది మనసు. స్ర్తి శరీరాన్ని డబ్బు పెట్టి కొనడం, ఆ బక్కపలచని శరీరాన్ని దోచుకోవడం, సెక్స్ పేరుతో అంగాంగం హింసించడం ఏ అభ్యుదయానికి నాంది. ఏ విప్లవ సంస్కృతికి కీర్తి. ఇలాంటి వ్యక్తిని, విశృంఖలత్వాన్ని కాళోజి, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ, అజంతా వంటి పెద్ద రచయితలు శ్రీశ్రీ తాగుబోతుతనాన్ని, సెక్స్ పేరుతో స్ర్తిల పట్ల చులకన భావాన్ని సమర్థించడం తెలుగు సాహిత్యం విలువ తీశారని అనిపిస్తున్నది.
శ్రీశ్రీలాంటి వాళ్ళ వల్ల బతకలేక, చావలేక ఒళ్ళు అమ్ముకునే దీనస్థితికి చేరిన స్ర్తిలను వేశ్యలుగా ముద్రవేసి వారిపై పోలీసులు కేసులు పెడతారు. కానీ పురుషులపై పురుష వేశ్యలని ఎందుకు కేసు పెట్టరు? పెట్టాలని ఎందుకు అడగరు? మాలాటివారిని అరెస్టు చేసి, ఫొటోలు తీసి, కేసులుపెట్టి, జడ్జిల ముందుకు తెచ్చి శిక్షలు వేసే పురుష వ్యవస్థ శ్రీశ్రీ వంటివారిని ఎందుకు వదిలిపెడతారు. చీకటి దొంగలను పట్టుకోలేరు. నిజమే. కాని తాను వేశ్యలతో కలిశానని తెగింపుతో, ఒక విజయగర్వంతో రాసుకున్న విషయాలు తెలిసి కూడా అతను చేసిన తప్పులపై అతని అభిమానులు, పాఠకులు ఎందుకు నోరు మెదపరు. ‘సాహితి’లో దాసోజు లలిత రాసిన వ్యాసాన్ని (1-9-2014) విమర్శించేవారు సమాజాన్ని సెక్స్‌మయం చేయాలని అనుకుంటున్నారా అనిపిస్తుంది. మేం దానినుండి బయటపడి సంసారులం కావాలని అనుకుంటున్నాం. కానీ మీలో చాలామంది మాలో కలవాలని అనుకుంటున్నారని అనిపిస్తున్నది. స్ర్తిల జీవితాలతో ఆడుకునే వారిని ఊర్లో విడిచిన కోడెల వలె వదిలివేయడం వల్ల స్ర్తి జాతికి చేటు కలుగుతున్నది. వేశ్యల పేర్లతో, ఊర్లతో సహా రాయడం చూస్తుంటే చీకటి తప్పు చేసి తలవంచుకుని పోయేవారే మంచివారు అని చెప్పక తప్పదు. శ్రీశ్రీ విశృంఖల జీవితంపై సినిమా రంగం ప్రభావం పడిందని చెప్పాలి. శ్రీశ్రీ అసలు స్వరూపం తెలిసి కూడా మాట్లాడని వారు దోషులే అని నేను తీర్పు ఇస్తున్నాను. మేం మనుషులం, ప్రేమ పేరుతో వంచింపబడినవాళ్ళం. శ్రీశ్రీకి ప్రేమ అంటే గిట్టదు. ప్రేమ అంటే కామం. అవును మేం అక్కడే ఓడిపోయాం. అయినా మనుషులుగా జీవిస్తున్నాం. మాలాగా ఎవరూ మారకూడదని పోరాడతాం. అందులోంచి బయటకు వచ్చి నలుగురం కలిసి పచ్చళ్ళు తయారుచేసి అమ్ముకుంటున్నాం. శ్రీశ్రీలాంటి వారి గురించి స్పష్టంగా విమర్శించని వారు ముసుగు వేసుకున్న వేశ్యలు. మంచి సమాజంలోనే మంచి మనుషులు పుడతారు. వర్గ సమాజములో ఎంతోమంది శ్రీశ్రీలు ఉంటారు జాగ్రత్త. దొంగలకు లోబడవచ్చునేమో కాని దొంగ ముసుగులు వేసుకున్న అభ్యుదయ వాదుల అసలు రంగు బయటకు రావాలి. వేశ్యల గురించి రాసిన శ్రీశ్రీ రాతలను మేం అంగీకరించడం లేదు. వాటిని నిషేధిస్తున్నాం. ఎందుకంటే వాటిని చదివి పిల్ల శ్రీశ్రీలు పుట్టకూడదు. శ్రీశ్రీది మాత్రం అభ్యుదయ సాహిత్యానికి అపకీర్తి. మహిళల గౌరవాన్ని మంటగలిపే మచ్చ.
– నళిని (ఒక సెక్స్ వర్కర్)

 

 

 

మాటల్లో వికాసం – చేతల్లో కరుకుదనం!

  • – జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)

ఎన్నికల దొంగాటలో ప్రజలు అడగని హామీలను గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటానికి మల్లగుల్లాలు పడి, ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని త్రిశంకుస్వర్గంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేలియాడిస్తున్నాయి. పాత రుణాల మాఫీ కాక, కొత్త రుణాలు లేక, తోడు వర్షాభావ స్థితితో మొత్తం ఖరీఫ్‌పై ఆశల్ని వదులుకున్నారు రైతులు. అడపాదడపా పడిన వర్షాలకు వేసిన మెట్టపంటలు ఆకులు చిగుర్చకముం దే ఆశలు చల్లారిపోయాయి. ఫలితంగా ఇరు ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. మెదక్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా అధికార టిఆర్‌ఎస్ ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, కెసిఆర్ ప్రాతినిధ్యం చేస్తున్న గజ్వేల్ ప్రాంతంలోనే బాల్‌రెడ్డి అనే యువ రైతు జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేటలో పురుగులమందు తాగి చనిపోయాడు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్‌లో కూడా జరిగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం (ఆత్మహత్యల నిలయం)లోని అక్కాపూర్ గ్రామంలో 30-35 బోర్లు వేసి వేసారిన రైతుల కథనాలు ప్రధాన శీర్షికగా పత్రికల్లో దర్శనమిచ్చాయి. ఇలా బతుకు బోరు బావుల్లో కూరుకుపోవడం తెలంగాణలో సర్వసాధారణమైంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ సాధన తర్వాత నిజాం చక్కెర కర్మాగారాలైన శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని గంటాభజాయించి చెప్పిన కెసిఆర్ ఇప్పుడా వూసే ఎత్తడంలేదు. పైగా బోధన్ ప్రాంతానికి కవిత ఎంపిగా, మెదక్ ప్రాంతానికి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే! అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే బోధన్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఎవరైనా అడ్డొస్తే తలనరికి కర్మాగార గేటుకు వేలాడదీస్తానని రెచ్చగొట్టిన కెసిఆర్ మాటలు ఇప్పుడు హైదరాబాద్ దాటడంలేదు. ఇదే జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత ఎర్రజొన్న రైతుల్ని పరామర్శించి, వారి బకాయిలకు కొంత మొత్తాన్ని విడుదల చేసిన కెసిఆర్, దీని పక్కనగల బోధన్ రైతుల వెతల్ని వినడానికి మాట్లాడటానికి ఇష్టపడడంలేదు. వైఎస్‌ఆర్ ఏర్పాటుచేసిన (2004లో) హౌస్ కమిటీలోని తొమ్మిదిమంది ఎంఎల్‌ఎలలో పద్మా దేవేందర్ రెడ్డితో సహా జిల్లా నాయకులు నలుగురున్నారు. 2006లో ఇచ్చిన 350 పేజీల రిపోర్టు నేటికి ఆచరణకు నోచుకోవడంలేదు. చివరికి హైకోర్టులో కేసు వేయడం, కోర్టు ఆదేశాల మేరకు గత జనవరి 9న కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటానని సంతకాలు చేశారు దీనికితోడు తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ పార్టీ తెరాస అధికారంలోకి రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలంగాణలో ఎక్కడాలేని విధంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపిం చారు. విచిత్రమైన విషయమేంటంటే, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇదే జిల్లా వాసే కాక, అదే బోధన్ డివిజన్‌కు చెందినవాడు కావడం గమనార్హం! ఈ మూడునెలల కాలంలో ఒక్కసారి కూడా చెరకు రైతుల గూర్చిగాని, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడం గూర్చి గాని మాట్లాడకపోవడం విడ్డూరం!
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఫ్యాక్టరీని 67 కోట్ల రూపాయలకే 51 శాతం వాటాను దక్కించుకున్న తూర్పుగోదావరి వాసి గోకరాజు గంగరాజు పరికరాలను తరలించడం ద్వారా, అమ్మడం ద్వారా, విద్యుత్‌ను అమ్ముకోవడం ద్వారా కోట్లాది రూపాయల్ని ఆర్జించి ఇప్పుడు తన వాటా డబ్బు కావాలనడం, క్రషింగ్ చేయాలంటే మూలధనం కావాలని పీటముడి పెట్టడం, దీనికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నోరు మెదకపోవడంతో చెరకు రైతులు అయోమయంలో ఇరుక్కుపోయారు. గోకరాజుకు నిజంగా డబ్బులు ఇవ్వాల్సివస్తే, ప్రభుత్వం దగ్గర లేవనుకుంటే, కొంత సర్దుబాటు చేసి, దఫాలవారిగా మిగతా డబ్బుల్ని ఇస్తానని ఒప్పందం చేసుకొని, ప్రభుత్వమే చక్కెర కర్మాగారాన్ని నడిపినా పరువు దక్కేది. తెరాస అన్నమాట నిలబెట్టుకున్నదనే గుర్తింపు వచ్చేది. గత 12 సంవత్సరాలుగా దాదా 65 మంది కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరో 400మంది ప్రత్యక్ష కార్మికులు వీధిన పడ్డారు. ఉద్యమ కాలంలో ఈ ఫ్యాక్టరీ రైతుల్ని ఉద్యమ అవసరాలకు వాడుకున్న తెరాస, ఇప్పుడు నోరు మెదకపోవడం శోచనీయం కాదా? తిరిగి రైతులు ఉద్యమబాట పట్టాలని చూడడం, దీనికి ఎంఆర్‌పిఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌లు నాయకత్వం వహించాలని అనుకోవడం, ఈ సందర్భంగా బోధన్‌లో సమావేశాలు జరగడం కూడా జరిగిపోయాయి. పోరాటం ద్వారా సాధించుకున్న హక్కుల్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోకపోవడం ఓ వింత అందామా..? మూర్ఖత్వం అందామా..?
ఈ ప్రభుత్వమే కాళోజీ జయంతిని ఘనంగా జరిపింది. తమ ప్రాంతంవాడే దోపిడి చేస్తే ఇక్కడే పాతరేస్తామన్న ఆయన గొడవని మాత్రం మరిచిపోయింది. నిజంగానే ఫ్యాక్టరీని నడిపే సత్తా, డబ్బులు లేవా అంటే, ఇవ్వాలనుకున్నవారికి, ఓటు బ్యాంకు రాజకీయాలకై కోరకుండానే కెసిఆర్ వరాలజల్లుల్ని, డబ్బుల్ని అప్పనంగా ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు హైటెక్ చంద్రబాబుతో పోటీపడాలని చూస్తూ పారిశ్రామికవేత్తలని ఆకర్షించడానికై అనేక ఆకర్షణీయ పథకాల్ని ముందుకు తెస్తూనే ఉన్నాడు. వైఎస్‌ఆర్ కాలంలో టాటా నానో కార్ల ఫ్యాక్టరీకి భూమిని ఇవ్వలేని పరిస్థితి వుంటే, కెసిఆర్ పారిశ్రామికవేత్తలను పిలుచుకుంటూ భూముల్ని దారాదత్తం చేస్తున్నాడు. హీరో ఆటోమొబైల్ కంపెనీకి 600 ఎకరాల్ని, పి అండ్ జికి, జాన్సన్ అండ్ జాన్సన్‌కు, కోజెంట్‌కు వందలాది ఎకరాల్ని ఇవ్వడమేకాదు, స్వయంగా శంకుస్థాపనల్ని చేస్తున్నాడు. పోనీ, వీటివల్ల స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయా అంటే, ఎలాంటి గ్యారంటీ ప్రభుత్వానికి లేదు. ఆ యాజమాన్యాలు ప్రకటించలేదు. భూమి ని, రాయితీలను పొందడం తప్ప ఈ పారిశ్రామిక విధానంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. 17 ఫోకస్ రంగాలపై పౌరులనుంచి, ఇతర సంస్థల నుంచి అభిప్రాయాల్ని కోరుతూ హైదరాబాద్ హకథాన్ (్హ్ఘషర్ఘీఆ్ద్యశ) పేరున ప్రకటనల్ని గుప్పిస్తున్నది ప్రభుత్వం! బాబు తిరిగి కలగంటున్న 2014-2020 విజన్‌లా, కెసిఆర్ 2015-2020 విజన్‌కై శ్రీకారం చుట్టాడు. టెక్నాలజీ ఇంక్యుబేటర్ పేరున రూ. వెయ్యికోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే పథకాలకు బాబు ప్రయత్నం చేస్తూ, వెయ్యి కోట్ల మూలనిధిని ఏర్పాటుచేసాడు. కెసిఆర్ కూడా ఇదే పద్ధతిన రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదనల్ని చేయబోతున్నాడు. దీన్నిబట్టి, బాబుకున్న విజనే కెసిఆర్‌కు వుందని తేలుతున్నది. ఇప్పటికే వున్న 1400 ఐటి సంస్థల్లోని 3.5 లక్షల ఉద్యోగార్థుల్లో తెలంగాణ వాటా 35 శాతం లోపే! కొత్త సంస్థల్లో తెలంగాణవారికి వచ్చే ఉద్యోగాలెన్నో ఎవరికీ తెలియదు.
ఉద్యమకాలంలో ప్రస్తావించినట్లు మూతబడిన, ప్రైవేట్‌పరం గావించబడిన సర్‌సిల్క్, సిర్పూర్‌కాగజ్, అంతర్గామి, ఆజంజాహి, డిబిఆర్, రిపబ్లికన్ ఫోర్జ్, ఆల్విన్ సంస్థలతో సహా ప్రాగా టూల్స్‌ను, చక్కెర కర్మాగారాల్ని తెరిచి ప్రభుత్వ రంగంలో నడిపే ఆలోచన ఏమైనా వుందా అంటే అదీ తెలియడంలేదు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐడిపిఎల్, హెచ్‌ఎంటిల సంగతి అతీగతి లేదు. హెచ్‌ఎంటిని పూర్తిగా మూసివేస్తున్నట్టు ఈమధ్యన ప్రకటన కూడా వచ్చింది. ఇలా ప్రైవేట్ పెట్టుబడులకై ఆలోచించే పారిశ్రామిక విధానాలు తప్ప ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని తెరాస వంద రోజులకు కూడా ప్రకటించలేకపోయింది. పథకాలు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, విధానాల్ని ప్రకటించడానికి సమయమెందుకో తెలియదు!
వ్యవసాయ రంగం గూర్చి స్పష్టపర్చకుండా, రైతులు ఏమి చేయాలో చెప్పకుండా, గొలుసుకట్టు చెరువులని, ప్రాణహిత చేవెళ్ళ అని, గోదావరి, కృష్ణలనుంచి రావాల్సిన నీరని, ఎత్తిపోతలని రైతుల్ని భ్రమల్లో ముంచెత్తడం గత పాలనలాగానే వున్నది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉనికిలో వున్న చెరువులకు కనీస మరమ్మతులు చేపట్టినా, రైతులకు కొంత ఆశ వుండేది. అలాగే పంటల విధానాల్ని ప్రకటించి పరపతి సహకార సంస్థల ద్వారా విత్తనాల్ని, కనీస మోతాదు ఎరువుల్ని అరువుపై ఇచ్చినా కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగేది. ఇవేవి చేయకుండా కోటి ఎకరాల భూమిని సర్వే చేయిస్తానని ఇక్రిసాట్‌తో భూసార పరీక్షలని రైతుల్ని పక్కదారి పట్టించడం మొదలైంది. అయితే ఇవన్నీ కాలక్రమంలో చేయాల్సిన పనులే! ఈ విధంగా పట్టించుకోవాల్సిన అంశాల్ని పట్టించుకోకుండా, దీర్ఘకాలికంగా సాధించే విద్యుత్‌లాంటి అంశాల్ని ముందేసుకోవడం అం టేనే, ఓ రాజకీయ చతురత!
ఇక విద్యారంగంది అంతులేని కథ! ప్రతీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమ తమ ముద్రల్ని ముద్రించుకోవాలని చూడడం జరుగుతున్నది. వైఎస్‌ఆర్ సక్సెస్ స్కూళ్ళం టే, కిరణ్‌కుమార్‌రెడ్డి మాడల్ స్కూళ్లంటూ, మొత్తంగా డబ్బుల్ని కొల్లగొట్టారు. ముం దు, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విద్యావిధానం వుండాలి. కేంద్ర జాబితాలోనా, రాష్ట్ర జాబితాలోనా అది స్పష్టపడాలి. నిధులు తేటతెల్లం కావాలి. ప్రైవేట్ రంగమా, ప్రభుత్వ రంగమా తేలాలి. మాధ్యమాన్ని నిర్ణయించుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఓ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా, కెజి నుంచి పీజి దాకా ఉచిత విద్య అని, అదీ ఆంగ్ల మాధ్యమంలో అని ఏకపక్ష నిర్ణయాలు కెసిఆర్‌కు బాగుంటాయేమోగాని, విధానానికి, ఆచరణకు పనికిరావు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉచిత విద్య ఉన్నది. ప్రైవేట్‌ను రద్దుచేయకుండా, కార్పొరేట్‌ను నియంత్రించకుండా, మాధ్యమంపై నిర్ణయం జరగకుండా ఓ 6,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం, అసెంబ్లీ నియోజక వర్గానికొక పాఠశాలను ముందుగా ఏర్పాటుచేస్తానని చెప్పడం, ఇప్పుడున్న నవోదయ, రెసిడెన్షియల్స్‌లాగా కొందరికే అవకాశాల్ని కలిగించడం అవుతుంది. దీని ద్వారా నెరవేరాల్సిన కామన్ స్కూల్ విధానం నెరవేరకపోగా, మరిన్ని అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతాయి.
వెంటనే ఫీజుల చెల్లింపుచేసి కళాశాలలు నడిచేలా చూడాలి. రైతుల రుణమాఫీ చేసి వారికి నమ్మకాన్ని కల్గించాలి. పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే నడిచేలా చర్యలు గైకొనాలి. తోడుగా, ఆరోగ్యకరమైన, సంప్రదాయబద్ధమైన వ్యవసాయ విధానాల్ని రూపొందిస్తే స్వంత ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేదంటే దేశవ్యాపిత ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా రుచి చూడాల్సి వస్తుంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.