శ్రీలలితా సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’
త్రికూట రహస్యం
దేవి త్రిపుర సుందరి అందరిలోనూ ప్రేమ భావ బీజం నాటుతుంది .ప్రేమను పవిత్రం గా సేవిస్తే శుద్ధమైన ఆనందాన్ని అనుభ విస్తుంది ..కామ తో ఉన్న ప్రేమ లౌకిక శారీరక సుఖాన్నే ఇస్తుంది .కాని అలౌకికం అయితే పరమానందాన్ని శాశ్వత సుఖాన్నే ఇస్తుంది .ధర్మ సమ్మతం అయిన కామం మంగళ ప్రదం .కామం మనిషిని పశువును చేస్తుంది ,దైవ సమానుడినీ చేస్తుంది .కామాన్ని కోరేవాడు లౌకికాన్ని అలౌకిక ప్రేమగా గ్రహించాలి .అప్పుడే ప్రేమ సార్ధకమవుతుంది .అప్పుడు వ్యక్తిగత హద్దులు దాటి విరాట్ శక్తిని సాక్షాత్కారించుకో గలుగుతాడు అంటారు ఇలపావులూరి వారు .
రక్త మాంసాలతో కూడిన శరీరం వెనక ఒక పరమ రామణీయకమైన నిధి దర్శనమిస్తుంది .దీనిముందు ప్రపంచ సుఖాలన్నీ తుచ్చం అనిపిస్తాయి .అందుకే లలితా సహస్రం లో దేవిని ‘’మహా లావణ్య శేవధి ‘’అన్నారు అంటే దేవి సౌందర్యానికి పరాకాష్ట .పాప పరిహారం జరిగితే రూపం నిగ్గు తేలి దివ్యత్వాన్ని పొందుతుంది అంటారు డాక్టర్ పాండురంగా రావు గారు .’’శ్రీ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా ‘’అన్న దానిలో ఆమె సర్వ శోభితమైనది .ముక్కుకింద సుధారస పాత్రలతో సమానమైన సరసత్వపు అక్షయ ప్రవాహలైన ఆమె ఆధరాలున్నాయి .అవి ప్రపంచాన్ని దాహ పిపాసలో ముంచేస్తాయి. పెదవుల నుండి మాటలు వెలువడు తున్నప్పుడు మాటల మధ్య దేవి చిరునవ్వు కోమల చాయతో వాయు మండలాన్ని అంతటికి ఆశ్రయం ఇస్తూ ఉంది .ఆమె ముఖానికి తగిన వాక్ సౌందర్యం ముగ్ధుల్ని చేస్తుంది .ముఖానికి నిజమైన శోభ వాణి అంటే పలుకు .అమృత వాక్కులు వెలువడుతుంటే తదేక ధ్యానం తో తన్మయత్వం తో దర్శిస్తాం .అలాంటి దివ్య శోభ దేవి ముఖ మండలం లో భాసిస్తుంది .
‘’కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ ‘’-దేవి కంఠం నుండి నడుము వరకు మధ్య కూటం వ్యాపించి ఉంది .వాగ్భవ కూటం లాగా ఇది తెరచుకొని ఉండదు అని గ్రహించాలి .ఎక్కువ భాగంకప్పబడి ఉంటుంది .శరీరం లోని నవ రంధ్రాలలో ఏడు రంధ్రాలు ముఖ మండలం లోనే ఉన్నాయి .మధ్య కూటం లో ఒక్క రంధ్రం కూడా లేదు .ఈ కూటం వాగ్భవ కూటాన్ని నడప టానికి సహాయ పడుతుంది .పెదవులనుండి బయటికి వచ్చేమాటలు నాభి నుంచే బయల్దేరుతాయని మనకు తెలిసిన విషయమే .ముఖ మండల సౌందర్యాన్ని పెంపొందించ టానికి మధ్య కూటం తోడ్పడుతుంది . మధ్య కూటానికి దాని స్వంత సౌందర్యం కూడా ఉంది .మెరిసే కళ్ళల్లో యెంత సౌందర్యం ఉంటుందో ,ఎత్తైన వక్షస్థలం లోనూ అంతే సౌందర్యం ఉంటుంది . కూర్చోవటానికి ,లేవటానికి తిరగడటానికి శరీర మధ్య కూటం అందరికీ కావాల్సిందేగా .దేవి ముఖ మండలం యెంత మహిమాన్వితమో మధ్యకూటం అంటే మహిమాన్విత పాత్ర పోషిస్తుంది అన్నారు రావు గారు .
నడుము కింది భాగాన్ని శక్తి కూటం అంటారు సామర్ధ్య ,సౌభాగ్య ,సౌందర్యాలను పెంపొందించటం లో శక్తి కూటంముఖ్య పాత్ర పోషిస్తుంది .ప్రాణి శక్తికి ఇది మూల కేంద్రం .అందుకే దీన్ని మూలాధార కేంద్రం అంటారు .శక్తి స్వరూపిణి అయిన దేవి ముఖ్య నివాస స్థానం ఇదే అంటే మూలాధార కేంద్రమే .పరమేశ్వరి యొక్క ఈ శక్తికూటం కొందరిలో జాగృతం గా ఉంటె మిగిలిన వారిలో సుషుప్తం గా ఉంటుంది .ఈ శక్తి కూటం మేల్కొన్నప్ప్పుడు వ్యక్తీ యొక్క చైతన్యం వికాసం వైపుకు ఉన్ముఖ మౌతుంది అంటారు డాక్టరుగారు .నడుము నుండి నాభి ,నాభి నుండి హృదయం ,అక్కడి నుండి కంఠం,దాని నుంచి లలాటం , అక్కడినుండి కపాలం వరకు ఈ శక్తి చైతన్య సంచారం చేసి సహస్రార చక్రం లో ఉన్న ఆనందమయి అయిన దేవి చరణామృతం లో శరీరం లోని అవయవాలన్నిటిని రస ప్లావితం చేసేస్తుంది .అందుకే శక్తి కూటమే పరాశక్తి ప్రధాన ప్రవాహం .
దేవి నివాసం మూడు కేంద్రాలు -వాగ్భవ కేంద్రం , ,మధ్యకూట కేంద్రం ,శక్తి కూటకేంద్రం .ఈ మూడూ వేరు వేరుగా ఉన్నా ఒకదానితో ఒకటి కలిసి ఉండటం విశేషం .ప్రతిజీవిలో ఇవి విడివిడిగా ఉంటాయి .ఈ మూడూ కలిస్తేనే శరీరం.ఈ శరీరమే అశరీర అయిన ఆత్మ యొక్క ఆనంద నిలయం .అక్కడే అమ్మ ఉనికి .పైకి కనిపించే రక్తమాంస ఆస్తుల వెనుక ఇంతటి రహస్యం ఉందని గమనించకపోవమే అజ్ఞానం .చీకటి బతుకు . ఈ శరీరమే పరమేశ్వరీ రమణీయ రూప రేఖలకు అంకితమైన యంత్రం .ఈ శరీరం వాగ్భవ కూటం నుంచి వెలువడే వాక్కే పరమేశ్వరి వాగ్విలాసాన్ని చిత్రించే మంత్రం .శరీర కదలికలు ,వర్తనలే దేవి నడకలకు ప్రాతి నిధ్యం వహించే స్వతంత్ర తంత్రం .ఇలా పరమేశ్వరి స్థూల సౌందర్యం ,సూక్ష్మ సౌందర్యం ,యాంత్రిక స్వరూపం ,మాంత్రిక మహత్వం ,తాంత్రిక విధానం మానవ శరీరం మీదే ఆధారపడి ఉన్నాయని మరువ రాదన్నారు .
‘’మూల మంత్రాత్మికా మూల కూట త్రయ కలళేబరా –కులామ్రుతైక రసికా కుల సంకేత పాలినీ ‘’అన్న ముప్ఫై ఆరవ భాగం ఉపనిషత్ దర్శనమే .దేవత ఆత్మ విశిష్టమైన మంత్రం లో నిహితమై ఉంటుంది .ప్రత్యెక మంత్రంలో రూప మార్మిక సంకేతం ఉంటుంది .ప్రతి వ్యక్తికీ స్వంత వాక్ వైఖరి ఉంటుంది .మంత్రం లో మనకు కావలసిన దేవతను సాక్షాత్కారించుకో వచ్చు. ప్రతి మంత్రం ఏదోఒక దేవత ఆత్మకు ప్రతీక .కానీ శ్రీమాత అందరు దేవీ దేవతలకు జనని .అందుకే ఆమె ను ఆహ్వానించే మంత్రం మూలమంత్రం .అందులో ఆమె ఆత్మ నివాసం ఉంటుంది .కనుక మూల మంత్రాత్మిక అయిందన్నారు ఇలపావులూరి వారు .దేవి దివ్య శరీరం లోని మూడు ప్రధాన కూటాలు సమస్త ప్రాణుల శరీరం లోని కూట త్రయ సమూహానికి మూలాదారాలు అని అర్ధం చేసుకోవాలి.అందుకే ‘’మూల కూట త్రయ’’ అయింది .దేవి శరీరం ఒక మూల బిందువు .ఈ బిందువు ప్రతి బింబం ప్రతిప్రాణి లోను కనిపిస్తుంది .దేవి ద్రుష్టి మన ద్రుష్టి వెనక ఉన్నప్పుడే దాన్ని చూసే శక్తి మనకు లభిస్తుంది .ఆమె శ్రవణాలు మన వెనక ఉన్నప్పుడే మనం వినగలుగుతాం .అప్పుడే మన శరీర అవయవాలు శక్తి వంతం అవుతాయి .
కూట త్రయపు మూలం -,శారీరకం మానసికం ,ఆధ్యాత్మికం అని మూడు రకాలు. స్తూల శరీరం లో ఇది శారీరకం . మాంత్రికం లో మానసికం ,అఖండానంద ఆక్షయ రూపం లో ఆధ్యాత్మికం అవుతుంది .మూడు రూపాలలోను దేవి సకల చరాచర సృష్టికీ మూలాదారమే అవుతుంది .ఆమె దివ్య శరీరం లో ఉన్నట్లే మంత్రాక్షర కళేబరం లోను మూడు కూటాలు ఉంటాయన్నారు రంగా రావు గారు .శిరోభాగం ,మధ్య భాగం ,పాద భాగం .గాయత్రీమంత్రం లో కూడా మూడుభాగాలున్నాయని మనకు తెలుసు ‘’తత్స వితుర్వరేణ్యం ‘’,భర్గో దేవస్య ధీమహి ‘’,ధియో యోనః ప్రచోదయాత్ ‘’.ఇందులోని మూడు భాగాలు ,పాదాలు కూటాలు కూడాఇలాంటి కూట త్రయాన్ని బాలా త్రిపుర సుందరి ,పంచ దశి ,శ్రీ విద్య మొదలైన మంత్రాలలో దర్శించ వచ్చునంటారు వారు . మంత్రం నిర్మాణం మంత్రం ద్వారా మనం మననం చేసే దేవత రూప కల్పనకు అక్షర రూపమే నంటారు .మంత్రమే దేవి శరీరం .అందుకే అక్కడ ఆమె ఆవాసం. కనుకనే ‘’మూల కూట త్రయ కళేబరా ‘’అనటం జరిగిందని వివరిస్తారు ఇల పావులూరి వారు .
సశేషం
నవరాత్రి దసరా శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-14-ఉయ్యూరు