సంజీవదేవ్ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. చేసినవాడు. సత్యం, శివం సుందరం అను మూడు పదాలను ‘తత్వమసి’ (నీవు అతనివే, అతనంతటివాడివే) అను ఒకే ఒక పదంలో దర్శించి హర్షించినవాడు. ఉన్నదొక్కటే, అదే సౌందర్యం, అదే సత్యం. అదే శివం. దాని కొరకే సత్యం, దానికొరకే శివం. నీవు అనే యోగ దృష్టితో తెలుసుకొని రచించినవాడు, వచించినవాడు. అందుకే అతడు అందాన్ని మాత్రమే ఆఖరు వరకు అవలంభించాడు. తన రచనల ద్వారా మనకందించారు. వాటిని రచించడమే కాదు వాటికి అందమైన పేర్లు పెట్టాడు. వాటిని మనతో చదివించడానికి, వాటి వైపునకు మన దృష్టిని ఆకర్షించడానికి. నేను కూడా మొదట ఆ పేర్లతోనే ఆకర్షితుణ్ణ ్ణయ్యాను. సోమయ్య సతీమణి అరుణ అప్పట్లో నేను పనిచేస్తోన్న తెలుగు అకాడమీలోనే పనిచేస్తుండేది. ‘ఇవి బాగున్నాయి సార్ చదవండి’ అని వారి రచనలను నాకు పరిచయం చేసింది ఆవిడే. నేనవి విడవకుండా చదివి ఆశ్చర్యపోయాను. రచనలు ఇంత అందంగా కూడా ఉంటాయా అని వాటన్నిటినీ చదివి, ఆ తదుపరి వాటిని రెండు సంపుటాలుగా ప్రచురించాను కూడా. వాటిని ప్రచురించే భాగ్యం నాకు లభించడానికి సోమయ్య, అరుణలే ప్రధాన కారకులు. రవీంద్ర భారతిలో ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ ఆ పుస్తకాలను ఆవిష్కరించి తెలుగు అకాడమీ తరపున సంజీవదేవ్‌ను ఘనంగా సన్మానించారు.
సంజీవదేవ్‌కి అందమే పాఠశాల; చెట్లు, గుట్టలు, కమనీయ దృశ్యాలు, పశుపక్ష్యాదులు, ఇవి ఆయనకు పాఠాలు బోధించే పంతుళ్లు. సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషల్లో ఆయన ప్రావీణ్యులు. ప్రాచ్య పాశ్చాత్య చిత్రలేఖనా పద్ధతులను అవగతం చేసికొన్న స్వయానా చిత్రకారుడు. వ్యాసకర్త, విమర్శకుడు, లేఖకుడు, చక్కని ఉపన్యాసకుడు. ఏది రాసినా, ఏది మాట్లాడినా ఎంతో సరళంగా, సరసంగా మాట్లాడిన సమర్థుడు. దర్శన దృష్టే కాక దార్శనిక తాత్త్విక దృష్టి అపారంగా కలవాడు. ఉత్తరాలను comelyగానే కాక homelyగా కూడా రాసి వాటిని సాహిత్య స్థాయికి చేర్చినవాడు. అనేకానేక జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో పరిచయమున్నవాడు.
అందుకే నేను సాహిత్య అకాడమీ సదరన్ రీజియన్ ఆఫీస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ కె.పి. రాధాకృష్ణన్‌ను ప్రశంసిస్తున్నాను. అలాగే డాక్టర్ వె ంకటప్పయ్యను, వారికి సహకరిస్తున్న స్థానిక ప్రముఖులను, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా శ్రీనివాసరావు వచ్చాక, గోపి తెలుగు అడ్వయిజరీ బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి చేబడుతున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సభలో పాల్గొంటున్నందుకు నేనెంతో సంతోషిస్తూ, సాహిత్య అకాడమీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సంజీవదేవ్ ఎంత గొప్ప భావుకుడో ఆయన మాటల్లోనే చూద్దాం… ‘భారతీయ దర్శన విజ్ఞానం ‘ఫిలాసఫీ’లో అద్వైతం ఒక గొప్ప ‘స్కూల్ ఆఫ్ థాట్’. ఐన్‌స్టీన్ యొక్క ‘రిలేటివిటీ’ సిద్ధాంతాన్ని తెలుసుకోటం ఎంత కష్టమో అద్వైత సిద్ధాంతాన్ని తెల్సుకోవడం అంత కన్న ఎక్కువ కష్టం కాకపోయినా, కనీసం అంత కష్టమే. భౌతికవాదుల బాహ్య ప్రపంచం ఎంత నిజమో, ఆధ్యాత్మిక వాదుల అంతఃప్రపంచం కూడా అంతే నిజం. భౌతిక వాదులు ఈ అంతర్జగత్తును గుర్తించాలి. ఆధ్యాత్మిక వాదులు ఆ బాహ్య జగత్తును గుర్తించాలి. అది సమగ్రతతత్వం, సంపూర్ణ సత్యం, పరిపూర్ణ జ్ఞానం!… జీవితంలో ఆలోచనా, మంచితనం మాత్రమే చాలవు, రసానందం లేని జీవితం నీరసపు బతుకై పోతుంది. నీరసపు బతుకు మృత్యువు కంటే హీనం.’ సంజీవదేవ్ జన్మదినాలు అంతటా జరుపుకుందాం, అలాంటి వారి విగ్రహాలు అంతటా ఆవిష్కరించుకుందాం ఇకముందు. అలాంటి వారికి చెందిన రచనలు, సృజనలు అన్ని విద్యాలయాల్లో పాఠాలుగా పెట్టే ఏర్పాట్లు చేసుకుందాం. అలాంటి వారి జీవిత చరిత్రలు తప్పకుండా రచనలుగా, అనువాదాలుగా చేయించే యేర్పాట్లు చేద్దాం. దానినే సత్సంస్కృతిగా, సదాచారంగా భావిద్దాం.
-డాక్టర్ వెలిచాల కొండలరావు
తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు
(సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా
నేడు తెనాలిలో సదస్సు)