బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు రాష్ర్టాల తెలుగు వారికోసం ఈ పండుగరోజులన్నాళ్లూ ఆ విశేషాలు, నైవేద్యాలు, పాటలు ప్రత్యేకంగా అందిస్తుంది నవ్య.
తెలంగాణలోని మారుమూల పల్లెలు మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు.. బతుకమ్మ పండగలో ఉత్సాహంగా పాల్గొంటారు. రంగురంగుల పువ్వులు, ముచ్చటైన పాటలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఒక్కసారి బతుకమ్మ ఆడితే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని భావించే వాళ్లలో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణఒకరు. ఆవిడ ‘నవ్య’తో బతుకమ్మ ముచ్చట్లను పంచుకున్నారిలా.. ఆడవాళ్లందరు ఒక చోట చేరి.. బతుకమ్మను ఆడే దృశ్యం మనోహరంగా ఉంటుంది. తాజాపువ్వులను సేకరించి.. బతుకమ్మను పేర్చడంలో ఎవరి నైపుణ్యం వారిదే! ఒకప్పుడు రకరకాల పువ్వులతో అలంకరించేవారు. ఇప్పుడు గునుగుపూలు, తంగేడుపూలు ఎక్కువగా వాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల శక్తులు ఒక్కటైనట్లు.. ఇక్కడి పండగలు, సంస్కృతి కూడా ప్రజల్ని ఏకతాటి మీద నడిపించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండగకు సంబంధించి చిన్నప్పటి జ్ఞాపకాలైతే నాకు లేవు కాని.. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజాసమూహాలు పిలిస్తే వెళ్లేదాన్ని. అటు మా పుట్టింట్లో, మెట్టినింట్లో.. బతుకమ్మను చేసుకునేవారు కాదు. మహబూబ్‌నగర్‌జిల్లా గద్వాలలో కూడా ఈ పండగ చేసుకునేవారు కాదు. అయితే తెలంగాణ ఉద్యయం మొదలయ్యాక – నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని ఉద్యమదిశగా మళ్లించడానికి బతుకమ్మ పండగను ఘనంగా చేసుకునేవాళ్లం. ఉదయాన్నే లేచి మహిళలు బతుకమ్మను రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా అలంకరించి, చక్కటి పాటలు పాడుతుంటే ఆనందమేస్తుంది. తెలంగాణలోని జిల్లా జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉన్నప్పటికీ మన సంస్కృతి అనేది అందర్నీ ఏకం చేస్తోంది. ఈ కోవలో బతుకమ్మ పండుగకు ఇదివరకటి కంటే ప్రాధాన్యత లభిస్తోంది. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. బతుకమ్మకు కొందరు రాజకీయరంగు పులిమి.. ఆ పండుగను సామాన్యులకు దూరం చేస్తున్నారేమో అనిపిస్తోంది. కొందరు సామాజిక శ్రేయోభిలాషులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండగ కోసం పదికోట్లు నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. అయితే ఈ నిధులు ఎందుకోసం, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. బతుకమ్మ అనేది ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేసుకునే పండుగ. ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లాకేంద్రంలో ఘనంగా చేయాలనుకుంటే.. మహిళా ప్రజాప్రతినిధులందర్నీ ఆహ్వానించి.. బతుకమ్మ పండుగను చేయవచ్చు. అందుకు పెద్దగా ఖర్చు కాదు. కోట్లాది రూపాయలు పండుగ కోసమని చెప్పి.. ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పడం లేదు ప్రభుత్వం. |
—
దుర్గేస్మృతా హరసి భీతి మశేష జంతో : స్వస్థైః స్మృతా మతిమతేవ శుభాందదాసి!!
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ధ్ర చిత్తా!! భారతీయ సంస్కృతిలో దేవతా ఉత్సవాలకు పురాణాలు, తంత్ర గ్రంధాలలో అపరిమితమైన ప్రాధాన్యం ఉంది. పురాణాలలో దేవతలకు ఉత్సవాలను నిర్దేశిస్తే- స్థల పుర్ణా ఆగమ శాస్త్రం, తంత్ర విద్యలను అనుసరించి ఉత్సవక్రమం ఏర్పాటు చేస్తారు. శారదా నవరాత్రి పేరుతో విశేషంగా అందరూ జరుపుకునే ఉత్సవ క్రమంలో కూడా ఈ ప్రభావం కనబడుతుంది. శారదా నవరాత్రులను నియమం తప్పకుండా ఆచరించటానికి కూడా ఒక కారణముంది. ఎందుకంటే- శారద అందరికీ తల్లి. బిడ్డకు కోపం వచ్చినా, తల్లికి కోపం వచ్చినా, తల్లి బిడ్డను ఆదరిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా దుష్ట పుత్రుడు ఉండచ్చు కానీ దుష్టురాలైన తల్లి మాత్రం ఉండదు. అందుకే ఆ తల్లిని అందరూ కొలుస్తారు. నవరాత్రి, నవావరణార్చన, చండీనవాక్షరీ ఇలా తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషాలు శ్రీమాత ఆరాధనలోని ప్రత్యేకతలు. శ్రీమాత అవతార క్రమంలో నవదుర్గలుగా దుర్గా స్వరూపం ధరించింది. ఇలా తొమ్మిదవ అంకెతో ఈమెకు ప్రీతికరమైన బంధం ఉన్నది. శ్రీమాత చరిత కూర్మ, వామన , దేవీ భాగవతం, మార్కండేయ, బ్రహ్మాండ పురాణాలలో అధికంగా కనబడుతుంది. ఇక శివపురాణం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శివ, శివా ఇరువురూ లేని కథ శివపురాణంలో ఉండదు. అందుకే ‘‘శ్రీ శివా శివశక్తి కురూపిణీ లలితాంబికా’’ అని చెబుతారు. శివుడు గూర్చి ఏమి చెప్పినా అక్కడ శ్రీమాత ఉంటుంది. మాత విద్యాప్రదాత కూడా. దేవ కార్యార్థమై ఆమె అనేక సార్లు జన్మించింది కూడా. ఇక శరదృతువుకు ఉన్న విశేషాలు గురించి చూద్దాం. శ్రీమద్రామాయణంలో కిష్కింధకాండ 30వ సర్గలో శరదృతువును వర్ణించారు. శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణ కోసం శరదృతువు వచ్చేవరకు వేచి ఉన్నాడని శ్రీ మద్రామాయణం చెబుతుంది. ఇదే రీతిగా శ్రీ మద్మహాభారత ంలో విరాటపర్వంలో అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు ఉత్తర గోగ్రహణం ఘట్టంలో మొదటిసారిగా విజయదశమినాడు శమీ వృక్షమున ఉన్న ఆయుధాలు తీసుకున్నట్లు ఉంది. శరత్కాలంలోనే మహిషాసురుని శ్రీమాత సంహరించెనని కూడా ఉంది. అశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి శరన్నవరాత్రులు ఆచరించేవారిని ప్రతి అంశంలోను విజయం, శుభం చేకూరుతుంది. – కప్పగంతు సుబ్బరామ సోమయాజులు, విజయవాడ 9848520336 |