దసరా పరమార్ధం -మనిషి మనసు -ధర్మం –

భారతీయులు జరుపుకునే పండుగలలో దసరా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మనం 9 రోజులు శక్తులకు పూజలు చేస్తూ, 10వ రోజు విజయ దశమిగా జరుపుకుంటాం. రాముడు, రావణునిపై విజయం పొందిన రోజున విజయదశమిగా చేసుకుంటాం.
రాముడు విజయం పొందాడు. కానీ రావణుడు మహా శివభక్తుడు, శక్తివంతుడైనప్పటికీ ఓటమి పాలయ్యాడు. ఈ గెలుపు, ఓటముల వెనుక ఉన్న రహస్యాన్ని మనం గమనించినట్లయితే మనం ఎలా నడుచుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి వంటి విషయాలకు సంబంఽధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకోవచ్చు.
రావణాసురుడు శివభగవానుడి నుంచి పొంది వరానికి చాలా అహంకారిగా అయ్యాడు. అహంకారం ఒక అవగుణం. అవగుణాలు ఉన్న వ్యక్తి ఎప్పటికి విజయం పొందలేడు. రావణాసురుడి 10 తలలు సీ్త్ర, పురుషులలో ఉన్న పది అవగుణాలకు గుర్తుగా చూపిస్తారు. రాముడు నిరహంకారిగా ఉన్నాడు. దురాశ దుఃఖానికి చేటు అని అంటారు. రావణుని దురాశ అతనిని ఓడిపోయేలా చేసింది. రావణాసురుడి ఓటమి నుంచి కర్మ సిద్ధాంతం కూడా మనకు అర్ధమవుతుంది. రావణాసురుడికి సీత పట్ల అపవిత్ర భావన కలగటం అతను చేసిన చెడు కర్మ. ఆ చెడు కర్మ యొక్క ఫలితం కూడా చెడుగానే ఉంటుంది. అందుకే ఓటమిని చవిచూశాడు. ప్రపంచంలోని కర్మ సిద్ధాంతం ‘‘మనం ఎలాంటి కర్మలు చేస్తామో, అలాంటి ఫలితాన్నే తిరిగి పొందుతాం.’’ రాముడు తన జీవితంలోని మంచి పనులు చేశాడు. అందుకే విజయాన్ని పొందాడు. ఈ రోజునకు మనం రాముడు మంచి బాలుడు అని మంచి ఉదాహరణగా రాముడిని చెప్పుకుంటున్నాం.
దసరా (దస్‌ హరా) రావణుని పది తలలను రాముడు హరించాడు. అంటే రాముడు పది అవగుణాలపై విజయం పొందాడు. అందుకే విజయదశమిగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. మనం కూడా మనలో ఉన్న అవగుణాలను తొలగించుకోవటం ఈ విజయదశమి నుంచి ప్రారంభించి ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వగలం.
– బ్రహ్మకుమారీస్‌
సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనవి నవరాత్రులు. పూజలు,పిండివంటలు, కొత్త బట్టలు, సంబరాలు- ఇవేనా నవరాత్రులంటే? అసలు ఈ నవరాత్రుల అంతరార్థమేమిటి? వీటిని నిర్దేశించటం ద్వారా మన పూర్వీకులు ఏం చెప్పదలుచుకున్నారు? వీటిన్నింటినీ ఈ సమయంలో ఒక సారి ఆలోచించుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం- లోక కంటకుడైన మహిషాసురుడిని చంపటానికి సకలదేవతల శక్తులన్నీ ఏకమై ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ శక్తియే మహిషాసురుడితో ఇతర రాక్షసులతో ఈ తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు సంపూర్ణ విజయం సాధించింది. అందుకే ఆశ్వీజ శుక్ల పక్ష పాడ్యమి నుంచి దశమి దాకా తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు జరుపుకుంటాం. అయితే ఇక్కడ దేవిని ఒక స్వరూపంగా మాత్రమే చూడకూడదు. అందరిలోను ఆమె ఆత్మస్వరూపమై ఉంటుంది. దీనిని తెలుసుకోకపోవడమే అవిద్య.
అవిద్యే మూల హేతువు..
భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి అష్టప్రకృతులు. వీటికి కారణం అవిద్య. ఈ తొమ్మిదింటినీ నాశనం చేసేది ఆత్మజ్ఞానమనే జ్ఞానశక్తి. భగవతీ స్వరూపిణియైున దేవి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన గురువుల ద్వారా ప్రజలందరికీ అందిస్తుంది. చాలా మందికి- భూమి, ఆకాశం వంటి అష్టప్రకృతులకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం రావచ్చు. అసలు ఈ విశ్వంలోని ప్రకృతులన్నింటికీ శక్తి ఉంటుంది. శక్తి లేని వస్తువు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తికి ఉన్న వివిధ రూపాలే ఈ ప్రకృతులన్నీ. అందుకే భూమికి ధారణ శక్తి, జలానికి తడిపే శక్తి, అగ్నికి కాల్చే శక్తి, వాయువుకు చలింప చేసే శక్తి, ఆకాశానికి అన్నింటినీ ఇముడ్చుకొనే శక్తి, మనసుకు జ్ఞానశక్తి, ఆలోచనాశక్తి- ప్రాణానికి క్రియా శక్తి ఉన్నాయి. అయితే ఈ శక్తులన్నింటికీ మూలాధారమైనది ఆత్మశక్తి. అదే జ్ఞానశక్తి రూపంలోకి మారి అహంకారాన్ని నశింపచేస్తుంది.
అహంకారమే రాక్షసుడు..
ఇక్కడ పురాణ ప్రోయక్తమైన శక్తి ఆవిర్భావాన్ని తాత్వికంగా విచారించాలి. మనం పరమాత్మను ధ్యానించేటప్పుడు ఇంద్రియాలనే దేవతలన్నీ అంతర్ముఖం అయిన మన మనస్సు ఆత్మశక్తి సన్నిధి చేత శుద్ధ సాత్వికంగా మారుతుంది. ఇదే శక్తి యొక్క ఆవిర్భావం. ఈ శక్తి ద్వంద్వాలనే శుంభ నిశుంభాది రాక్షసులను చంపుతుంది. మనిషిలోని అహంకారమే మహిషాసురుడు. మహిషం అంటే దున్నపోతు. దేహమనే మహిషాన్ని అధిరోహించిన అహంకారమే మహిషాసురుడు. అహంకారమనే రాక్షసుడు చేయని కార్యమే లేదు. వాడే లోకకంటకుడు. వాడిని శుద్ధ సాత్విక మనస్సే జ్ఞాన శక్తి రూపిణియైు సంహరించగలదు. అహంకారుడు తన పరివారంతో సహా జ్ఞాన శక్తి చేతిలో చనిపోతాడు.
సమాజహితానికే ప్రమాదం!
ఎప్పుడో పూర్వీకులు నిర్దేశించిన పండగలను ఇప్పుడు మనం ఎందుకు చేసుకోవాలనే అనుమానం కూడా కొందరిని తొలచివేస్తూ ఉంటుంది. ఈ పండగలు- మన అంతర్ముఖులం కావటానికి, ఈ విశ్వంలో మన స్థానం ఏమిటో తెలుసుకోవటానికి, చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి, జ్ఞానశక్తిని పొందటానికి ఇదొక అవకాశం. ప్రకృతి శక్తులను అదుపులో పెట్టుకున్నామనే అహంభావంతో ముందుకు వెళ్తు ముప్పులు తప్పవు. గత ఏడాది ఉత్తరాఖండ్‌, ఈ ఏడాది జమ్ముకాశ్మీర్‌లలో వచ్చిన వరదలు వీటికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అతి సున్నితమైన పర్వతసానువులలో తన స్వార్థం కోసం కడుతున్న ప్రాజెక్టుల వల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటే ఏర్పడే వినాశానానికి గుర్తులు. మనిషి అహంకారపూరుడితై తనకు తిరుగులేదనుకుంటే మొత్తం సమాజహితానికే పెను ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుత మన సమకాలీన సమాజంలో తరచి చూస్తే అలాంటి వారెందరో కనిపిస్తూ ఉంటారు. వారందరూ అంతఃముఖులై తన ప్రవర్తనను సమీక్షించుకోవటానికి ఇదొక మంచి ముహర్తం. అప్పుడు ఈ ప్రపంచమంతా సుఖఃశాంతులతో నిండుతుంది. అందరికీ విజయం చేకూరుతుంది.
– శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
శ్రీ శారదా పీఠం, విశాఖపట్టణం
ప్రపంచమెలా ఏర్పడింది అన్న విషయంపై ఉపనిషత్తులు ఎలా ఆలోచించాయో గతవారం గమనించాం. ఆ సృష్టిలోనే భాగమైన జీవులు, వాటిలో ముఖ్యమైన మనం ఎలా ఏర్పడ్డామో కూడా ఉపనిషత్తులు విశ్లేషించాయి.
చీమ నుండి మొదలు ఏనుగు (మధ్యలో ఉన్న మనిషి) వరకు అన్ని జీవుల్లోనూ ఆకలి, నిద్ర, ఆత్మరక్షణ, సంతానాన్ని క నడం అనేవి సాధారణం. మనిషికొక్కడికే మిగతా జీవులకు లేని ఆలోచనా శక్తి ఉంది. మనిషి ఇండియాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆఫ్రికాలోని మారుమూల అడవిలో ఉన్నా అతనికి చూడటం, వినడం, వాసన పీల్చడం లాంటి అయిదు ఇంద్రియాలూ, మనస్సు, వీటన్నిటితో ఒకే విధంగా ఆలోచించే శక్తి ఉన్నాయి. రెండు రెండు కలిస్తే నాలుగే అనే లాజిక్‌ సిస్టమ్‌ అతని మెదడులో ఉంది. ఈ ఇంద్రియాలు, మనస్సు ఎలా ఏర్పడ్డాయి అని కూడా మన రుషులు ఆలోచించారు.
మనిషి ఆలోచించడానికి ఉన్న సాధనం మనస్సు మాత్రమే. మనం బయటి ప్రపంచాన్ని మాత్రమే సాధారణంగా తెలుసుకుంటూ ఉంటాం. మనస్సు గూర్చి ఆలోచించడానికి కూడా సాధనం ఈ మనస్సే.
మొట్టమొదటిగా ఇంద్రియాలను గమనిస్తే ఒక్కొక్క ఇంద్రియం ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ప్రకృతిలో స్థూలంగా ఐదు అంశాలు మనిషికి తెలుసు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేవి. వీటినే పంచభూతాలు అన్నారు. కన్ను కేవలం వెలుతురును చూడగలుగుతుంది. ఈ వెలుతురు తేజస్సు. అనగా అగ్ని యొక్క లక్షణం. అంటే కంటికి, అగ్ని అనే తత్త్వానికి సంబంధం ఉంది. ముక్కు కేవలం వాసన చూడగలుగుతుంది. వాసన భూమి యొక్క లక్షణం. అంటే ముక్కు భూమితో సంబంధించి ఉంది. చర్మం మాత్రమే స్పర్శను గ్రహిస్తుంది. ఈ స్పర్శ వాయువు యొక్క లక్షణం. అంటే చర్మానికీ, వాయువుకీ సంబంధం ఉంది. ఇలాగే మిగతావి కూడా. మనస్సు మాత్రం ఐదు ఇంద్రియాలు తన ముందుంచిన విషయాల్ని విశ్లేషించి వాటి మంచి చెడ్డల్ని తెలుసుకుంటుంది.
ఇంద్రియంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ఇంద్రియశక్తి, మరొకటి ఇంద్రియమనే అవయవం. చూపు అనేది శక్తి. కన్ను అనేది అవయవం. కేవలం కన్ను అనే అవయవం ఉన్నా, చూపు అనే ఇంద్రియశక్తి లేకుంటే మనం చూడలేము. అలాగే మిగతా ఇంద్రియశక్తులూ, ఇంద్రియాల అవయవాలూ. ఈ ఇంద్రియాలు గమనించే విషయాలు, అంటే భూమి, నీరు మొదలైనవి ఐదూ శరీరానికి వెలుపల ఉన్నాయి.
పై విధంగా పరిశీలిస్తే భూమి, నీరు మొదలైన ఒక్కొక్క విషయం (భూతం) మూడు రకాలుగా ఉంది. మొదటిది స్థూలంగా మనం చూసే భూమి. రెండోది ఆ విషయాన్ని తెలుసుకునే ఇంద్రియశక్తి. మూడవది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సాధనమైన అవయవం. ఇలాగ పంచభూతాలు అనబడే ఐదింటిలోనూ మూడు అంశాల్ని చూస్తాం. మరో విధంగా చెప్పాలంటే ఒకే విషయం మూడు రకాలుగా మార్పు, అనగా పరిణామం చెందింది. ఈ మూడు అంశాల్లోనూ మొదటిది తెలివికి సంబంధించిన విషయం. రెండవది తెలుసుకునే అవయవ శక్తి. మూడవది తెలియబడే విషయం.
ఈ మూడు అంశాలకీ నామకరణం అవసరం. వీటిలో తెలివికి సంబంధించిన భాగం ముఖ్యమైనది. దీనికి కారణమైన గుణాన్ని సత్త్వం అన్నారు. అవయవ శక్తికి కారణమైన గుణాన్ని రజస్సు అన్నారు. స్థూలంగా మనకు కనిపిస్తూన్న భూమి, నీరు మొదలైన వాటిని తమోగుణం వల్ల ఏర్పడినవి అన్నారు. ఈ కోణం నుంచి చూస్తే చూపు అనే ఇంద్రియశక్తి, తేజస్సు యొక్క సత్త్వం అనే భాగం నుండి వచ్చింది. కన్ను అనే అవయవం తేజస్సు యొక్క రజోగుణం నుండి వచ్చింది. బౌతికంగా మనకు కనిపించే తేజస్సు (అగ్ని, సూర్యుడు మొదలైనవి) తమోగుణం వల్ల ఏర్పడినవి.
మనస్సు ఐదు ఇంద్రియాల నుంచి వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటుంది. అంటే ఇది ఐదు భూతాల సత్త్వమనే భాగాల నుండి ఏర్పడినదని అర్థం.
సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు అంశాలూ ప్రకృతిలో అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాలోనూ ఉన్నాయని మన ప్రాచీనులు గమనించారు. సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ సృష్టికి కారణం ఏ మూల పదార్థముందో దానిలో కూడా ఈ మూడు అంశాలూ ఉండి ఉండాలి. కార్యం (effect),, ఎలా ఉంటే కారణం (cause) అలాంటిదే అనేది సామాన్య నియమం (మట్టి అన్నది కారణమైతే కుండను కార్యం అంటారు). పైన చూపిన ఇంద్రియాలకూ, మనస్సుకూ కారణమైన ఐదు భూతాలూ ఒకే కారణం నుండి వచ్చాయి. ఈ స్పష్టికి కారణాన్ని మనవాళ్లు మూలప్రకృతి అన్నారు. ఇది చైతన్యంలో ఏర్పడే ఒకానొక సృజనాశక్తి అని గతంలో చెప్పుకున్నాం. అంటే ఈ మూల ప్రకృతిలో కూడా ఈ మూడు గుణాలే ఉన్నాయి.
పై విశ్లేషణ తర్వాత ఉపనిషత్తులు గమనించే విషయం ఏమిటంటే బయట ప్రపంచంలో ఉన్నదే శరీరంలో ఉంది. శరీరంలో ఉన్నదే బయట ప్రపంచంలో ఉన్నది. చీమ నుంచి ఏనుగు వరకూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఇదే అర్థాన్ని వేదాంతులు సామాన్యంగా ప్రవచనాల్లో పిండము, బ్రహ్మాండము ఒక్కటే అంటూంటారు. ఇంగ్లీషులో చెప్పాలంటే microcosm (శరీరం) macrocosm (ప్రపంచం) రెండూ ఒకటే. సృష్టిలో ప్రతిఒక్క జీవీ, ప్రతి ఒక్క వస్తువూ మరొకదానిపై ఆధారపడి ఉంది. గాలి పీల్చకుండా ఒక క్షణం కూడా ఉండలేం. నీరు భోజనం లేకుండా కొన్ని రోజులు కూడా ఉండలేం. అలాగే శరీరంలోని వేడి కూడా. ప్రతిక్షణం ప్రతిజీవి ప్రకృతిపై ఆధారపడి ఉంది. ఇదే విధంగా ప్రతి వస్తువూ మిగతా వాటి కలయికతో ఏర్పడిందే. ఉపనిషత్తుల కాలంలోనే సాంఖ్యులనే మరో వర్గం వారు కూడా పై మూడు గుణాలనూ విశ్లేషించారు. బౌద్ద సిద్ధాంతలో కూడా దీన్నే ప్రతీత్యసముత్పాదం (principle of dependent origination) అన్నారు.
సృష్టిలో కనిపిస్తున్న ఈ వైచిత్రి (వెరైటీ)కి కారణం ప్రపంచంలోని అన్ని ప్రాణుల్లోనూ పైన చెప్పిన సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ అనేక నిష్పత్తుల్లో కలిసి ఉండడమే. మనుషుల్లో కూడా ఒకడు ఉన్నదానితో సంతృప్తి కలిగి, అహింస, సత్యం మొదలైన గుణాలు కలిగివుంటాడు. అతడ్ని చాలా సాత్వికుడు అంటూంటాం. మరొకడు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, జయించాలని, ఇతరుల్ని డామినేట్‌ చేయాలని వెంపర్లాడుతుంటాడు. ఇత డిది రజోగుణం. మరొకడు ఇనిషియేటివ్‌ లేకుండా మజ్జుగా ఉంటాడు. ఇదే తమోగుణం. ప్రతిమనిషిలో పై మూడు గుణాలు ఏదో ఒక నిష్పత్తిలో ఉన్నా ఏదో ఒక గుణం అధికంగా ఉండడం వల్ల పై మూడు personality types గమనిస్తుంటాం.
ఇంత లోతుగా మనస్సును గూర్తి, ఇంద్రియాల గూర్చి ఆలోచించడం భారతీయ ఆలోచనా విధానంలోని ప్రత్యేకత.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.