గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12

13- కరుణ రసానుభూతి -భవ భూతి-1

ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భావ భూతి కవి ,నాటక కర్త .కాళిదాసు ప్రతిభకు సమానుడైన వాడు .విదర్భ గొండియా జిల్లా లోని పద్మపురం లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ఇది మహారాష్ట్ర -మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉంది .భవభూతి అసలు పేరు శ్రీ కంఠ నీల కంఠ .తండ్రి నీల కంఠుడు తల్లి జాత కర్ణి. కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ శాఖ వాడు కాశ్యప గోత్రీకుడు .ఇతని పూర్వీకులలో ‘’మహా కవి ‘’అనే పేరు ఉన్నవాడున్నాడట .శివాభిమాని. గ్వాలియర్ కు ఆగ్నేయం లో నలభై కిలో మీటర్ల దూరం లో ఉన్న పద్మ పావయ దగ్గర విద్యాభ్యాసం చేశాడు .గురువు పరమ హంస జ్ఞాన నిది .యమునా నది ఒడ్డున ఉన్న ‘’కల్పి ‘’గ్రామం లోనే రచనలు చేశాడు .కనోజ్ ను పాలించిన  రాజు యశోవర్మ ఆస్థాన కవి భవ భూతి అని పన్నెండవ శతాబ్ది చరిత్రకారుడు కల్హణుడు రాజ తరంగిణిలో రాశాడు .కాశ్మీర్  రాజు  లలితా దిత్య ముక్తా పీడుడు యశోవర్మను 736లో జయించాడని చెప్పాడు .భవ భూతి మాలతీ మాధవం ,ఉత్తర రామ చరిత్ర  మహా వీర చరిత్ర రాశాడు .ఇందులో ఉత్తర రామ చరిత్ర గొప్ప పేరు పొందింది .

యశో వర్మ కొడుకు ఆమ రాజు భప్పట్టి ,.చేత జైన దీక్ష పొందాడట .వాక్పతి భవ భూతిని –‘’భవ భూతి జలధి నిర్గత కావ్యామృత రస కణా ఇవ స్పురంతి –యస్య విషేషా అద్యాపి వికటేశు కదా నివేశేషు ‘’అని కీర్తించాడు .వాక్పతికంటే భవ భూతి పెద్దవాడు అని తెలుస్తోంది .వామనుడు భవ భూతి  శ్లోకాలను  ఉద్ధరించాడు .సోమదేవుడు వ్యాస ,కాళిదాస  భారవి  భర్త్రు మేంఠుల సరసన భవ భూతిని చేర్చి విశేష గౌరవాన్ని కల్పించాడు .భవ భూతికాలం క్రీ శ 680-750అని భావించ వచ్చు .

కవిత్వాన్ని పడికట్టు పదాలలతో విశ్లేషిస్తున్న కాలం లో  భవ భూతి విసిగి వేసారి తనదైన మార్గాన్ని ఎంచుకొని ధైర్యం గా ముందుకు సాగాడు .ఈ విషయాన్ని స్వయం గా మాలతీ మాధవం లో చెప్పాడు .ఈ మాట కొంత గర్వం తో చెప్పినట్లు ఉన్నా ,అతని దిషణాహంకారమే అది అని విశ్లేషకులన్నారు .ముందుమాటల్లో తాను  వేదాలతో పాటు వ్యాకరణ ,మీమాంస న్యాయ సాంఖ్య   ,యోగ శాస్త్రాలను తరచి చూశానని చెప్పుకొన్నాడు .ఉజ్జయినిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేరాడు .’’గౌడి’’విధానం లో రాసిన సంస్కృత నాటకాలు ఉత్తమోత్తమం గా ఉన్నాయి .ముతక హాస్యం అంటే ఇష్టం లేక విదూషక పాత్ర ను దేనిలోనూ చిత్రించలేదు .తనను ‘’శ్రీ కంఠ పద్మ లాంచనుడు’’గా చెప్పుకొన్నాడు అంటే ‘’కంఠం లో సరస్వతీ దేవి కొలువై ఉన్న వాడు ‘’అని అర్ధం .’’భవ భూ –తిర్నమ’’అంటే భవ భూతి .మాలతి లోని మూడవ అంకం లో తన గురువు కుమారిలుడని  నాలుగో అంకం లో కుమారిలుని శిష్యుడు కుమ్బెరకాచార్య అని రాశాడు .ఇదే భవ భూతి అసలు పేరంటారు .

భవ భూతి కవితా గీర్వాణం

’’సర్వత ప్రచలిత పాఠః’’అని చెప్పుకొన్నాడుతన మహా వీర చరితం ను  అంటే ప్రతి చోటా తన గ్రంధం దర్శనమిస్తుందని అర్ధం .అంటే అంత పాప్యులర్ అని భావం .ఇందులో చివరి భాగాలను వినాయక భట్టు రాశాడని కాశ్మీర చరిత్ర చెప్పిందట ,రామాయణ కధలో చాల మార్పులు చేశాడు .కైక ను రాముడిని వనవాసానికి పంపే విలన్ గా చిత్రించ లేదు .శూర్పణఖ మంధర వేషం లో వచ్చి రాముడికి కైక రాసిన ఉత్తరాన్ని అందిస్తుంది .అప్పటికే రాముడు మహర్షుల యజ్ఞాలను తపస్సును సంరక్షిన్చాలనే ఉద్దేశ్యం తో సీతా కల్యాణం అయిన వెంటనే మిధిలా నుంచే సరాసరి అరణ్యాలకు బయల్దేరటానికి సిద్ధం గా ఉంటాడు .మన రామాయణం లో ఉన్నట్లు అయోధ్య నుండి కాదు . ఇదొక కొత్త మార్పు .రాముడే మహా వీరుడు శూర విక్రమ పరాక్రముడు .పరశురామ గర్వ భంగం చేస్తాడు .’’విరసత్రదానుడు (శౌర్యమే లక్షణం గా ఉన్న వాడు) ‘’అంటాడు రాముడిని భవ భూతి .మహా వీర చరితం రచనా విధానాన్ని బట్టి కవి రాసిన మొదటి నాటకం ఇదే అని పిస్తుంది .మైత్రేయి మాల్య వంతమొదలైన కొత్త పాత్రలు సృష్టించాడు .వీర రౌద్ర భీభత్స దృశ్యాలలో శార్దూలాన్ని స్రగ్ధరను వాడాడు శృంగారం లో వసంత తిలక ,మాలిని  మందా క్రాన్తాలను ఉపయోగించాడు ఛందో భేదం బాగా చేశాడు .

మాలతీ మాధవం పది అంకాల నాటకం .బృహత్కధ లోని ఒక కద ఆధారం గా రాసిన ‘’ప్రకరణం ‘’అనే నాటక శాఖకు చెందింది .భవ భూతి ఊహా పోహలకు గొప్ప వేదిక గా నిలిచింది .మాలతి –మాధవుల ప్రేమ కదా తో బాటు మకరం డ మదయంతిక ప్రేమ కూడా సమాంతరం గా సాగుతుంది .భయానక దృశ్యాలను కూడా చేర్చి రాసిన ఏకైక నాటకం అంటారు .అయితే నాటకం’’ సుదీర్ఘ సుత్తి’’ లా సంక్లిష్టం గా ఉండి ‘’బోర్’’ కొట్టిస్తుంది .హటాత్  సంఘటనలతో కద మలుపులు తిరిగి సుఖాంతమౌతుంది .

ఉత్తర రామ చరిత్ర భవ భూతి ‘’మేగ్నం ఓపస్ ‘’నాటకం గా నిలిచింది .కవిత్వం పరవళ్ళు తొక్కుతుంది .ఇందులోనూ వాల్మీకి రామాయణానికి విరుద్ధం గా కధలో అనేక మార్పులు చేశాడు .దీనికి ఆధారం ఏమిటో తెలియదు .కరుణ రసాత్మక నాటకం గా జగత్ ప్రసిద్ధి చెందింది .రాముడు కుశ లవుల తో యుద్ధం అశ్వమేధ యాగం సీతా రాముల పునస్సమాగం  మొదలైనవి అవాల్మీకాలుగా భావిస్తారు .కరుణ రసాన్ని ధారా పాతం గా   వర్షించ టానికే ఇన్ని మార్పులు చేశాడని అంటారు .కద దాదాపు ఉత్తర రామాయణ కద మనకు తెలిసిందే .సీతా దేవి మనసును అత్యంత ప్రతిభా వంతం గా ఆవిష్కరించాడు కవి .అన్ని రసాలు కరుణ రసానికి ఉపాం గాలు అని నిరూపించాడు భవ భూతి. అదీ అతని ప్రత్యేకత .ఆలంకారికులు దీనినే సమర్ధించారు .ఇంతటి కరుణార్ద్రపూర్వక నాటకం ప్రపంచ నాటకాలలో లేనే లేదని నిర్ద్వందం గా చెప్ప వచ్చు .భవ భూతి ప్రేమ వివాహాలకు అత్యంత గౌరవం ఇచ్చాడు .తనకాలానికి తగిన భాషలో నాటకం చక్కగా ఒదిగి పోయింది .సౌరసేని ప్రక్రుతాన్ని ఒక్కదానినే ప్రయోగించాడు .భావాల కంటే భాషకు ఉన్నత స్థానాన్ని కల్పించటం భవ భూతి ప్రత్యేకత గా పేర్కొంటారు .ప్రౌఢత ,ఉదారత ,వశిత్వం తన  ప్రత్యేకతలుఅని చెప్పుకొన్న మాట నూటికి నూరు పాళ్ళు సత్యం .భాషలో హిమాలయోత్తుంగ  శిఖరాయమానం గా భాసించాడు భవ భూతి .ఎవరికీ తలవంచని  ఎవరినీ అనుకరించని కవిభవి భవ భూతి.గోవర్ధనాచార్య అన్నట్లు ‘’సాహితీ మూర్తి సరస్వతి మహోన్నత హిమ శృంగంగా భవ భూతి సాహిత్య స్పర్శ తో భాసించింది .లేక పొతే ఆ కసాయి రాతి కొండ ఆ దుఖపు ఘట్టాలకు కరిగి నీరై పోయి ఉండేది ‘’అన్నమాట నిజం నిజం . ఈ విషయాలన్నీప్రొఫెసర్ శ్రీ రామనాధన్ ఆంగ్లం లో ‘ఎ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ భవ భూతి ‘’లో రాశారు .ఈ నాటకం లో భవ భూతి రచన అత్యంత పరి పుస్ట స్థితికి చేరింది .

వాల్మీకం లో సీత భూలోకం చేరి దుఖాన్తమవుతుంది .కానిభావ భూతి  తన నాటకం లో సుఖాంతం చేశాడు .పద్మ పురాణం లో ఇలానే ఉందని దాన్నే ఆధారం గా తీసుకొని ఉంటాడని డా .బెల్వల్ కర్ అభిప్రాయ పడ్డాడు .మిరాశి అభిప్రాయం లో పద్మ పురాణ కర్త భవభూతి కధను తీసుకోన్నాడని .కాళిదాసు అభిజ్ఞాన శాకుంత  స్పూర్తితో సుఖాంతం చేసి ఉంటాడు .కరుణ రస స్థాయీ భావం దుఖమే అయినా భవ భూతి సీతా రాముల దాంపత్య ప్రేమను శృంగార భావ స్పర్శ ,కామ వాసనా లేనట్లు పోషించాడు .రాముని మాటల్లో కూడా ఎక్కడా కామ కోరిక లేనే లేదు .వారిది అలౌకిక ప్రేమ .రాముని స్నేహ పూర్వక ప్రేమ ,విరహ దుఖం మనకు శోక భావాన్నే కలిగిస్తుంది .రాముడు సీతకు ప్రాధాన్యం ఇస్తే ,భవభూతి రాముడికి ప్రాధాన్యం ఇచ్చాడు .ఇందులో రాముడు ధర్మ మూర్తిగా కంటే ప్రేమ మూర్తి ,స్నేహ మూర్తిగా దర్శనమిస్తాడు .పరిణత మనస్కుడైనాడు .వాల్మీకం లో సీతకు వచ్చిన సానుభూతి ఇందులో రాముడు పొందటం విశేషం .మూర్తీభవించిన కరుణా రస మూర్తి గా కనిపిస్తాడు .కరుణ రసం పరాకాష్టకు తెచ్చాడు కవి ఇందులో .

ఆనంద  వర్ధనుడు రసాలలో కరుణ రసం మధురతర మైనది .’’మనసు లో  పైకి  కనిపించని వ్యధతో ఉన్న రాముడిని పుటం పెట్టిన కరుణ రస పాకం ‘’అన్నాడు భవ భూతి .-

‘’అవిర్భిన్నో గాభీరత్వా ధన్తర్గూఢఘన వ్యధః –పుట పాక ప్రతీకాశో రామస్య  కరుణో రసః ‘’అన్నాడు .భవ భూతి కరుణ రసం పై చెప్పిన శ్లోకం ఇంకా జనం నాలుకల మీద నర్తిస్తోంది –

‘’ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్ –భిన్నః ప్రుధక్ ప్రుధగి వాశ్రయతే వివర్తాన్

ఆవార్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ –అంభో యదా సలిల మేవహి తస్సమగ్రం ‘’

దీని భావం –కరుణ రసం ఒక్కటే రసం .మిగిలినవన్నీ దాని భేదాలే .ఒకే రూపం ఉన్న నీరు ఆవర్త బుద్బుద ,తరంగ రూపాలను పొందుతూ మూల రూపం చెడ కుండా  ఉంటుంది. అదే రకం గా కరుణ రసం ఇతర విభాదుల వలన అనేక రూపాలు ధరిస్తుంది .అయినా మూల రూపం మాత్రం మారదు ‘’.ఇది గ్రీకు’’ ట్రాజెడీ’’కి దగ్గరగా ఉందన్న వాళ్ళూ ఉన్నారు .

నిజమైన ప్రణయం ఎలా ఉంటుందో భవ భూతి ఇలా చెప్పాడు –

‘’అద్వైత సుఖ దుఖయో రానుగతం సర్వాస్వవస్తాసు యత్ –విశ్రామో హృదయస్య యాత్ర జరసా యస్మిన్ని  హార్యో రసః

కాలేనా వరణాత్య యాత్ పరిణతేయత్స్నేహ సారే స్థితం –భద్రం ప్రేమ సుమానుసస్య కదా మాపయేకం హిత త్ప్రాప్యతే’’అంటే ‘’నిజమైన ప్రేమ సుఖ  దుఖాల్లో సమానం గా ఉంటుంది. ఆపద కష్టాలలో ఒకే రకం గా స్పందిస్తుంది .హృదయానికి అనిర్వచ నీయ ఆనందాన్ని ,శాంతిని కలిగిస్తుంది .వృద్ధాప్యం లోను సరసత లోపించదు .లజ్జా సంకోచం తగ్గిపోయి పరిపక్వమైన స్నేహం మాత్రమె మిగులుతుంది ‘’ నిజం గా ఇది గొప్ప ‘’కోటబుల్ కోట్’’.మాలతీ మాధవం లో ఇంకోశ్లోకం లో భార్యా భర్తలు ఒకరికొకరు మిత్రులు బంధువులు ఒకరికోసం ఒకరు కోరికల్ని సంపదను చివరికి ప్రాణాలు కూడా త్యాగం చేయటానికి సిద్ధ మౌతారు.స్వార్ధం లేనిది స్తిరమైనది ,రాను రాను పెరిగేది ,ఇద్దరికీ ఆనందం కలిగించేది ఆదర్శ దాంపత్య ప్రణయం ‘.బాహ్య కారణాల వలన ప్రేమ పుట్టదు .సూర్యోదయానికి కమలాలు చంద్రోదయానికి చంద్ర కంట శిలలు వికసించి కరిగి నట్లు ప్రేమ సమస్త ప్రాణాల్లో అన్ని పదార్ధాలలో ఒకే రకం గా ఉంటుంది అన్నాడు .ఇది స్వాభావికం .స్వయం ప్రేరకం .

సీతా విరహాన్ని రాముడు –

‘’హాహా దేవి స్పుతతి హృదయం శ్రంసాటే దేహ బంధః -శూన్యం మన్యే జగదవిరళజ్వాల మంతర్జ్వలామి

సీ ధన్నంధేత మసి విదురో మజ్జతీ వాన్తరాత్మా –విష్వంగ మోహః  స్థగయతి కదం మండభాగ్యః కరోమి ‘’’

రాముడు సామాన్య మానవుడిగా దుఃఖించాడు .సీతా విరహం తో హృదయం పగిలిపోతోందని ,శరీరం శిదిలమౌతోందని ప్రపంచం శూన్యమైనదని గుండెలో జ్వాలలు రేగుతున్నాయని తన దుఖిత ఆత్మ గాడాంద కారం లో కూరుకు పోతోందని ,అన్నివైపులా చీకట్లు  కమ్మేస్తున్నాయని ,అలాంటి స్తితిలో ఉన్న మంద భాగ్యుడైన తాను  ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు ‘’అన్నాడు .సాధారణం గా స్త్రీల ఆవేదన ఇలా ఉంటుంది .కాని రాముడిలో చూపాడు కవి .అందుకే గోవర్ధనాచార్యుడు –

భవ భూతేః సంబం ధాథ్  భూధర భూరేవ భారతీ  భాతి- ఏ తత్క్రుత  కారున్యే కిమంయదా రోదతిగ్రావాః ‘’

Inline image 1  Inline image 2 Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-14-ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.