గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14
13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం )
కవితా గీర్వాణం
అనేక శాస్త్రాలతో బాటు నాట్య ,అర్ధ కామ ,ఆయుర్వేద శాస్త్రాలలోను భవ భూతికి మంచి ప్రవేశం ఉంది .భరతుని రస సిద్ధాంతాన్ని ఔదల దాల్చిన వాడు .అసలే సదాచార సంపన్న వంశం .వారంతా ‘’సోమ పీదులు’’,పంక్తి పావనులు ,బ్రహ్మ వాదులు ‘’.పంక్తి పావనులు అంటే చతుర్వేదాలను ,ఆరు వేదాంగాలను చదివి వేద పఠనాన్ని పది తరాలుగా చేస్తున్న వారు అని అర్ధం’’ .తనను వశ్యవాక్కుగా ,పరిణత ప్రజ్ఞా దురీణునిగా ,శబ్ద బ్రహ్మ గా చెప్పుకొన్నాడు .మాలతీ మాధవం లో ఆతని శివ భక్తీ కనిపిస్తే, మహా వీరం లో రామ భక్తీ సామ్రాజ్యాన్ని ఏలినట్లనిపిస్తుంది .తన ప్రతిభపై అపార నమ్మకం ఉన్నవాడు .అందుకే పండితులు మొదట నిరాకరించినా ‘’కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ ‘’అన్నాడు ‘’విపులాచ పృధ్వీ ‘’అనేది ఒక పలుకుబడి దేశం లో బాగా ప్రచారమైంది .భార్య మరణ దుఖం తో ఉత్తర రామ చరిత రాశాడని కొందరి ఊహాగానం .పవిత్రప్రేమ కే పట్టం కట్టాడు ఆంగ్లం లో ‘’డివైన్ లవ్ ‘’అనేదానికి ఉదాహరణ గా పాత్రల్ని చిత్రించాడు ఆ నాడే .అలౌకిక ప్రేమ అతని ఆదర్శం .అదే భారతీయాదర్శం .దానినే ప్రతిబింబింప జేశాడు .
‘’వ్యతి ప్రతి పదార్దానంతర కో-పి హెతుః-నఖలు బహిరుపాదీన్ప్రీతయః సంశ్రయంతే ‘’అన్నాడు- అంటే తెలియని కారణాలు యేవో మనుష్యులను ఒక్కటిగా కలిపి బంధిస్తాయి. ప్రేమకు బయటి కారణాలు ఉండవు .మనకవికి నాటక నటులతో సన్నిహిత సంబంధాలున్నట్లు గోచరిస్తుంది .నాటక లక్షణ శాస్త్రం లో ప్రతి అంకం లోను విదూషకుడు ఉండాలి .దీన్ని ‘’తూ-నా బొడ్డూ ‘’అని అసలా పాత్రనే తీసి పారేసి కొత్త ఆలోచన తెచ్చాడు .మన విశ్లేషకులు కాళిదాస భవ భూతులని తులనాత్మకం గా పరిశీలించి నిగ్గు తేల్చారు .అందులో కొన్ని కధలూ గాధలూ చేరాయి కూడా .అందులో నమ్మదగనివే ఎక్కువ .అయినా కొంత చూద్దాం
కాళిదాస –భవ భూతులు
ఇద్దరూ గీర్వాణ సాహిత్యం లో ఉద్దండ కవులే .మహా కవి అని కాళి దాసును అందరూ అంటున్నా భవభూతి ఫాన్స్ మాత్రం ఆయనే మహా కవిగా చెప్పుకొంటారు .కాళిదాస ‘’విసనకర్రలు’’’’స్వర్గం లో పారిజాతాది వృక్షాలు కేవలం వృక్షాలే .కాని’’ స్నుహీ వృక్షం ‘’మాత్రం మహా వృక్షం అని గురువుగారిని సమర్ధించారు .కాని ఇది వైద్యానికి కూడా పనికి రాదట .అందుకే వైద్య శాస్త్రం లో వ్యంగ్యం గా దాన్ని ‘’మహా వృక్షం ‘’అన్నారట. ఇది లోక సహజం .ఇద్దరూ భోజ రాజ ఆస్తానకవులే అని కధలల్లారు .
‘’కాళి ‘’మృదు స్వభావి .’’భవ’’ గంభీరుడు .’’దాసుది’’’’ వైదర్భీ రీతి’’ క్లిస్టసమాస రచన ఉండదు .పదలాలిత్యం ఎక్కువ .కవిత్వం లో ప్రసాద మాధుర్యం ఉంటుంది. అయితే ‘’భూతి’’ ది’’గౌడీ రీతి ‘’.దీర్ఘ సమాస రచన ఇష్టం క్లిస్ట పద ప్రయోగం ఇష్టం గా చేస్తాడు .అప్రసిద్ధ ప్రయోగాలూ చేశాడు .దాసు కవిత్వం వ్యంగ్య ప్రధానం రమణీయా ర్ధాలను ప్రతిపాదిస్తాడు వ్యంజనా రీతికి పట్టం కట్టాడు. భూతి మాత్రం వాచ్యార్ధానికే ప్రాదాన్యమిచ్చాడు .శబ్దాలపై ఎక్కువ గా ఆధార పడ్డాడు .సంక్లిష్ట భావాలేక్కువ .అన్నీ అరటిపండు ఒలిచినట్లు చెబితేనే తృప్తి .నాటక సంవాదాలు ఎక్కువ గా చేశాడు .
గురువులిద్దరూ ప్రక్రుతి ప్రేమికులే .ముందే మనం చెప్పుకోన్నట్లు కాళిదాసు లలిత కోమల సౌందర్యాన్ని ప్రకృతిలో దర్శించాడు .భవ ప్రకృతిలోని భీభత్సాన్ని భయంకరాన్ని చూపించాడు .దాసు వర్ణనలు మనసుకు చల్లగా ఉంటె భూతి వర్ణనలు భయ పెడతాయి .శక్తి వంతమైన పదాలను కూరుస్తాడు సందర్భాన్ని బట్టి .దాసుడి సరళ మధుర స్వభావం .భవ ది ప్రౌఢ తీక్ష్ణ ,గంభీర స్వభావం .ఇద్దరూ పరిమితం గానే అలంకారాలు వాడారు .నిత్య జీవితం లోని ఉపమలు దాసు వాడితే భూతి అమూర్త ఉపమలు తీసుకొన్నాడు. అలంకార చమత్కారాలు ఇష్టం లేనివాడు .
భవ భూతి మనుషుల అంతర్ సౌందర్యాన్ని అన్వేషించి వివరిస్తాడు .కాళిదాసు బాహ్య సౌందర్యాన్ని అద్భుతం గా చిత్రించాడు .భవ బాహ్య సౌందర్యం జోలికి పోనే లేదు .శకుంతలను దాసు ప్రక్రుతికన్య లాగా వర్ణిస్తాడు –
‘’ఆధరః కిసలయ రాగః కోమల విటపాను కారిణౌబాహూ –కుసుమమివ లోభ నీయం యౌవన మంగేషు సన్నద్ధం ‘’అన్నాడు .కపోల కచాల మీదనే దాసు ద్రుష్టి .భూతి కి ఈ దృష్టే లేదు అందుకే సీత శకుంతల కన్నా పవిత్ర మూర్తిగా అనిపిస్తుంది .
కాళిదాసు ప్రణయం కామ వాసన వేస్తుంది .భవ భూతి ప్రణయం ఆత్మలకు సంబంధించి .స్నేహ పూర్వకమైంది .వివాహ బంధం చేత స్తిరపడేది .శకుంతలా దుష్యన్తులది అతిలోక ప్రేమ యేకాని సీతా రాముల ప్రణయం అంత గంభీరం స్థిరం ,పవిత్రమైనది .యవ్వన ఉద్రిక్తతతో కాళిదాసు చిత్రించిన ప్రేమకాదు ,కాలం తో పరిపక్వమైంది .ఇద్దరూమహా కవులే .సందేహం లేదు దాసు కల్పనకు గొప్ప కవి .భూతి సహజ చిత్ర కవి భావనాలోక సంచారికాడు .
కాళిదాసు నాటకాలను లాక్షిణికుల ఆమోదం పొందేట్లు రాశాడు. భవ భూతి స్వేచ్చతో కొత్త దారులు తొక్కాడు. రంగస్తలం మీద అన్నీ చూపించేశాడు .మనుష్య మాంసాన్నీ అమ్మించాడు .ఉత్తర రామ చరిత్రలో చిత్రపటాల దర్శనం ఒక దివ్యాను భూతి .గర్భంక నాటకం అతని ప్రతిభకు నిదర్శనం .దాసు ప్రకృతిచిత్రణ చేసినా హృదయపు లోతుల్ని తరచలేక పోయాడు .భూతి సూక్షం పరిశీలనతో హృదయపు లోపలి పొరల్ని ఆవిష్కరించాడు .కరుణకు భవ భూతి పట్టం కడితే కాళిదాసు శృంగారానికి పట్టాభి షేకం చేశాడు .సంభోగ శృంగారాన్ని దాసు, వియోగ శృంగారానుభూతిని భవుడు చిత్రించారు .కరుణ తోబాటు వీర రౌద్ర భయానక భీభత్సాలను సమర్ధం గా చిత్రించాడు .
కాళి దాసుది కళాత్మకత .భావభూతిది భావ తీవ్రత .భవ భూతికి కాళిదాసు అభిమాన కవే .వాల్మీకం అంటే భవ భూతి అమితగౌరవం .మార్పులు చేసినా సమర్ధన కనిపిస్తుంది .దుష్యంతుడు శకుంతల చిత్ర పటం దగ్గర పెట్టుకొని దుఖిస్తాడు .రాముడు పంచవటికి వెళ్లి విరహాన్ని పొందుతాడు .ఇద్దరికీ పుత్రులు జన్మించారు .వారే విడిపోయిన నాయికా నాయకుల్ని కలపటం విశేషం .భారత ఇతి వృత్తాంతం తీసుకొని కాళిదాసు శాకుంతలాన్ని దివి భువిలను అనుసంధానం చేస్తూ నభూతో గా రాశాడు .భవ భూతి ఉత్తర రామాయణం లోని సీత కధను తీసుకొని రామ దృష్టితో అతి కరుణ రసాత్మకం గా చిత్రించాడు .దుష్యంతుడు లంపటుడు ,చంచలుడు గాకనిపిస్తే రాముడు దీరోదాత్తుడుగా నిష్కామ స్నేహ శీలిగా దర్శనమిస్తాడు .ఇద్దరూ పాత్రలను అతిలోక సుందరం గానే చిత్రించి చరితార్దులై నారు .దియోకాంత రాయ్ ఆంగ్లం లో వీరిద్దరిని తులనాత్మకం గా పరిశీలించి గొప్ప పుస్తకం రాశాడు .దీనికి తెలుగు అనువాదమూ వచ్చింది .మా నాన్న గారి దగ్గర ఉండేది నేను రెండుమూడు సార్లు చదివిన జ్ఞాపకం .ఇద్దరుకవుల రచనలు అన్ని భాషల్లోకి అనువాదం పొందాయి .
భవ భూతిని కాళిదాసు ప్రశంసించితే భవభూతి కాళిదాసు నాయికా నాయకులను వీలైనప్పుడల్లా స్తుతించాడు .కాళిదాసు ప్రభావం భవ భూతిపై ఉంది .ఉత్తరరామ చరితలో శాకుంతలం ప్రభావం కనిపిస్తుంది .ఒకరికొకరు వీరాభిమానులు మధ్యమనమే బుజాలు కాసి దెబ్బతింటున్నాం .కాళిదాస భావ భూతులు సాహిత్యాకాశం లో సూర్య చంద్రులు .కమనీయ దీప్తులు .
భవ భూతి కద ఇంతటితో సమాప్తం
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-14-ఉయ్యూరు
—