బ్రహ్మోత్సవాలు -అన్నమయ్య –

శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల విశేషాలను తన సంకీర్తనలలో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. ఆయన కుమారుడైన పెద తిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య ప్రభృతులు కూడా పరమ భాగవతోత్తములై ఈ వాజ్ఞ్మయ కైంకర్యాన్ని నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య సంకీర్తనల విశేషాలు…
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఏయే రోజు ఏయే వాహనాలలో విహరిస్తాడో, ఈ సందర్భంగా జరిపే ఊంజల సేవ, డోలోత్సవం వంటి విశేషాలను అన్నమయ్య తన సంకీర్తనలలో వర్ణించారు.
తమిళ సంప్రదాయం ప్రకారం పెరటాశి నెలలో, తెలుగు నెలల ప్రకారం ఆశ్వయుజ మాసం ప్రథమార్థంలోను ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఎంత భక్తి ప్రపత్తులతో పాల్గొంటారో ఈ సంకీర్తనలో వర్ణించారు అన్నమయ్య.

నానా దిక్కుల నరులెల్లా
వానల లోననె వత్తురు కదలి
సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు
హితులు గొలువగా నిందరును
శత సహస్ర యోజన వాసులును
వ్రతముల తోడనె వత్తురు కదలి
ముడుపులు, జాళెలు, మొగిదల మాటలు
కడలేని ధనము కాంతులును
కడుమంచి మణులు కరులు తురగములు
వడిగొని చెలగుచు వత్తురు కదలి
మగుటి వర్థనులు, మండలేశ్వరులు
జగదేకపతులు చతురులును
తగు వేంకటపతి దరుశింపగ బహు
వగల సంపదల వత్తురు గదలి

పై సంకీర్తనలోని వర్ణనలను బట్టి రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. 1. ఈ బ్రహ్మోత్సవాలు వానల కాలంలో నిర్వహింపబడేవి. అంటే అప్పుడూ, ఇప్పుడు కూడా వర్ష రుతువులోనే జరుగుతున్నాయి. 2. అప్పుడు సామాన్య భక్తులు మొదలుకుని మహామండలేశ్వరులు, చక్రవర్తుల వరకు బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీవారిని సేవించే వారు. ఇప్పుడు కూడా సామాన్యుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర మాన్యులు ఎందరో ఈ మహోత్సవాలలో సభక్తికంగా పాల్గొంటూ ఉన్నారు.
అంకురార్పణ, ధ్వజారోహణం, సేనాపతి ఉత్సవాలతో ప్రారంభమవుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో సేనాపతియైున విష్వక్సేనుని ఆగమనాన్ని, వైభవాన్ని అన్నమ య్య ఈ కింది కీర్తనలో అద్భుతంగా వర్ణించారు.
అదె వచ్చె నిదెవచ్చె నచ్యుత సేనాపతి
పది దిక్కులకు నిట్టే పారరో అసురులు
గరుడధ్వజమదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవు చక్రమదె
మురవైరి పంపులవె ముందరి సేనలవె
పరచి గగ్గులకాడై పారరో దానవులు
తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె
యెల్లదేవతల రథాలింతట నవె
కెల్లు రేగీనెక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళాన బదరో ధనుజులు

ఆగమోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే సేనాపతి ఉత్సవ విశేషాలన్నీ పై సంకీర్తనలో అన్నమయ్య అక్షర బద్ధంగా ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు శేష వాహనంతో ప్రారంభమవుతాయి. శ్రీమన్నారాయణునకు శయ్యగా, ఆసనంగా, ఆవాసంగా, అంతఃపురమందిరంగా- ఇలా ఎన్నో విధాలుగా శ్రీనివాస కైంకర్యంలో నిమగ్నుడైన శేషుడు నిత్యసూరులలో అగ్రగణ్యుడు. ఈ కింది సంకీర్తనలో శేషవాహనోత్సవాన్ని అన్నమయ్య మనోజ్ఞ దృశ్యాలతో వర్ణించారు.
వీడు గదే శేషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు
వేడుక గరుడునితో పెన్నుద్ధైన శేషుడు
వేయి పడగల తోడ వెలసిన శేషుడు
చాయమేని తళుకు వజ్ఞాల శేషుడు
మాయని శిరస్సులపై మాణిక్యాల శేషుడు
యే యేడ హరికి నీడై యేగేటి శేషుడు

ఈ విధంగా అన్నమయ్య బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన సేవలను వర్ణించారు. భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని ప్రధానోత్సవంగా భావించే గరుడ సేవను అన్నమయ్య చాలా కీర్తనలలో వర్ణించారు.
ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన
గరుడుని మీద నెక్కి గమనించితివి నాడు
అరుదైన పారిజాత హరణానకు
ఇలా గరుడ వాహన వైభవాన్ని వర్ణించిన కీర్తనలు చాలా ఉన్నాయి.
వీధుల, వీధుల విభుడేగినిదె
మోదము తోడుత మొక్కరో జనులు
దేవదేవుడెక్కే దివ్యరథము
మా వంటి వారికెల్ల మనోరథము

వంటి అనేక కీర్తనలలో రథోత్సవాన్ని వర్ణించాడు.
బ్రహ్మోత్సవాలలో చివరి అంకంలో శ్రీవారు అశ్వ వాహనాన్ని అధిరోహించి తిరువీధులలో ఎంతటి మహారాజసంతో విహరిస్తాడో అన్నమయ్య ఈ క్రింది కీర్తనలో కనులకు కట్టినట్లు వర్ణించారు.
నీవు తురగము మీద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదజల్లి తపుడు
పదిలముగ నిరువంక పసిడి పింజల యంప
పొదుల తరకసములొరపులు నెరపగ
గదయు శంఖంబు చక్రము ధనుఃఖడ్గములు
పదివేలు సూర్యబింబములైన వపుడు
సోరిది శేషుని పెద్దచుట్టు పెనుగేవడము
సిరిదొలక నొక చేత చిత్తగించి
దురమునకు దొడవైన ధూమకేతువు చేత
నిరవైన బల్లెమై యేచె నందపుడు

బ్రహ్మోత్సవాలలో చిట్టచివరగా నిర్వహించే చక్రస్నాన సన్నివేశాన్ని పురస్కరించుకుని మర్థమర్థ మమ బంధాని, దుర్ధాంత మహాదురితాని…. హితకర శ్రీవేంకటేశ ప్రయుక్త సతతపరాక్రమ జయంకర… అంటూ శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశునితో కలసి ఎలా తిరుమంజనాదులు స్వీకరిస్తాడో హృద్యంగా వర్ణించారు. ఈ విధంగా అన్నమయ్య శ్రీనివాసునికి అక్షర బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
– మేడసాని మోహన్‌

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.