నవరాత్రులపై శ్రీ అరవింద రావు

శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్ధం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో అలాగే తనను తాను పరీక్షించుకొని, మనస్సులో పేరుకున్న దురాశ, ద్వేషం లాంటి మలినాన్ని తొలగించుకోవడానికి మన పూర్వీకులు కల్పించిన సమయం దేవీ నవరాత్రులు. వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు మొదలైనవి. ఈ రోజుల్లో కేవలం గుడికి వెళ్లి కోరికలు కోరడం, ఆర్భాటంగా పూజలు చేయడం ఒక పద్ధతి. దానితోపాటు వ్యక్తిగతంగా ఉపవాసం లాంటి కొన్ని నియమాలను పాటించడం మరో పద్ధతి. ఈ పూజ యొక్క అసలు విషయాన్ని తెలుసుకోవడానికై శ్రద్ధగా ఒక పుస్తకాన్ని పారాయణం చేయడం సరైన పద్ధతి. మన స్వభావాన్ని బట్టి మన పూజలు.
ప్రస్తుత దేవీ నవరాత్రుల్లో సాధారణంగా పారాయణం చేసే పుస్తకాలు దేవీ భాగవతం, దుర్గాసప్తశతి పుస్తకం చదివితే మనస్సు ఎలా పవిత్రమవుతుంది? ఎలాంటి మంచి పుస్తకం చదివినా అది మన మనస్సుపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. దేవీ భాగవతం అనేది మనకున్న ముఖ్య పురాణాల్లో ఒకటి. వేదాంతానికి చెందిన క్లిష్టమైన విషయాల్ని, మనిషి నడవడికకు, సమాజ ధర్మానికీ చెందిన అనేక విషయాలను సామాన్య పాఠకునికి అందించడం అందులో ముఖ్యవిషయం. కథ కేవలం ఒక సాకు మాత్రమే. text is only a pretext  అంటారు ఆంగ్లంలో. ఎన్నో కథలు- హరిశ్చంద్రుని కథ, వశిష్ఠ, విశ్వామిత్రుల స్పర్ధ, రంతిదేవుని కథ, నారదుడు వ్యామోహంలో పడడం మొదలైన ఎన్నో కథలు ఈ పురాణంలో చూస్తాం. అట్లాగే దుర్గాదేవి అనేక రాక్షసుల్ని సంహరించడం చూస్తాం. కథా భాగాన్ని మాత్రమే చూస్తే మనకు, చిన్న పిల్లలకు తేడా ఉండదు. ఆయా పాత్రల మధ్య జరిగే సంభాషణ, ధర్మం గూర్చి, వేదాంత విషయాల గూర్చి చర్చ ముఖ్యంగా చదవాల్సిన విషయాలు. వీటిద్వారా రచయిత సింబాలిజం రూపంలో చెప్పదలుచుకున్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఈ పుస్తకం ఏడవ స్కంధంలో హిమవంతుడి కూతురుగా పుట్టబోతున్న శ్రీదేవి తనకు కాబోయే తండ్రికి చేసే వేదాంత బోధ మొత్తం వేదాంత శాస్త్ర సారంగా చెప్పవచ్చు. అలాగే శ్రీదేవి చూపించే విశ్వరూపమూ, భగవద్గీతలో కృష్ణుడి విశ్వరూపమూ ఒకటే. దీన్నంతా సంస్కృతంలోనే చదవాలనే నియమం లేదు. నాకు సంస్కృతం తెలిసినా మార్కెట్టులో లభ్యమయ్యే శ్రీ సుబ్రహ్మణ్య సోమయాజి గారి అనువాదం చదువుతూంటాను.
దేవీ భాగవతం పూర్తిగా దేవీ తత్త్వాన్ని తెలిపే పెద్ద పుస్తకం. ఇది కాక మనం మామూలుగా పారాయణం చేసే దుర్గాసప్తశతి మార్కండేయ పురాణంలోని చిన్న భాగం. దుర్గాదేవి మహిషాసురుడిని, దంభుడు, శంభుడు మొదలగు రాక్షసుల్ని చంపడం రెండు పుస్తకాల్లోనూ ఉన్న విషయం. దీనిలోని సింబాలిజం గూర్చి ప్రాచీనులు సంస్కృతంలో రాసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. తెలుగులో సరైన పుస్తకాలు రాకపోవడం వల్ల ఇదంతా దేవతలు, రాక్షసుల యుద్ధాలు, మనిషికి సంబంధం లేని విషయాలుగా కనిపిస్తాయి.
దేవీ భాగవతం ప్రకారం దేవియే శుద్ధజ్ఞాన స్వరూపం, దేవీయే శక్తి. ప్రపంచంలోని అన్ని శక్తిరూపాలూ ఈ పరమేశ్వరివే. మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, అలాగే అచ్చ తెలుగులో చెప్పుకునే బతుకమ్మ. ఇవన్నీ ఆ శక్తి పేర్లే. ప్రకృతిలోని సీ్త్రజాతి అంతా శక్తి అంశయే. అందుకే కుమారీ పూజ అనే ఆచారం ఈ నవరాత్రుల్లో ఉంది. చిన్న బాలికల్ని దేవీ స్వరూపంగా భావించి పూజ చేయడం వల్ల వారిలో ఎంత ఉత్తమ సంస్కారం, పవిత్రమైన భావనలు ఏర్పడతాయో ఊహించగలం. మిగతా దేశాల్లో కూడా దేవీ పూజ ఒకప్పుడు ఉండేది. పురుషాధిక్య సంస్కృతి పెరిగిన తర్వాత స్ర్తీని దేవతగా పూజించే సంప్రదాయం ఆ దేశాల్లో ఆగిపోయింది.
పుస్తకాల పారాయణంతోపాటు నిష్ఠ ఉన్నవాళ్లు ఉపవాసం కూడా చేస్తారు. ‘ఉప’ అంటే ‘దగ్గరగ’ అనీ, ‘వాసం’ అంటే ‘ఉండడం’ అనీ అర్ధం. అంటే మనం పూజించే దేవతాతత్త్వానికి దగ్గరగా ఉండడం. మిగతా కార్యక్రమాల నుంచి సాధ్యమైనంతగా మనస్సును మళ్లించి శ్రద్ధతో పారాయణం చేయడం. ఉపాసన అన్నా కూడా ఇదే అర్ధం. శ్రీదేవి ఉపాసన చేసే వాళ్లు సప్తశతిని చదువుతూ కొన్ని మంత్రాల్ని జపం చేస్తారు.
శ్రీదేవి అనేది పురాణం పెట్టిన పేరు. వేదాంతం దీన్నే చైతన్యంలోని సృజన, లేదా మాయాశక్తి అంటుంది. ఈ శక్తిలో సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ఉంటాయని ఇదివరలో చూశాం. సత్వం అంటే శాంత స్వభావం, సంతుష్టిగా ఉండడం. సత్యమార్గంలో ఉండడం మొదలైనది. రజస్సు విజృంభిస్తే ఇతరుల్ని డామినేట్‌ చేయాలనే భావం. దీనితో పాటు తమస్సు కూడా కలిస్తే హింసాత్మక ప్రవృత్తి కలుగుతుంది. ఇలాంటి ప్రవృత్తుల్ని అణచివేయడమే రాక్షసుల్ని చంపడం అంటే. ఇది మాయాశక్తిలో ఉన్న ఒక  self correcting mechanism  అనవచ్చు. పై మూడు గుణాల సమతౌల్యం (balance) ఉండడమే ప్రకృతి స్వభావం.
నవరాత్రుల సందర్భంగా ఉన్న కథల్ని చూస్తే మహిషుడు అంటే మనలో ఉన్న దున్నపోతు స్వభావం, సోమరితనం, తామసగుణం లక్షణం. ఈ లక్షణాల్ని తీసివేయడమే మహిషాసురుణ్ణి వధించడమంటే. గీతలో దంభం, దర్పం మొదలైనవి తామస లక్షణాలుగా చెప్పారు. దంభమంటే నేనే గొప్ప ధార్మికుణ్ణి అంటూ ఇంపోర్టెడ్‌ పువ్వులు, పండ్లు తెచ్చి పూజలు చేసి విర్రవీగి చాటింపు వేసే లక్షణం. అమ్మవారు దీన్నే దంభుడు అనే రాక్షసుడు అంటుంది. దీన్ని నశింపజేయడమే దంభుని వధ. అలాగే రక్తబీజుడు. వీని శరీరం నుంచి కిందపడ్డ ఒక్కొక్క రక్తపుబొట్టూ ఒక్కొక్క రాక్షసుడిగా వస్తుంది అని వర్ణించినపుడు చెడు అనేది ఎంత త్వరగా పెరుగుతుంది అని చెప్పడమే. దాన్ని ఎప్పటికప్పుడు తుంచివేయాలన్నదే రక్తబీజుణ్ణి చంపడమంటే.
దేవతలకూ, రాక్షసులకూ తండ్రి ఒక్కడే. ఇద్దరూ శివుడినో, బ్రహ్మ దేవుణ్ణో పూజించి వరాలు పొందినవారు. ఈ వరాలతో విర్రవీగడం హింసాప్రవృత్తికి పాల్పడటం రాక్షస లక్షణం. ఈ రెండు గుణాలూ మనిషి మనస్సులో ఉన్నవే. అసుర గుణాల్ని తొలగించుకొని మనసును మంచి మార్గంలో పెట్టడమే వీటి ఉద్దేశం.
వేదాంతం చెప్పే నిర్గుణ తత్వం ( formless concept)లో సగుణ రూపాల్ని ( name and form ) భావించి సామాన్య ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లు చెప్పడమే పురాణాల ఉద్దేశం. వీటిలో వివిధ రకాలైన శాసా్త్రల గురించి ప్రాథమిక అవగాహన ఇచ్చే అంశాలుంటాయి. పెద్ద బాలశిక్షలో లాగ కొన్ని కథలు, కొంత వేదాంతం, కొంత ధర్మం, యోగము, ధ్యాన పద్ధతులు మొదలైన వాటిపై స్థూలంగా ప్రస్తావన ఉంటుంది. సదాచారానికి చెందిన ఎన్నో విషయాలు ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి.
ఈ ఆచారాలలో కొన్నింటిని అతి కొద్ది మందే పాటించడం చూస్తున్నాం. పాటించడానికి వీలైనన్ని పాటిస్తూ వ్యక్తి తనను తాను ఆధ్యాత్మికంగా బాగు చేసుకునే సమయమే ఈ నవరాత్రులు.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను
navya@andhrajyothy.com
కు పంపండి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.