గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19
17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు
క్షేమేంద్రుడు కాశ్మీర దేశ కవి .శైవ సిద్ధాంతాన్ని మదించిన అతిగొప్ప జ్ఞాని అయిన అభినవ గుప్తునికి శిష్యుడు .కాశ్మీర రాజు అనంతుని ఆస్థానం లో క్షేమేంద్రుడు ప్రసిద్ధ పండితుడుగా ఉండేవాడు .అయితే వైష్ణవం పైనా బౌద్ధం పైన రచనలు చేసి సమర్ధతను చాటుకొన్నాడు .1037వరకు నిరంతర రచన ప్రవాహాన్ని పారించాడు .అతని బృహత్కధా మంజరి ‘’ పేరెన్నిక గన్న బృహత్ కావ్యం .ఇది గుణాధ్యుడు రాసి కాలగర్భం లో కలిసిపోయిన’’ బృహత్ కద ‘’కు మరోసంక్షిప్త రూపం .శ్రీమహా విష్ణువు దశావతారాల గురించి ‘’దశావ తార చరిత్ర ‘’రాశాడు క్షేమేంద్రుడు .కొన్ని నాటకాలు ,వర్ణనాత్మక కవిత్వం తో బాటు అధిక్షేప నవల ,కామ సూత్రాలపై విపులమైన వ్యాఖ్యానమూ రాశాడు .క్షేమేంద్రుని రచనలను కవులు వ్యాఖ్యాన కర్తలు తమ గ్రంధాలలో పలు చోట్ల పేర్కొనటం వలన అతని గురించి జనాలకు పరిచయం కలిగింది..ముఖ్యం గా రాజతరంగిణి లో అనేక మార్లు ఉదాహరింప బడిన కవి క్షేమేంద్రుడు .
క్షేమేంద్రుని కవితా గీర్వాణం
1871లో మా త్రమే క్షేమేంద్రుని రచనలు సుమారు ముప్ఫై నాలుగు వెలుగు చూశాయి .ఏ.సి బర్నేల్ తంజావూరు సరస్వతి మహల్ నుండి బృహత్కదా మంజరిని మొదట చూసి వెలువరించాడు .బహ్లార్ ,స్టీల్, పీటర్సన్,దాస్ ,కౌల్ వంటి చారిత్రిక పరిశోధకులు క్షేమేంద్రుని రాత ప్రతులను సేకరించి వెలువరించారు . అందులో మూడు వ్యంగ్యాత్మక మైన భాణాలు –సమయ మాత్రిక ,నర్మ మాల ,కలావిలాస లను హక్సర్ ఆంగ్లం లోకి అనువదించాడు .వీటిల్లో ఎవర్నీ వదిలిపెట్టలేదు బౌద్ధ గురువుల్ని ,సన్యాసులను ,సన్యాసినులను ఉతికి ఆరేశాడు .వ్యవస్థలోని కుళ్ళు ను కడిగిపారేశాడు .ఉజ్జయిని నగర సాయం సమయ అందాలను మహాద్భుతం గా కవిత్వీకరించాడు .ఉజ్జయిని లో పదకొండవ శతాబ్ది వివరాలు ఈ నాటికీ అలానే ఉన్నాయని మనకు తెలుస్తుంది .మనుషుల స్వభావాలను ఆకృతులను తీర్చిదిద్దాడు .దెయ్యాలతో డాన్స్ చేయించాడు .ముఖ్యంగా సభ్య మగ వారి ని చిత్రించిన తీరు ఇప్పటికీ మనకు దృశ్య గోచరమౌతుంది .స్త్రీల గురించి కొంత అతిగా రాశాడనిపిస్తుంది .అప్పటి స్త్రీకి ఇప్పటి స్త్రీకి సహస్ర భేదం కనిపిస్తుంది .అందుకే అతను వర్ణించిన స్త్రీ మూర్తులను నేడు ఉదాహరించటా నికి ఇబ్బంది పడతారు .
క్షేమేంద్రునికావ్యాలు –రామాయణ మంజరి ,భారత మంజరి(చిత్రభారతం ) ,బృహత్కదా మంజరి అనే సంక్షిప్త రామాయణ ,మహా భారత ,బృహత్కదా రూపాలు .ఆలంకార గ్రంధాలుగా ఔచిత్య చర్చ ,కవి కంఠాభరణ ,సువృత్త తిలక .వ్యంగ్య అధిక్షేపక నాటకాలు –కళావిలాస ,సమయ మాత్రిక ,నారీలలామ ,దేశోపదేశ .నీతిబోధక కావ్యాలు –నీతికల్ప తరువు ,దర్పదలన ,చతుర్వర్గ సంగ్రహ ,చారు చర్య ,సేవ్య సేవకోపదేశ ,లోక ప్రకాశ ,స్తూపావదాన .పౌరాణికాలు –అవధాన కల్ప లతా ,దశావ తార చరిత్ర .
క్షేమేంద్రుడు ‘’కవి నృపావళి’’అనే చారిత్రిక కావ్యం రాసినట్లు కల్హణుడు చెప్పాడు .కాని లభ్యం కాలేదు .క్షేమేంద్రుని అలంకార గ్రంధం ‘’కవి కంఠా భరణం ‘’లో కవిత్వ ప్రాప్తి ,కావ్య వైచిత్రి ,అర్ధ ,శబ్ద రసాలలోని దోషాలు ,గుణాలు వివరించాడు .ఇది అయిదధ్యాయాల గ్రంధం .ఔచిత్య ప్రాధాన్యాన్ని వివరించాడు .ఔచిత్యాన్ని ఒక కావ్య సిద్ధాంతం గా ప్రతిపాదించాడు .శబ్ద ,అర్ధ ,గుణ ,అలంకార ,రస సంబంధ ఔచిత్యాలను ప్రముఖం గా సోదాహరణం గా చర్చించాడు .అనౌచిత్య దోషాలను ప్రముఖ కవుల రచనల నుంచి నిర్భయం గా ఎత్తి చూపాడు .ధ్వని సిద్ధాంతం క్షేమేన్ద్రుడికి ఇస్టమైందే .అనేక రకాల తత్వాలన మిశ్రమాన్ని ఔచిత్య సిద్ధాంతం లో ప్రతిపాదించాడు .ఔచిత్య సిద్ధాంతం అత్యవసరమైణ కావ్య తత్త్వం గా అందరూ భావించారు .ఔచిత్యం చివరికి ధ్వని సిద్ధాంతం లో అంతర్భవిస్తుందని విశ్లేషకులు తేల్చారు .సువృత్తి తిలక అనే మరో అలంకార గ్రందాన్నికూడా క్షేమేంద్రుడు రాసినట్లు తెలుస్తోంది .
చారుచర్య అనే నీతిశాస్త్ర గ్రంధం లో నిత్య జీవితం లో మనం అనుసరించాల్సిన విషయాలను చెప్పాడు .ఇది ఒక మార్గ దర్శిగా ఉపయోగ పడుతుంది .
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –4-10-14-ఉయ్యూరు
గణితంలో Fibonacci series అని ఒక శ్రేణి ఉంది. కాని ఆ శ్రేణిని రూపొందించినది క్షేమేంద్రుడే అని ఒక వాదం ఉంది. ఇందులోని వాస్తవ అవాస్తవాలు తెలిసినవారు వివరించమని విన్నపం.