గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13
కరుణ రసాను భూతి –భవ భూతి -2
కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన
ప్రకృతిని వర్ణించటం లో కాళి దాస భావ భూతులు భిన్న మార్గాలను అనుసరించారు .కాళిదాసు కు ప్రక్రుతి లలిత మనోహరం గా కన్పిస్తే భవ భూతికి భయంకరం గా కనిపించింది .ఆ మనోభావాలనే వారు కవిత్వీకరించారు .విదర్భ వాసి కనుక భావ భూతికి దండకారణ్యం తో పరిచయం ఉండిఉంటుంది .దాని భయంకర స్వరూపాన్ని బాగా వర్ణించాడు .ఈ మార్గం లో అరణ్య విశేషాలను అంతవరకూ ఏ కవీ రాయలేదు .కొత్తమార్గం తొక్కాడు .ఒక రకం గా దృశ్య చిత్రాలుగా చూపించాడుకవిత్వం లో .’’దండకం నిశ్శబ్దం తో ,క్రూర మృగ గర్జనలతో ఉంది .నిద్రించే పాముల బుసలు అడవికి అగ్గి పెట్టి నట్లుంది .గుంటల్లో నీళ్ళు మెరుస్తున్నాయి .దాహం తో తొండలు నీళ్ళు దొరక్క కొండ చిలువల చెమటని తాగుతున్నాయి ‘’అంటాడు .అయితే మనోహరం గా దృశ్యమానమైన చోట అతిమనోహరం గానే సహజ రీతిలో వర్ణించాడు
‘’గుంజత్కుంజ కుటీర కౌశిక ఘటా ఘుత్కార వత్కీచక – స్తం బాడంబర బద్ధ మౌళి కులఃరౌన్చాభి దోయం గిరిః
ఏతస్మిన్ ప్రచలాకినాం ప్రచలితా ముద్వేజితాఃకూజితైః-ఉద్వేల్లంతి పురాణ రోహిణ తరుస్కందేషుకుమ్భీనసాః’’
పొదరిలళ్ళల్లో గుడ్ల గూబల ధ్వనులతో కూడిన కీచ కాం డాల శబ్దాలతో నిశ్శబ్దం తాండ విస్తోంది .కాకులతోగొడవలతో క్రౌన్చపర్వతమ్ నెమళ్ళ క్రేమ్కారాలతో సర్పాలు భయపడి రోహణ పర్వత వృక్ష కొమ్మలపై దిక్కు తోచక అటూ ఇటూ తిరుగుతున్నాయి .
వాసంతి ,తమసా ,మురళి అనే నదులను ప్రాణం ఉన్న పాత్రలుగా తీర్చిదిద్ది అసమాన ప్రతిభ చూపాడు .ఈ సందర్భం లో కోమల ప్రకృతి స్వరూపాన్ని అంతే లలితం గా వర్ణించాడు
‘’ఇహ సమద శాకుం తా క్రాంత వానీర వీరుత్ –ప్రసవ సురభి శీత స్వచ్చ తోయావహంతి –
ఫలభర పరిణామ శ్యామ జంబూ నికుంజ –స్థలాన ముఖర భూరి శ్రోతసో నిర్ఘరిన్యః ‘’
నదులు ప్రవిహిస్తున్నాయి .వాటి ఒడ్డున వానీర లతలు వ్యాపించి ఉన్నాయి. ఆ లతలపై మధుర కూజితాలతో పక్షులు విహరిస్తున్నాయి .పక్షుల కదలికలతో పూలు రాలి నదీ ప్రవాహం లోపడి సువాసనలతో జలాలు శోభిస్తున్నాయి .సహజ శీతలం స్వచ్చం అయిన పర్వత నిర్ఝరులు అంటే నదులు సువాసనలతో ఆహ్లాదాన్నిస్తున్నాయి .వాటి దారాలతో తడుప బడిన జంబూ వృక్ష నికుమ్జాలను తాకటం చేత కమ్మని ధ్వని చేస్తూ అనేక మార్గాలలో ప్రవహిస్తున్నాయి .ఇలా దృశ్యాలకు ఆలంకారిక వన్నె తెస్తాడు .
భవ భూతి నాటక కళా శిల్పం
భవ భూతి కాళిదాసు లాగా శ్రవ్య కావ్య రచన చేయలేదు .మూడూ నాటకాలే రాశాడు .రామ పరాక్రమానికి ఆయువు పట్టుగా మహా వీర చరిత రాశాడు .ఇందులో వస్త్వైక్యం సాధించాడని విమర్శ కులు మెచ్చుకొన్నారు .మొదటి నాటకం కనుక కళా కౌశలం లో వెనక పడ్డాడు .కల్పిత కద మాలతీ మాధవం భాసకృత ‘’అవిమారక ‘’నాటక ప్రభావం ఉంది .ఇది ప్రకరణం ఇంతకుముందే ప్రకరణం గా శూద్రక కవి మృచ్చకటికం రాశాడని మనకు తెలుసు .హాస్యం లేడుండా రాశాడు భవ భూతి .గంభీర రచన .శృంగార భీభాత్సాలున్నాయి, పండాయికూడా .ముందే చెప్పనట్లు లాగుడు ఎక్కువై విసుగు తెప్పిస్తుంది .రంగ స్థల ప్రదర్శనకు పై రెండూ అనువైనవిగా లేవు .
ఉత్తర రామ చరిత లో నాటకాలలో శిఖరాయమానం .ప్రదర్శన యోగ్యతా పొందింది .ప్రేక్షకులు చూసి రసప్లావితులౌతారు .దృశ్య విభజన రాణించింది .నాటకం మొదట్లోనే రాముడి చేత –
‘’స్నేహం దయం తదా సౌఖ్యం యదివా జానకీమపి –ఆరాధనాయ లోకస్య ముంచతోనాస్తి మే వ్యధా ‘’అని చెప్పిస్తాడుకవి .ఇదే నాటక బీజం .ఇక్కడి నుంచి రామ కద అంకురించి,పల్లవించి కుసుమించి, ఫలిస్తుంది .సుఖాంతం చేయటానికి అన్నీ పకడ్బందీ ఏర్పాట్లు చేశాడు .రాముడికి సీతా విరహం పరమ అసహ్యం అనిపిస్తుంది –‘’కిమ్మస్యా న ప్రేయో యది పరమ అసహ్యస్తూ విరహః అని పిస్తాడు .విరహం అసహ్యం అనుకొన్న సందర్భం లో దుర్ముహుడు ప్రవేశించి లోకాపవాదు చెవిన వేస్తాడు .ఇదే ‘’ఐరనీ ‘’.మొదటి రెండు అంకాల మధ్య కాలం పన్నెండేళ్ళు .దాన్ని సమర్ధ వంతంగా చూపించాడు .ఈ నాటకం లో భారతీయమైన కర్తవ్య నిష్ట ,త్యాగం దాంపత్య ప్రేమ ,కులపాలికా ప్రణయం ,గృహస్త జీవన మాధుర్యం ,ధర్మాచరణ స్పష్టం గా నిరూపించాడు .మన సంస్కృతీ ధర్మాలకు ఆట పట్టుగా ఆదర్శం గా ఉత్తర రామ చరితను భవ భూతి నిర్మింఛి పరమ ప్రయోజనాన్ని సాధించాడు .సంభాషణలు రసవత్తరం గా సంక్షిప్తంగా ఉంటాయి .పాత్రోచిత శైలీ చూపించాడు .కరుణ రస వర్షం లో మనల్ని తడిపేస్తాడు భవ భూతి .
భాషలో ప్రౌఢత్వం మాటలో ఉదారత ,అర్ధ గాంభీర్యం అనే త్రివేణీ సంగమం భవ భూతి కవిత్వం లో కనిపిస్స్తుంది ..యుద్ధ వర్ణలలో దీర్ఘ సమాసాలతో ‘’గౌడీ రీతి ‘’లో వర్ణిస్తాడు .దీనివలన భీభత్సరసం వీరం పొంగిప్రవహిస్తాయి ప్రయోజనం సిద్ధిస్తుంది .అవసరమైనప్పుడు వచనాన్ని సమర్ధం గా రాశాడు రసాలను ,పాతత్రానుకూల శైలి అనుసరించి నాటకాకినికి జీవం పోశాడు .దీనికి ముగ్ధుడైన తిలక మంజరిరాసిన ధనపాలుడు –
‘’స్పష్ట భావ రాసా చిత్రైః పదన్యాసైః వర్తితా –నాటకేషు నట స్త్రీన భారతీ భావ భూతినః’’అని శ్లాఘించాడు .శ్మశాన వర్ణనాలోని గౌడీ రీతి లోని భీభత్స రసాన్ని చూద్దాం –
‘’ఉత్క్రుత్యోత్క్రుత్య కృత్తిం ప్రధమ మధ ప్రుదూ త్సేదభూయామ్సి మాంసా –న్యంస స్ఫిక్ స్పష్ట పిండాద్యవయవ సులభా న్యుగ్ర పూతీని జగ్వా –
ఆర్తః పర్యస్త నేత్రః ప్రకటిత దశనః ప్రేతరం కః కరం తాత్ –అంక స్థా దస్తి సంస్థం స్థపుట గటమపిక్రవ్య మవ్యగ్ర మత్తి’’
శ్మశానం లో ఒక దెయ్యం శవం తోలు వలిచింది .భుజాల వెనక ఉబ్బిపోయి దుర్గంధం తో ఉన్న మాంసాన్ని తింటోంది .కళ్ళు పెద్దవి చేసి పళ్ళను ఇఇలిస్తూ ఒడిలో ఉంచుకున్న శవం ఎముకలకు అంటుకొని ఉన్న మాంసాన్ని గీకి గీకి సంతోషం గా తింటోంది ‘’యెంత భయంకరమైన వర్ణనొ .కళ్ళకు అట్టి నట్లు చూపాడు దృశ్యాన్ని .దీన్నే ‘’పోట్టిగ్రాఫు ‘’అంటే ఫోటోగ్రఫీ వర్ణన అంటారు .అంటే ఉన్నదిఉన్నట్లు గా చిత్రీకరించి చూపిస్తాడు .దానికి కలర్ వేయడు.
భవ భూతి ఛందో వైవిధ్యాన్ని బాగా పాటించాడని చెప్పుకొన్నాం .అతనికి ఇష్టమైనది ‘’శిఖరిణీ వృత్తం ‘’దాన్ని ఎంతబాగా ప్రయోగించాడో క్షేమేంద్రుడు ‘’మాలినీ వృత్తం ‘’లో మనోహరం గా చెప్పాడు –
‘’భవ భూతేః శిఖరిణీ నిరర్గళ తరం గిణీ-రుచిరా ఘన సందర్భే యా మయూరీ వ నృత్యతి ‘’
మానవ హృదయపు లోతులను తడిమి ఆర్ద్రత కలిగిస్తాడు .సూక్ష్మ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి చెబుతాడు .
‘’భవ భూతి కవేర్వాచ స్సదంతే రస రంజితాః –సుమనోభా స్సుదాస్యందిబంధ మాధుర్య బంధురాః’’అని ఒక అజ్ఞాత కవి భవ భూతి వివిధ రస పోషణ లో సిద్ధ హస్తాన్ని గురించి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-14-ఉయ్యూరు