మాం మార్స్ మార్చ్ మాజా
ఊహ ,ఆశారావు అన్యోన్య దంపతులు .నిన్న మాం మార్చ్ చేసి మార్స్ కక్ష్య లో ప్రవేశించినప్పటినుంచి వారి మాజాకు అంతులేదు .వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల తీరు -దసరా కనుక సరదాగా కాసేపు –
ఊహ –ఏమండీ !అమ్మాయి పెళ్ళిచేశాం .అల్లుడితో అమ్మాయి హనీ మూన్ ఏర్పాటు చేయమని చిలక్కి చెప్పినట్టు చెప్పా ఏం చేశారు ?
ఆశారావు –దానికేందుకు కంగారు బంగారం? మనవాళ్ళు కుజ గ్రహం లో కాలు పెట్ట బోతున్నారుగా .ఇండియాలో ఎక్కడ చూసినా కాలుష్యం .ఆఖరికి హిమాలయాలనూ ప్లాస్టిక్ భూతం వదలలేదు కబళిస్తోంది .అందుకనే మార్స్ మీదకు మన జంటను మార్చ్ చేయాలని మార్చి లో పంపే ఏర్పాట్లు షురూ చేశా .
ఊహ –ఓరి నా మేనత్తకోడుకో ! యెంత ఎదిగిపోయావ్ ?
ఆశా –అవును ఇందాకా బజార్లో పంపుల దగ్గర ఆ గొడ వేమిటే?
ఊహ – మన మున్సి పాల్టీవాళ్ళు రోజుకు ఒక గంటె కదండీ నీళ్ళు వదిలేది .నీళ్ళకోసం పానీ పట్టు యుద్ధం అది .అయినా ఈ నీళ్ళ సమస్య ఎప్పుడు తీరుతుందో?
ఆశా –ఇక ఆ సమస్య ఉండదే .నీళ్ళ బాటిల్ చేత్తో బుచ్చుకొని మార్స్ మీదకెళ్ళి బాటిల్ నిండా తెచ్చుకోవటమే .
ఊహ –ఆరి మీ ఇల్లు బంగారం కానూ –అంత వీజీ అన్నమాట .సడే గాని సంబడం –మా నాన్న పొద్దున్న ఫోన్ చేశాడు .ఊళ్ళో ఎవరూ కౌలుకి ఇవ్వటం లేదట .ఇక్కడైనా మీరు ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నాడు .
ఆశా –ఆరి బంగారి మామోయ్ !ఏమే మీనాన్న కౌలుకు తీసుకొని డబ్బు లెగగోట్టే రకం .ఉన్నచేను పక్క చేను కలుపుకొనే రకం .బుద్ధిగా ఉంటె ఎండుకివ్వరక్కడ?ఇక్కడికొచ్చి ఏం ఉద్ధరిస్తాడుట ?
ఊహ –అల్లుడైనా మేనల్లుడైనా మీరేకదండి .ఏదో ఒకటి చూద్దురూ !
ఆశా-అదికాదు కాని –కుజుడి మీద అంతాఖాళీ .ఇంతవరకు ఎవరూ ఆక్రమించలేదు .మీ బాబును అక్కడికి తోలేద్దాం .కబ్జా చేసి దర్జా గా బతుకీడుస్తాడు .అక్కడే రియల్ ఎస్టేట్ కూడా చేసి బోలెడు సంపాదించి నీకు ఒడ్డాణమూ చేయిస్తాడు .అయినా నీనడుముకు కనీసం పాతిక కిలోలన్నా బంగారం కావాలి కదే .
ఊహ –దిష్టి తగుల్తుందండి మీ మాటలు వింటే .మొన్ననేగా కంసాలాయాన్ని ఇంటికి పిలిపించి వాకబు చేయించింది .పావు తక్కువ పాతిక కిలోలు చాలన్నాడు కదండీ .సరే కానీండి నా కెమెరా తో ఫోటోలు సరిగ్గా రావట్లేదండి .మంచిది కొనరూ .
ఆశా –మార్స్ మీదకు మంచి కెమెరాలు తీసుకెళ్ళారు మన వాళ్ళు .అవి పని అయిపోగానే కిందకి పడిపోతాయట.ఎక్కపడుతాయో జ్యోతిష్కుడినడిగి వెతికి పట్టుకోస్తాలే.అయినా కెమేరా అంటే లక్ష్యం లేదు నీకు .పిల్లల ఒకటి ,రెండ్లూ అన్నీ దాని మీదే.కిందపడేసి ఉంచటమే కానీ జాగ్రత్త చెయ్యవు .
ఊహ –ఇహ ఆపండి సుభాషితాలు .పిల్లా జెల్లా ఉన్న కొంప ఎలా ఉంటున్దేమిటి ?మీకేమైనా పట్టేడిస్తేగా ?లేవగానే ఒక సారి ‘’పూజ అవగానే మరోసారి మధ్యాహం నిద్రలేవంగానే ఇంకోసారి ‘’కంపు ‘’కొట్టటం తప్ప కొంపా గోడూ పట్టించుకొంటారా?సాయంత్రం రెండుగంటలు బలాదూర్ .,తిరిగిరాగానే మళ్ళీ కుర్చీ ఎక్కి నొక్కుకోవటం .నాకేమైనా సాయం చేస్తున్నారా ?నడుములు విరుడుతున్నాయి చేసి చేసి .ఇకొంచెం ఖాళీ ఉంటె టి వి .రాత్రికి పక్కలో నా సవతి ‘’రేడియో ‘’.రాత్రి పదకొండింటిదాకా దాని మాయలోనే .మళ్ళీ తెల్లారు జామున అయిదింటికే ఎఫ్ ఏం రేడియో అంటూభక్తీ పాటలంటూ మిర్చిలో ‘’ దేవ రాగం విత్ భారతి ‘’వింటూ ఆ సోల్లుకబుర్లకు పులకిస్తూ కళా పోసన అంటూ నా నిద్ర చెడగోట్టడమే మీ ధ్యేయం గా ఉంటున్నారు .నేనెవరికి చెప్పుకోను?
ఆశా –ఇక కొళాయ్ కట్టు . నీ బాబు ను అను .నన్నంటేఊర్కోను .
ఊహ –నా బాబెందుకు మధ్యలో మీబాబు గోడమీదున్నాడు గా .అయినా మీ మాయ్యను అనాలి .
ఆశా –ఆయనేం చేశాడు మధ్యలో .మీనాన్నను ,మా అమ్మను ఒప్పించి పుణ్యం కట్టుకొని ముడేశాడు మనిద్దర్నీ .సరేకాని అన్నం లోకి ఏం చేశావ్ ?
ఊహ –చేయ్యటానికేమున్నాయి ? అన్నీ కిలో నలభై పైనే అని చెప్పి తలో వంద గ్రాముల కూరలు తెస్తే ఏం వండి ఎవరి నోట్లో పెట్టను?
ఆశా –ఇక దిగులక్కర్లేదే .మార్స్ లో పంటలు బాగా పండుతాయట .అక్కడికే వెళ్లి తెచ్చుకోవచ్చు .ధాన్యం గోడౌన్లు ,కుజ బజారులు ,మార్స్ మిల్కూ ,మార్స్ మసాలా అన్నీ కారు చౌక.ఇదే శపథం చేసి చెబుతున్నా .ఇక మన రైతు బజారులో కూరలు కొనను .పచారీకొట్లో బియ్యం పప్పూ ఉప్పూ తేను.అన్నీ కుజుడి దగ్గరినుంచే తెస్తా.ఏమంటావ్?
ఊహ మీరు అనుకొంటే సాదిస్తారండీ .అందుకే మా నాన్న మీకిచ్చి పెళ్లి చేశాడు నన్ను .వేపకాయంత పైత్యం ఉన్నా గంగిగోవుకదండీ మీరు .
ఆశా-చివరికి నన్ను గోడ్డుకింద కట్టేశావన్న మాట.సరే బుడ్డాడేక్కడ?
ఊహ –ఇక్కడ క్రికెట్ ప్లె గ్రౌండ్ బాలేదని ఫ్రెండ్స్ తో మార్స్ మీదకేళ్ళాడండీ ఆడుకోవటానికి .
ఆశా –ఆహా ! నాకేననుకొన్నా నీకూ ఎక్కిందా కుజ పైత్యం ?
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు